జాక్ డోర్సీ: ట్విటర్ సీఈఓ అకౌంట్ హ్యాక్ చేసిన 'చక్లింగ్ స్క్వాడ్' హ్యాకర్లు

ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్‌లో ఏకంగా ఆ సంస్థ సీఈఓ, సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఖాతానే హ్యాకింగ్‌కు గురైంది.
'చక్లింగ్ స్క్వాడ్'గా చెప్పుకొంటున్న హ్యాకర్ల బృందం తామే డోర్సీ ఖాతాలోకి చొరబడినట్లు ప్రకటించింది.
డోర్సీ ట్విటర్ ఖాతా దాదాపు 15 నిమిషాల పాటు హ్యాకర్ల నియంత్రణలో ఉంది. ఈ సమయంలో వాళ్లు వరుసగా తీవ్ర వివాదాస్పద, జాతి విద్వేష వ్యాఖ్యలను వరుస పెట్టి పోస్ట్ చేశారు.
అయితే, తమ సిస్టమ్స్‌లో ఎలాంటి లోపమూ లేదని ట్విటర్ ప్రకటించింది.
డోర్సీ ఖాతాకు అనుసంధానమై ఉన్న ఫోన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లడం వల్లే హ్యాకింగ్ జరిగిందని, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ పొరపాటే దీనికి కారణమని వివరించింది.
ట్విటర్‌కు అనుసంధానమైన ఫోన్ నెంబర్ నుంచి ఒక ప్రత్యేక నెంబర్‌కు మెసేజ్ చేస్తే, అది ఆటోమేటిక్‌గా ట్వీట్ రూపంలో పోస్ట్ అయ్యేలా ఓ ఫీచర్ ఉంది.
దీన్నే ఆ హ్యాకర్ వాడినట్లు ట్విటర్ తెలిపింది. సమస్య ఇప్పుడు పూర్తిగా పరిష్కారమైనట్లు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా జరిగింది?
'సిమ్ స్వాపింగ్' (సిమ్ జాకింగ్) పద్ధతి ద్వారా హ్యాకర్లు డోర్సీ ట్విటర్ ఖాతాను అదుపులోకి తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
మొబైల్ ప్రొవైడర్ కస్టమర్ సర్వీస్ సిబ్బందిని హ్యాకర్లు బోల్తా కొట్టించో, డబ్బులు ఇచ్చో, డోర్సీ ఫోన్ నెంబర్‌తో కొత్త సిమ్ తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డాయి.
ఫోన్ నెంబర్‌ను పొందిన తర్వాత దాని నుంచి టెక్స్ట్ మెసేజ్ పంపడం ద్వారా ట్వీట్లు పోస్ట్ చేశారని వివరించాయి.
ట్వీట్లు పెట్టేందుకు చాలా మంది బ్రౌజర్ గానీ, ట్విటర్ యాప్ గానీ వినియోగిస్తుంటారు.
కానీ ఇంటర్నెట్ అవసరం లేకుండా, తమ ఫోన్ నెంబర్ నుంచి టెక్స్ట్ మెసేజ్ పంపడం ద్వారా ట్వీట్లు పెట్టే ఫీచర్‌ను ట్విటర్ ప్రారంభ రోజుల నుంచి అందిస్తోంది. నిజానికి ట్వీట్లపై అక్షరాల పరిమితి ఉండటానికి ఇది కూడా ఓ కారణం.
చాలా దేశాల్లో ఇంటర్నెట్ డేటా ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉండటంతో ఈ ఫీచర్‌ను ట్విటర్ ఇంకా తొలగించలేదు.
మొబైల్ ప్రొవైడర్ పొరపాటు వల్ల డోర్సీ ఖాతా హ్యాక్ అయిందని చెబుతున్నా.. తమ సీఈఓ ఖాతాపైనే దాడి జరగడం ట్విటర్‌కు ఇది ఇబ్బందికర పరిణామమే.
వివిధ దేశాల అధినేతలకు సైతం ట్విటర్‌లో ఖాతాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
హ్యాకర్లు ఏం పోస్ట్ చేశారు?
నల్లజాతీయులను కించపరిచే ట్వీట్లు కొన్ని డోర్సీ ఖాతా నుంచి పోస్ట్ అయ్యాయి. హోలోకాస్ట్ గురించి ప్రస్తావిస్తూ యూదులకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు కూడా అందులో వచ్చాయి.
ఒక సోషల్ మీడియా సంస్థ ప్రధాన కార్యాలయంలో బాంబు ఉన్నట్లు కూడా హ్యాకర్లు డోర్సీ ఖాతా నుంచి ట్వీట్ పెట్టారు.
ఇదివరకు కూడా ప్రముఖుల ఖాతాలను తాము హ్యాక్ చేసినట్లు చక్లింగ్ స్క్వాడ్ పలుమార్లు ప్రకటించుకుంది.
ఇవి కూడా చదవండి:
- ప్రభాస్ సాహో సినిమాపై లార్గో వించ్ డైరెక్టర్ ఏమన్నారు? అభిమానులు ఎలా స్పందించారు? మధ్యలో అజ్ఞాతవాసిని ఎందుకు తెచ్చారు?
- విపిన్ సాహు పారాగ్లైడింగ్: ‘రూ.500 ఎక్కువ ఇస్తా, కిందకు దించు బాబోయ్’
- వైరల్ ఫొటో: మొదటి రోజు స్కూల్‌కు వెళ్తున్నప్పుడు అలా... వచ్చేటప్పుడు ఇలా..
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- విపిన్ సాహు పారాగ్లైడింగ్: ‘రూ.500 ఎక్కువ ఇస్తా, కిందకు దించు బాబోయ్’
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- వాట్సాప్‌లో కొత్త సమస్య.. మీ మెసేజ్‌లను వక్రీకరించి పంపొచ్చు
- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపైకి వెళ్లలేదంటే మీరు నమ్ముతారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








