బ్యాంకాక్‌లో మోదీ: ఆర్‌సీఈపీ ఒప్పందానికి భారత పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయా? - అభిప్రాయం

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జయ్ నారాయణ్ వ్యాస్
    • హోదా, బీబీసీ కోసం

1995, జనవరి 1న మారకేష్ ఒప్పందం కింద ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూటీఓ) ఏర్పడింది.

ప్రస్తుతం అందులో 153 సభ్య దేశాలు, 30 పరిశీలక ప్రభుత్వాలు ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో 95 శాతం డబ్ల్యూటీఓ సభ్య దేశాలే సాగిస్తున్నాయి.

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో డబ్ల్యూటీఓ కేంద్ర కార్యాలయం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన విధివిధానాలను డబ్ల్యూటీఓ నిర్దేశిస్తుంది. అయితే, వాటి అమలు దాని బాధ్యత కాదు.

పరస్పర ప్రయోజనకర ఆర్థిక, వాణిజ్య సంబంధాలు, సమానత్వం, నిబద్ధత కూడిన హామీలు, పారదర్శకత, భద్రత.. ఇవీ డబ్ల్యూటీఓ పాటించే మార్గదర్శక సూత్రాలు.

రాయితీల మీదే ఆధారపడ్డ రైతులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశాలు, హోల్‌సేల్ వ్యవసాయత్పత్తుల ఎగుమతుదారులు అధికంగా ఉన్న దేశాలు వాణిజ్యపరమైన అడ్డంకులు తగ్గించుకోవడంపై దోహా సదస్సులో చర్చించాయి. కానీ, దీనిపై వాటి మధ్య అంగీకారం ఇంకా కుదరాల్సి ఉంది.

డబ్ల్యూటీఓ చార్టర్‌పై సంతకం చేసిన దేశం మిగతా సభ్య దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించి వాణిజ్యపరమైన అడ్డంకులని సృష్టించేందుకు వీలు లేదు.

భారత్ దీనిపై సంతకం చేసినప్పుడు దేశంలోకి విదేశీ ఉత్పత్తుల వరద పెరిగి, దేశీయ తయారీదారులు, వ్యాపారులు తుడిచిపెట్టుకుపోతారని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

మన మార్కెట్‌లోకి వచ్చే కొన్ని చవక ఉత్పత్తుల వల్ల దేశీయ వ్యాపారులకు నష్టం జరుగుతోందని ఇప్పటికీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, Getty Images

చైనాను తట్టుకుని భారతీయ పరిశ్రమలు ఎలా నిలబడతాయి?

బొమ్మలు మొదలుకొని రసాయనాలు, ఫర్నీచర్ వరకూ చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ధర, నాణ్యత విషయంలో దేశీయ తయారీదారులు వీటితో పోటీపపడలేకపోతున్నారు.

ఇప్పుడు మరొక ఆందోళన మొదలైంది. అది రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ (ఆర్‌సీఈపీ) అంటే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం అనే కొత్త వాణిజ్య ఒప్పందం గురించి.

2011-12లోనే ఆర్‌సీఈపీ గురించి అవగాహన కుదిరింది.

ఆసియాన్ సభ్యదేశాలు (బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) భాగస్వామ్యులు (భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్)ల మధ్య ఒప్పందం ఇది.

ఒకవేళ అమల్లోకి వస్తే ఆయా దేశాలు కస్టమ్స్ సుంకాలు లేకుండా ఒకరితోఒకరు వాణిజ్యం చేసుకోవచ్చు.

ప్రపంచ జీడీపీలో 34 శాతం ఈ 16 ఆర్‌సీఈపీ దేశాల నియంత్రణలోనే ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ దేశాల వాటా 40 శాతం.

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రభావితమయ్య రంగాలు

ఆర్‌సీఈపీతో భారత్‌లోని కొన్ని రంగాలకు ముప్పు ఉంది. చైనా, ఆసియాన్ దేశాల నుంచి వచ్చే చవకైన దిగుమతుల పోటీని అవి తట్టుకోలేవు. వస్త్ర, రసాయనాలు, డై (అద్దకం రంగులు), డై సంబంధిత ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, ఉక్కు పరిశ్రమల వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.

