పాకిస్తాన్ ఎన్నికలు: గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షాయిస్టా ఫరూకీ, ఉపాసనా భట్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పాకిస్తాన్‌లో గిరిజన ప్రాంతాల్లో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ నెల 25వ తేదీన జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇక్కడ క్రియాశీలంగా ప్రచారం చేస్తున్నారు.
పాక్షిక స్వయంప్రతిపత్తి గల ఈ ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాస్ (ఎఫ్ఏటీఏ)ను వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పాఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో కలుపుతూ పాక్ ఇటీవలే చరిత్రాత్మక ప్రకటన చేసింది.
అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాల్లో 2013 ఎన్నికల్లో పెద్దగా ప్రాతినిధ్యం లేని ప్రధాన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు చురుకుగా పనిచేయటం కనిపిస్తోంది.
ఇది ఉగ్రవాదానికి పట్టుగొమ్మగా పేరుపడిన ప్రాంతం. విస్తృత స్థాయిలో సైనిక ఆపరేషన్లు జరిగాయి. ఇక్కడ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సహా ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించాయి.
ఈ ప్రాంత ఓటర్లు జాతీయ అసెంబ్లీ (పార్లమెంటులో దిగువ సభ)కి 12 మంది ప్రతినిధులను ఎన్నుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
విలీనానికి ముందు ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండేది?
1947లో పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నుంచీ.. పాక్షిక స్వయంప్రతిపత్తి గల ఈ గిరిజన ప్రాంతాలను బ్రిటిష్ పాలనా కాలపు చట్టాల ద్వారానే పాక్ కేంద్ర ప్రభుత్వం పరిపాలించేది.
పాక్‌లోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా.. ఈ గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకమైన రాజకీయ, ఎన్నికల విధానం ఉంది.
కేవలం కేంద్రంలోని పార్లమెంటుకు మాత్రమే ప్రజా ప్రతినిధులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ప్రతినిధులు ఎవరూ ఉండరు.
1997 వరకూ కూడా ఎఫ్ఏటీఏ ప్రజలకు సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు. ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలు పనిచేయటానికి అనుమతిస్తూ 2011లో అధ్యక్ష ఉత్తర్వును జారీచేశారు. ఎఫ్ఏటీఏను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావటం లక్ష్యంగా ఆ ఉత్తర్వును జారీచేశారని డాన్ వార్తా పత్రిక చెప్తోంది.
దీంతో ఎఫ్ఏటీఏలో కూడా 2013లో సాధారణ ఎన్నికలు జరిగాయి. కానీ.. చాలా రాజకీయ పార్టీలు ఇక్కడ అభ్యర్థులను నిలబెట్టలేదు.
2013కు ముందు.. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ ప్రాంతంలోని పార్లమెంటు స్థానాల ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీచేసేవారు.
అయితే.. జమాయిత్ ఉలేమా-ఇ-ఇస్లామ్-ఫజల్, జమాత్-ఎ-ఇస్లామి వంటి ఇస్లామిక్ వాద రాజకీయ పార్టీలు అప్పుడు కూడా ఇక్కడ క్రియాశీలంగా ఉండేవి.

జరిగిన మార్పులు ఏమిటి?
ఎఫ్ఏటీఏను ఖైబర్ పాఖ్తున్‌ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లో విలీనం చేస్తూ 2018 మే నెలలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణను పాక్ పార్లమెంటు ఆమోదించింది. ఈ ప్రాంతాల్లో సంస్కరణలు తీసుకురావటం ఈ చర్య లక్ష్యం.
ఎఫ్ఏటీఏ హోదా మారే ప్రక్రియ రెండేళ్ల కాలపరిమితిలో పూర్తవుతుందని.. ఈ ప్రాంతం కేపీ రాష్ట్ర అసెంబ్లీలో భాగంగా మారుతుందని స్థానిక మీడియా పేర్కొంది.
ఇప్పటివరకూ ఎఫ్ఏటీఏ నుంచి జాతీయ అసెంబ్లీకి 12 మంది, సెనేట్ (పార్లెమెంటులో ఎగువ సభ)కు 8 మంది ప్రతినిధులు ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ లేదు.
అయితే.. జూలై 25న జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఎఫ్ఏటీఏ ప్రజలు జాతీయ అసెంబ్లీకి ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయని.. కేపీలో విలీనం నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలను ఇంకా నిర్ణయించాల్సి ఉందని ‘ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
2018 ఎన్నికల కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి?
పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో లాగానే.. ఎఫ్ఏటీఏలో కూడా జూలై 25వ తేదీ పార్లమెంటు ఎన్నికల కోసం అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
రెండు ప్రముఖ ఇస్లామిక్ వాద పార్టీలు - జేయూఐ-ఎఫ్, జేఐ - ఇప్పటికే ఈ ప్రాంతంలో భారీ రాజకీయ సభలు నిర్వహించాయి.
‘‘సైనిక చర్య, ఎఫ్ఏటీఏ విలీనానికి ముందు.. రాజకీయ ప్రముఖులు ఈ ప్రాంతంలో పర్యటించటం సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడ తిరిగే స్వేచ్ఛ ఇంకా ఎక్కువగా ఉంది’’ అని ఇక్కడి నుంచి పోటీచేస్తున్న పీటీఐ అభ్యర్థి ఔరంగజేబ్ ఖాన్ చెప్పినట్లు జియో న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.
అయినా.. ఎన్నికల కార్యకాలాపాలు కొన్ని ప్రాంతాలకే పరిమితంగా ఉన్నాయని మీడియా కథనాలు చెప్తున్నాయి.
సౌత్ వజీరిస్తాన్ గిరిజన ప్రాంతపు ప్రభుత్వం గత నెలలో ఆ ప్రాంతంలో బహిరంగ సభలు, సమావేశాలను నెల రోజుల పాటు నిషేధించింది. ప్రభుత్వ వ్యతిరేక సమావేశాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు కేవలం ఆంతరంగిక సమావేశాలు మాత్రమే నిర్వహించుకోవటానికి అనుమతిచ్చింది.
పష్తూన్లకు రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం డిమాండ్ చేయటంతో పాటు.. గిరిజన ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అదృశ్యమవుతుండటంపై నిరసనలు తెలుపుతున్న ఒక ప్రధాన గ్రూపు పష్తూన్ తాహాఫజ్ (ప్రొటెక్షన్) మూవ్‌మెంట్ (పీటీఎం) సభ్యులు కొందరు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే.. పీటీఎంలోని ఉన్నతస్థాయి కమిటీల నుంచి వారిని తొలగించారు. ఈ కమిటీలను ఏర్పాటు చేసింది ‘‘ప్రజల హక్కుల కోసం పోరాటం’’ చేయటానికి అని.. రాజకీయాల్లో పాల్గొనాలనే ‘‘కోరిక’’ ఉన్నవారికి వీటిలో చోటు లేదని ఆ సంస్థ సీనియర్ నాయకులు అంటున్నారు.
ఈ ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొనాలన్న ఆసక్తి మహిళల్లో ఎక్కువగా ఉందని మీడియా కథనాలు చెప్తున్నాయి.
కుర్రమ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతం నుంచి అలీ బేగం స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
ఎఫ్ఏటీఏ నుంచి పోటీచేస్తున్న మహిళల్లో ఆమే మొదటివారు కానప్పటికీ.. గిరిజన ప్రాంతం నుంచి పోటీచేస్తున్న మొదటి ‘‘సీరియస్’’ అభ్యర్థి అలీ బేగమేనని ప్రముఖ వార్తాపత్రిక ‘ద న్యూస్’ చెప్తోంది.
ఇదిలావుంటే.. రాష్ట్ర అసెంబ్లీకి కూడా మిగతా దేశంతో పాటే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతంలో కొన్ని రాజకీయ పార్టీలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఏడాది ఆలస్యం చేయటం ద్వారా రాజకీయ అస్థిరతకు అవకాశం కల్పించినట్లు అవుతుందని అవి వాదిస్తున్నాయి.
కానీ ఈ డిమాండ్లను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఈ ప్రాంతంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటానికి విస్తృత ఏర్పాట్లు అవసరమని పేర్కొంది.
అఫ్గానిస్తాన్‌లో ప్రతిస్పందన ఎలా ఉంది?
గిరిజనులతో పాక్ ప్రభుత్వం ‘కిరాతకంగా’ వ్యవహరిస్తోందని, సరిహద్దు ప్రాంతాల్లో అశాంతికి ఆజ్యం పోస్తోందని గతంలో తీవ్రంగా విమర్శించిన అఫ్గాన్ మీడియా, పరిశీలకులు.. పాక్ సార్వత్రిక ఎన్నికలపై ఇంకా స్పందించలేదు.
ఎఫ్ఏటీఏను కేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. ఈ ప్రాంతంలో పాక్ ప్రభుత్వం ‘‘భయాందోళనలు’’ సృష్టిస్తోందంటూ కొన్ని ఆఫ్ఘాన్ వార్తాపత్రికలు తీవ్రంగా ఖండించాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








