‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలా ప్రకటిస్తుంది? అందుకు పాటించే విధానాలేమిటి?

భద్రతా మండలి

ఫొటో సోర్స్, Getty Images

మౌలానా మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకుంటూ వస్తోంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో మసూద్ అజర్‌ను ఉగ్రవాది ప్రకటించాలన్న భారత్ అభ్యర్థనను వ్యతిరేకిస్తున్న ఏకైక దేశం చైనా మాత్రమే.

మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలని భారత్ చేస్తున్న అభ్యర్థనను చైనా భద్రతా మండలిలో రెండు సార్లు వ్యతిరేకించింది. మొదట ఆర్నెల్లపాటు అడ్డుకున్న చైనా, రెండోసారి మూడు నెలల పాటు భారత ప్రయత్నాలను నీరుగార్చింది.

అందుకే, పాకిస్తాన్‌లో ఉన్న మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి టెర్రరిస్టుల జాబితాలో చేర్చాలని ఇప్పుడు భారత్ కొత్తగా మరోసారి కోరాల్సి ఉంటుంది.

అయితే, అసలు ఐక్యరాజ్య సమితి ఒకరిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఎలా ప్రకటిస్తుంది? అలా ప్రకటించేందుకు ఏఏ ప్రమాణాలు పాటిస్తుంది?

తీవ్రవాద సంస్థలు లేదా వ్యక్తులను జాబితాలో చేర్చే పని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 1267 కమిటీది.

1267 కౌంటర్ టెర్రరిజం కమిటీ ఏం చేస్తుంది?

  • టెర్రరిస్ట్ సంస్థలపై ఆంక్షలు, చర్యల అమలును ఇది పర్యవేక్షిస్తుంది
  • తీర్మానాల జాబితాలో ఉన్న నిబంధనల ప్రకారం తగిన వ్యక్తులు, సంస్థలను సూచిస్తుంది
  • ఐఎస్ఐస్, అల్-ఖైదా (ఈ రెండు సంస్థలకు సంబంధం ఉందని తేలినప్పుడు) ఆంక్షల జాబితా నుంచి పేర్లను చేర్చడం, తొలగించడం గురించి వచ్చే అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, వాటిపై నిర్ణయం తీసుకుంటుంది
  • ఐఎస్ఐఎస్, అల్-ఖైదా ఆంక్షల జాబితాలో చేర్చే వ్యక్తులు, సంస్థల గురించి ప్రత్యేక సమీక్షలను నిర్వహిస్తుంది
  • ఆయా సంస్థలు, వ్యక్తులపై పర్యవేక్షణ బృందం సమర్పించిన నివేదికలను పరిశీలిస్తుంది
  • ఆంక్షలు అమలు చేయడం గురించి ఏటా భద్రతా మండలికి నివేదిక ఇస్తుంది

1267 కమిటీ ఆంక్షల రకాలు

  • ఈ జాబితాలో ఉన్న సంస్థలు, వ్యక్తులు ఆయుధాలను వినియోగించటంపై నిరోధం ఉంటుంది
  • వారి ప్రయాణాలపై నిషేదం ఉంటుంది
  • ఆయా సంస్థలు, వ్యక్తుల ఆస్తుల స్వాధీనం చేసుకుంటుంది
  • ఈ చర్యలకు తుదిగడువు ఏదీ ఉండదు
  • ఈ ఆంక్షలు, చర్యలను 18 నెలలకొకసారి సమీక్షిస్తారు

జాబితాలో ఎంతమంది ఉన్నారు?

భద్రతా మండలి 1267 కౌంటర్ టెర్రరిజం కమిటీలో ఇప్పటివరకూ 257 మంది వ్యక్తులు, 81 సంస్థలను నమోదు చేశారు.

భద్రతా మండలి

ఫొటో సోర్స్, AFP

జాబితాలో నమోదుకు పాటించే ప్రమాణాలు

ఒక వ్యక్తి లేదా సంస్థకు ఐఎస్ఐఎస్ లేదా అల్-ఖైదాతో సంబంధం ఉన్నట్టు సూచించే ఏవైనా చర్యలు, లేదా కార్యకలాపాలకు పాల్పడితే వారు ఐఎస్ఐస్, అల్-ఖైదా ఆంక్షల జాబితాలో చేర్చడానికి అర్హులు అవుతారు.

ఐఎస్ లేదా అల్-ఖైదా తరఫున పనిచేయడం, లేదా వారికి సహకరించడం, వారికి, లేదా సంబంధిత విభాగాలకు ఆయుధాల సరఫరా, అమ్మకం, బదిలీ చేసినా, వారి కోసం పెట్టుబడులు పెట్టినా, ప్రణాళికలు రూపొందించినా ఈ జాబితాలో చేరుస్తారు. ఆ సంస్థల కోసం లేదా వాటి అనుబంధ సంస్థల కోసం ఎవరినైనా రిక్రూట్ చేసుకున్నా వారిని జాబితాలో చేరుస్తారు.

కమిటీ జాబితాను ఎలా నిర్ణయిస్తుంది?

1267 కౌంటర్ టెర్రరిజం కమిటీ ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక ప్రత్యేక అంశంపై ఏకాభిప్రాయం సాధించలేకపోతే, కమిటీ అధ్యక్షుడు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించవచ్చు. అప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేకపోతే, ఆ అంశాన్ని భద్రతా మండలికి సమర్పించవచ్చు.

సాధారణంగా, ఏ అభ్యంతరాలూ లేనట్లయితే ఐదు రోజుల్లో నిర్ణయాలు తీసుకోవచ్చు. పేర్ల నమోదుకు, తీసివేయడానికి నో అబ్జక్షన్ ప్రక్రియ పది రోజుల వరకూ పడుతుంది.

ప్రతిపాదిత నిర్ణయాన్ని ఎలాంటి కాల పరిమితి లేకుండా సభ్యులు హోల్డులో ఉంచవచ్చు. అయితే పెండింగులో ఉన్న అంశాన్ని పరిష్కరించడానికి మూడు నెలల తర్వాత అప్ డేట్స్ అందించాలని అభ్యర్థించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)