యెమెన్ యుద్ధం: కాల్పుల విరమణ ఒప్పందంతో శాంతించిన హుదైదా

ఫొటో సోర్స్, Reuters
యెమెనీ ప్రభుత్వ-అనుకూల దళాలకు, హూతీ తిరుగుబాటుదారులకు మధ్య హుదైదా రేవు నగరంలో జరిగిన కాల్పుల ఘటనలు, కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరువాత అదుపులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
హుదైదాలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే, ఆ తరువాత కూడా అక్కడక్కడా కాల్పుల ఘటనలు జరిగినట్లు సమాచారం వచ్చింది. కానీ, మొత్తానికి పరిస్థితి గతంతో పోల్చితే ప్రశాంతంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
శాంతి ప్రయత్నం ఇప్పటివరకైతే ఫలిస్తున్నట్లే కనిపిస్తోందని ఐక్యరాజ్యసమితి దూత మార్టిన్ గ్రిఫిత్ అన్నారు.
హుదైదా కోసం జరుగుతున్న పోరాటం ఓడ రేవు కార్యకలాపాలను దాదాపు స్తంభింప చేసింది. యెమెన్ బాధితులకు ఆహార, వైద్య సహకారం అందించడానికి ఈ రేవు చాలా కీలకం.
యెమెన్ యుద్ధం వల్ల దేశ జనాభాలో దాదాపు యాభై శాతం మంది తీవ్రంగా దెబ్బతిన్నారు. ఒక కోటి నలభై లక్షల మంది ప్రజలు కరవు కోరల్లో చిక్కుకున్నారు. 85 వేల మంది చిన్నారులు పోషకాహారం లేక చనిపోయారని భావిస్తున్నారు.
దేశంలోని పశ్చిమ భూభాగాన్ని రాజధాని సనాతో సహా తిరుగుబాటుదారులు 2015 ప్రారంభంలో తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఫలితంగా దేశాధ్యక్షుడు అబ్ద్రాబూ మన్సూర్ హదీ దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి మొదలైన యుద్ధం నాలుగేళ్ళుగా కొనసాగుతూనే ఉంది.
తిరుగుబాటుదారు దళాలు ఇరాన్ అండతో బలపడుతున్నాయని భావించిన సౌదీ అరేబియా, మరో ఎనిమిది అరబ్ దేశాలు యెమెన్‌లో ప్రభుత్వాన్ని తిరిగి నెలకొల్పేందుకు జోక్యం చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి ప్రోద్బలంతో గత గురువారం నాడు స్వీడన్‌లో జరిగిన శాంతి చర్చలలో రెండు వర్గాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కొందరైతే, ఇది దాదాపు నాలుగేళ్ళుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడంలో మొదటి అడుగు అని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజధాని నగరమైన సనాకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుదైదా, యెమెన్‌లోని నాలుగో అతిపెద్ద నగరం. 2014లో తిరుగుబాటుదారుల అధీనంలోకి వెళ్ళక ముందు ఆ నగరం దేశానికి ప్రధాన ఆర్థిక కేంద్రంగా వర్థిల్లింది.
హుదైదా ఓడరేవు కూడా యెమెన్‌లోని దాదాపు మూడింట రెండు వంతుల మంది ప్రజలకు జీవాధారం అని చెప్పవచ్చు. ఆహారం, మందులు, ఇంధనం వంటి దిగుమతుల కోసం వారు దాదాపు పూర్తిగా ఈ ఓడరేవు మీదే ఆధారపడతారు.
2 కోట్ల 20 లక్షలకు పైగా యెమెనీలు ఏదో ఒక రకమైన సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 80 లక్షల మంది ప్రజలకు ఈ పూటకు తిండి దొరుకుతుందో లేదో తెలియదు.
కోటీ 60 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదు. 20 లక్షల మంది ప్రజలు తమ ఇళ్ళను వదలి వెళ్ళిపోయారు. 25 శాతం విద్యార్థులకు స్కూలుకు వెళ్ళే వెసలుబాటు లేదు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం: ఫేస్‌బుక్ నుంచి పేపాల్ వరకు అన్నిటినీ వాడేసిన రష్యా
- నీళ్ళ లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు...
- రోడ్డు వేసుకున్నారు... రాత మార్చుకున్నారు
- అమెరికా, నెదర్లాండ్స్‌లో రాముని కరెన్సీ: ఈ వార్తల్లో నిజమెంత, రాముని కరెన్సీ చరిత్ర ఏమిటి
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
- ఆన్లైన్లో అమ్మాయిలు.. ఈ ఒంటరితనానికి పరిష్కారమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









