రఫేల్ కేసులో సుప్రీం తీర్పు: "ఒప్పందంపై కోర్టు జోక్యం అవసరం లేదు... డీల్ కేటాయింపులో పక్షపాతం కనిపించట్లేదు"

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రాన్స్ కంపెనీ దసో నుంచి భారతదేశం 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ ఒప్పందంలో వాణిజ్య పక్షపాతం ఏమీ కనిపించలేదని, కాబట్టి వీటి కొనుగోళ్ల కేసులో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది.
యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం నిర్ణయ ప్రక్రియను అనుమానించేందుకు కూడా ఎలాంటి ఆస్కారం లేదని కోర్టు తెలిపింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు పాఠం చదివి వినిపించారు.
‘‘36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేసేందుకు ఎలాంటి ఆస్కారం లేదు. ఒప్పందంలోని చిన్న చిన్న క్లాజుల మార్పుల వల్ల మొత్తంగా ఒప్పందాన్నే రద్దు చేయకూడదు.
గతంలో నిర్ణయించిన 126 యుద్ధ విమానాల కొనుగోళ్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవటం వల్లనే 36 రఫేల్ యుద్ధ విమానాల ఒప్పంద ప్రక్రియ మొదలయ్యింది. ఇదే అసలైన వాస్తవం (హార్డ్ ఫ్యాక్ట్).
తాజా ఒప్పందంపై 2016 సెప్టెంబర్‌లో సంతకాలు జరిగాయి. ఈ (ఒప్పందం రద్దు చేయాలన్న) పిటిషన్లను (ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు) హోలండ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, దానిపై మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతే వేశారు. వ్యక్తిగత దృక్కోణాలు న్యాయ పునః పరిశీలనకు ఆధారాలు కాదు.
ఈ ఒప్పందానికి సంబంధించి భారతీయ భాగస్వామితో (దసో కంపెనీ) ఒప్పందం చేసుకోవటంలో తమకు ఎలాంటి పాత్ర లేదని ప్రభుత్వం చెబుతోంది. భారతీయ భాగస్వామిని ఎంపిక చేసుకునేది ఈ విమానాలను విక్రయిస్తున్న దసో ఏవియేషన్. కాబట్టి న్యాయ పునఃపరిశీలన సాధ్యం కాదు.
తొలుత నిర్ణయించిన 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేయకుండా 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అనే విచక్షణలోకి మేం వెళ్లం. అలాగే, (తొలుత నిర్ణయించినట్లుగా) 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని మేం కోరం.
మన దేశం సన్నద్ధత లేకుండా ఉండకూడదు. 4వ తరం, 5వ తరం యుద్ధ విమానాల అవసరాన్ని నొక్కి చెప్పిన సీనియర్ ఐఏఎఫ్ (భారత వాయుసేన) అధికారులతో (ఈ కేసు విషయంలో)మాట్లాడాం.
ఈ ఒప్పందంలోని ప్రతి ఒక్క అంశంపైనా (విచారణ జరిపేందుకు) అప్పీలేట్ అథార్టీలాగా కోర్టు కూర్చోవటం సరికాదు.
మేం మా న్యాయ పునఃపరిశీలన అధికారంతో రఫేల్ పాత ఒప్పందం, కొత్త 36 యుద్ధ విమానాల ఒప్పందాల ధరలను సరిపోల్చేందుకు ఉపయోగించకూడదు.
పైగా, ఈ ఒప్పందం వాణిజ్యపరంగా మరింత ప్రయోజకరమని కేంద్ర ప్రభుత్వ వివరణ పత్రం చెబుతోంది.
జాతీయ భద్రత దృష్ట్యా మేం ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేం.’’
అది 'was' కాదు, 'is'
రఫేల్ ఒప్పందం కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పులో దిద్దుబాటును కోరుతూ కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ ద్వారా సుప్రీంకోర్టులో శనివారం ఒక దరఖాస్తు దాఖలు చేసింది.
సీల్డ్ కవర్‌లో తాము సమర్పించిన పత్రాల్లో ఒక సందర్భంలో is (ఈజ్) అనే పదం వాడామని, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో is స్థానంలో was (వాజ్) అనే పదం వచ్చిందని, దీనిని సరిచేయాలని ప్రభుత్వం తన దరఖాస్తులో కోరింది. సరిచేసిన తర్వాత సదరు వాక్యం ఇలా ఉంటుందని పేర్కొంది: ''The CAG 'is' to submit its report to PAC & then the redacted part is put in public domain.'' (కేంద్రం దరఖాస్తు ప్రకారం ఈ వాక్యంలోని మొదటి భాగం అర్థమేంటంటే - కాగ్ తన నివేదికను ప్రజాపద్దుల సంఘానికి(పీఏసీకి) సమర్పించాల్సి ఉంది.)
శీతాకాల సెలవుల అనంతరం సుప్రీంకోర్టు కార్యకలాపాలు తిరిగి మొదలైన తర్వాత జనవరి 2న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ప్రభుత్వం తన ఈ దరఖాస్తు గురించి ప్రస్తావించనుంది.
