తెలంగాణ గ్రామాల్లో పర్యటిస్తే పెద్ద పెద్ద రోడ్ల మూలల్లో మార్జిన్లకు ఆవల విసిరేసినట్టుగా సుత్తీ కొడవలి గుర్తున్న స్మారకాలు వెలిసిపోయి కనిపిస్తాయి. కొన్ని గ్రామాల సెంటర్లలోనూ ఇంకా దళితవాడలన్నింటా విరివిగా అంబేడ్కర్ విగ్రహాలు కనిపిస్తాయి. ఇటీవలి పరిణామంగా శివాజీ, వివేకానందుడి స్మారకాలు అంబేడ్కర్‌తో పోటీపడుతూ మెరుస్తుంటాయి.

ఆధునిక అభివృద్ధికి చిహ్నంగా కనిపిస్తున్న రోడ్లకు ఆవల ఉన్న స్థూపాలు యాభై ఏళ్లుగా ఇక్కడ సాగిన సాయుధ పోరాట ఆనవాళ్లు. దళిత వాడల్లోనూ ఇంకా అక్కడక్కడా గ్రామాల సెంటర్లలోనూ కనిపించే అంబేడ్కర్ విగ్రహాలు 90ల నుంచి ఇక్కడ పెరిగిన దళిత చైతన్య, అస్తిత్వ వాద ఉద్యమాల ప్రభావ చిహ్నాలు. సాయుధపోరాటానికి కేంద్రాలుగా ఉన్న దళితవాడల్లో ఎర్రని రంగును బులుగు రంగు ఆక్రమిస్తూ వచ్చిన తీరును అది పట్టిస్తుంది. పదేళ్ల నుంచి వెలుస్తున్న వివేకానందుడు, శివాజీ విగ్రహాలు హిందుత్వ వాద ధోరణి పెరుగుతోందనడానికి తాజా నిదర్శనం.

1990ల చివరి నాటికి, తెలంగాణలో సాయుధ పోరాటం దాదాపుగా ముగిసింది. అయితే ప్రస్తుతం, బస్తర్ అడవుల్లోని మావోయిస్టు అగ్రనేతలలో తెలుగు వారే ఎక్కువ ఉన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన గడువు 2026 మార్చి 31 నాటికి, నక్సలిజాన్ని అంతం చేయాలని కేంద్ర సాయుధ దళాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

నక్సల్స్ కేంద్ర స్థావరం చత్తీస్ గఢ్ అడవుల నుంచి తరచుగా ఏకపక్షంగా భారీ స్థాయిలో నక్సల్ అగ్రనేతల మరణాల వార్తలొస్తున్నాయి. ఇప్పుడది ముగింపు దశకు చేరిందనే సంకేతం అనుకోవచ్చు.

మావోయిస్టులు కూడా దీనిని గ్రహించినట్లు కనిపిస్తోంది. ‘ఆయుధాలు వదిలేయడం’ గురించి అధికార ప్రతినిధి అభయ్ రాసిన లేఖ, మావోయిజం భవిష్యత్తుపై అనిశ్చితిని నాయకుడు రూపేష్ అంగీకరించడం వంటివి దీనికి సూచనలు. సాయుధ ఉద్యమం ముగిసినట్టేనా?

నక్సల్బరీ - శ్రీకాకుళం

1967లో పశ్చిమబెంగాల్ లోని నక్సల్బరీ లో జరిగిన ఘటన సాయుధపోరాటానికి దారితీసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థానిక ఆదివాసీ రైతులకు, భూమిలేని నిరుపేద రైతులకు అండగా సీపీఎం లోని రాడికల్ ఎలిమెంట్స్ తో కూడిన సిలిగురి విభాగం నిలబడి వారిని జోతేదారులపై అంటే భూస్వాములపై తిరగబడేలా చేసింది. 1967 మే 25న జరిగిన ఘటనలో ఒక ఎస్ఐను బాణంతో దాడిచేసి చంపారు. పోలీసులు ఆదివాసీలపై కాల్పులు జరిపి 8 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు, ఒక పురుషుడు సహా మొత్తం 11 మందిని కాల్చి చంపారు. ఇది నిప్పు రాజేసింది. ఆదివాసీ సాయుధ తిరుగుబాటు చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. చైనీస్ మీడియా దీన్ని వసంత మేఘ గర్జన (spring thunder) అని అభివర్ణించింది.

