ఎమర్జెన్సీ: ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు కుట్రలు చేస్తున్నారని ఇందిరా గాంధీ ఆందోళన, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, బంగ్లాదేశ్ యుద్ధం తరువాత ఆమె ప్రజాదరణ అమాంతం పెరిగిపోయిన సందర్భంలో వచ్చి ఉంటే పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవి.
కానీ 1971 తర్వాత మూడేళ్లలో దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
అలహాబాద్ హైకోర్టు నిర్ణయం తర్వాత ఇందిరాగాంధీకి బహిరంగంగా మద్దతు తెలపడానికి చాలా కొద్ది మందే ఆసక్తి చూపారు.
''రాంగ్ ప్లేస్‌లో కారు పార్క్ చేసినందుకు ప్రభుత్వాధినేతను రాజీనామా చేయమని అడిగేలాంటి పరిస్థితి నెలకొంది'' అని ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ జేమ్స్ కామెరన్ వ్యాఖ్యానించారు.
1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేసింది.
ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఎన్నికలను రాజ్‌నారాయణ్ ప్రతిష్టాత్మకంగా మార్చారు. ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులూ ఒడ్డారు. విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఆయన మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీ కూడా చేశారు. అయితే, ఫలితాల్లో రాజ్‌నారాయణ్ ఓడిపోయారు. అయినా రాజ్‌నారాయణ్ పట్టువీడలేదు. ఇందిరా గాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు.
ఎన్నికల్లో తనకు మద్దతుగా ఇందిరా గాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారని రాజ్‌నారాయణ్ ఆరోపించారు. మొత్తం ఏడు ఆరోపణలు చేశారు.
ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు నిర్ణయం వచ్చిన వెంటనే ఇందిర మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు 1, సఫ్దర్‌జంగ్ రోడ్డులోని ఆమె ఇంటికి రావడం ప్రారంభించారు.
కానీ ఇందిరాగాంధీ ఆ సమయంలో కొందరి మాట మాత్రమే వింటుండేవారు.
''1975 జూన్ 12న రాజీనామాకు ఇందిర మానసికంగా సన్నద్ధమవుతున్నారు. తన స్థానంలో స్వర్ణ్ సింగ్‌ను ప్రధానమంత్రిని చేయాలని ఆమె ఆలోచించారు. సుప్రీంకోర్టులో తన అప్పీలును ఆమోదించిన తర్వాత మళ్లీ తన పరపతి పెరుగుతుందని, అప్పుడు తాను మళ్లీ ప్రధానమంత్రి కావొచ్చని ఇందిర ఆలోచించారు. అయితే ఇందిర నాయకత్వంలో సంతోషంగా పనిచేయగలను గానీ, తాత్కాలికంగా అయినా సరే స్వర్ణ్ సింగ్‌ను ప్రధానమంత్రిని చేయాలనుకుంటే సీనియారిటీ ప్రాతిపదికన తాను పోటీపడతానని సీనియర్ మంత్రి జగ్జీవన్ రామ్ సంకేతాలు ఇవ్వడం ప్రారంభించారు'' అని ప్రముఖ జర్నలిస్టు ఇందర్ మల్హోత్ర తన పుస్తకం 'ఇందిరా గాంధీ ఏ పర్సనల్ అండ్ పొలిటికల్ బయోగ్రఫీ'లో రాశారు.


ఫొటో సోర్స్, Getty Images
జేపీ వల్లే ఇందిర నిర్ణయం మార్చుకున్నారా?
సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేముందే తాను రాజీనామా చేస్తే అది ప్రజలలో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, ఒకవేళ సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పునిస్తే తాను తిరిగి అధికారంలోకి రావచ్చని ఇందిర భావించారు.
''ప్రతిపక్ష నేతలు, ప్రత్యేకించీ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) రాజీనామా నిర్ణయాన్ని ఇందిరకే వదిలిపెడితే ఆమె అదే చేసేవారేమో. కానీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని, ఇందిరాగాంధీ రాజీనామా చేసేలా తామే ఒత్తిడి చేసినట్టు ప్రపంచానికి చూపించాలని జేపీ అనుకున్నారు.
