మళ్లీ పోలియో కేసులు.. ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్జీ
- హోదా, బీబీసీ న్యూస్
పపువా న్యూ గినియాలో పోలియో వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. టీకాల క్యాంపెయిన్ తక్షణమే ప్రారంభించాలని పిలుపునిచ్చింది.
దేశంలోని తీరప్రాంత నగరమైన లాయేలో జరిగిన సాధారణ ఆరోగ్య తనిఖీలలో ఇద్దరు ఆరోగ్యకరమైన పిల్లలలో ఈ వైరస్ నమూనాలు గుర్తించారు.
పోలియో టీకాలు వేయించుకున్న వారు దేశ జనాభాలో సగం కంటే తక్కువ ఉన్నారు. పోలియోను దాదాపుగా నిర్మూలించగలిగామని అనుకుంటున్న దశలో ప్రపంచంలో అక్కడక్కడా ఈ వైరస్ బయటపడుతోంది.


ఫొటో సోర్స్, WHO/T.Moran
'దేశం దాటి వ్యాపించే ప్రమాదం'
''పోలియోకు సరిహద్దులు లేవు. దీని నిర్మూలనకు మనం ఏదైనా చేయాలి, అది కూడా సత్వరమే చేయాలి. వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయ్యేలా దృష్టి పెట్టాలి'' అని పపువా న్యూ గినియాలో డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్ సెవిల్ హుసేయ్నోవా గురువారం మీడియా సమావేశంలో చెప్పారు.
పోలియో దేశం దాటి వ్యాపించే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.
ఈ పోలియో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పోలియో సోకిన వ్యక్తి మలం తాకినపుడు లేదా ఆ వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలోని బిందువుల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. పోలియో బారినపడుతున్న పిల్లలలో ఎక్కువ మంది ఐదేళ్లలోపు వారే.

ఫొటో సోర్స్, Getty Images
అరుదైన సందర్భాల్లో పక్షవాతం..
పోలియోకు చికిత్స లేదు. పపువా న్యూ గినియాలో కొత్తగా వచ్చిన రెండు కేసులతో సహా వైరస్ సోకిన చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. కొంతమందికి ఫ్లూ ఉన్నట్లు అనిపించొచ్చు.
అరుదైన సందర్భాల్లో, అంటే వెయ్యిలో ఒకరికి ఈ వైరస్ పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. శ్వాస తీసుకోవడానికి అవసరమైన కండరాలను ఈ పక్షవాతం ప్రభావితం చేస్తే ప్రాణాంతకం కావొచ్చు.
2000లో పపువా న్యూ గినియాను పోలియో రహిత దేశంగా ప్రకటించారు. కానీ, 2018లో అక్కడ మళ్లీ వ్యాపించింది, అదే సంవత్సరం దాన్ని అదుపులోకి తెచ్చారు.
ఇటీవల బయటపడిన కేసులు ఇండోనేషియాలో కనుగొన్న వైరస్ రకం మాదిరి ఉన్నాయి. ఇండోనేషియా తూర్పు పపువా ప్రావిన్స్‌తో పపువా న్యూ గినియా సరిహద్దును పంచుకుంటోంది.

ఫొటో సోర్స్, Reuters
ఏడాదిలో పూర్తి చేస్తాం: ఆరోగ్య శాఖ మంత్రి
''పోలియో ప్రమాదకరమైన వ్యాధి. ఈ ఏడాది చివరికల్లా పోలియో ఇమ్యూనైజైషన్ 100 శాతం పూర్తి చేస్తాం'' అని పపువా న్యూ గినియా ఆరోగ్యశాఖ మంత్రి ఎలియాస్ కాపవోరే చెప్పారు.
"పోలియోపై యుద్ధం ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది" అని ఆరోగ్య శాఖ నిన్న ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది.
టీకా క్యాంపెయిన్ పదేళ్ల లోపు పిల్లలపై దృష్టి పెట్టనుంది. దాదాపు 35 లక్షల మందికి చేరువ కావడమే క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, ఆస్ట్రేలియా ప్రభుత్వం టీకా డ్రైవ్‌లో పపువా న్యూ గినియాకు సహాయం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా టీకా కవరేజ్ ఒకేలా లేదని యూనిసెఫ్ పపువా న్యూ గినియా అధికార ప్రతినిధి వీరా మెండోంకా అభిప్రాయపడ్డారు. కొన్నిచోట్ల, కేవలం 8 శాతం మందికి మాత్రమే టీకాలు వేస్తున్నారని తెలిపారు.
టీకాలను ప్రోత్సహించడానికి, తప్పుడు సమాచారాన్ని నిలువరించేందుకు చర్చిలు, స్థానిక నాయకులతో యూనిసెఫ్ కలిసి పనిచేస్తోందని మెండోంకా అన్నారు.
ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా పోలియో కేసులు నమోదయ్యాయి. నిరుడు పాకిస్తాన్‌లో 74 కేసులు, ఆప్గానిస్తాన్‌లో 24 కేసులు వెలుగుచూశాయి. గాజాలో పోలియో వ్యాప్తి గురించి కూడా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది, అక్కడ వైరస్‌ను మురికి నీటిలో గుర్తించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