అంతకు రెండేళ్ల కిందటే, భారత రాజ్యాన్ని సాయుధమార్గంలో నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా కూల్చి సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ‘ఎయిట్ డాక్యుమెంట్స్’ను రూపొందించారు స్థానిక సీపీఐ(ఎం) నాయకుడు చారు మజుందార్. కానూ సన్యాల్, జంగల్ సంతాల్‌లతో కలిసి ఆయన నక్సల్బరీ తొలి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం శ్రీకాకుళం, తెలంగాణ, బిహార్, దండకారణ్యం అడవులకు విస్తరించింది.

హంగ్రీ సిక్స్‌టీస్

ఈ ఉద్యమం స్థానిక సమస్యలతో ముడిపడి ఉండవచ్చు, కానీ దాని రాజకీయ లక్ష్యం చాలా పెద్దది: చైనా నుంచి ప్రేరణతో సాయుధ విప్లవం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఆ లక్ష్యం. రాడికల్ సీపీఐ(ఎం) వర్గాలు తమ పరిధిని విస్తరించుకోవడానికి ఆదివాసీ సమస్యలపై దృష్టి పెట్టాయి.

1969లో కేంద్ర ప్రభుత్వం ఇలా పేర్కొంది: “అశాంతికి ప్రాథమిక కారణం.. గిరిజనుల ప్రయోజనాలను కాపాడటానికి రూపొందించిన చట్టాల అమలులో లోపాలు. దీనిని సరిచేయలేకపోతే, తీవ్రవాదుల నాయకత్వంలోకి వెళ్లిపోయిన గిరిజనుల్లో విశ్వాసాన్ని గెలుచుకోవడం అసాధ్యం”

చరిత్రకారుడు సుమంత బెనర్జీ ‘హంగ్రీ సిక్స్‌టీస్’ ను కరవు, సంక్షోభం, డీవాల్యూయేషన్, మాంద్యపు కాలంగా అభివర్ణించారు. ఇది రాడికల్ ఆలోచనలకు అవకాశాన్ని సృష్టించిందని తెలిపారు. అటు అంతర్జాతీయంగా కూడా అదొక ఉద్యమాల దశాబ్దంగా ఉండింది.

సాయుధ వర్సెస్ పార్లమెంటరీ మార్గం

కమ్యూనిస్టు పార్టీలో సాయుధ పోరాటంపై చర్చ నక్సలైట్లతోనే మొదలైందేమీ కాదు. తెలంగాణ సాయుధపోరాటం రోజులనుంచి ఆంధ్ర థీసీస్ గా ప్రాచుర్యం పొందిన డాక్యుమెంట్ పై చర్చోపచర్చలు జరిగిన రోజులనుంచి సాగుతూ వచ్చి 60ల్లో అలా రూపం దాల్చింది. పల్లెలలో పాక్షిక యుద్ధం, పట్నాల్లో సమ్మెలతో సమన్వయించి విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లాలని 1951 నాటి సీపీఐ డాక్యుమెంట్ తన టాక్టికల్ లైన్ లో పేర్కొంది.

ఎమర్జెన్సీ సమయంలో ఆరెస్సెస్‌తో చేతులు కలిపి ఐక్య పోరాటంలోకి వెళ్లడం, 1951 టాక్టికల్ లైన్ లో నిర్ణయించిన పోరాట పంథాలోనూ రహస్య పార్టీ నిర్మాణంలోనూ పురోగతి లేకపోవడం, పార్టీ రహస్య విభాగం ఏర్పాటులో విఫలమవడం' వంటి కారణాలతో సీపీఐ(ఎం) సహ వ్యవస్థాపకుడు పుచ్చలపల్లి సుందరయ్య 1975లో పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రహస్య పార్టీ నిర్మాణం, సాయుధ పోరాటం అంశాలపై సుందరయ్య, బసవపున్నయ్య, రణదివెల మధ్య సీపీఎంలో చర్చ చాలా నడిచింది. తరువాత మాకినేని బసవపున్నయ్య నాయకత్వంలో సీపీఐ(ఎం) శాంతియుత పద్ధతుల్లో మార్పు తన మార్గమని నిర్దేశించుకుంది.

