ప్రెస్‌రివ్యూ: ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం: రాహుల్‌గాంధీ

రాహుల్‌గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రంలో 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపైనే చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పినట్లు ‘ఈనాడు’ ఒక కథనం ప్రచురించింది.

‘ఈనాడు’ కథనం ప్రకారం.. ఈ అంశాన్నే తమ మొదటి ప్రాధాన్యంగా తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం దిల్లీలో ఏపీపీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు అధ్యక్షతన నిర్వహించిన ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో రాహుల్‌గాంధీ పాల్గొని మాట్లాడారు.

'మోదీ సర్కారు ఇంతకాలమైనా హోదా అమలు చేయలేదు.. అందరం కలిసి ఒత్తిడి తెస్తే నాడు యూపీఏ ఇచ్చిన హామీలు అమలయ్యేలా చేయవచ్చు' అని పేర్కొన్నారు. ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. 'ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు.. సాధించేవరకు పోరాటం కొనసాగుతుంది' అని చెప్పారు.

నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఎవ్వరికీ హోదా లేదు: కేంద్ర ఆర్థిక శాఖ సంకేతాలు

ప్రత్యేక హోదా ఇక లేనట్లేనని, ఏ రాష్ట్రానికి ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించిందని, జీఎస్టీ అమలైన తర్వాత హోదా కలిగిన రాష్ట్రాలకూ పన్ను మినహాయింపులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపిందని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రకారం.. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఏపీకి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లపై కేంద్రం పూర్తిగా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది.

సోమవారం రాత్రి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన నాయుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులతో జరిగిన సమావేశంలోనే ఏపీ డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పెదవి విరిచినట్లుగా తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఏపీ ప్రభుత్వం కోరిన విధంగా ఈశాన్య రాష్ట్రాల తరహాలో రాయితీలను ఇచ్చే అవకాశాలు లేవని కేంద్రం భావిస్తోంది. వీటి గురించి వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభుతో చర్చిస్తామని జైట్లీ చెప్పినప్పటికీ... ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకునే సూచనలు లేవని తెలుస్తోంది.

ఇప్పటి దాకా ప్రకటించిన ప్యాకేజీకి మాత్రమే తాము పరిమితమవుతామని, రెవెన్యూ లోటును మరో 1600 కోట్లకు మించి అదనంగా ఇవ్వడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. పైగా... మొత్తం నెపాన్ని రాష్ట్రంపై నెట్టేసేలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ''ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామన్నాం. విదేశీ సహాయ ప్రాజెక్టులకు నిధులు ఎక్కడినుంచి కావాలో వారినే తేల్చుకోమన్నాం. అంతకంటే ఏమీ చేయలేం'' అని జైట్లీ స్వయంగా తన సన్నిహితులతో అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లు రాయితీలను ఏపీకి ఇస్తే ఒడిసా, బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాలు కూడా డిమాండ్‌ చేస్తాయన్నారు. ఒక రాష్ట్రంలో ప్రజల భావోద్వేగాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే... మిగతా రాష్ట్రాల్లో కూడా భావోద్వేగాలు రేగుతాయని జైట్లీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న టీఆర్‌ఎస్ ఎంపీలు

ఫొటో సోర్స్, Kavitha Kalvakuntla/Twitter

రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ ఢిల్లీలో టీఆర్‌ఎస్ పోరు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్‌చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీలో పోరాటాన్ని మరింత ఉధృతం చేశారని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కథనం తెలిపింది. తొలి రోజైన సోమవారం లోక్‌సభను స్తంభింపజేసిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. రెండోరోజైన మంగళవారం కూడా తమ ఆందోళనను కొనసాగించారని పేర్కొంది.

‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రకారం.. లోక్‌సభ లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ముస్లింలు, ఎస్టీలకు విద్యాసంస్థల్లో, ఉద్యోగ కల్పనలో మరిన్ని రిజర్వేషన్లు ఇచ్చేందుకుగాను ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 50% నుంచి 62 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ గతేడాది ఏప్రిల్‌లో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని నినదించారు.

మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిపిన ఎంపీలు 11 గంటల తర్వాత లోక్‌సభలో కూడా తమ నిరసన గళాన్ని వినిపించారు. ఎంపీల నిరసన ప్రతిధ్వనులతో లోక్‌సభ దద్దరిల్లింది. వారిని శాంతింపజేసేందుకు స్పీకర్ సుమిత్రామహాజన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత జితేందర్‌రెడ్డి, ఉపనేత వినోద్‌కుమార్,ఎంపీ కవిత, బాల్కసుమన్ తదితరులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.