‘‘తన ప్రకటనలన్నింటిలోనూ ఇందిరాగాంధీ స్థాయిని తగ్గించి మాట్లాడేవారు. ఈ వ్యక్తిగత శత్రుత్వం ఇందిరలోని పోరాటస్ఫూర్తిని బయటకు తెచ్చింది. అన్ని విధాలా తనను తాను రక్షించుకోవాలన్న తన నిర్ణయాన్ని బలోపేతం చేసింది'' అని 'ఇందిరాగాంధీ, ది ఎమర్జెన్సీ అండ్ ఇండియన్ డెమోక్రసీ' అనే పుస్తకంలో ఇందిరకు సెక్రటరీగా పని చేసిన పీఎన్ ధర్ రాశారు.

ఇందిర రాజీనామాను కోరుకున్న కాంగ్రెస్ సీనియర్లు
కాంగ్రెస్‌లోని పెద్ద నేతల్లో ప్రతి ఒక్కరూ పైకి ఇందిరాగాంధీకి విశ్వాసపాత్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ప్రధానమంత్రి పదవి తమకు దగ్గరలో ఉందన్న విషయం వారికి అవగాహన ఉంది.
''బహిరంగంగా ఇందిరకు మద్దతిస్తున్నప్పటికీ చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇందిర రాజీనామా చేయాలని గుసగుసలాడుకునేవారు. వారిలో జగ్జీవన్ రామ్, కరణ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెంగళరావు, కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ వంటివారితో సహా అనేకమందిలో ఈ అభిప్రాయం ఉండేది. కానీ వారిలో ఎవరికీ ఈ విషయాన్ని ఇందిరతో నేరుగా చెప్పే ధైర్యం లేదు'' అని తన పుస్తకం 'ది ఎమర్జెన్సీ, ఏ పర్సనల్ హిస్టరీ' అనే పుస్తకంలో కుమీ కపూర్ రాశారు.
ఈ విషయంలో కరణ్‌సింగ్ ఇందిరాగాంధీకి పరోక్షంగా ఓ కచ్చితమైన సలహా ఇచ్చారు.
ఇందిరాగాంధీ క్యాబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కరణ్ సింగ్.. రాజీనామా విషయాన్ని తాను ఇందిరాగాంధీకి సూచించానని చెప్పినట్టు 'హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్' పుస్తకంలో నీర్జా చౌధురి రాశారు.
''రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు రాజీనామా లేఖను పంపడం బాగుంటుందని నేను సూచించా. ఆయన మీ రాజీనామాను తిరస్కరించి, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు పదవిలో కొనసాగాలని కోరవచ్చు'' అని కరణ్ సింగ్ ఇందిరాగాంధీతో చెప్పారు.
కరణ్ సింగ్ ఈ విషయం చెప్పినప్పుడు ఇందిరాగాంధీ ఏమీ మాట్లాడలేదుగానీ ‘నా సూచన ఇందిరాగాంధీకి నచ్చినట్టు లేదని నాకనిపించింది’’ అని కరణ్ సింగ్ నీర్జా చౌధురితో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సంజయ్ గాంధీ వ్యతిరేకత
ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. ధవన్, హరియాణా ముఖ్యమంత్రి భన్సీలాల్‌లు ఇందిర రాజీనామాను వ్యతిరేకించారు.
''రాజీనామా చేయాలని ఇందిరాగాంధీ అనుకుంటున్నారని సంజయ్ గాంధీకి తెలియగానే, ఆయన తల్లిని మరో గదిలోకి తీసుకెళ్లి, తాను ఆమెను రాజీనామా చేయనివ్వనని చెప్పారు.
సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చే వరకు కాంగ్రెస్ అధ్యక్షపదవిని ఇందిర చేపట్టడం, దేశ ప్రధాని పదవిని తాను చేపట్టడమనే దేవకాంత బారువా సూచనపై కూడా సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ విశ్వాసపాత్రంగా ఉన్నట్టు నటిస్తున్నారని, కానీ వాస్తవంలో అందరూ అధికారం కోసం పరుగు తీస్తున్నారని ఇందిరతో చెప్పారు సంజయ్'' అని ఇందిరాగాంధీ బయోగ్రఫీలో పుపుల్ జయకర్ రాశారు.

