కర్ణాటక: బీజేపీ అధికారం నిలబెట్టుకునే 5 మార్గాలు

యడ్యూరప్ప

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ,
    • హోదా, బెంగళూరు నుంచి, బీబీసీ కోసం

కర్ణాటక అసెంబ్లీలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు.

మే 15న వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 222 సీట్లలో బీజేపీకి 104 స్థానాలు లభించాయి. సాధారణ మెజారిటీకి 8 సీట్లు తక్కువగా ఉన్నా గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ నేత యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.

మొదట సీఎం యడ్యూరప్పకు బలం నిరూపించుకునేందుకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీంతో మే 19న సాయంత్రం 4 గంటలకు బీజేపీ తన బలం నిరూపించుకోవాలని శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజున కర్ణాటక అసెంబ్లీ ముఖచిత్రం స్పష్టం కావడానికి ఎంత సమయం పట్టిందో, దానితో పోలిస్తే, ఈ రోజు బలపరీక్ష తర్వాత యడ్యూరప్ప సర్కారు ఉంటుందా, కూలుతుందా అనే విషయంలో స్పష్టత రావడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది.

కర్ణాటక

ఫొటో సోర్స్, Getty Images

ప్రోటెం స్పీకర్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ

అసెంబ్లీలో కొత్తగా నియమితులైన ప్రోటెం స్పీకర్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది.

మాజీ స్పీకర్ కేజీ బోయప్పను కర్ణాటక గవర్నర్ ప్రోటెం స్పీకర్‌గా నియమించారు. కాంగ్రెస్-జేడీఎస్ ( జనతాదళ్ సెక్యులర్ ) ఈ నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

ప్రోటెం స్పీకర్ నియామకంపై వివాదం ఏంటంటే, ఇప్పటివరకూ ఉన్న సంప్రదాయం ప్రకారం ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని ఈ పదవిలో నియమిస్తారు. కానీ గవర్నర్ వజూభాయ్ వాలా కేవలం నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన కేజీ బోపయ్యను ప్రోటెం స్పీకర్‌గా నియమించారు. కర్ణాటక అసెంబ్లీకి 8 సార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ఆయన వారిని పట్టించుకోలేదు.

ప్రోటెం స్పీకర్ నియామకాన్ని సుప్రీంకోర్టు ఆమోదించకుంటే, వేరే ఎమ్మెల్యే ఎవరితో అయినా ఈ పదవికి ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత కొత్త ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్యేలు అందరితో అసెంబ్లీలో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సభాధ్యక్షుడిని ఎంచుకుంటారు. తర్వాత మెజారిటీ నిరూపించుకునే ప్రక్రియ ఉంటుంది.

కానీ వీటన్నిటినీ మించిన పెద్ద ప్రశ్న ఏంటంటే, మెజారిటీకి 8 మంది ఎమ్మెల్యేలు తక్కువున్నా, అతిపెద్ద పార్టీ బీజేపీ నుంచి సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప తన కుర్చీని ఎలా కాపాడుకుంటారు అనేదే.

మరోవైపు కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 ( జేడీఎస్‌తో బీఎస్‌పీకి చెందిన 1 ఎమ్మెల్యే ఉన్నారు) మొత్తం కలిపితే 116 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అంటే ఈ కూటమి దగ్గర సాధారణ మెజారిటీ కంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు.

వీరితోపాటూ ఇద్దరు స్వతంత్రులు కూడా ఉన్నారు. 224 స్థానాలున్న అసెంబ్లీలో 222 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరిగింది. రెండు స్థానాల్లో ఇంకా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

యడ్యూరప్ప

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి 5 మార్గాలు

1.బలపరీక్ష సమయంలో 15 మంది ఎమ్మెల్యేలను బీజేపీ అసెంబ్లీకి గైర్హాజరు అయ్యేలా చేయగలిగితే, సభలో హాజరైన ఎమ్మెల్యేల మొత్తం సంఖ్య 208 అవుతుంది.

బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సభలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం సాధారణ మెజారిటీకి ఈ ఎమ్మెల్యేల సంఖ్య సరిపోతుంది. ఇలా బీజేపీ తన ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవచ్చు.

2.జేడీఎస్ లేదా కాంగ్రెస్ కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ విప్ ధిక్కరించి బీఎస్ యడ్యూరప్పకు మద్దతు ఇస్తే, లేదా వీరు సభకు రాజీనామా చేస్తే బీజేపీ ప్రభుత్వం గట్టున పడుతుంది. రెండు విషయాల్లో ఈ ఎమ్మెల్యేలు తమ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.

3. అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు హంగామా సృష్టిస్తే, సభాధ్యక్షుడు ఆ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశిస్తే, సభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ అవుతుంది. అలా యడ్యూరప్ప తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చు.

4. కాంగ్రెస్‌లో 12 మందికి పైగా లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. యడ్యూరప్ప లింగాయత్ కాబట్టి వారంతా ఆయనకు బలపరీక్షలో మద్దతు ఇవ్వాలని లింగాయత్ మఠాధిపతులు ఆదేశించవచ్చు. వీరశైవ సమాజం ద్వారా లింగాయత్‌ల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వాదించవచ్చు.

5.విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కేందుకు రహస్య బ్యాలెట్ పద్ధతి ఉపయోగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అలా ఎమ్మెల్యేల గుర్తింపు బయటపడకుండా ఉంటుందని భావిస్తోంది. అలా చేసినా యడ్యూరప్ప తన సీఎం కుర్చీని కాపాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)