1949లో విజయవంతమైన చైనా విప్లవం భారత కమ్యూనిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపింది. చైనా, భారత్ ల మధ్య అనేకానేక సారూప్యాలున్నందున చైనా మార్గమే సరైనదనే వాదన ఊపందుకుంది. రష్యా, చైనా మార్గీయుల మధ్య విభజన రేఖలు పెరిగి 1964లో సీపీఐ విభజనకు దారితీసింది. సాయుధ పోరాటం వైపు మొగ్గు చూపిన అసమ్మతివాదులు ఆలిండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రివల్యూషనరీస్ (ఏఐసీసీసీఆర్)ను ఏర్పాటు చేశారు. ఇది 1969లో సీపీఐ(ఎంఎల్)గా మారింది.

సోవియట్ యూనియన్ నుంచి చైనా వైపు

1960ల చివరి నాటికి భారత కమ్యూనిస్టు పార్టీలో రష్యా చొరవ, ప్రమేయం పూర్తిగా తగ్గిపోయాయి. అంతకుముందటి దశలో రష్యా ప్రభావం బలంగా ఉండింది. చివరకు తెలంగాణ సాయుధ పోరాటం విరమించాలా వద్దా అనే విషయంపై ఎడతెగని వివాదం నడిచాక రష్యా వెళ్లి స్టాలిన్ తో చర్చించి వచ్చాకే నిర్ణయించుకున్నారు. 1951లో కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటం విరమించుకున్నారు. అయితే చైనా విప్లవం రాడికల్స్ కు కొత్త ఉత్సాహమిచ్చింది. అది పెరుగుతూ పోయి మావో భారత రాడికల్స్‌కు చిహ్నంగా మారారు. అది ఎంతగా అంటే "చైనా చైర్మన్ మా చైర్మన్" అని చారు మజుందార్ ప్రకటించేదాకా!

కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల నక్సల్స్ కేంద్రంగా మారింది. మధ్యతరగతి యువతను నక్సలిజం ఆకర్షించింది. దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ వంటి ‘‘సంపన్న’’ కళాశాలల విద్యార్థులు కూడా రైతులను సమీకరించడానికి గ్రామాలకు వెళ్లారు. సీపీఐ, సీపీఐ(ఎం)లు భాగమైన పశ్చిమ బెంగాల్‌లోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణలు, కఠినమైన పోలీసు చర్యలు అనే రెండు మార్గాల్లో ఈ ఉద్యమాన్ని అణచివేశాయి.

1972 నాటికి బెంగాల్లో తగ్గుముఖం పట్టిన ఉద్యమం ఆంధ్రలో తిరిగి ఊపిరి పోసుకుంది. శ్రీకాకుళం ఆదివాసీలతో పాటు విద్యావంతులైన యువతను కూడా ఆకర్షించింది. ఇది కూడా ఎక్కువ కాలం మనలేకపోయింది. 1975 నాటికి దెబ్బతింది. 'నక్సలైట్లకు సంస్థాగత నిర్మాణం, బలమైన ప్రజా మద్దతు, మిలిటరీ పరిజ్ఞానం లేదు' అని కానూ సన్యాల్ తరువాత అభిప్రాయపడ్డారు.

పీపుల్స్ వార్, ఎంసీసీ ఆవిర్భావం

1977 అక్టోబర్‌లో కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్ ఏర్పాటు చేశారు. లెనిన్ పుట్టినరోజు ఏప్రిల్ 22న 1980 లో సీతారామయ్య, ఆయన సహచరులు ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్‌ను స్థాపించారు. మరోవైపు కనాయ్ ఛటర్జీ నాయకత్వంలోని బిహార్ గ్రూప్ తరువాత మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (ఎంసీసీ)గా మారింది.

రెండు సంస్థలూ పార్లమెంటరీ రాజకీయాలను తిరస్కరించాయి. తక్షణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చాయి. అండర్‌గ్రౌండ్ పార్టీ ఆర్గనైజేషన్ పై పట్టుగా ఉన్నాయి.

ఈ నక్సలైట్ పార్టీలు బలమైన దళిత, ఆదివాసీ పునాదులు ఏర్పరచుకున్నాయి. కోబాడ్ గాంధీ వంటి విద్యావంతులను, కొందరు మధ్యతరగతి మేధావులను ఈ ఉద్యమం ఆకర్షించగలిగింది.

