మోదీ కాంగ్రెస్‌కు దేశభక్తి నేర్పించాలనుకుంటోంది ఈ కుక్కలతోనే

ఫొటో సోర్స్, PERCY ROMERO / PINTEREST
ఎన్నికల సమయంలో దేశభక్తి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కర్ణాటకలో కూడా ఇప్పుడు అలాంటి వాతావరణమే ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జామఖండీలో ప్రచారం చేస్తున్నప్పుడు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
''మన దేశంలో ఎప్పుడు దేశభక్తి గురించి మాట్లాడుకున్నా, జాతీయవాదం, జాతీయగీతం, వందేమాతరం ప్రస్తావన వస్తుంది, కొంతమందికి మాత్రం దిగులు పట్టుకుంటుంది'' అన్నారు.
‘స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ ఈ స్థాయికి దిగజారుతుందని ఎవరైనా ఆలోచించారా? ఆ పార్టీ నేత ''భారతదేశాన్ని ముక్కలు చేస్తాం'' అంటూ నినాదాలు చేసే వారి మధ్యలోకి వెళ్లి వాళ్లను ఆశీర్వదిస్తున్నాడు. ’ అని మోదీ విమర్శించారు.
''కాంగ్రెస్ గర్వం ఆకాశాన్నంటిందని నాకు తెలుసు. దేశ ప్రజలు వారిని పట్టించుకోవడం మానేశారు. కానీ వాళ్లు ఇప్పుడు కూడా నేలపైకి దిగలేదు. దేశభక్తి గురించి వాళ్లు ముథోల్ కుక్కలను చూసైనా నేర్చుకోవాలి''. అని మోదీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముథోల్ కుక్కల ప్రస్తావన ఎందుకు వచ్చింది?
కనీసం బాగల్‌కోట్‌లోని ముథోల్ కుక్కల నుంచైనా నేర్చుకోవాలంటూ మోదీ కాంగ్రెస్‌కు సలహా ఇచ్చారు. ఈ కుక్కలు ఇండియన్ ఆర్మీ కొత్త బెటాలియన్‌తో కలిసి దేశ రక్షణ కోసం వెళ్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశభక్తితోపాటూ ముథోల్ కుక్కల గురించి ఎందుకు ప్రస్తావించారు? ఆయన దేశభక్తి గురించి చెప్పడానికి ఈ కుక్కల్లో అంతలా ఏముంది. వీటిలో అంత ప్రత్యేకతేంటి?
ముథోల్ కుక్కలను ముథోల్ హౌండ్, కారవాన్ హౌండ్ అని కూడా అంటారు. భారతదేశానికి చెందిన ఈ జాతి కుక్కలకు ఈ పేరు ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో గతంలో ఉన్న ముథోల్ సామ్రాజ్యం నుంచి వచ్చింది. అక్కడి పాలకులు వీటిని పెంచడం ప్రారంభించారు.
చాలా సన్నగా ఉండే ఈ కుక్కలు భారత సైన్యంలో సేవలందిస్తున్న భారతదేశానికి చెందిన మొట్టమొదటి జాతిగా నిలిచాయి.
వేటాడడంలో, కాపలా కాయడంలో పేరుపొందిన ఇవి చాలా వేగంగా పరిగెత్తగలవు. వీటికి తిరుగులేని ధైర్యం, శక్తి ఉంటుంది. నిశితంగా చూడడం, వాసన పట్టడంలో కూడా ఇవి ప్రత్యేకమైనవని చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కుక్కల్లో ప్రత్యేకత ఏముంది?
వీటికి ఉన్న ప్రత్యేకతల వల్ల 2016 ఫిబ్రవరిలో ఈ జాతికి చెందిన కొన్ని పిల్లలను మీరట్‌లో ఉన్న ఇండియన్ ఆర్మీ రిమవుంట్ అండ్ వెటర్నరీ కేర్ (ఆర్వీసీ) కు తీసుకొచ్చారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
భారతదేశానికి చెందిన ఈ జాతి కుక్కలను ట్రైనింగ్ కోసం ఆర్వీసీకి తీసుకురావడం ఇదే మొదటి సారి. వీటి స్థానంలో గతంలో లాబ్రడార్, జర్మన్ షెపర్డ్ లాంటి విదేశీ జాతి కుక్కలకు శిక్షణ ఇస్తూ వచ్చారు. ఈ కుక్కలు ట్రైన్ అయ్యాక ఇండియన్ ఆర్మీలో భాగమయ్యాయి
ట్రైనింగ్ కోసం తీసుకొచ్చిన ఎనిమిదింటిలో ఆరు కుక్కలను శ్రీనగర్ హెడ్ క్వార్టర్ 15 కోర్, నగరోటా హెడ్‌క్వార్టర్ 16 కోర్‌లో ఫీల్డ్ ఎవాల్యుయేషన్, సూటబిలిటీ ట్రయల్ కోసం తీసుకుంటారని సైనికాధికారులు చెబుతున్నారు.
ఈ కుక్కలను పష్మీ, కార్వానీ అని కూడా అంటారు. దేశంలో దక్కన్ పీఠభూమిలోని చాలా గ్రామాల్లో కూడా వీటిని పెంచుతున్నారు. దీని తల చాలా సన్నగా, పొడవుగా ఉంటుంది. చెవులు మధ్యలో కాస్త వెడల్పుగా ఉంటాయి. దవడ పొడవుగా బలంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కుక్కల చరిత్ర ఏంటి?
కాపలా కాయడంలో ఇవి మామూలు కుక్కల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే భద్రత విషయంలో ఇవి చాలా నిశితంగా, అప్రమత్తంగా ఉంటాయి. కర్ణాటకలోని ముధోల్ పట్టణంలో సుమారు 750 కుటుంబాలు ఈ కుక్కపిల్లలను పెంచుతున్నాయి. పెద్దవయ్యాక వాటిని మంచి ధరకు అమ్ముతున్నాయి.
కానీ ఈ కుక్క దక్షిణ భారతదేశం ఎలా చేరింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మధ్య ఆసియా, అరేబియా నుంచి ఇవి పశ్చిమ భారతదేశం చేరాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెంపుడు కుక్కలుగా మారాయి.
ఈ ప్రత్యేక జాతి కుక్కలను మొదట గుర్తించిన ఘనత ముధోల్ స్టేట్‌లో ధనికుడైన రాజాసాహెబ్ మలోజీరావ్ ఘోర్‌పడేకు దక్కుతుంది. కొందరు ఆదివాసీలు ఈ కుక్కలను పెంచుతున్నారని, వాటికి బేదార్ అని పేరు పెట్టారని తెలుసుకుంది ఆయనే. బేదార్ అంటే భయం లేనివని అర్థం.
1900 ప్రారంభంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ముధోల్ మహారాజు కింగ్ జార్జ్ 5కు ఇలాంటి రెండు కుక్కలను బహుమతిగా ఇచ్చారు.
భారతీయ సైన్యానికి ముధోల్ కుక్కలపై ఇంత ఆసక్తి కలగడానికి ఒక కారణం ఉంది. ఇవి నిఘా, సరిహద్దు రక్షణకు సంబంధించిన పనుల్లో ఆర్మీకి సాయం చేయగలవు. దేశానికి మెరుగైన సేవలందించగలవు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








