ఇండియా జీడీపీ: Q4లో 3.1 శాతానికి పడిపోయిన జాతీయోత్పత్తి.. కరోనా దెబ్బతో మరింత కుదేలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిధి రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రేటు జనవరి నుంచి మార్చి వరకు ముగిసిన త్రైమాసికంలో 3.1 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ వెల్లడించింది.
అలాగే.. 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 4.2 శాతంగా ప్రకటించింది. ఇది 2018-2019 ఆర్ధిక సంవత్సరంలో 6.1 శాతంగా నమోదైంది.
ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సూచిస్తుంది.
2011-12 స్థిర ధరలతో పోల్చినప్పుడు 2019-20 నాలుగో త్రైమాసికం (Q4) లో జీడీపీ రూ. 38.04 లక్షల కోట్లనీ, అదే 2018-19 చివరి త్రైమాసికంలో అది రూ. 36.90 లక్షల కోట్లుగా ఉందని, మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దీని ప్రకారం జనవరి నుంచి మార్చి వరకు ఉన్న చివరి త్రైమాసికంలో 3.1 వృద్ధిరేటు నమోదైనట్లు చెప్పింది.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొన్నేళ్ల పాటు నెమ్మదించవచ్చని 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, జనవరి-మార్చి త్రైమాసికం సమయంలో పలువురు విశ్లేషకులతోపాటు, రేటింగ్ ఏజెన్సీలు కూడా చెప్పాయి.జనవరి-మార్చి త్రైమాసికం జీడీపీ గణాంకాలు ఈ రోజు విడుదలయ్యాయి.
అయితే.. ఎనిమిది కీలక రంగాల వృద్ధిరేటు సూచికలో కూడా భారీ క్షీణత కనిపించింది. ఈ ఏడాది మార్చిలో 9 శాతం క్షీణత చూపించిన ఈ వృద్ధిరేటు, ఏప్రిల్ మాసానికి వచ్చేసరికి 38.1 శాతం పడిపోయింది.
ఈ ఎనిమిది కీలక రంగాలలో జనవరి 2020 నాటికి తుది వృద్ధి రేటు 2.2%లో ఎలాంటి మార్పు లేదు.

ఫొటో సోర్స్, Getty Images
"ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన భారత్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో బలమైన చర్యలను చేపట్టింది. కానీ మార్చిలో దేశవ్యాప్తంగా మొదలైన లాక్‌డౌన్ ఆ వృద్ధిని తీవ్రంగా తగ్గించింది" అని ఇటీవల రాయిటర్స్ పోల్‌లో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.భారత ఆర్థికవ్యవస్థ ఏడాది కిందట మార్చితో ముగిసిన త్రైమాసికంలో 2.1 శాతం పెరిగిందని, 2012 నుంచి అది అత్యంత బలహీనంగా ఉందనే విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ 52 మంది ఆర్థిక వేత్తలతో నిర్వహించిన ఈ పోల్ చెప్పింది.
కరోనా మహమ్మారి దేశాన్ని తాకకముందే భారత ఆర్థికవ్యవస్థ క్షీణిస్తూ వచ్చింది. సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన లాక్‌డౌన్ ఆసియాలోని మూడో అతిపెద్ద మార్కెట్‌లో దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయేలా చేసింది.2019 ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతం వరకూ పెరిగిన భారత జీడీపీ 2019-20 అక్టోబర్-నవంబర్‌లో 7 ఏళ్ల కనిష్టానికి 4.7 శాతానికి పడిపోయింది.ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 1.2 శాతం పెరిగిందని అంచనా వేసినట్టు ఒక ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు చెప్పింది. ఇది బహుశా అతి తక్కువ వృద్ధి అంచనా.మార్చి నెలలో చివరి వారం రోజుల పాటు ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా రద్దు కావడంతో నాలుగో త్రైమాసికం(2020 ఆర్థిక సంవత్సరం)లో వృద్ధి దాదాపు 1.2 శాతం ఉంటుందని తాము భావిస్తున్నామని ఆ రీసెర్చ్ రిపోర్టులో చెప్పారు.
లాక్‌డౌన్ విధించిన ఆ ఏడు రోజుల్లో దాదాపు 1.4 లక్షల కోట్లు నష్టం వచ్చిందని ఆ నివేదిక తెలిపింది. తర్వాత, అంతకు ముందు అంచనా 5 శాతంతో పోలిస్తే, 2020 ఆర్థిక సంవత్సరం వార్షిక జీడీపీ గ్రోత్ దాదాపు 4.2 శాతం ఉంటుందని నివేదిక చెప్పింది.
తాజాగా గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసిన గణాంకాలలో జీడీపీ వార్షిక వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదు కాగా... చివరి త్రైమాసికంలో అది 3.1శాతంగా తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
జీడీపీ వృద్ధిపై ప్రభావం
ఎస్బీఐ నివేదికలో రాష్ట్రాలవారీ విశ్లేషణ జీడీపీలో 75 శాతం నష్టాలకు దేశంలోని అగ్ర రాష్ట్రాలే కారణం అని చెబుతోంది. ఇందులో మహారాష్ట్రకు 15.6 శాతం, తమిళనాడుకు 9.4 శాతం, గుజరాత్‌కు 8.6 శాతం వాటా ఉంది.
నోమురా, హెచ్ఎస్‌బీసీ, ఐసీఆర్ఏ, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూహరిటీస్ లాంటి ఎన్నో ఏజెన్సీలు జీడీపీ గురించి భయంకరమైన అంచనాలను వెల్లడించాయి.
