ఐపీఎల్ 2020: సూపర్‌స్టార్‌లుగా సంచలనం సృష్టించబోయే యువ క్రికెటర్లు వీరేనా...

ఐపీఎల్ 2020

ఫొటో సోర్స్, Getty Images

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2020 క్రికెట్ టోర్నమెంట్ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మొదలైంది.

ఆసక్తికరంగా సాగే ఈ టోర్నమెంట్ ప్రపంచంలోనే సుసంపన్న టోర్నమెంట్‌లలో ఒకటి. దీనిలో భారత్‌తోపాటు విదేశీ జట్లకు చెందిన టాప్ క్రికెటర్లు ఆడుతుంటారు.

భారత్‌లో ఈ మ్యాచ్‌లు జరిగేటప్పుడు అభిమానులతో మైదానాలు కిక్కిరిసిపోతుంటాయి. బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులూ కూడా వీటికి వస్తుంటారు.

అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఈ సారి అంతా భిన్నంగా జరగబోతోంది. ఖాళీ స్టేడియంలలో క్రికెటర్లు ఆడబోతున్నారు. అంటే ఈ సారి అభిమానుల చప్పట్ల మోత వినిపించవు. మరోవైపు ఎప్పటిలా పార్టీలూ ఉండబోవు.

మరోవైపు ఎప్పటికీ మారని ఒక అంశం ఉంది. అదేమిటంటే.. క్రికెట్ చరిత్రలో కొత్త సూపర్‌స్టార్‌లకు ఈ టోర్నమెంట్ వేదికగా మారడం. అంటే ఈసారి కూడా కొంతమంది కొత్త క్రికెటర్లు తమ సత్తా చూపించేందుకు దిగుతున్నారు.

అన్ని టీమ్‌లూ కొత్త ప్లేయర్లకు అవకాశం కల్పించాయి. కొందరైతే భారత్‌లోని అండర్-19 జట్టు క్రిడాకారులను తీసుకున్నారు. వీరిలో సూపర్‌స్టార్లగా మారే అవకాశమున్న కొందరి వివరాలివీ..

యశస్వి జైస్వాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యశస్వి జైస్వాల్

యశస్వి జైస్వాల్

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అంటే యశస్వికి చాలా ఇష్టం. సచిన్‌ను కలవాలని ఎప్పటినుంచో అతడు కలలుకన్నాడు.

దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అండర్-19 వరల్డ్ కప్ ఆడి భారత్ వచ్చిన వెంటనే అతడి కల నెరవేరింది. టోర్నమెంట్‌లో అతడి స్టైలిష్ బ్యాటింగ్‌పై సచిన్ ప్రశంసలు కూడా కురిపించారు. అప్పటినుంచీ తిరుగు లేకుండా యశస్వి దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ టీమ్‌తో అతడు ఐపీఎల్‌లో రంగ ప్రవేశం చేస్తున్నాడు.

యశస్విపై రాజస్థాన్ రాయల్స్ చాలా ఆశలే పెట్టుకుంది. వరల్డ్ కప్‌లో అతడి ఆట తీరు చూస్తే అందరూ అలానే భావిస్తారు మరి. 88, 105 నాట్ అవుట్, 62, 57 నాట్ అవుట్, 29 నాట్ అవుట్, 57 ఇవి అతడి స్కోర్లు. ఈ ఏడాది అతడిదే టాప్ స్కోర్. టోర్నమెంటు చరిత్రలో ఐదు అర్థ శతకాలు బాదిన మూడో బాట్స్‌మన్ ఇతడే.

క్రికెట్ చరిత్రతోపాటు అతడి నేపథ్యమూ స్ఫూర్తిదాయకమైనదే. తన నైపుణ్యాలకు పదునుపెట్టేందుకు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణం నుంచి అతడు ముంబయి మహానగరానికి వచ్చాడు. తొలి రోజుల్లో అతడు రోడ్లపైనే పడుకునేవాడు. వీధుల్లో తినుబండారాలనూ అమ్మాడు.

అతడిలో ప్రతిభను గుర్తించిన ఓ స్థానిక కోచ్ అతడికి ఆశ్రయం ఇచ్చారు. దీంతో అతడి జీవితం మలుపు తిరిగింది. బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడే టీమ్‌లో అతడు చోటు సంపాదించాడంటే ఇది మామూలు విషయం కాదు. కఠినమైన పరిస్థితుల్లో ఎలా నెగ్గుకు రావాలో అతడికి బాగా తెలుసు.