ఇదే సమయంలో కావేరీ జల వివాదంపై తమిళనాడు ఎంపీలు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆ రాష్ట్ర ఎంపీలు నిరసనలతో హోరెత్తించారు. ఎంపీల నిరసన ప్రతిధ్వనుల మధ్య సభను రెండుసార్లు వాయిదావేయాల్సి వచ్చింది.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, Getty Images

టార్గెట్‌ 'లాల్‌ ఖిలా'... మమత సరికొత్త నినాదం!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ 'చలో ఢిల్లీ' అంటూ పిలుపునిచ్చారని.. ఇక తమ లక్ష్యం ఢిల్లీ ఎర్రకోటనే అని ప్రకటించారని ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో ఇక తమ లక్ష్యం బెంగాల్‌ అంటూ బీజేపీ నినాదానికి ప్రతిగా 'టార్గెట్‌ లాల్‌ ఖిలా' పోరుకేకను ఆమె అందుకున్నట్లు ఆ కథనం పేర్కొంది.

‘సాక్షి’ కథనం ప్రకారం.. త్రిపురలో పాతికేళ్ల సీపీఎం పాలనకు బీజేపీ తెరదించిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మాట్లాడుతూ.. బెంగాల్‌, ఒడిశా, కేరళలో విజయాలు సాధిస్తేనే.. కమలానికి సంపూర్ణ స్వర్ణయుగం వచ్చినట్టు అని పేర్కొన్నారు. అయితే, అమిత్‌ షా వ్యాఖ్యలపై మమత ఘటుగా స్పందించారు.

సోమవారం పురాలియా జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. 'ఇక తమ తదుపరి టార్గెట్‌ బెంగాలేనని కొందరు అంటున్నారు. అలాగైతే మన లక్ష్యం ఢిల్లీ ఎర్రకోటనే. ఢిల్లీ దిశగా సాగుదాం. ఛలో ఢిల్లీ అంటూ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన నినాదాన్ని మేం నమ్ముతాం. బెంగాల్‌ దేశాన్నే కాదు భవిష్యత్తులో ప్రపంచాన్ని గెలుచుకోగలదు' అని ఆమె పేర్కొన్నారు.

హైకోర్టు

ఫొటో సోర్స్, wikipedia

విద్యా హక్కు అమలు చేయరేం?: ఏపీ, తెలంగాణలకు హైకోర్టు నోటీసులు

పేద విద్యార్థులకు కూడా ప్రైవేటు పాఠశాలల్లో విద్య అందించాలన్న ప్రధాన లక్ష్యంతో రూపొందిం చిన విద్యా హక్కు చట్ట నిబంధనను తెలంగాణ, ఏపీల్లో అమలు పర్చకపోవడంపై హైకోర్టు మండి పడినట్లు ‘ప్రజాశక్తి’ దినపత్రిక కథనం పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. చట్టాన్ని ఎందుకు అమలు చేయలేక పోయారో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ రెండు ప్రభుత్వాలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌, న్యాయమూర్తి కె.విజయలక్ష్మి లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం నోటీసులు జారీ చేసింది.

విద్యా హక్కు చట్టం అమలు చేయడం లేదని న్యాయశాస్త్ర విద్యార్థి తాండవ యోగేష్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యన్ని బెంచ్‌ విచారించింది. ఈ చట్టం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి నుంచి తిప్పారెడ్డి రాసిన లేఖను కూడా హైకోర్టు పిల్‌గా పరిగణించి రెండు వ్యాజ్యాలపై బెంచ్‌ విచారణ చేపట్టింది.

ప్రైవేటు బడుల్లో పేదలకు 25 శాతం సీట్లు ఇవ్వాలనే చట్ట నిబంధన అమలు జరగడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల పూర్తి వివరాలేవీ కూడా విద్యాధికారి దగ్గర పొందుపర్చలేదు. చట్ట స్ఫూర్తిని ప్రభుత్వాలు నీరుగార్చుతున్నాయి. పేదలకు ప్రాథమిక విద్యలో ఫీజు రీయింబ్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. ఉన్నత విద్యకు మాత్రమే ప్రభుత్వాలు ఇస్తున్నాయి. దీని వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతాయి. చట్టం అమలు జరిగేలా హైకోర్టు చర్యలు తీసుకోవాలి అని యోగేష్‌ వాదించారు. ఈ చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పడిపోతుందని ఎపి ప్రభుత్వ లాయర్‌ చెప్పారు. విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)