ఆర్‌సీఈపీ ఒప్పందంపై సంతకం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు చాలా మంది పారిశ్రామికవేత్తలు, సంఘాల నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌ల్లోనివారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఎగుమతుల విషయంలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. దిగుమతుల విలువ 565 బిలియన్ డాలర్లు ఉంటే, ఎగుమతుల విలువ 478 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది.

దిగుమతుల్లో ప్రధానమైంది ముడిచమురే. దాని వాటానే దాదాపు 100 బిలియన్ డాలర్లు.

ఇక భారత్ మొత్తం దిగుమతుల్లో ఆర్‌సీఈపీ దేశాల వాటా 44 శాతం (165 బిలియన్ డాలర్లు). నవంబర్‌లో ఒప్పందం అమల్లోకి వస్తే, ఇది రెండింతలయ్య అవకాశం ఉంది. ఇదే అంశం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది.

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, Getty Images

చైనా నుంచి రసాయనాలు, డై.. బంగ్లాదేశ్, ఇండోనేసియాల నుంచి వస్త్రాలు.. అస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల నుంచి డైరీ ఉత్పత్తులు సుంకాలేవీ లేకుండా భారత్ మార్కెట్‌లోకి పోటెత్తితే స్థానిక పరిశ్రమలు, పాడి రైతులు ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది.

రసాయనాలు, డైలు చైనా నుంచి చవగ్గా వస్తాయని స్థానిక వర్గాలు అంటున్నాయి. రసాయనాల రంగంలో డైల వాటా 33 శాతం. చైనా ఉత్పత్తుల వరద మొదలైతే, దేశీయ పరిశ్రమల్లో 50 శాతం మూతపడే ముప్పు ఉంది.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలే ఎక్కువగా ప్రభావితమవుతాయి. రసాయనాలు, డై తయారీలో గుజరాత్ కేంద్రంగా ఉంది. ఆ రాష్ట్రంలో డై, డై సంబంధిత పరిశ్రమల మొత్తం టర్నోవర్ రూ.25 వేల కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. ఆర్‌సీఈపీ అమల్లోకి వచ్చి చైనా, ఇతర దేశాల నుంచి ఆ ఉత్పత్తుల దిగుమతులు మొదలైతే రూ.8 వేల కోట్ల నష్టం జరగొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

వస్త్రాలకు సంబంధించి ఆరు దేశాలతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చేసుకుంది. దీని కింద భారత్ ఎగుమతుల విలువ 60 బిలియన్ డాలర్లు ఉండగా, దిగుమతుల విలువ మాత్రం 200 బిలియన్ డాలర్లు ఉంది.

ఎఫ్‌టీఏతో భారత్‌కు ప్రయోజనం దక్కలేదని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు మరో 16 దేశాలతో ఈ ఒప్పందం కుదిరితే వస్త్ర రంగం పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

ఆర్‌సీఈపీ రూపంలో భారత్ సమస్యలకు ఆహ్వానం పలుకుతున్నట్లు అనిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న పరిశ్రమలు కొత్త పోటీని తట్టుకోలేక, అంతరించిపోయే ప్రమాదం ఉంది.

ఆర్‌సీఈపీ

ఫొటో సోర్స్, Getty Images

నిరుద్యోగం పెరగొచ్చు

పాల ఉత్పత్తుల రంగంలో ఉన్నవారిపై నేరుగా ప్రభావం పడొచ్చు. నిరుద్యోగం పెరగొచ్చు.

చవక పాల ఉత్పత్తులతో రైతులు, పాడి పరిశ్రమలో ఉన్నవారికి నేరుగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఎక్కువగా ఉద్యోగాలు కల్పించే వస్త్ర, కెమికల్, హెవీ ఇంజినీరింగ్ పరిశ్రమలు ఆర్‌సీఈపీ దేశాలతో పోటీ పడలేకపోవచ్చు. ఈ రంగాల్లోనూ నిరుద్యోగం పెరగొచ్చన్న ఆందోళన ఉంది.

ఆర్‌సీఈపీ మీద సంతకం చేసే ముందు భారత్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటుందని, సొంత పరిశ్రమలకు హాని చేయకుండా ఉంటుందని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)