విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సూపర్ చేజింగ్... వెస్టిండీస్ ఔట్

భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images

  • గువహటి వన్డేలో భారత్ వెస్టిండీస్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.
  • కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే కెరీర్లో 36వ సెంచరీ చేశాడు.
  • రోహిత్ శర్మ వన్డే కెరీర్లో 20వ సెంచరీ చేశాడు. 152 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
  • రెండో వికెట్‌కు కోహ్లీ, రోహిత్ 246 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు.
  • టాస్ గెలిచిన భారత్ వెస్టిండీస్‌ను మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
  • వెస్టిండీస్ నిర్ధారిత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది.
  • బదులుగా భారత్ 42.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసి విజయభేరి మోగించింది.

"70ల నుంచి భారతీయ క్రికెట్‌ ఎంత అదృష్టం చేసుకుందంటే, తర్వాత ప్రతి తరంలో ఒక ఆటగాడు పరుగుల దాహంతో తపించిపోతున్నాడు. ఈ తరంలో ఆ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ".

అసోంలోని గువహటి నగరంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో 36వ సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది.

కోహ్లీని మంజ్రేకర్ మాత్రమే ప్రశంసలతో ముంచెత్తలేదు. సోషల్ మీడియాలో కోహ్లీపై కాంప్లిమెంట్స్ వెల్లువెత్తాయి. ట్విటర్‌లో కోహ్లీ టాప్ ట్రెండ్‌గా నిలిచాడు.

అయినా, విరాట్ కోహ్లీ ఎప్పుడు బ్యాటింగ్ చేస్తున్నా, కొన్నిమాత్రం చాలా మామూలుగా జరిగిపోతాయి. ముఖ్యంగా వన్డేల్లో... ఎదురుగా ఉన్నది వెస్టిండీస్ లాంటి అనుభవం లేని బలహీన జట్టైనా, లేక ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా లాంటి గట్టి జట్లయినా అద్భుతాలు అలా జరిగిపోతాయి.

మైదానంలో కోహ్లీ చేతుల్లో బ్యాట్ ఉన్నంతవరకూ, స్టేడియంలో ఇండియా అనే అరుపులు ఆకాశాన్నంటుతాయి. ప్రేక్షకుల్లో భారత్ విజయంపై ధీమా ఉంటుంది.

ప్రత్యర్థి బౌలర్లు బెదిరిపోతారు, ఫీల్డర్లను ఎక్కడ పెట్టాలో తెలీక కెప్టెన్ దిగులుపడిపోతాడు.

భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images

కామెంటరేటర్లు జోరుగా ఉంటారు. కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చే ఆ షాట్లను ఎలా వర్ణించాలో తెలీక కాస్త కన్‌ఫ్యూజ్ కూడా అవుతుంటారు.

కోహ్లీ కల్లోలం

ఐసీసీ ర్యాంకింగ్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ అయిన కోహ్లీకి భారత్‌లో ఇది 15వ సెంచరీ. కెప్టెన్‌గా 14వ శతకం. వెస్టిండీస్‌పై ఐదోది. ఒక భారతీయ బ్యాట్స్‌మెన్ కరిబియన్ జట్టుపై చేసిన సెంచరీల్లో అత్యధికం ఇదే.

లక్ష్యం చూసి కోహ్లీ పెద్దగా టెన్షన్ పడలేదు. చెప్పాలంటే స్కోర్ చేజ్ చేస్తున్నప్పుడు తను ఎప్పుడూ ఒత్తిడిలో కనిపించడు. కోహ్లీ 36 సెంచరీల్లో 22 చేజింగ్‌లోనే చేయడం దాన్ని నిరూపిస్తుంది.

ఆసియా కప్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత కోహ్లీ వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో తిరిగి జట్టుతో కలిశాడు. జులై 17 తర్వాత కోహ్లీ మొదటి సారి ఈ వన్డేలోనే ఆడాడు. కానీ ఈ ఫార్మాట్‌లో ఫిట్ కావడానికి కోహ్లీకి టైం పడుతుందని ఎక్కడా అనిపించలేదు.

భారత్ విజయం

ఫొటో సోర్స్, NURPHOTO

29 ఏళ్ల కోహ్లీ క్రీజులోకి వచ్చినపుడు, భారత్ శిఖర్ ధవన్ రూపంలో 10 పరుగులకే తన తొలి వికెట్ కోల్పోయింది. కానీ కోహ్లీ ఆగుతాడా? వెస్టిండీస్ బౌలర్లను ఉతికారేశాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకు నచ్చిన షాట్లు ఆడాడు. ఫీల్డర్లను మైదానమంతా పరుగులు పెట్టించాడు.

కోహ్లీ 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత కాస్త గేరు మార్చి కాసేపు వేగం తగ్గించాడు. కానీ రోహిత్ శర్మతో కలిసి రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. 27వ ఓవర్లో రోచ్ బంతికి ఫోర్ కొట్టిన విరాట్ తన 36వ సెంచరీ పూర్తి చేశాడు.

2018లో కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ. ఇంతకు ముందు తను మూడు సెంచరీలు జనవరిలో దక్షిణాఫ్రికాపై చేశాడు.

కోహ్లీ వరుసగా మూడోసారి క్యాలెండర్ ఇయర్‌లో 2 వేలకు పైగా పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ (1996-98), మాథ్యూ హెడన్ (2002-04), జో రూట్(2015-17) తర్వాత ఆ ఘనత అందుకున్న నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

భారత్ విజయం

ఫొటో సోర్స్, AFP

రోహిత్ మెరుపులు

అభిమానులు హిట్‌మ్యాన్‌గా పిలుచుకునే రోహిత్ శర్మ కెప్టెన్ కోహ్లీకి అండగా నిలిచాడు. అతడితో కలిసి 246 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన రోహిత్, కోహ్లీ అవుటైన తర్వాత స్టీరింగ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. గ్రౌండ్ నలువైపులా అద్భుతమైన షాట్లు కొట్టాడు.

రోహిత్ శర్మ 117 బంతుల్లో 152 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సిక్స్ కొట్టి భారత్‌కు విజయం అందించాడు. రోహిత్ తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు.

వెస్టిండీస్ ఇన్నింగ్స్

అంతకు ముందు వెస్టిండీస్ ఫ్లాట్ వికెట్‌పై బ్యాటింగ్ చేసే అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకుంది. హెట్‌మెయర్ 78 బంతుల్లో 106 పరుగులు చేశాడు.

వెస్టిండీస్ నిర్ధారిత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో యజువేంద్ర చాహల్ బ్యాట్స్‌మెన్లను కాస్త కట్టడి చేయగలిగాడు. 10 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కూడా పడగొట్టాడు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)