నేడు జింబాబ్వే ఎన్నికలు: ఐదు ముఖ్యాంశాలు

ఫొటో సోర్స్, Reuters/AFP
నేడు జరగనున్న జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో సుమారు 50 లక్షల మంది జింబాబ్వే పౌరులు ఓటు వేయనున్నారు.
ఈ ఎన్నికలు గత ఎన్నికలకన్నా ఎలా భిన్నమైనవి?
1. మొదటిసారి ముగాబే లేని ఎన్నికలు
1980లో జింబాబ్వే ఏర్పడిన నాటి నుంచి, ఒకే ఒక వ్యక్తి ఎన్నికల్లో గెలిచి, దేశాన్ని పాలించారు. ఆయనే రాబర్ట్ ముగాబే. 1987లో అధ్యక్ష విధానాన్ని ప్రవేశపెట్టేవరకు ఆయనే ప్రధానిగా ఉన్నారు.
కానీ 94 ఏళ్ల ముగాబే గత ఏడాది సైన్యం తిరుగుబాటుతో పదవీచ్యుతుడయ్యారు. భార్య గ్రేస్ ముగాబేను తన వారసురాలిగా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు కూడా పార్టీ వర్గాలకు ఆగ్రహం తెప్పించాయి.
అయితే ఎట్టకేలకు ముగాబే స్థానంలో ఎమర్సన్ నంగాగ్వా అధ్యక్షుడు కావడంతో, అన్ని పార్టీలు స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటున్నాయి. యూరప్, అమెరికా ఎన్నికల పరిశీలకులు కూడా ఈ పరిణామాన్ని ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం నంగాగ్వాయే జాను-పీఎఫ్ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
2. అతి పొడవైన బ్యాలెట్ పేపర్
ముగాబే పోటీలో లేకపోవడంతో అనేక మంది అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈసారి అధ్యక్ష బ్యాలెట్‌లో 23 మంది పేర్లు ఉంటాయి. ముగాబే భయంతో ఎన్నికల్లో పాల్గొనలేకపోయిన అనేక మంది ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అధ్యక్ష పదవికి ప్రధాన పోటీ ఎమర్సన్ నంగాగ్వా, ప్రతిపక్ష ఎండీసీ కూటమి నేత నెల్సన్ చామిసా మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
అయితే బ్యాలెట్ పేపర్‌ను రెండు వరుసలుగా విడగొట్టి, నంగాగ్వా పేరు రెండో వరుస పైభాగంలో వచ్చేలా చేయడం వివాదాస్పదంగా మారింది.
పార్లమెంటరీ ఎన్నికల్లో మొత్తం 55 పార్టీలు పాల్గొంటున్నాయి.

ఫొటో సోర్స్, AFP
3.'ఘోస్ట్ ఓటర్ల' తొలగింపు
జింబాబ్వే ఎన్నికల కమిషన్ ఓటర్ల నమోదు కొరకు ఈసారి కొత్తగా వేలిముద్రల పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని వల్ల ఎవరైనా ఒకసారి కన్నా ఎక్కువసార్లు ఓటరుగా నమోదు చేసుకోవడం వీలవదు. అందువల్ల ఈ ఎన్నికల్లో అక్రమాలకు తావుండే అవకాశం లేదు.
ఈసారి మొత్తం 56 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 'ఘోస్ట్ ఓటర్ల' తొలగింపు కారణంగా 2013 నాటితో పోలిస్తే ఈసారి సుమారు రెండున్నర లక్షల మంది ఓటర్లు తగ్గారు. గతంలో జరిగిన ఎన్నికల్లో మరణించిన వారి పేరిట కూడా ఓట్లు వేశారని ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల జరిగిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో కూడా సుమారు రెండున్నర లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారన్న విమర్శలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
4. గుర్తులపై నిషేధం
ఎన్నికల కమిషన్ ఈసారి అభ్యర్థుల గుర్తుల నుంచి కొన్ని జంతువులను, ఆయుధాలను నిషేధించింది.
నిషేధించిన వాటిలో చిరుత, ఏనుగు, వెలుగుతున్న కాగడా, సింహం, గుడ్లగూబ, నాగుపాము, ఖడ్గం, గొడ్డలి మొదలైనవి ఉన్నాయి. వాటిని ఎందుకు నిషేధించారు అన్నదానిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు.
అయితే 'క్షుద్రవిద్య'లే వీటిని నిషేధించడానికి కారణమై ఉండవచ్చని జింబాబ్వే చరిత్రకారుడు పతీసా న్యాతి అభిప్రాయపడ్డారు. గుడ్లగూబ, పాము మొదలైనవి క్షుద్రవిద్యలకు ప్రతీకలని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
5. ఈసారి స్వలింగ సంపర్క వ్యతిరేక ప్రసంగాలు లేవు
ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎల్‌జీబీటీ వర్గాన్ని కించపరుస్తూ చేసే ప్రసంగాలు తగ్గిపోయాయని ఒక స్వలింగ సంపర్కుల హక్కుల బృందం డైరెక్టర్ తెలిపారు. గతంలో ముగాబే ఒకసారి స్వలింగ సంపర్కులు పందులు, కుక్కలకన్నా హీనం అని వ్యాఖ్యానించారు. స్వలింగసంపర్కం ఆఫ్రికా సంస్కృతి కాదన్నారు.
అయితే ప్రజల దృష్టిని మరల్చేందుకే స్వలింగ సంపర్కుల అంశాలను లేవనెత్తేవారని ఎల్‌జీబీటీ ప్రతినిధి చెస్టర్ సాంబ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- గ్రౌండ్ రిపోర్ట్ : అల్వర్‌లో ఆవులు తోలుకెళ్తున్న ముస్లిం యువకుడిని ఎవరు చంపారు?
- కేరళ: 'కూర్చునే హక్కు' సాధించుకున్న సేల్స్ గర్ల్స్
- శానిటరీ న్యాప్కిన్లపై జీఎస్టీ రద్దు వెనకున్నది ఈ అమ్మాయే
- చైనాలోని ఈ భారీ యంత్రాలు చూస్తే ఔరా అంటారు
- భారతదేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకు సాధ్యం కాదు?
- క్రికెట్ 'ఉక్కు మనిషి' సీకే నాయుడు
- పాకిస్తాన్ ఎన్నికలు: గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు ఏమిటి?
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- అనుమానం లేదు.. ఆడవాళ్లే శక్తిమంతులు!
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