మూడు దశాబ్దాలలో మొదటిసారి ప్రస్తుత సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ నెగటివ్ గ్రోత్ టెరిటరీలోకి వెళ్లబోతోందని చాలామంది ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ సంకోచం ఎంత వరకూ ఉండచ్చు అనేదానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి.
లాక్‌డౌన్ వల్ల వివిధ రంగాలపై పడిన ప్రభావం విషయానికి వస్తే, తయారీ, సేవల రంగాలు ఎక్కువగా దెబ్బతింటే, వ్యవసాయం దయ తలిచింది అనుకోవచ్చు.
వివిధ రంగాలలో పైకి లేచినవి వ్యవసాయ రంగం, ప్రభుత్వ వ్యయం మాత్రమే అని కేర్ రేటింగ్స్ చెప్పింది. “డిమాండ్ నెమ్మదించడం, ఎగుతులు పడిపోవడం వల్ల కూడా జీడీపీ గ్రోత్ మీద ప్రభావం పడింది” అని కేర్ రేటింగ్స్ ఆర్థిక వేత్త డాక్టర్ రుచా రనదివె చెప్పారు.
మార్చి చివరి వారంలో లాక్‌డౌన్ అమలు చేశారు, కాబట్టి జీడీపీ గణాంకాలు క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించకపోవచ్చు అని ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
“చివరి త్రైమాసికంలో వచ్చిన అరుదైన వృద్ధి, ఇప్పటికీ తక్కువగా ఒక అంకెలో ఉండచ్చు. అయితే, ప్రస్తుత త్రైమాసికం అంకెలు ఆర్థిక వ్యవస్థలో అసలైన దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి” అని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ జోసెఫ్ థామస్ చెప్పారు.

ప్రభుత్వ చొరవ, సవాళ్లు
ఆర్థికవ్యవస్థకు ఊపిరిలూదేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఆత్మనిర్భర భారత్ అభియాన్’ ప్యాకేజీ ద్వారా 20 లక్షల కోట్లు ప్రకటించింది. ఈ ప్యాకేజీ జీడీపీలో 10 శాతం అని, దీనివల్ల కార్మికులకు, ఎంఎస్ఎంఈలకు, రైతులకు, కుటీర పరిశ్రమలకు ప్రయోజనం లభిస్తుందని ప్రభుత్వం చెప్పింది. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ద్రవ్య లభ్యత చర్యలు కూడా ఈ ప్యాకేజీలో భాగమే. ఈ ప్యాకేజీతోపాటూ పేదలకు నగదు బదిలీ, ఆహార ధాన్యాలు కూడా ప్రభుత్వం అందిస్తోంది. ఆర్థికవ్యవస్థ కోలుకోడానికి ప్రభుత్వం మరిన్ని చేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
“మనం ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న వాహన, వాహన సహాయక, గృహ, నిర్మాణ, రంగాల కోసం నిర్దిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది” అని ఐఎఫ్ఏ గ్లోబల్ సీఈఓ, ఫౌండర్ అభిషేక్ గోయెంకా చెప్పారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తయారీ రంగాన్ని పునరుద్ధరించడం దానికి సవాలుగా నిలిచింది.
కరోనా మహమ్మారి ఆర్థికవ్యవస్థపై దెబ్బ కొట్టక ముందు నుంచే, తయారీ కార్యకలాపాలు పడిపోవడం అనే సమస్యను దేశం ఎదుర్కుంటోంది. పారిశ్రామిక ఉత్పత్తి(ఐఐపీ) మార్చిలో 16.7 శాతానికి కుదించుకుపోగా, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వివరాల ప్రకారం దేశంలో నిరుద్యోగం రేటు మార్చిలో 8.75 నుంచి ఏప్రిల్లో ఎప్పుడూ లేనంత కనిష్టానికి 23.5 శాతానికి పడిపోయింది. నిరుద్యోగం రేటు గత ఏడాది 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో ఉంది. గత ఏడాది చివర్లో 8 ప్రధాన రంగాల నుంచి వచ్చిన పారిశ్రామిక ఉత్పత్తి గత 14 ఏళ్లలో లేనంత ఘోరంగా 5.2 శాతానికి పడిపోయింది. నగదు వినియోగించే అనధికారిక ఆర్థికవ్యవస్థను దెబ్బకొట్టే లక్ష్యంతో 2016లో వివాదాస్పద నోట్ల రద్దు తర్వాత చిన్న వ్యాపారాలు అప్పుడప్పుడే కోలుకోవడం ప్రారంభించాయి.
ఇవి కూడా చదవండి:
- ఆర్థిక వృద్ధి అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి
- పాకిస్తాన్ నుంచి మిడతల దండు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వైపు వచ్చేస్తోందా
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో ఆమె ఇంటికి క్యూ కట్టిన రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు
- పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం ఎలా
- కరోనావైరస్: అంటార్కిటికాలో మైనస్ 40 డిగ్రీల చలిలో ‘భారతి మిషన్’ పరిశోధకులు ఎలా ఉన్నారు?
- వలస కూలీల కష్టాలపై స్పందించిన సుప్రీంకోర్టు.. సుమోటోగా విచారణ.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు
- లాక్‌డౌన్ సడలిస్తే మనకు ముప్పు తప్పదా
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది
- ప్రధాని మోదీ ఏడాది కిందట కాళ్లు కడిగిన పారిశుద్ధ్య మహిళలు ఈ లాక్‌డౌన్ కాలంలో ఎలా ఉన్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