కేసు పూర్వాపరాలు
ఫ్రెంచ్ కంపెనీ దసో నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం కుదుర్చుకున్న రూ.59 వేల కోట్ల ఒప్పందంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో పాటు పలువురు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.

ఫొటో సోర్స్, Inc
రాహుల్ గాంధీ ఆరోపణలు
రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేశారు.
‘‘రఫేల్ చాలా సుస్పష్టమైన కేసు. అనిల్ అంబానీ ఎన్నడూ విమానాలు తయారు చేయలేదు. అనిల్ అంబానీ 45 వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నారు. అనిల్ అంబానీ రఫేల్ ఒప్పందం జరగడానికి కొన్ని రోజుల ముందే కంపెనీ పెట్టారు. మరోవైపు హెచ్ఏఎల్ కంపెనీ.. 70 ఏళ్లుగా విమానాలు తయారు చేస్తోంది. ఎలాంటి అప్పులూ లేవు. వేలాది మంది ఇంజనీర్లు ఈ కంపెనీలో పనిచేయాలనుకుంటారు. 520 కోట్ల రూపాయలు విలువ చేసే విమానాన్ని 1600 కోట్ల రూపాయలకు ఎందుకు కొనుగోలు చేశారు? చాలా చిన్న ప్రశ్న. ఎవరికి లాభం చేకూర్చేందుకు కొన్నారు? అరుణ్ జైట్లీ కొన్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. వేయొచ్చు. కానీ, ఈ మూడు ప్రశ్నలకైతే స్పష్టంగా సమాధానాలు ఇవ్వండి. జేపీసీ వేయండి. దేశం మొత్తం తెలుసుకోవాలనుకుంటోంది నరేంద్ర మోదీ, అనిల్ అంబానీలు ఏం ఒప్పందం కుదుర్చుకున్నారోనని.
ఆ విమానాలు వేరు.. ఈ విమానాలు వేరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారు. కానీ, తాము ఇస్తామన్న విమానాలు ఒకటేనని ఫ్రాన్స్ చెబుతోంది. గతంలో భారత వాయుసేన పరీక్షించిన విమానాలనే ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోనే ఫ్రాన్స్ స్పష్టంగా పేర్కొంది. మరి ఇప్పుడు మాట్లాడుతోంది ఎవరు? అక్కడ ఉన్నది ఎవరు? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయేనా లేక వేరే ఎవరైనానా? ఆయన అబద్ధాలాడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం స్పందన
కేంద్ర ప్రభుత్వాన్ని చుట్టుముట్టిన రఫేల్ వివాదం గురించి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. బీబీసీ ప్రతినిధి జుబేర్ అహ్మద్ అడిగిన ఓ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ బదులిస్తూ..
"ఈ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగింది. గత ప్రభుత్వ ఒప్పందాలలాగ ఇందులో దళారులకు తావు లేదు. అందుకే మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి బదులు, ప్రశంసించాలి'' అని అన్నారు.
రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి - రాజ్‌నాథ్ సింగ్
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటుకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ వ్యవహారంపై శుక్రవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజలను తప్పుదోవ పట్టించారని, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ పరువును మంటగలిపారని అన్నారు.
నాపైన చేసినవన్నీ నిరాధార ఆరోపణలే - అనిల్ అంబానీ
సుప్రీంకోర్టు తీర్పుపై అనిల్ అంబానీ ఒక ప్రకటన చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
‘‘రఫేల్ ఒప్పందానికి సంబంధించి రిలయన్స్ గ్రూప్‌పైన, నాపైన వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, రాజకీయ ప్రేరేపితం అని స్పష్టమైపోయింది’’ అని అనిల్ అంబానీ పేర్కొన్నట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
ప్రధాని, బీజేపీ సంబరాలు చేసుకునేదేమీ లేదు - కాంగ్రెస్
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్లను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి, బీజేపీ సంబరాలు చేసుకోవాల్సిన పనిలేదని, సుప్రీంకోర్టు తీర్పులో వైరుధ్యం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. ఒప్పందం వివరాల్లోకి తాము వెళ్లటం సబబు కాదని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన అన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
రఫేల్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలన్న తమ డిమాండ్‌ను కొనసాగిస్తామని ఆనంద్ శర్మ స్పష్టం చేశారు.
మా ఉద్యమం ఆగదు - ప్రశాంత్ భూషణ్
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈ కేసు దాఖలు చేసిన పిటిషనర్లలో ఒకరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. ‘‘సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా తప్పు. మా ఉద్యమాన్ని వదులుకోం. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలా లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- హిందుత్వ అజెండా గురి తప్పిందా? అందుకే బీజేపీ ఓడిందా?
- 'జాత్యహంకార' గాంధీ విగ్రహాన్ని తొలగించిన ఘనా యూనివర్శిటీ
- వృద్ధాశ్రమాల్లో జీవితం ఎలా ఉంటుందంటే..
- మహాకూటమి చంద్రబాబు వల్ల నష్టపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