ఫొటో సోర్స్, INC
కాంగ్రెస్ మేథో మథనం
ఎమర్జెన్సీని ప్రకటించడం వెనుక ఇందిరాగాంధీకున్న అభద్రతాభావం ప్రధాన పాత్ర పోషించింది.
అలహాబాద్ హైకోర్టు నిర్ణయం, జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంతో పాటు తన సొంత పార్టీకే చెందిన నేతలు తనను అధికారం నుంచి తప్పించేందుకు తన వెనక కుట్రలు చేస్తున్నారని కూడా ఇందిర ఆందోళన చెందారు.
''ఇందిరను తొలగించాలనే ఆలోచనలో వందమందికిపైగా కాంగ్రెస్ నేతలున్నారు. వారిలో దేవకాంత్ బారువా కూడా ఉన్నారు. ఇందిరకు అతిపెద్ద మద్దతుదారుగా చెప్పుకునే ఆయన కూడా ఇందిరను వదిలివేయాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ నాయకుడు చంద్రజిత్ యాదవ్ నివాసంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశానికి హాజరైన కొందరు క్యాబినెట్ మంత్రులకు సీనియర్ నేత జగ్జీవన్ రామ్‌ని ప్రధానమంత్రిగా చేయాలా లేక 1952 నుంచి కేంద్రమంత్రిగా ఉన్న స్వర్ణ్ సింగ్‌కు పదవి ఇవ్వాలా అనేదానిపై ఏకాభిప్రాయం కుదరలేదు'' అని 'ది జడ్జ్‌మెంట్' అనే పుస్తకంలో కులదీప్ నయ్యర్ రాశారు.
ఆరోజు రాత్రి బారువా, యాదవ్ కలిసి ఇందిరాగాంధీకి వ్యతిరేక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తుంటే, యువ నాయకులు చంద్రశేఖర్, కృష్ణకాంత్, మోహన్ ధారియా ప్రెస్ ముందు బహిరంగంగానే ఇందిరకు వ్యతిరేకంగా మాట్లాడారు.
ప్రధానమంత్రి కెరీర్‌ను రక్షించడం కన్నా పార్టీని రక్షించడం చాలా ముఖ్యం అని ఈ నాయకులు వాదించారు.
ప్రధానమంత్రి మీద దర్యాప్తు సాగుతుండడంతో ఇందిర నేతృత్వంలో 1976 ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేయదనీ, ఇందిరాగాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ముందుకొస్తే దేశం విప్లవం వైపుగా కదులుతుందని కృష్ణకాంత్ నమ్మారు. ఇప్పుడు పరిస్థితి ఆమె ఒక్కరే మునిగిపోయేలా లేదని, ఆమెతో పాటు పార్టీ కూడా మునిగిపోయేలా ఉందని వాదించారని 'ఇండియాస్ ఫస్ట్ డిక్టేటర్‌షిప్, ద ఎమర్జెన్సీ 1955-77' పుస్తకంలో క్రిస్టోఫ్ జాఫ్రెలట్, ప్రతినవ్ అనిల్ రాశారు.

ఫొటో సోర్స్, HARPER COLLINS
సొంత పార్టీలో తిరుగుబాటుపై ఇందిర ఆందోళన
మరో వైపు జగ్జీవన్‌రామ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హేమ్‌వతి నందన్ బహుగుణ, కృష్ణకాంత్‌తో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు వారిద్దరూ మద్దతుగా ఉన్నారు.
పార్టీ ఐక్యంగా ఉండాలని మోహన్ ధారియాకు ఇందిర మద్దతుదారు యశ్వంత్ రావ్ చవాన్ విజ్ఞప్తి చేశారు.
