సునీల్ దేవ్‌ధర్: త్రిపుర ఎర్రకోటపై బీజేపీ జెండాను ఎగరేసిన మరాఠీ

ఫొటో సోర్స్, Sunil Deodhar/Facebook
25 ఏళ్లుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపుర ఇప్పుడు బీజేపీ వశమవుతోంది. ఒకప్పుడు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని కమలం పార్టీ ఇప్పుడు అదే చోట అధికారానికి చేరువైంది. ఈ విజయం వెనక ఓ మరాఠీ వ్యక్తి కీలక పాత్ర పోషించారు. అతని పేరే సునీల్ దేవ్‌ధర్.
మహారాష్ట్రకు చెందిన సునీల్ గురించి మరాఠీలకే పెద్దగా తెలియదు. కానీ, ఈశాన్య భారత్ మీడియాలోని పతాక శీర్షికల్లో అతని పేరు తరచూ వినిపిస్తుంది.
త్రిపుర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగానే కాదు, ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడంలో సునీల్‌దే కీలకపాత్ర. త్రిపుర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 40కి పైగా స్థానాలతో అధికారం దిశగా దూసుకెళ్తోంది.
కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారిగా ఈ స్థాయి విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో సునీల్ దేవ్‌ధరే ప్రధాన పాత్ర పోషించారని పార్టీ పెద్దలే చెప్తున్నారు.
సునీల్ ఉండేది ముంబయిలోని విల్లే పార్లేలోనైనా ఈశాన్య భారత్‌నే తన నివాసంగా ఆయన భావిస్తుంటారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన చాలా ఏళ్లు ఈశాన్య భారత్‌లోనే పనిచేశారు.

ఫొటో సోర్స్, Sunil Deodhar/Twitter
మోదీ దూతగా..
ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి రాగానే 2014లో వారణాసి లోక్ సభ ఎన్నికల ప్రచార బాధ్యతను పార్టీ నేతలు సునీల్‌కు అప్పగించారు. ఇక్కడి నుంచే మోదీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
ఇక్కడ మోదీ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో సునీల్ కీలకపాత్ర పోషించారు. దీంతో మోదీ విశ్వాసాన్ని చూరగొన్నారు. అదే సమయంలో సునీల్‌కు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను పార్టీ అప్పగించింది.
ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం లేకపోయినా, అమిత్ షా ఎన్నికల పనితీరును చాలా దగ్గరగా గమనించిన అనుభవం సునీల్‌కు ఉంది. అదే అనుభవాన్ని ఆయన త్రిపుర ఎన్నికల ప్రచారంలో ఉపయోగించారు. బూత్ స్థాయిలో కేడర్‌ను పటిష్టం చేశారు. మీడియాలో పెద్దగా కనిపించని సునీల్ సోషల్ మీడియాలో మాత్రం చాలా క్రియాశీలంగా ఉంటారు.
'భారీస్థాయిలో ర్యాలీలు తీయడం వంటి ప్రచార వ్యూహాలు కాకుండా ప్రజలతో మమేకమవుతూ వారి నాడి తెలుసుకుంటుంటారు. సామాన్యులతో కలసిపోయి రాజకీయాల గురించి ప్రస్తావిస్తుంటారు. తాను వెళ్లే దారిలో చిన్న గుంతలు కనిపించినా అక్కడి నుంచి ఫేస్‌బుక్ లైవ్ ఏర్పాటు చేసి సమస్యలను ప్రస్తావిస్తుంటారు. రైల్లో వెళుతూ ప్రజలతో మాట్లాడుతుంటారు' అని సునీల్ ప్రచారతీరును బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవి వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మోదీ దూతలుగా 24 మంది కార్యకర్తలను ఎంపిక చేసిన సునీల్ వారిని ప్రతిరోజూ వివిధ రైల్వే స్టేషన్‌లకు పంపించేవారు. అక్కడే బీజేపీ పనితీరును వారు ప్రజలకు వివరించేవారు. ఈ ప్రచారసరళి ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆయన మొదలుపెట్టారు.
దేశంలోని అతి పేద సీఎంగా మాణిక్ సర్కార్‌కు పేరుంది. ఆయనపై వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అయితే, సునీల్ ఆయనపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు.
'ఇక్కడ ప్రజలకు కావాల్సింది పేద ముఖ్యమంత్రి కాదు.. తమ పేదరికాన్ని తొలగించే పాలన కావాలి' అని సునీల్ పదే పదే తన ప్రచారంలో చెబుతూ వచ్చారు.
స్థానిక భాష కూడా నేర్చుకొని..
కేవలం త్రిపురలోనే కాదు మేఘాలయలో కూడా దేవ్‌ధర్ పార్టీ తరఫున పనిచేశారు. 'మై హోం ఇండియా' పేరుతో ఆయన సొంతంగా ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు.
స్థానిక యువతతో ఆయన అక్కడి భాషలైన ఖాసీ, గార్గోలలో మాట్లాడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఈ రెండే కాదు స్థానికంగా చాలా మంది మాట్లాడే బెంగాలీలో కూడా ఆయన బాగా మాట్లాడగలరు.

ఫొటో సోర్స్, EPA
రాష్ట్రంలోని వామపక్షాలు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న కొందరు నాయకులను బీజేపీ గూటికి తీసుకురావడంలో సునీల్ పాత్ర కీలకం.
'ఎన్నికల పర్యటనల్లో మంచి పేరున్న చాలా మంది కాంగ్రెస్ నాయకులను చూశాను. అందుకే వాళ్లను బీజేపీకి తీసుకరావడనాకి ప్రయత్నించాను' అని సునీల్ బీబీసీకి చెప్పారు.
అయితే, ఈ తీరుతో పార్టీలోని పాత నాయకులు, కార్యకర్తలు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారని బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవి పేర్కొన్నారు.
'సునీల్ వల్లే త్రిపురలో బీజేపీ విజయం సాధ్యమైంది. ఐదేళ్ల నుంచి ఆయన ఇక్కడి పార్టీ కోసం కష్టపడ్డారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగానూ ఆయన ఇక్కడి పని చేశారు' అని సీనియర్ జర్నలిస్టు సందీప్ ఫుకాన్ బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








