టీఎస్ఆర్టీసీని భరించే శక్తి లేదు, హైకోర్టు తీర్పు తర్వాత తుది నిర్ణయమన్న ప్రభుత్వం - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, TELANGNA I&PR/TSRTC
టీఎస్ఆర్టీసీని యథాతథంగా నడపడం సాధ్య కాదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడినట్లు ఈనాడు సహా అన్ని ప్రధాన పత్రికలూ కథనాలు ప్రచురించాయి.
టీఎస్ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, న్యాయస్థానంలో నిర్ణయాలు, నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రథమ కర్తవ్యంగా ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉందని, అప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించినట్లు కథనంలో చెప్పారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో గురువారం ఆర్టీసీపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
నాలుగు గంటలు పైగా జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశంపై విస్తృత చర్చ జరిగింది.
ఆర్టీసీకి ఉన్న అప్పులు, బకాయిలు, సీసీఎస్‌కు ఇవ్వాల్సిన మొత్తం, కొత్త బస్సులకు అయ్యే ఖర్చు, పీఎఫ్ బకాయిలు, ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి చెల్లించాల్సిన మొత్తం జీతం... అన్నిటిపై ప్రభుత్వం లెక్కలు వేసింది.
"మొత్తంగా ఇప్పుడున్నట్లు ఆర్టీసీని నడపాలంటే నెలకు దాదాపు రూ.640 కోట్లు కావాలి, ఈ భారమంతా ఎవరు భరించాలి, ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వానికి కూడా భరించే పరిస్థితి లేదు. ఎంతోకొంత ప్రభుత్వ సాయం చేసినా అది ఎంతవరకు నిలబడగలుగుతుంది" అని అభిప్రాయపడింది.
"ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం, చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథాతథంగా నడపడం సాధ్యం కాదు" అనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్ర పన్నుల వాటాలో భారీ కోత
కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు భారీగా తగ్గబోతున్నాయంటూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
రాష్ట్రాలకు ప్రస్తుతం కేంద్ర పన్నుల్లో ఇస్తున్న వాటా శాతాన్ని గణనీయంగా తగ్గించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మేరకు 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం మెమొరాండం ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రం ఉమ్మడి సంచయం నుంచి రాష్ట్రాలకు బదలాయిస్తున్న 42 శాతం వాటాలో.. నిర్దిష్టంగా ఎంత మేరకు తగ్గించాలనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, 33 శాతానికి తగ్గించాలని కోరినట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి అని కథనంలో చెప్పారు.
మరిన్ని నిధులివ్వాలని, వాటా పెంచాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్రం తగ్గించాలని కోరడం అనూహ్య పరిణామంగా చెబుతున్నారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించడానికి.. జీడీపీ వృద్ధి భారీగా తగ్గడం, ఆర్థిక మందగమనం, తగ్గుతున్న పన్ను వసూళ్లను కారణాలుగా కేంద్రం చెబుతున్నట్లు తెలిస్తోందని ఆంధ్రజ్యోతి చెప్పింది.
ఈ సూచనను ఆర్థికసంఘం అంగీకరిస్తే అది రాష్ట్రాలకు శరాఘాతమే. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దదెబ్బే. ఎన్నికల హామీలను ప్రభుత్వాలు నెరవేర్చుకోలేని పరిస్థితి తప్పదని రాసింది.
ఐదేళ్ల కిందటే 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు భారీగా పన్నుల వాటాను పెంచింది. 32 శాతం ఉన్న వాటాను ఏకంగా 42 శాతానికి పెంచిన కమిషన్ కొన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కోత విధించింది.
42 శాతాన్ని 50 శాతానికి పెంచాలన్నది రాష్ట్రాల తాజా డిమాండ్. కానీ కేంద్రం 13వ ఆర్థిక సంఘ పరిస్థితి నాటికే తిరోగమిస్తుందని ఆర్థిక నిపుణులు సైతం ఊహించలేదు.