భూ పంపిణీ, వెట్టిచాకిరి నిర్మూలన, అటవీ ఉత్పత్తులకు న్యాయమైన ధరల సాధన, పన్నుల దోపిడీ నుంచి విముక్తి కోసం వారు పోరాడారు.

తెలంగాణ టు బస్తర్ దండకారణ్యం

CG Khabar

CG Khabar

పీపుల్స్ వార్ తొలిదశలోనే స్థావరాలను ఏర్పాటు చేయడానికి కార్యకర్తలను బస్తర్ లోని దండకారణ్యానికి పంపారు సీతారామయ్య. మావోయిస్టులు అక్కడి ఆదివాసీలకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్పించారు, దోపిడీని ప్రతిఘటించారు. ఆదివాసీల విశ్వాసాన్ని పొందారు. 1980లలో బస్తర్‌లో వేతనంతో కూడిన శ్రమ, ఆధునిక వరి సాగు గురించి తెలియదని, ఆహారంలో గోంగూర తప్ప మరే కూరగాయ తినే అలవాటు లేదని, రెండో పంట గురించి ఎవరూ వినలేదని పినాక పాణి రాసిన 'జనతనరాజ్యం' పేర్కొంది. మావోయిస్టులు కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారు. సహకార సంఘాలు, పాఠశాలలు స్థాపించారు. చెరువులు, బావులను తవ్వించారు.

వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల (ప్రస్తుత ఎన్ఐటీ) అప్పట్లో రిక్రూట్‌మెంట్ హబ్‌గాా మారింది. రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీకి రాడికల్ ఇంజనీరింగ్ కాలేజీ అనేది మారుపేరుగా మారిపోయింది. ఇటీవల భద్రతా బలగాల చేతుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా అనేక మంది నక్సలైట్ నాయకులు ఈ కళాశాల నుంచే వచ్చారు.

నిరుపేద రైతులు, రైతుకూలీలు నక్సలైట్ల నేతృత్వంలో జమీందార్ల భూముల మీద దాడులు చేసి స్వాధీనం చేసుకోవడం అనేది 80ల్లో పెద్ద ఎత్తున సాగింది. అప్పట్లో ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది.

తెలంగాణలో నక్సలైట్ ఉద్యమానికి కొంత స్థానిక పరిస్థితుల నేపథ్యముంది. నిజాం పాలన ముగిసిన తర్వాత కూడా తెలంగాణలో భూస్వాముల పెత్తనం కొనసాగింది. వెట్టి చాకిరీ, భూస్వాముల అరాచకాలు, పెత్తందారీ పద్ధతులు, ఇతర దోపిడీ విధానాలు కొనసాగాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండేవికావు. ప్రజల్లో ఆశ కొంచెం, నిరాశ కొండంత ఆవరించిన కాలం. దేశవ్యాప్తంగా ‘‘యాంగ్రీ యంగ్ మ్యాన్’’ అనేది సినిమాల్లోనూ, బయట ఇమేజరీగా ఉన్న కాలం. ఒక దొర చేతిలో పీడనకు గురయ్యే బాధిత సమూహాలు అసంఖ్యాకంగా గ్రామాల్లో ఎదురుబొదురుగా కనిపించే కాలం. ప్రత్యక్షంగా ఒక ‘‘విలన్’’ అంటూ ఎదురుగా ఉన్నకాలం. వెరసి అది సాయుధ విప్లవానికి ఫర్టైల్ గ్రౌండ్‌గా పనిచేసింది.

పుల్లరి ఉద్యమం, బీడీ ఆకు ఉద్యమం, దున్నేవానికి భూమి, వెట్టి చాకిరి నిర్మూలన లాంటి చర్యలు, దొరలు-భూస్వాముల భూముల స్వాధీనం వంటివి తొలిదశలో విస్తరణకు బాగా ఉపయోగపడ్డాయి. ఆదివాసీలను, దళితులను ప్రధానంగా ఆకర్షించగలిగాయి. అయితే ప్రభుత్వం రైతులను అనుమతించకపోవడం వల్ల అలాంటి భూములు చాలావరకు చాలా కాలం వరకు సాగులేక పడావు పడిపోవడం మరో పరిణామం.

