విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప నెగ్గకపోతే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశమంతా కర్ణాటక వైపే చూస్తోంది. విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప నెగ్గితే ఏమవుతుంది? నెగ్గకపోతే ఏమవుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
'117 మంది ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు' అంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఓవైపు అంటుండగా.. 'కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు నాకు ఉంది.. వారి మద్దతుతోనే విశ్వాస పరీక్షలో నెగ్గుతా' అని సీఎం యడ్యూరప్ప నమ్మకంగా చెబుతున్నారు.
వీరిలో ఎవరి మాట నిజం..? కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగానే ఉన్నారా? లేదంటే కొందరు యడ్యూరప్పను బలపరుస్తారా? అన్నది చర్చనీయమవుతోంది.
అంతేకాదు.. తన రాజకీయ జీవితంలో అయిదోసారి బలపరీక్ష ఎదుర్కొంటున్న యడ్యూరప్ప విఫలమైతే ఏమవుతుందన్నదీ చర్చకొస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరీక్షలో గెలవలేకపోతే..
- బలపరీక్షలో యడ్యూరప్ప విజయం సాధిస్తే ఆయన సీఎం కుర్చీకి ఢోకా ఉండదు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన కొనసాగిస్తారు.
- ఒకవేళ ఆయన విశ్వాస పరీక్షలో విజయం సాధించలేకపోతే మాత్రం వెంటనే తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
- ఆ తరువాత గవర్నరు వాజూభాయ్ వాలా జేడీఎస్, కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంటుంది. అప్పుడు వారు కూడా మళ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలి.
- లేదంటే, గవర్నరు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతి పాలనకూ సిఫారసు చేయొచ్చు. మళ్లీ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
- ఒకవేళ గవర్నరు జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి అవకాశమిచ్చినా వారూ విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోతే రాష్ట్రపతి పాలనకే అది దారి తీస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
సీఎంగా కొనసాగాలంటే..
- యడ్యూరప్ప సీఎంగా కొనసాగాలంటే విశ్వాస పరీక్షలో విజయం సాధించడం తప్పనిసరి.
- కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నప్పటికీ రెండిటికి ఎన్నికలు జరగలేదు. దీంతో 222 సీట్లకు గాను బీజేపీ 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్ 37 స్థానాల్లో గెలిచాయి.
- జేడీఎస్‌లో కుమారస్వామి రెండు స్థానాల నుంచి గెలవడంతో ఆ పార్టీ నుంచి విశ్వాస పరీక్షలో పాల్గొనేది గరిష్ఠంగా 36 మంది మాత్రమే అవుతారు. మరోవైపు ప్రోటెం స్పీకర్‌ను బీజేపీ నుంచి నియమించడంతో ఆ పార్టీ సభ్యుల లెక్కా 103 అవుతుంది.
- అంటే.. ప్రోటెం స్పీకరును, కుమారస్వామి ఒక స్థానాన్ని మినహాయిస్తే విశ్వాస పరీక్షకు గరిష్ఠంగా 220 మంది మాత్రమే హాజరయ్యే వీలుంటుంది.
- వీరంతా ఓటింగులో పాల్గొంటే, బీజేపీ 110 మంది మద్దతు పొందగలిగితే.. అప్పుడు బీజేపీకే చెందిన ప్రోటెం స్పీకరు ఓటుతో యడ్యూరప్ప గట్టెక్కగలరు.
- ఆ లెక్కన బీజేపీకి మరో ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం ఉందన్న మాట.

ఫొటో సోర్స్, Getty Images
పదకొండేళ్లలో అయిదోసారి
యడ్యూరప్ప తొలిసారి 2007 నవంబరులో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. జేడీఎస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పటికీ 8 రోజుల్లోనే జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన విశ్వాసపరీక్ష ఎదుర్కొన్నారు. బలం నిరూపించుకోవడంలో విఫలమయ్యారు.
ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లు సాధించడంతో యడ్యూరప్ప మళ్లీ సీఎం అయ్యారు. అయితే, 3 సీట్లు తక్కువ కావడంతో 2008 జూన్‌లో విశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. అందులో ఆయన పాసయ్యారు.
అనంతరం 2010 అక్టోబరులోనూ యెడ్డీకి ఫ్లోర్ టెస్టు తప్పలేదు. కొందరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో అప్పటి గవర్నరు హెచ్‌ఆర్ భరద్వాజ్ విశ్వాస పరీక్షను ప్రతిపాదించారు. అయితే.. ప్రస్తుతం నియమితులైన ప్రోటెం స్పీకర్ బోపయ్యే అప్పుడూ ప్రోటెం స్పీకరుగా పనిచేసి సభ నుంచి 16 మంది సభ్యత్వం రద్దు చేసి గట్టెక్కేలా చేశారు.
కానీ, గవర్నరు ఆ పరీక్ష ఫలితాన్ని తిరస్కరిస్తూ మళ్లీ కొద్ది రోజులకే విశ్వాస పరీక్ష నిర్వహించారు. అందులో ఆయన బలం నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన అయిదోసారి బలపరీక్షకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








