తెలంగాణలో అటవీ అధికారులపై దాడి - మొన్న ఆసిఫాబాద్ జిల్లాలో, నేడు భద్రాద్రి జిల్లాలో

- రచయిత, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి
- హోదా, రాజేశ్, బీబీసీ కోసం
తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై పాలక టీఆర్ఎస్ పార్టీ నేత కోనేరు కృష్ణారావు దాడి సంఘటన మరువక ముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాపాడు గ్రామ పరిధిలో మరో దాడి జరిగింది.
అటవీశాఖ అధికారులు ములకలపల్లి మండలం గుండాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ భూముల్లో ట్రాక్టర్లతో దున్నుతున్నారన్న సమాచారంతో అందడంతో అక్కడకు చేరుకున్నారు. ట్రాక్టర్లను ఆపి, వారిని ప్రశ్నించడంతో స్థానిక గిరిజనులు కర్రలతో వారిపై దాడికి దిగారు.

"ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాం. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరిగితే ఉద్యోగుల్లో అభద్రత పెరుగుతుంది" అని డీఎఫ్ఓ రాంబాబు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన సిబ్బందిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగజ్‌నగర్‌లో అటవీ అధికారులపై దాడి
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సోదరుడు, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఉన్న కృష్ణారావు అటవీ భూముల స్వాధీనం కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై అనుచరులతో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజర్ అనిత తీవ్రంగా గాయపడగా ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు భర్త మాణిక్ రావు తెలిపారు.

ఫొటో సోర్స్, BBC Telugu
అసలేం జరిగింది
కాళేశ్వరంలో అటవీ భూములు మునిగిపోవడంతో వాటి స్థానంలో కొత్త ప్రాంతంలో చెట్లు నాటి మొక్కలు పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది.
ఈ పనికి కాగజ్‌నగర్ ప్రాంతంలోని సార్సాలా అనే గ్రామంలో 20 హెక్టార్ల భూమిని ఎంపిక చేశారు అధికారులు. ఆ భూమిని చదును చేయడానికి ఆదివారం ఉదయం ట్రాక్టర్లతో వెళ్లారు.
అదే సమయంలో స్థానికులు, కోనేరు కృష్ణ ఆ ప్రాంతానికి చేరుకుని సిబ్బంది వెనక్కి వెళ్లాలంటూ దాడికి దిగారు.
కర్రలతో సిబ్బందిని, అధికారులను కొడుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో పోలీసులు ఉన్నా వారిని నిరోధించలేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అధికారులపై టీఆర్‌ఎస్ నేత దాడి చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన కృష్ణారావు ప్రవర్తనను ఖండించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు. ఆయనను అరెస్ట్ చేసి, కేసు కూడా నమోదు చేశారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఫారెస్ట్ అధికారులేమంటున్నారు
"ఇవాళ ఉదయం పోలీసులతో కలసి సుమారు 30 మంది డివిజన్ సిబ్బంది స్థలానికి వెళ్లారు. అకస్మాత్తుగా సార్సాలా గ్రామానికి చెందిన వారు గుంపుగా వచ్చారు. బూతులు తిట్టారు. వారు కోనేరు కృష్ణ నాయకత్వంలో మా అధికారి సీహెచ్ అనితపై దాడికి దిగారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించాం. వారు ఇతరులను కొట్టారు. మరో ముగ్గురు మహిళా సిబ్బందికి, ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్లకు కూడా గాయాలయ్యాయి. వారికీ చికిత్స జరుగుతోంది. మూడు ట్రాక్టర్లను ధ్వంసం చేశారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. 30 మంది పోలీసులున్నారక్కడ" అంటూ ఘటన జరిగిన తీరును బీబీసీకి వివరించారు కాగజ్ నగర్ డివిజినల్ ఫారెస్ట్ అధికారి రాజా రమణా రెడ్డి.

ఫొటో సోర్స్, ugc
భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతోనేనా?
ఈ ఘటన జరిగిన భూమి కదంబ రిజర్వు ఫారెస్టులో భాగమనీ, సెక్షన్ 15 అటవీ చట్టం కింద నోటిఫై అయి ఉందనీ, అక్కడ ఎవరూ సాగు చేయడం లేదనీ, బహుశా ఆ భూమిని ఆక్రమించుకునే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉండొచ్చనీ రాజా రమణా రెడ్డి అభిప్రాయపడ్డారు.
నిజాయితీతో పనిచేసే అనితపై దాడి జరగడం, అది కూడా అంత మంది పోలీసుల సమక్షంలో జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
దీనిపై రాజా రమణా రెడ్డి ఫిర్యాదుతో ఈజ్గామ్ స్టేషన్లో కేసు నమోదయింది. మొత్తం 16 మందిపై కేసు పెట్టారు.

కృష్ణ రాజీనామా
దాడికి పాల్పడిన కృష్ణ జడ్పీ ఉపాధ్యక్ష పదవికి, జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఆ విషయాన్ని ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మీడియాకు తెలిపారు.
పోడు రైతులపై అటవీ సిబ్బంది జులుంకి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు కృష్ణ తన రాజీనామా లేఖలో రాశారు.
ప్రస్తుతం కృష్ణ, ఆయన అనుచరులు కుమ్రం భీం జిల్లా పోలీసుల అదుపులో ఉన్నారు.

అటవీ శాఖ అధికారుల నిరసనలు
అటవీ అధికారిణిపై దాడిని ఖండిస్తూ ఆ శాఖ అధికారులు, సిబ్బంది నిరసన తెలుపుతున్నారు.
పెద్ద సంఖ్యలో ఆ శాఖ సిబ్బంది నిరసనల్లో పాల్గొన్నారు.
దాడికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.
మరోవైపు భూముల స్వాధీనానికి వెళ్లిన అధికారులకు రక్షణ కల్పించలేకపోవడంపై కాగజ్‌నగర్ డీఎస్పీ, సీఐలపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇవి కూడా చదవండి:
- ఉదారవాదానికి (లిబరలిజం) కాలం చెల్లిందా? పుతిన్ మాట నిజమేనా?
- అంబేడ్కర్‌తో బీబీసీ అరుదైన ఇంటర్వ్యూ: 'సరైనవారు ఎన్నికైతేనే ఎన్నికలకు విలువ'
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- ఆరెంజ్ జెర్సీల్లో కనువిందు చేయనున్న 'మెన్ ఇన్ బ్లూ'
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
- కార్లోస్ బ్రాత్‌వైట్... ఈ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి...
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- జీ-20 శిఖరాగ్ర సదస్సు: ఏమిటీ భేటీ? ఇక్కడ ప్రపంచ నాయకులు ఏం చర్చిస్తారు...
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








