బోయింగ్ 737 మాక్స్ లయన్ ఎయిర్ విమానం కూలిపోవటానికి వరుస వైఫల్యాలే కారణం

ఫొటో సోర్స్, Getty Images
విమాన తయారీ సంస్థ బోయింగ్, విమానయాన సంస్థ లయన్ ఎయిర్, విమానాన్ని నడుపుతున్న పైలట్ల వైఫల్యాలన్నీ కలిసి బోయింగ్ 737 మాక్స్ విమానం కూలిపోవటానికి కారణమయ్యాయని దర్యాప్తు నివేదిక పేర్కొంది.
ఇండొనేసియాకు చెందిన ఈ లయన్ ఎయిర్ విమానం గత ఏడాది అక్టోబరు నెలలో జావా సముద్రంలో కూలిపోవటంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 189 మందీ చనిపోయారు.
ఆ తర్వాత ఐదు నెలలకు ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కూడా కూలిపోయి.. అందులోని 157 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ వరుస ప్రమాదాలతో మ్యాక్స్ 737 శ్రేణి విమానాలను వినియోగించటం నిలిపివేశారు.
విమానం డిజైన్ లోపాలు ఈ రెండు దుర్ఘటనలకూ కారణమని నిపుణులు పేర్కొన్నారు.
ఇండొనేసియా విమాన ప్రమాద దర్యాప్తు అధికారులు సోమవారం తమ తుది నివేదికను విడుదల చేశారు.
''మాకు తెలిసినదాని ప్రకారం.. తొమ్మిది అంశాలు ఈ విమానం కూలిపోవటానికి దారితీశాయి. ఈ తొమ్మిది వైఫల్యాల్లో ఏ ఒక్కటి సరిగ్గా ఉన్నా ఈ ప్రమాదం సంభవించి ఉండకపోవచ్చు'' అని దర్యాప్తు అధికారుల్లో ఒకరైన నుర్కాయో ఉటోమో మీడియా సమావేశంలో చెప్పారు.

ఆ నివేదిక ఏం చెప్తోంది?
మొత్తం 353 పేజీలున్న ఆ నివేదిక ప్రకారం..
ఈ విమానం తుది ప్రయాణానికి ముందు కాక్‌పిట్ సమస్యను గుర్తించారు. అప్పుడే ఆ విమానాన్ని నిలిపివేసి ఉండాలి. కానీ.. ఆ సమస్యను సరిగా నమోదు చేయనందున దానిని సరిచేయకుండానే బయలుదేరటానికి అనుమతించారు.
ఫ్లోరిడాలోని ఒక మరమ్మతు దుకాణం నుంచి కొనుగోలు చేసిన ఒక కీలకమైన సెన్సర్‌ను సరిగా పరీక్షించలేదు. ఆ సంస్థ లైసెన్సును అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ శుక్రవారం రద్దు చేసింది.
విమానంలోని మాన్యువరింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆగ్‌మెంటేషన్ సిస్టమ్ (ఎంసీఏఎస్)కు ఈ సెన్సర్ సమాచారం అందిస్తుంది.
గాలిలో ప్రయాణిస్తున్నపుడు 737 మ్యాక్స్ విమానం స్టాల్ కాకుండా (గాలిలో తేలటం ఆగిపోవటం) నిరోధించటానికి సాయపడటం కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేశారు. లయన్ ఎయిర్, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ - రెండు విమానాలు కూలిపోవటం వెనుక కారణాలను కనుగొనటానికి ప్రయత్నిస్తున్న దర్యాప్తు అధికారులు ఈ సాఫ్ట్‌వేర్ మీద దృష్టి కేంద్రీకరించారు.