''జూన్ 12, 18 మధ్య జగ్జీవన్ రామ్‌కు కాంగ్రెస్ ఎంపీల మద్దతు పెరుగుతున్నట్టు కనిపించింది. ఆయనకు మద్దతు కూడగట్టడానికి కమ్యూనిస్టు నాయకుడు శ్రీపాద్ అమృత్ డాంగే, కాంగ్రెస్ వామపక్షవాది కేడీ మాలవీయ రంగంలోకి దిగారు'' అని క్రిస్టోఫ్, ప్రతినవ్ అనిల్ రాశారు.
''తన శత్రువుల కన్నా, సొంత పార్టీ సభ్యుల గురించే ఇందిరాగాంధీ ఎక్కువ ఆందోళన చెందారు'' అని ప్రముఖ జర్నలిస్ట్ నిఖిల్ చక్రవర్తి భావించారు.
ఆ పరిస్థితుల్లో ఇందిరాగాంధీకన్నా అభద్రతాభావానికి లోనవుతున్నవారు ఎవరూ లేరని ఆమె బయటి ప్రత్యర్థులు కూడా భావించడం ప్రారంభించారు.
''ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించడం మా ఉద్దేశం. ఓ మహిళ దేశానికి నాయకత్వం వహించలేరని నాకు అర్ధమయింది. మా ఉద్యమాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఈ మహిళకు లేదు'' అని మొరార్జీ దేశాయ్ చెప్పినట్టు 'మిసెస్ గాంధీస్ అపోజిషన్, మొరార్జీ దేశాయ్' టైటిల్‌తో 1975 ఆగస్టు 9న ప్రచురితమైన ఆర్టికల్‌లో ఓరియానా ఫలాచి రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇందిర, జగ్జీవన్ రామ్ మధ్య విభేదాలు
ఇందిరను వ్యతిరేకించడానికి యువ కాంగ్రెస్ నాయకులకు వ్యక్తిగత కారణాలున్నాయి. జయప్రకాశ్ నారాయణ్‌తో కాంగ్రెస్ చర్చలు జరపాలని సూచించినందుకు అంతకు మూడు నెలల ముందు మోహన్ ధారియాను మంత్రివర్గం నుంచి ఇందిరాగాంధీ తొలగించారు.
ఇందిరాగాంధీ వ్యతిరేకించినప్పటికీ 1972లో చంద్రశేఖర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడయ్యారు.
''ఇందిరాగాంధీకి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందని జగ్జీవన్ రామ్ చెప్పడం ఉత్తమాటే. ఆయనే స్వయంగా ప్రధాని పదవి కోసం నిరీక్షిస్తున్నవారిలో ఉన్నారు. ఇందిరకు, జగ్జీవన్ రామ్‌కు మధ్య చాలాకాలంగా విభేదాలున్నవిషయం రహస్యమేమీ కాదు'' అని క్రిస్టోఫ్ జాఫ్రెలట్, ప్రతినవ్ అనిల్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటెలిజెన్స్ నివేదికతో ఆందోళన
మొత్తం 350 మంది కాంగ్రెస్ ఎంపీల్లో ఇందిరాగాంధీకి 191మంది మద్దతు మాత్రమే ఉందని ఆమెకు ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పింది.
మిగిలిన 159 మంది ఎంపీలు పార్టీలోని ప్రాంతీయ నేతలకు మద్దతుదారులుగా ఉన్నారని అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఆత్మ జైరామ్ తనతో చెప్పినట్టు షా కమిషన్ ఎదుట చెప్పారు ఇందిరాగాంధీ మాజీ వ్యక్తిగత కార్యదర్శి పీఎన్ ధర్.
యువ నాయకుల వెంట 24 మంది ఎంపీలున్నారు. యశ్వంత్‌రావ్ చవాన్ వెంట 17 మంది, జగ్జీవన్‌రామ్ వెంట 13 మంది, బ్రహ్మానందరెడ్డి వెంట 11 మంది, కమలాపతి త్రిపాఠి వెంట 8 మంది, హేమ్‌వతి నందన్ బహుగుణ వెంట ఐదుగురు, డీపీ మిశ్రా వెంట నలుగురు, శ్యామ్‌చరణ్ శుక్లా వెంట ముగ్గురు ఎంపీలున్నారు. వారితో పాటు 15 మంది ఇతర ఎంపీలు కూడా వ్యక్తిగత, రాజకీయ, ఇతర కారణాలతో వ్యతిరేకించారు. (షా కమిషన్ పేపర్లు, ఫైల్ 1, పేజ్ 25-26)
ఇందిరాగాంధీ రెండువైపులా సంక్షోభం ఎదుర్కొన్నారు.