కేంద్రం చేసిన విజ్ఞప్తిని యథాతథంగా అంగీకరించబోమని ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ చెప్పారు. ''బదలాయింపు పరిమితి ఎంత అనేది అన్ని అంశాలనూ పరిశీలించి నిర్ణయిస్తాం. కేంద్రంతో పాటు 30 విజ్ఞాపనలు మా వద్ద ఉన్నాయి. అన్నీ చూసి సమతూకంతో ఓ నిర్ణయానికి వస్తాం'' అని సింగ్ తెలిపారని జ్యోతి కథనంలో వివరించింది.
2020 ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్లకు కేంద్ర-రాష్ట్రాల పన్నుల వాటాను కమిషన్ నిర్ణయిస్తుంది.

పోలవరం కాంక్రీట్ పనులు పునఃప్రారంభం
పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 1 బ్లాకు దగ్గర కాంక్రీట్ పనులు పునఃప్రారంభమైనట్లు సాక్షి కథనం ప్రచురించింది.
చెప్పిన గడువుకంటే ముందుగానే పోలవరం పూర్తిచేయాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని ఇందులో చెప్పారు.
ఇందులో భాగంగా స్పిల్ వే ప్రాంతంలో కాంక్రీట్ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ పునఃప్రారంభించింది. కంపెనీ జీఎం, ప్రాజెక్ట్ మేనేజర్ పూజలు చేసి పనులు ప్రారంభించారు.
స్పిల్ వే 54వ బ్లాకు నుంచి వరసగా కాంక్రీట్ పనులు చేస్తామని ఎస్ఈ నాగిరెడ్డి చెప్పారు.
గేట్ల అమరిక, కాఫర్ డ్యాం నిర్మాణం, స్పిల్ వే చానల్ పనులు కూడా ఇదే సమయంలో పూర్తి చేస్తామన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బడా ఎగవేతదారులు వీళ్లే... బయటపెట్టిన ఆర్బీఐ
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల వివరాలను ఆర్బీఐ ఎట్టకేలకు వెల్లడించిందని నమస్తే తెలంగాణ ఓ కథనంలో పేర్కొంది.
ఈ ఏడాది మే నెలలో సమాచార హక్కు చట్టం కింద 'ది వైర్' దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందించిన ఆర్బీఐ 30 భారీ ఉద్దేశపూర్వక రుణ ఎగవేత సంస్థల పేర్లను తెలిపింది.
నిజానికి ఈ సమాచారం కోసం దశాబ్దం పైగా ఎడతెగని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు సైతం ఈ వివరాలు వెల్లడించాలని ఆర్బీఐని ఆదేశించింది. కానీ, దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతమని, బ్యాంకింగ్ రంగ విశ్వసనీయత, సంబంధాలు దెబ్బతింటాయని చెబుతూ ఆర్బీఐ దీన్ని తోసిపుచ్చుతూ వచ్చింది.
కానీ దరఖాస్తుదారులు మరోసారి సుప్రీంను ఆశ్రయించగా.. ఆర్బీఐ తీరు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందంటూ ఏప్రిల్‌లో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆర్బీఐ వెల్లడించిన 30 సంస్థల బకాయిలు రూ.50వేల కోట్ల పైనే ఉన్నాయి. దీనిలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్, పీఎన్‌బీ కుంభకోణం నిందితుడు మెహుల్ చౌస్కీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ వంటి సంస్థలున్నాయని నమస్తే తెలంగాణ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- ‘తెలంగాణలో అమిత్ షా, కేసీఆర్‌ల రాజ్యం నడుస్తోంది’ - వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
- ప్రణబ్ ముఖర్జీ: ‘నేను బాల్ థాకరేను కలవటం సోనియా గాంధీకి నచ్చలేదు’
- ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోం.. భారత సైనికులు వెనక్కి వెళ్లాలి: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
- విరాట్ కోహ్లీ: ‘ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేక కుమిలిపోయా.. క్రికెట్‌ను వదిలేయాలన్న ఆలోచనలూ వచ్చాయి’
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