ఈ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయని.. వాటివల్ల విమానం స్టాల్ అవుతూ.. దాని ముందు భాగం పదే పదే కిందికి వాలేటట్లు చేస్తూ ఉండటంతో విమానాన్ని నియంత్రించటానికి పైలట్లు పోరాడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఇండొనేసియా దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఇక విమానానికి ఫస్ట్ ఆఫీసర్ (కో పైలట్)గా ఉన్న వ్యక్తి శిక్షణ పొందే సమయంలోనే అసమర్థ ప్రదర్శన కనబరిచారు. విమానాన్ని నడిపేటపుడు అనుసరించాల్సిన ప్రక్రియలను మరచిపోయారు.
విమానం నింగి నుంచి కూలిపోతున్న దశలోకి వెళ్లినపుడు ఆయనే విమానాన్ని నడుపుతున్నారు. అయితే.. విమానం కెప్టెన్ కూడా నియంత్రణలను కో-పైలట్‌కు అప్పగించే ముందు సక్రమంగా వివరించలేదు. విమానాన్ని గాలిలో తేలుతూ ఉంచటానికి ఇద్దరూ విఫలప్రయత్నాలు చేశారు.
విమానం నిర్వహణ పద్దులో 31 పేజీలు అదృశ్యమయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters
వారు సమర్థంగా స్పందించినట్లయితే...
''లయన్ ఎయిర్ విమానం కూలిపోవటంలో మెకానికల్ డిజైన్ సమస్యలు కీలక అంశాలని ఇండొనేసియా దర్యాప్తు అధికారులు ఇంతకుముందు పేర్కొన్నారు. అయితే ఈ నివేదికలో.. సమాచార లోపం, డిజైన్ లోపం, విమానం నడిపే నైపుణ్యాల లోపం వంటి అనేక వైఫల్యాలను వివరించారు'' అని బీబీసీ వాణిజ్య రంగ ప్రతినిధి తియో లెగెట్ పేర్కొన్నారు.
ఈ నివేదిక నేపథ్యంలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు.
''అంతకుముందు రోజు విమానాన్ని నడిపిన సిబ్బంది.. తాము ఎదుర్కొన్న సమస్యలను మరింత వివరంగా తెలిపినట్లయితే ఆ తరువాతి రోజున దానిని ఉపయోగించకుండా నిలిపివేసి ఉండేవారేమో.
ఆటోమేటెడ్ వ్యవస్థలో ఏదో సమస్య ఉన్నా, ఆ సమస్య ఉన్న విషయం తెలియకపోయినా.. విమానాన్ని సమర్థవంతంగా గాలిలో నిలిపిన పైలట్.. అంత సమర్థత లేని కో-పైలట్‌కు నియంత్రణను అప్పగించకుండా ఉన్నా ఈ విమాన ప్రమాదానికి ఆస్కారం లేకుండా ఉండేది కాదేమో'' అనే విశ్లేషణలు వస్తున్నాయని తెలిపారు.
''బోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డెన్నిస్ మూలెన్‌బర్గ్ పదే పదే చెప్పినట్లు.. ఈ ప్రమాదంలో వరుస ఘటనలు ఉన్నాయి. కానీ.. ఆ వరుసలో కేంద్ర బిందువు ఎంసీఏఎస్ - ఆ పైలట్లకు తెలియని కంట్రోల్ సిస్టమ్. అది ఒక్క సెన్సార్ విఫలమైతే పూర్తిగా ఫెయిలవుతుంది.
లయన్ ఎయిర్ కూలిపోయిన తర్వాత కూడా ఈ వ్యవస్థను ఇలాగే డిజైన్ చేయటానికి బోయింగ్ సంస్థ, నియంత్రణ సంస్థలు అనుమతించాయి. దానిని మార్చలేదు. అందువల్ల మరో విమానం కూలిపోయింది.
అంటే.. ఈ ప్రమాదాలకు అత్యధిక బాధ్యత వహించాల్సింది బోయింగ్ సంస్థే'' అని తియో లెగెట్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బోయింగ్ స్పందన ఏమిటి?
ఇండొనేసియా అధికారులు ఈ నివేదికలో బోయింగ్ సంస్థకు కొన్ని సిఫారసులు చేశారు. ఎంసీఏఎస్‌ను మళ్లీ కొత్తగా డిజైన్ చేయటం, దానికి సంబంధించి పైలట్ మాన్యువళ్లు, శిక్షణలో తగినంత సమాచారం అందించటం వంటివి అందులో ఉన్నాయి.
ఇండొనేసియా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ సిఫారసులను తాము ''పరిష్కరిస్తున్నామ''ని బోయింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
''ఈ ప్రమాదంలో తలెత్తిన విమాన నియంత్రణ పరిస్థితులు మరోసారి జరగకుండా నిరోధించటానికి.. 737 మ్యాక్స్ విమానం భద్రతను పెంపొందించటానికి మేం చర్యలు చేపడుతున్నాం'' అని చెప్పింది.
బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మెక్‌అలిస్టర్‌ను ఈ సంస్థ సోమవారం నాడు తొలగించింది. రెండు విమాన ప్రమాదాల తర్వాత ఆ సంస్థను వీడిన అత్యంత సీనియర్ అధికారి ఆయన.
ఇక 737 మ్యాక్స్ విమానాన్ని వినియోగించటం కోసం ఈ ఏడాది చివర్లోగా మళ్లీ అనుమతి పొందుతామని భావిస్తున్నట్లు కూడా బోయింగ్ తెలిపింది.
మరోవైపు.. 737 మ్యాక్స్ విమానానికి 2016లో అనుమతులు ఇస్తున్న సమయంలోనే.. అందులో ఉపయోగించిన ఎంసీఏఎస్ వ్యవస్థలో సమస్యలు తలెత్తాయని బోయింగ్ సిబ్బంది మెసేజీలతో చర్చించుకున్నారన్న విషయం ఈ నెలలో వెలుగులోకి వచ్చింది.
బోయింగ్ సంస్థ ప్రజాప్రతినిధులకు అందించిన పత్రాల్లో.. విమానాన్ని నడుపుతూ పరీక్షించేటపుడు అనూహ్య సమస్య ఎదురైందని ఒక పైలట్ రాశారు. ''నేను నియంత్రణ అధికారులకు తెలియకుండానే అబద్ధం చెప్పినట్లయింది'' అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