రవి బిష్ణోయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రవి బిష్ణోయ్

రవి బిష్ణోయ్

బిష్ణోయ్‌ను భారత భవిష్యత్ ''స్పిన్ ఇంద్రజాలికుడి''గా మాజీ టెస్ట్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభివర్ణించారు. అండర్-19 వరల్డ్ కప్‌లో అతడి ఆట తీరు చూస్తే ఇది అతిశయోక్తి కాదనే అనిపిస్తుంది.

బిష్ణోయ్ 17 వికెట్లు తీశాడు. కీలక సమయంలో భారత్ గెలిచేలా అతడు ఆటను మలుపులు తిప్పాడు. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. అయితే టోర్నమెంటులో స్టార్ పెర్ఫార్మర్‌లలో ఒకడిగా బిష్ణోయ్ చోటు సంపాదించాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో కింగ్స్-11 పంజాబ్ టీమ్ తరఫున బిష్ణోయ్ ఆడబోతున్నాడు. జట్టులో అతడు కీలకపాత్ర పోషిస్తాడని అందరూ భావిస్తున్నారు.

మధ్యస్థంగా నెట్టుకువచ్చే ఈ జట్టు.. బిష్ణోయ్ ప్రపంచ కప్ మాయాజాలాన్ని మళ్లీ చూపిస్తాడని ఎదురుచూస్తోంది.

ప్రియమ్ గార్గ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రియమ్ గార్గ్

ప్రియమ్ గార్గ్

అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌ అయిన గార్గ్.. ఫైనల్ వరకూ జట్టును తీసుకెళ్లాడు. అతడి స్కోర్ మామూలుగానే ఉన్నప్పటికీ.. అతడు మంచి క్రీడాకారుడు.

కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో మంచి వ్యూహాలను రచించగలడని ఇతడికి పేరుంది.

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా స్వదేశీ టోర్నమెంట్‌లలో చక్కటి ప్రదర్శనలూ ఇచ్చాడు.

2018లో ఉత్తర్ ప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌తో అతడు అరంగేట్రం చేశాడు. వస్తూవస్తూనే డబుల్ సెంచరీ కొట్టి.. అందరి దృష్టిలో పడ్డాడు.

మరికొన్ని మ్యాచ్‌లలోనూ అతడు మంచి స్కోర్ కొట్టాడు. దీంతో అండర్-19 కెప్టెన్‌గా అతడికి అవకాశం లభించింది.

ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ అతణ్ని జట్టులోకి తీసుకొంది. చరిత్రను పరిశీలిస్తే.. గార్గ్‌కు మంచి భవిష్యత్ ఉందనే చెప్పాలి.

ప్రస్తుత భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు పృథ్వీ షా, మహమ్మద్ కైఫ్, పార్థివ్ పటేల్ లాంటి క్రికెటర్లు అండర్-19 కెప్టెన్‌లుగా ఆడినవారే.

సన్‌రైజర్స్ జట్టు నిలబడటంలో గార్గ్ సాయం చేయగలిగే.. భారత జట్టులో అతణ్ని తీసుకొనే అవకాశాలు చాలా ఎక్కువ.

కార్తిక్ త్యాగి

ఫొటో సోర్స్, Kartik Tyagi/Facebook

ఫొటో క్యాప్షన్, కార్తిక్ త్యాగి

కార్తిక్ త్యాగి

గూగ్లీలతో బ్యాట్స్‌మన్‌లను బిష్ణోయ్ తికమక పెడుతుంటే...తన బౌలింగ్‌తో త్యాగి షాక్‌లు ఇచ్చేవాడు.

13.90 సగటుతో అతడు 11 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతణ్ని రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకుంది.

ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరన్, ఇంగ్లాస్ పేసర్ జోఫ్రా ఆర్చెర్ లాంటి వారు ఈ జట్టులో ఉన్నారు. వీరితో త్యాగి కలిస్తే.. జట్టు మంచి బౌలింగ్‌ జట్టుగా మారే అవకాశముంది.

యూఏఈలోని స్లో పిచ్‌లపై త్యాగి కీలకంగా మారే అవకాశముంది. ఎందుకంటే ఇలాంటి పిచ్‌లపై బౌలింగ్ వేయడంలో త్యాగి దిట్ట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)