నక్సలైైట్లు ఒత్తిడి గ్రూప్‌గా పనిచేసి ఆదివాసీలకు, దళితులకు, నిరుపేదలకు సంబంధించి ప్రయోజనం చేకూర్చే కొన్ని సానుకూల మార్పులకు కారణమయ్యారని కొందరు సామాజిక వేత్తలు వ్యాఖ్యానించి ఉన్నారు. వెట్టిచాకిరీ నిర్మూలన, కనీసవేతనం అనే రెండు రాజ్యాంగ పరమైన అంశాలను నక్సలైట్లు సాధించగలిగారని ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకర్త, న్యాయవాది, నక్సల్స్‌కు మాజీ సానుభూతిపరుడు కె.బాలగోపాల్ తన ఈపీడబ్ల్యూ వ్యాసంలో రాసి ఉన్నారు.

క్రమంగా మారిన సన్నివేశం

యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమవ్వడం, ఇతర తూర్పు ఐరోపా పరిణామాలతో మార్క్సిజం తన ఆకర్షణను చాలావరకు కోల్పోయింది. ఈ సిద్ధాంతంపై ప్రశ్నలు క్రమేణా బలపడుతూ వచ్చాయి. 1990లలో ప్రపంచీకరణ సామాజిక-ఆర్థిక స్వరూపాన్ని మార్చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధి, వై.ఎస్. రాజశేఖరరెడ్డి అమలుచేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, సంక్షేమ పథకాల విస్తరణలాంటివి గ్రామీణ యువతకు కొత్త ఆకాంక్షలను అందించాయి. విద్య ప్రైవేటు రంగంలోకి వెళ్లిన కొద్దీ ఒకప్పుడు రిక్రూట్ మెంట్ కేంద్రాలుగా కీలక పాత్ర పోషించిన సామాజిక సంక్షేమ హాస్టళ్ల ప్రాధాన్యం తగ్గిపోయింది. నిస్పృహకు కేంద్రమైన దుర్భర దారిద్య్రం తగ్గింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, 1977 నాటికి భారత దేశంలో 59.07 శాతం మంది దారిద్య్రంలో ఉంటే ఇది 2022 నాటికి 5.25 శాతానికి తగ్గింది.

భారతదేశంలో 1960ల చివర్లో ప్రారంభమైన హరిత విప్లవం 1980ల చివరినాటికి ఆహార కొరత సమస్య నుంచి బయటపడటానికి దేశానికి సహాయపడింది (ఎఫ్ఏవో).

అంతకు ముందు మావోయిస్టు పార్టీకి సన్నిహితంగానో, సానుకూలంగానో ఉన్న మేధావి వర్గం నుంచి మద్దతు తగ్గిపోయింది. 2009లో బాలగోపాల్ తన ఈపీడబ్ల్యూ వ్యాసంలో, ‘‘దాదాపు 40 ఏళ్ల నక్సలైట్ ఉద్యమాన్ని పునరావలోకనం చేస్తే, ఎంత తక్కువగా ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగలిగారు, అడ్డుకోగలిగారు అనేది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది’’ అని రాశారు. నక్సలైట్లకు మధ్యతరగతి ప్రజలు దూరమయ్యారు. ప్రజాస్వామ్యంలో సాయుధ పోరాటమేంటని ప్రశ్నించేవారు పెరిగారు.

ఎన్‌కౌంటర్లు నిజమైనవా, లేక నకిలీవా అనే చర్చ కూడా కనుమరుగవుతూ వస్తోంది. మావోయిస్టుల మరణాలు సమాజానికి పట్టనివిగా మారిపోయాయి.

అస్తిత్వ ఉద్యమాలు,
అంబేడ్కర్

1990లలో దళిత, స్త్రీవాద సాహిత్య ఉద్యమాలు బలంగా ముందుకొచ్చాయి. అందులో మాజీ నక్సలైట్ సానుభూతి పరులు కీలకపాత్ర పోషించారు. ఒకప్పుడు పునాదులుగా ఉన్న దళితవాడలలో నక్సలైట్ల బలం తగ్గుతూ వచ్చింది. 1990లో అంబేడ్కర్‌కు భారతరత్న అవార్డు ప్రకటించిన తర్వాత జరిగిన పరిణామాల్లో దళితవాడల్లో ఎరుపు బలహీనపడుతూ అంబేద్కరైట్ బులుగు బలపడుతూ వచ్చింది. మండల్ కమిషన్ రిపోర్ట్ విడుదల, తదుపరి పరిణామాల తర్వాత ఈ క్రమం ఇంకా వేగం పుంజుకుంది. పట్టణ మధ్యతరగతి మేధావి వర్గంలో ప్రభావం పూర్తిగా క్షీణిించింది.


