సుప్రీం కోర్టు: ‘‘మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై రేపు తగిన ఆదేశాలు జారీ చేస్తాం’’.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఫడణవీస్, అజిత్ పవార్‌లకు నోటీసులు

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై సోమవారం తగిన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.

న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు విని, కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్‌లకు నోటీసులు జారీ చేసింది.

బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ రాసిన లేఖ ప్రతులను, ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన పత్రాలను సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా తమకు అందించాలని సొలిసిటర్ జనరల్ తుహార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది.

శనివారం ఉదయం దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వీరిని ఆహ్వానించడం, వారిచేత ప్రమాణ స్వీకారం చేయించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు ఉమ్మడిగా ఈ పిటిషన్ దాఖలు చేశాయి.

‘తనను ప్రధానిని చేయమని ఎవరైనా అడగొచ్చు’ - జస్టిస్ ఎన్వీ రమణ

ఈ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నప్పుడు.. బీజేపీ తరపున హాజరైన న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. ఆదివారం సెలవు రోజని, ఆ రోజు సుప్రీంకోర్టు భేటీ అయ్యి పిటిషన్‌పై వాదనలు ఎలా వింటోందని అన్నారు. అలాగే, బలనిరూపణ చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించేలా, గవర్నర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయగలదా అని అడిగారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దీనికి జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘‘ఇది కోర్టు, ఆకాశమే హద్దు. ఎవరైనా ఏదైనా అడగొచ్చు. ఎవరైనా తనను ప్రధాన మంత్రిని చేయమని అడగొచ్చు’’ అన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

బీజేపీకి బలం ఉంటే ఈరోజే అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకోవాలి - శివసేన

శివసేన పార్టీ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది శనివారం ఉదయం 5.17 గంటలకని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రమాణం చేసింది ఉదయం 8.02 గంటలకని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఫడణవీస్‌ను గవర్నర్ ఆహ్వానించటంతో పాటు మిగతా కార్యక్రమాలకు సంబంధించిన లిఖితపూర్వక పత్రాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయని, శుక్రవారం రాత్రి 7 గంటలకు ఈ విషయాన్ని ప్రకటించాయని, ఇది తెలిసి కూడా గవర్నర్ వేరేవాళ్లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం పక్షపాతం చూపించడమేనని, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నియమాలకకు వ్యతిరేకమని అన్నారు.

ఈరోజే అసెంబ్లీలో బల నిరూపణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కపిల్ సిబల్ కోరారు. ఒకవేళ బీజేపీకి నిజంగానే బలం ఉంటే.. అది అసెంబ్లీ సాక్షిగా నిరూపణ అవుతుందని, లేకపోతే తాము (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమకు బలం ఉందని, దాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, సోమవారం అయినా తాము బలాన్ని నిరూపించుకుంటామని చెప్పారు.

ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే - కాంగ్రెస్, ఎన్సీపీ

కాంగ్రెస్-ఎన్సీపీల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఖితపూర్వక డాక్యుమెంటు ఆధారంగా ఎవరికి మెజార్టీ ఉందనే అంశంపై గవర్నర్ ప్రాథమికంగా అంచనాకు రావాలని, ఆ డాక్యుమెంటులో ఎమ్మెల్యేల సంతకాలు ఉండాలని, వాటిని పరిశీలించాలని, వీటన్నింటిపైనా సంతృప్తి చెందినప్పుడే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు తమ ప్రకటన వెలువడిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవుతారని చెప్పామని, అలాంటప్పుడు గవర్నర్ వేచి ఉండలేరా? అని అడిగారు.

‘‘కేవలం 42-43 సీట్లతో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే’’ అని సింఘ్వీ అన్నారు. అజిత్ పవార్‌ను తమ పార్టీ శాసనసభాపక్ష నేత హోదా నుంచి ఎన్సీపీ తొలగించిందని, పార్టీ మద్దతు లేకుండా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎలా కొనసాగుతారని అడిగారు. 1998లో ఉత్తర ప్రదేశ్ వ్యవహారంలోను, 2018లో కర్ణాటక వ్యవహారంలోను సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తక్షణం అసెంబ్లీలో బలనిరూపణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

వాళ్లు మూడు వారాలు నిద్రపోయారు - బీజేపీ

బీజేపీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. అసలు ఆదివారం నాడు ఈ పిటిషన్‌పై వాదనలు ఎందుకు వింటున్నారో తనకు తెలియడం లేదన్నారు. అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేసేలా.. ఆయనకు సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వగలదా? అని ఆరాతీశారు. మూడు వారాల పాటు పిటిషనర్లు నిద్రపోయారని, వాళ్లు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చే పత్రాలేవీ వారివద్ద లేవని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)