''మొదటి కారణం రాజ్యాంగాన్ని సవరించడానికి కావాల్సిన మెజార్టీ పార్లమెంట్‌లో ఆమెకు లేదు. రెండో కారణం ఒకవేళ ఆమె మద్దతుదారుల సంఖ్య 191 నుంచి 175కి పడిపోతే కాంగ్రెస్ ఎంపీలు నైతికబలం ఉన్న ఎవరో ఒకరి నాయకత్వంలో తనను పదవి నుంచి తొలగించే అవకాశాన్ని తోసిపుచ్చలేం'' అని క్రిస్టోఫ్ జాఫ్రెలట్, ప్రతినవ్ అనిల్ రాశారు.

ఫొటో సోర్స్, OUP
మారిన గాలి
కానీ జూన్ 18నాటికి ఇందిరకు అనుకూలంగా గాలి వీచడం మొదలయింది. దీనికి కారణం అప్పటివరకు నిశ్శబ్దంగా పరిస్థితులను గమనిస్తున్న యశ్వంత్‌రావ్ చవాన్, స్వర్ణ్ సింగ్ ఆమెకు అనుకూలంగా మారారు.
అప్పటికి తన ముందు చాలా పెద్ద సవాలు ఉందని జగ్జీవన్‌రామ్ కూడా గ్రహించారు.
ఓ వైపు దిల్లీలో రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు చాలా మంది పోటీదారులున్నారు. మరో వైపు వారంతా ఇందిరాగాంధీతో పోటీపడుతున్నారు. దిల్లీలో బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ పార్టీపై ఆమె పట్టు చెక్కుచెదరలేదు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఇందిర నాయకత్వంపై విశ్వాసం వ్యక్తమైంది.
''నాయకత్వ రేసులో తాను పాల్గొంటే, తాను పెద్ద సంక్షోభాన్ని ఆహ్వానించినట్టేనని జగ్జీవన్ రామ్ గ్రహించారు. పార్టీ మరోసారి చీలిపోయే అవకాశం ఉంటుందని కూడా భావించారు. దానికి ఆయన సిద్ధంగా లేరు'' అని ''టు ఫేసెస్ ఆఫ్ ఇందిరాగాంధీ'' పేరుతో రాసిన ఇందిరాగాంధీ జీవిత చరిత్రలో ఉమా వాసుదేవ్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇందిర నాయకత్వంపై విశ్వాసం
జగ్జీవన్ రామ్ నుంచి తనకు సవాలుందన్న విషయం కచ్చితంగా తెలుసుకున్న ఇందిరాగాంధీ తన నాయకత్వంపై విశ్వాసం ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటుచేయాలని సిద్ధార్థ శంకర్ రే, ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ వీబీ రాజులను కోరారు.
జూన్ 18న జరిగిన ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన మొత్తం 518 మంది కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. వారు ఇందిరా గాంధీ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇందిర నాయకత్వం దేశానికి అనివార్యమన్నారు.
మొదట్లో దాదాపు 70 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు ఉన్న ఆ యువ కాంగ్రెస్ నాయకుడికి, పార్టీలో మద్దతు తగ్గడం మొదలయింది. జయప్రకాశ్ నారాయణ్ గౌరవార్థం చంద్రశేఖర్ ఒక సమావేశం నిర్వహించినప్పుడు 20-25 మంది కాంగ్రెస్ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
మొదట తిరుగుబాటుదారులతో ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నందిని సత్పతి జూన్ 18 నాటికి ఇందిరా గాంధీ వైపు వచ్చారు. తర్వాతి కొద్ది రోజుల్లోనే, కాంగ్రెస్ నాయకులు, క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఇందిరకు మద్దతుగా మాట్లాడడం మొదలుపెట్టారు.
