యడ్యూరప్ప ‘విశ్వాసం’: కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతుతోనే ‘పరీక్ష’ నెగ్గుతా

యడ్యూరప్ప

ఫొటో సోర్స్, Getty Images

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్యేల శిబిరాలు కొనసాగుతున్నాయి. కొత్తగా కిడ్నాప్ ఆరోపణలు వస్తున్నాయి.

"ఇద్దరు ఎమ్మెల్యేలను మా బీజేపీ మిత్రులు హైజాక్ చేశారు. కానీ, ఆ ఎమ్మెల్యేలు తిరిగి మా వద్దకు వస్తారు" అని జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.

తమ పార్టీ ఎమ్మెల్యేను కూడా బీజేపీ అపహరించిందని సిద్ధరామయ్య ఆరోపించారు.

"ఈడీ, ఐటీ విభాగాలను వాడుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ను బీజేపీ నిర్బంధించింది" అని ఆయన అన్నారు.

శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

దాంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యడ్యూరప్ప తనకు పూర్తి స్థాయి ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

కర్ణాటక విధాన సౌధ

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR

‘అవును.. వారి మద్దతుతోనే గెలుస్తా’

కాగా, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తున్నారని, వారి మద్దతుతోనే తాము విశ్వాస పరీక్షలో నెగ్గుతామని యడ్యూరప్ప అన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ‘వాళ్ల మద్దతు లేకుంటే మేం మెజార్టీ ఎలా నిరూపించుకుంటాం?’ అని ఆయన అన్నారు.

కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు ప్రకటింస్తుండగా.. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

"జేడీ(ఎస్), కాంగ్రెస్‌లకు కలిపి ఉమ్మడిగా 118 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు ఇచ్చాం. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం మాకుంది. గత రెండు రోజులుగా విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది" అని కుమారస్వామి ఆరోపించారు.

మరోవైపు "జేడీ(ఎస్) ఎమ్మెల్యేలతో నేను టచ్‌లో ఉన్నాను, వాళ్లు శనివారం జరిగే బలపరీక్షలో యడ్యూరప్పకు మద్దతు ఇస్తారు" అని బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ అన్నారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

केजी बोपैया

ఫొటో సోర్స్, Facebook/K G Boppaiah/BBC

ప్రొటెం స్పీకర్ వివాదం

శనివారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేందుకు ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజే బోపయ్యను నియమించడంపై కూడా వివాదం రేగింది.

రాష్ట్రంలో ఎక్కువ సార్లు అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘునాథ్ విశ్వనాథ్‌ను కాదని, బోపయ్యను నియమించిడం నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.

ప్రొటెం స్పీకర్ నియామకం విషయంలో గవర్నర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దానిపై శనివారం ఉదయం 10.30 గంటలకు విచారణ చేపట్టనున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

తాజ్ కృష్ణ హోటల్ వద్ద మీడియా సిబ్బంది హడావుడి

హైదరాబాద్‌లో కర్ణాటకీయం

తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టే అవకాశం ఉందన్న అనుమానంతో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను గురువారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించింది.

రాత్రంతా బస్సుల్లో ప్రయాణం చేసిన కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణకు, జేడీఎస్ ఎమ్మెల్యేలు నోవాటెల్ హోటళ్లకు చేరుకున్నారు.

మధ్యాహ్నం బెంగళూరు నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యతో పాటు, జేడీఎస్ నేత కుమారస్వామి ఆ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

శనివారం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన విషయాలను చర్చించారు. అనంతరం రాత్రి ఎమ్మెల్యేలంతా మళ్లీ బెంగళూరుకు తిరుగుపయనమయ్యారు.

శుక్రవారం సిద్ధరామయ్యను కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గాలి జనార్థనరెడ్డి

ఫొటో సోర్స్, galijanardhanreddy/facebook

‘గాలి’ టేపుల దుమారం

కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాయచూర్ రూరల్ ఎమ్మెల్యేను గాలి జనార్థన రెడ్డి ప్రలోభపెట్టారని, బీజేపీకి మద్దతు ఇస్తే భారీగా డబ్బు ఇస్తామని ఆశచూపారంటూ కాంగ్రెస్ పార్టీ ఆడియో టేపులు బయటపెట్టింది. అయితే, అవి కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన నకిలీ టేపులని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు.

బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ప్రలోభపెడుతోందని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల నగదు, మంత్రి పదవి ఇస్తామంటోందని జేడీఎస్ నాయకుడు కుమార స్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)