అమెరికా: దొంగల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో తానే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు

పోలీస్

ఫొటో సోర్స్, EPA

ఇంట్లోకి ఎవరూ చొరబడకుండా సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఉచ్చులో చిక్కుకుని అమెరికాలో రొనాల్డ్ సిర్ (65) అనే వ్యక్తి మరణించారు.

మెన్ రాష్ట్రంలోని వాన్ బరెన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.

తనకు తూటా తగిలినట్లు రొనాల్డ్ 911కు ఫోన్ చేయడంతో, ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఆయన ఏర్పాటు చేసుకున్న ఉచ్చును గుర్తించారు.

ఇంట్లోకి ఎవరైనా చొరబడేందుకు ప్రయత్నిస్తే హ్యాండ్ గన్ పేలి వారికి తూటా తగిలేలా ఇంటి తలుపులను రొనాల్డ్ తీర్చిదిద్దినట్లు పోలీసులు వెల్లడించారు.

అమెరికాలో ఇళ్ల యజమానులు ఇలాంటి ఉచ్చులు ఏర్పాటు చేసుకోవడం అసాధారణమేమీ కాదు. కానీ, ఇద్ది చట్ట వ్యతిరేకమైన చర్య.

‘‘తనకు తూటా తగిలిందని రొనాల్డ్ మాకు ఫోన్ చేసి చెప్పారు. మేం వెళ్లి విస్తృత స్థాయిలో విచారణ జరిపాం. రొనాల్డ్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న పరికరం కారణంగానే గన్ పేలినట్లు గుర్తించాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు’’ అని స్థానిక పోలీసు విభాగం ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించింది.

అయితే, ఆ గన్ అనుకోకుండా ఎలా పేలిందనే విషయం ఇంకా తెలియరాలేదు.

హ్యాండ్ గన్స్

ఫొటో సోర్స్, Reuters

ఇంట్లో మరిన్ని అనుమానాస్పద పరికరాలను పోలీసులు గుర్తించారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్ సాయంతో వాటిని వారు పరిశీలిస్తున్నారు.

గతంలోనూ ఇలా ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న ఉచ్చుల కారణంగా వ్యక్తులు చనిపోయిన ఘటనలు అమెరికాలో చోటుచేసుకున్నాయి.

అమెరికాలో ఇలాంటి ఉచ్చులు పూర్తిగా చట్ట విరుద్ధం. వీటిని ఏర్పాటు చేసుకునేవారిపై అధికారులు చర్యలూ తీసుకుంటున్నారు.

ఇలాంటి ఉచ్చుల బారిన పడ్డ చొరబాటుదారులకు.. ఇళ్ల యజమానులే పరిహారం చెల్లించేలా గతంలో కోర్టులు తీర్పునిచ్చిన సందర్భాలు ఉన్నాయి.

తమ ఇంటిని కాపాడుకునే హక్కు వ్యక్తులకు ఉన్నప్పటికీ, చొరబాటుదారుడికి శిక్షను నిర్ణయించే అధికారం యజమానికి లేదని కోర్టులు స్ఫష్టం చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)