కానీ కాంగ్రెస్ నాయకులలో తనకు పూర్తి మద్దతు లేదని ఇందిరా గాంధీ గ్రహించారు. ఈ ఆలోచన అత్యవసర పరిస్థితిని ప్రకటించాలనే ఆమె నిర్ణయాన్ని మరింత బలపరిచింది.

ఫొటో సోర్స్, CHANDRASHEKHAR FAMILY
ఎమర్జెన్సీ ఎత్తివేయడంపై మనసు మార్చుకున్న ఇందిర
అత్యవసర స్థితికి కాస్త సడలింపు ఇవ్వడం లేదా పూర్తిగా ఎత్తివేడయం గురించి ఇందిరాగాంధీ ఆలోచిస్తున్నట్టు 1975 ఆగస్టు నాటికి సూచనలందాయి. దీనికి కారణాలున్నాయి. వర్షాలు బాగా పడుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తగ్గాయి. ప్రతిపక్షం పూర్తిగా బలహీనపడింది. వచ్చే ఆరేడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి.
''ఎర్ర కోట నుంచి ఆగస్టు 15న చేయబోయే ప్రసంగంలో ఇందిరాగాంధీ ఈ విషయాన్ని పక్రటించాల్సి ఉంది. కానీ ఆగస్టు 15 ఉదయం బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటనలు భారత్‌లో రాజకీయ సమీకరణాన్ని మార్చేశాయి'' అని పుపుల్ జయకర్ రాశారు.
షేక్ ముజిబుర్ హత్య ఇందిరాగాంధీకి షాక్ కలిగించింది. ఆమె దానిని నమ్మలేకపోయారు. ఎర్రకోటలో ప్రసంగించడానికి వెళ్లేముందు ''నేనెవర్ని నమ్మాలి?'' అని పుపుల్ జయకర్‌తో ఇందిర అన్నారు. బంగ్లాదేశ్‌లో జరిగిన హత్యలు ఆమెను సొంత భద్రతపై మరోసారి ఆలోచించేలా చేశాయి.

ఫొటో సోర్స్, PENGUINE
ఇందిర ప్రాణానికి ముప్పు
''తన ప్రాణానికి ముప్పు పెరగడంతో ఎమర్జెన్సీని కొనసాగించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది'' అని 1975 ఆగస్టు 19న ప్రతిపక్ష నేత ఎన్‌జీ గోర్‌కు రాసిన లేఖలో బంగ్లాదేశ్ ఘటనను ప్రస్తావిస్తూ ఆమె రాశారు.
షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్య జరగడానికి ఒక వారం ముందు ధజా రామ్ సాంగ్వాన్ అనే ఆర్మీ కెప్టెన్ టెలిస్కోపిక్ గన్‌తో దొరికిపోయారని, 'ది డే ఆఫ్ ద జాకల్' తరహాలో ఇందిరాగాంధీని చంపాలనుకున్నారని తన పుస్తకం 'ది జడ్జిమెంట్'లో కులదీప్ నయ్యర్ రాశారు.
అదే సంవత్సరం మార్చి 18న, అత్యవసర పరిస్థితికి మూడు నెలల ముందు, ఇందిరా గాంధీ విచారణకు హాజరు కావాల్సిన అలహాబాద్ హైకోర్టు వెలుపల 12 బోర్ తుపాకీని కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు.
మొత్తం మీద, అత్యవసర పరిస్థితి విధించడానికి గల అతి ముఖ్యమైన కారణాల్లో కాంగ్రెస్‌లో వర్గపోరు సహా ఇందిరాగాంధీ నాయకత్వానికి సవాలు ఎదురుకావడం, అలహాబాద్ హైకోర్టు నిర్ణయం, జేపీ ఉద్యమం, ఇందిరా గాంధీ ప్రాణాలకు ముప్పు వంటివి ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