నక్సలైట్ ఉద్యమ ఆవిర్భావం, ఉత్థాన పతనాల గురించి కోబాడ్ గాంధీ ఇటీవల బీబీసీతో తన అనుభవాలు, అభిప్రాయాలు పంచుకున్నారు. ఉద్యమం తన లక్ష్యాలను సాధించలేకపోవడానికి కేవలం అంతర్గత బలహీనత ఒక్కటే కాక, సంక్లిష్ట సామాజిక సన్నివేశం, రాజ్యానికున్న అమితమైన బలం కారణాలని ఆయన అన్నారు.
నిచ్చెన మెట్ల కులవ్యవస్థ, సామాజిక విభజనలు, ఆదివాసీల ప్రత్యేకత ల్లాంటి అనేకానేక సామాజిక సంక్లిష్టతలు, భారత ప్రభుత్వ సైనిక శక్తి, ఉద్యమానికి బలీయమైన అడ్డంకులను నిర్మించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంక్లిష్ట సామాజిక సన్నివేశాలను అర్థం చేసుకుని తగిన విధంగా అడ్రస్ చేయడంలో రాజ్య బలిమిని గుర్తించి తగిన విధంగా ఎత్తుగడలు రూపొందించుకోవడంలో ఉద్యమం విఫలమైందనీ, అయితే, ఇతర రాజకీయ శక్తులతో పోల్చుకున్నపుడు నక్సలైట్ ఉద్యమం ఈ విషయంలోె ఎంతో కొంత మెరుగు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కులాన్ని తగిన రీతిలో అడ్రస్ చేయలేకపోవడమన్నది ఉద్యమంలో ప్రాథమిక లోపమని, అట్టడుగు వర్గాలను ఈ పోరాటంలోకి తీసుకురాగల అవకాశాలను ఇది దెబ్బతీసిందని కోబాడ్ గాంధీ అభిప్రాయపడ్డారు.

2004 శాంతి చర్చలు, సీపీఐ (మావోయిస్టు) పార్టీ

2004లో పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) కలిసిపోయి సీపీఐ ఎంఎల్ (మావోయిస్టు) పార్టీగా ఏర్పడ్డాయి. అదే ఏడాది అక్టోబరులో వై.ఎస్. రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ అతిథులుగా హాజరైన మావోయిస్టు నాయకులకు మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఆ చర్చలు విఫలమయ్యాయి. వీటిని ఎవరి ప్రయోజనాల కోసం వారు వాడుకున్నారే తప్ప చర్చలపై ఇరువర్గాలకూ చిత్తశుద్ధి లేదనే ఆరోపణలు వచ్చాయి.

మావోయిస్టులు ప్రజల మద్దతు కోల్పోతున్న కొద్దీ సామాజిక-ఆర్థిక సమస్య అనే మాట కూడా పలుచనబడుతూ వస్తోంది.

శాంతి భద్రతల కోణమే ప్రధానంగా ముందుకొస్తోంది. ‘అర్బన్ నక్సల్స్’ అనే పదాన్ని ప్రభుత్వం ప్రాచుర్యంలోకి తెచ్చింది. అర్బన్ నెట్‌వర్క్స్ ను దెబ్బతీసింది. చాలామంది సానుభూతిపరులైన మేధావులు ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్నారు. కొంతమంది తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్నారు.


సైనికీకరణ, క్షీణత

2000 సంవత్సరం తర్వాత, ప్రభుత్వం దగ్గర అత్యంత ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు, సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగాయి. ఉమ్మడి ఆంధ్రలో గ్రేహౌండ్స్ మాదిరి ప్రత్యేక బలగాలు పుట్టుకొచ్చాయి. దండకారణ్యంలో ఆదివాసీ యువకులతో కూడిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు (డీఆర్‌జీ) ప్రధాన పాత్ర పోషిస్తోంది.

నక్సలైట్ వ్యతిరేక మిలీషియా ‘సల్వాజుడుం’ (2005-2011) రాజ్యాంగ వ్యతిరేకమన్న సుప్రీం కోర్టు తీర్పుతో రద్దు అయ్యాక, అందులోని చాలామంది సభ్యులు డీఆర్‌జీలో చేరారు. సంక్షేమ పథకాలు, రోడ్లు, గిరిజనుల్లో రాజకీయ చీలికలు వెరసి మావోయిస్టు కంచుకోటలకు బీటలువారేలా చేశాయి.

