'నరేంద్ర మోదీ గెలిస్తే శాంతికి మెరుగైన అవకాశాలు' - పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ వివాదానికి సంబంధించి భారతదేశంతో శాంతియుత పరిష్కారం కుదుర్చుకోగలిగితే అది ఈ ప్రాంత విస్తృత ప్రయోజనాలకు ఎంతో మేలు చేస్తుందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అన్నారు.
ప్రస్తుతం ఉన్న సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని తాను భావిస్తున్నట్లు ఆయన బీబీసీ వరల్డ్ ఎఫైర్స్ ఎడిటర్ జాన్ సింప్సన్‌తో అన్నారు. .
కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు పెరిగిన కొన్ని వారాల తర్వాత, భారత్ సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ దళాలపై ఆత్మాహుతి దాడి జరిగిన అనంతరం ఇరు దేశాలు పరస్పరం సీమాంతర వైమానిక దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే.
భారతదేశానికి, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని అడిగినప్పుడు, ''కశ్మీర్ వివాదం పరిష్కారమవ్వాల్సిందే. ఇలాగే, రగులుతున్న ఈ సమస్యను ఇలాగే వదిలేయలేం'' అని ఇమ్రాన్ బదులిచ్చారు.
''పేదరిక నిర్మూలనే రెండు దేశాలకు తొలి ప్రాధాన్య అంశం. పేదరికం తొలగిపోవాలంటే రెండు దేశాల మధ్య విభేదాలు సమసిపోవాలి. రెండు దేశాల మధ్య ఉన్న విభేదం ఒక్కటే. అదే కశ్మీర్. అది చర్చల ద్వారా పరిష్కారమవుతుంది'' అని ఇమ్రాన్ అన్నారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రసంగాల్లో మోదీ పాకిస్తాన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ భద్రత విషయాన్నీ ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
బీజేపీ చేస్తున్న హిందూ జాతీయవాద పునరేకీకరణ రాజకీయాలపై ప్రస్తుత ఎన్నికలు ఒక రెఫరెండం లాంటివన్నది కొందరి అభిప్రాయం.
'బాధ్యతారాహిత్యం'
భారత్, పాక్‌ల మధ్య ఘర్షణ వల్ల తలెత్తే ముప్పుల గురించీ ఇమ్రాన్ మాట్లాడారు.
''ఒక్కసారి ప్రతిచర్యకు పాల్పడితే పరిణామాలు ఎంతవరకూ వెళ్తాయన్నది ఎవరి అంచనాకూ అందదు. ఒక వేళ భారత్ మళ్లీ వచ్చి పాక్‌పై దాడి చేస్తే ప్రతిదాడి చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు. అది ప్రస్తుత పరిస్థితుల్లో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య బాధ్యతారాహిత్యమే అవుతుందని నేను భావిస్తున్నాను'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'మోదీ గెలిస్తే శాంతికి మెరుగైన అవకాశాలు'
ప్రధానిగా మోదీ తిరిగి ఎన్నికైతే భారత్, పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని రాయ్‌టర్స్ వార్తాసంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.
''మితవాద పార్టీ అయిన భాజపా గెలిస్తే కశ్మీర్ విషయంలో ఏదైనా ఒప్పందం లాంటిది కుదుర్చుకోవచ్చు. మిగతా పార్టీలైతే మితవాద పక్షం నుంచి వ్యతిరేకత రావొచ్చన్న భయంతో ఉంటాయి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఎన్నికల వేళ ఇమ్రాన్ స్నేహ హస్తం'
బీబీసీ వరల్డ్ ఎఫైర్స్ ఎడిటర్ జాన్ సింప్సన్ విశ్లేషణ
ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్న ఈ ఎనిమిది నెలల్లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చింది చాలా తక్కువ.
బీబీసీతోపాటు కొన్ని బ్రిటీష్, అమెరికన్ వార్తా సంస్థలను ఇప్పుడు ఆయన ఆహ్వానించారంటే, అందుకు కారణం ఎన్నికల వేళ భారత్‌కు సందేశం ఇవ్వాలని అనుకోవడమే.
కలిసి పనిచేయడం ద్వారా ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన స్నేహ హస్తం చాస్తున్నారు.
వాతావరణాన్ని ఇమ్రాన్ తేలికపరచాల్సి ఉందన్నది వాస్తవం.
పాక్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. భారత్‌తో ఆ దేశానికి ఉన్న గొడవల వల్ల విదేశీ పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు.
ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థలకు ఆశ్రయమిస్తోందని పాక్‌పై ఉన్న ఆరోపణలూ ఈ పరిస్థితికి మరో కారణం. అయితే ఈ ఆరోపణలను ఇమ్రాన్ తోసిపుచ్చుతున్నారు.
''ఉగ్రవాదంపై గత ప్రభుత్వాలేవీ మాకు మించి చర్యలు తీసుకోలేదు. అన్ని సమస్యలూ కశ్మీర్ వివాదంతోనే ముడిపడి ఉన్నాయి. ఆ ఒక్క సమస్య తొలగిపోతే, మిగతా వాటిని సులభంగా పరిష్కరించుకోవచ్చు'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