2000-2025 మధ్యకాలంలో, మావోయిస్టు సంబంధిత హింసలో 4,128 మంది పౌరులు, 2,717 మంది భద్రతాసిబ్బంది, అలాగే 4,944 మంది మావోయిస్టులు, గుర్తించని వారు 252 మంది కలిపి మొత్తం 12,041 మంది మరణించారు (ఎస్ఏటీపీ).

‘రోటీ కపడా ఔర్ మకాన్’ నుంచి ‘జిందగీ న మిలేగీ దోబారా’ దాకా

‘బందిని’ (1963) సినిమా సమయంలో సమాజంలో పెల్లుబుకుతున్న ఆవేదన, ఆక్రోశం నేపథ్యంలో మొదలైన ఆలోచన నక్సలిజం. ‘జిందగీ న మిలేగీ దోబారా’ (2011) నాటికి సమాజ గమనంలో, యువత ఆలోచనా విధానంలో చాలా మార్పులొచ్చాయి, వస్తున్నాయి. ప్రజల ఆలోచనా స్రవంతికి మావోయిస్టులకు కనెక్షన్ పోయింది.

అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు తమకు తాము పరిమితమైపోయిన నక్సలైట్లు మార్జినలైజ్ అయిపోయారు. బయటి ప్రపంచంతో వారి సంబంధాలు దాదాపుగా అంతరించిపోయాయి. ప్రజలు పట్టణాలకు ప్రయాణిస్తున్న కొద్దీ, నక్సలైట్లు మరింతగా దట్టమైన అడవులకు పరిమితమవుతూ వచ్చారు. భిన్నమైన దిశల్లో ప్రయాణం సాగింది. .

‘‘నక్సలైట్ ఉద్యమం ప్రధానంగా అత్యంత వెనుకబడిన అడవులకే పరిమితమైంది, పల్లెలు, మైదానప్రాంతాల్లోనే ఉనికి స్వల్పం. ఇక పట్టణాల గురించి చెప్పడానికే లేదు.’’ అని కోబాడ్ గాంధీ చాలా కాలం క్రితమే ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీకి రాసిన వ్యాసంలో చెప్పి ఉన్నారు.

రష్యా, చైనా, నేపాల్ లలో లెనిన్, మావో, ప్రచండలకు ఆయా దేశాలను విప్లవం ద్వారా ఆధునిక దశలోకి నడిపిన జాతీయ ఇమేజ్ ఉంది. అది ఇక్కడ నక్సలైట్లకు లేదు. చట్టాలు, కోర్టుల వంటి ఆధునిక మార్గాలున్న ప్రజాస్వామ్య దేశంలో సాయుధ పోరాటాన్ని అరాచకమని భావించే వారే ఎక్కువ.

ముగింపు

మావో చివరి సైనికులు అస్తిత్వ పోరాటం చేస్తున్నారు. సమూలమైన మార్పు కోసం అంటూ ఏవో కలలతో అడవి బాట పట్టినవారిలో మిగిలినవారు మిగిలి ఉంటారా, దారి మార్చుకునే అవకాశమైనా వారికి మిగిలి ఉంటుందా, లేక సమూలంగా నిర్మూలించాలని రాజ్యం పట్టుబడుతుందా అనేది చూడాలి. వసంతమేఘ ఘర్జన బలహీనమైన పీలస్వరంగా మారిన సన్నివేశంలో నక్సలైట్ల కథ భారతదేశపు మారుతున్న రాజకీయ ఆర్థిక వ్యవస్థ గురించి, దానిని మార్చడానికి ఆయుధాలు చేపట్టిన వారి గురించి మనకు చెబుతుంది.

క్రెడిట్స్:

స్టోరీ: జీఎస్ రామ్మోహన్
ఇల్లస్ట్రేషన్ అండ్ డిజైన్: పునీత్ బర్నాలా, చేతన్ సింగ్, వాసిఫ్ ఖాన్
ప్రొడక్షన్: వాసిఫ్ ఖాన్
ఫోటో క్రెడిట్: గెట్టీ, సీజీ ఖబర్


`