కేంద్ర బడ్జెట్ 2026: ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏవి పెరుగుతాయి?

ఫొటో సోర్స్, ANI
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
కేంద్ర బడ్జెట్ అనగానే ఉద్యోగులు, ఆదాయ పన్ను మినహాయింపుల కోసం చూస్తే, సామాన్య ప్రజలు, గృహిణులు బడ్జెట్‌లో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అని చూస్తారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో తయారీ, ఎగుమతి, గ్రీన్ ఎనర్జీకి ఉపశమనం లభించింది. మరోవైపు స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పెట్టుబడులు, లావాదేవీలపై పన్ను విధించారు.
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 17 ఔషధాలపై ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తొలగించింది. దీని వల్ల భారత మార్కెట్‌లో ఈ మందులు చౌకగా లభిస్తాయి.
7 అరుదైన వ్యాధుల చికిత్స కోసం విదేశాల నుండి దిగుమతి చేసుకునే మందులపై సుంకాన్ని కూడా ప్రభుత్వం తొలగించింది.
ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి సంబంధించిన కొన్ని పరికరాలపై సుంకాన్ని తగ్గించారు.
ఇది సాధారణ వినియోగదారులు, రోగులు, పెట్టుబడిదారులు, పరిశ్రమలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
అయితే బడ్జెట్‌లో పన్నులకు సంబంధించి ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు. అసలు వాటి గురించి ఎలాంటి విధానపరమైన ప్రకటన చేయలేదు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యం దిశగా ముందుకు సాగడంలో ఈ బడ్జెట్ చాలా ముఖ్యమైనదని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.
అమెరికాలోకి దిగుమతయ్యే భారత ఉత్పత్తులపై అమెరికా 50శాతం సుంకాలు విధిస్తోంది. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. బడ్జెట్ వీటన్నింటిపైనా దృష్టి సారించింది.


ఫొటో సోర్స్, Getty Images
అందుబాటు ధరల్లో చికిత్స, మందులు
ఈ బడ్జెట్ ద్వారా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు, వారి కుటుంబాలపై చికిత్స ఖర్చుల భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది.
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే, ప్రాణాలను రక్షించే 17 ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు.
ఏడు అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే దిగుమతి చేసుకున్న మందులు, ప్రత్యేక ఆహారంపై గతంలో ఉన్న పన్నులను రద్దు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశీయ తయారీ, ఎగుమతులపై ఉపశమనం
- మైక్రోవేవ్ ఓవెన్లకు అవసరమైన కొన్ని భాగాలపై కస్టమ్స్ సుంకాలను తగ్గించారు.
- సముద్ర ఆహార ఎగుమతులకు సుంకం లేని ఇన్‌పుట్ పరిమితిని 1 శాతం నుంచి 3 శాతానికి పెంచారు.
- తోలు, సింథటిక్ పాదరక్షలు, వస్త్రాల ఎగుమతులకు గడువు పొడిగించారు. దీని కారణంగా మార్కెట్‌లో వాటి రేటు తగ్గుతుంది.
- 2035 వరకు అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే పరికరాలపై కస్టమ్ సుంకం ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images
ఈవీ, సౌరశక్తి, గ్రీన్ ఎనర్జీ చౌకగా మారే అవకాశం
ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై పన్నులను తగ్గించే ప్రయత్నం చేసింది.
లిథియం-అయాన్ బ్యాటరీ నిల్వ వ్యవస్థలకు సంబంధించిన అనేక ఇన్‌పుట్‌లను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు.
సౌర ఫలకాల తయారీలో ఉపయోగించే సౌర గాజుకు ముడి పదార్థం సోడియం యాంటిమోనేట్‌పై సుంకం తొలగించారు.
దీనివల్ల విద్యుత్ వాహనాలు, సౌరశక్తి, బ్యాటరీ రంగాలలో ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి.
అయితే, ఈ ప్రయోజనాలు కస్టమర్లకు చేరుతాయా లేదా అనేది కంపెనీల విధానాల ద్వారా తేలనుంది.
బడ్జెట్‌లో ప్రకటనల వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. అయితే ఆ ప్రయోజనం వినియోగదారుడికి కంపెనీలు అందిస్తాయా అనేది చూడాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
వ్యక్తిగత దిగుమతులు, విదేశీ వ్యయాలపై ఉపశమనం
వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్ సుంకాన్ని 20 శాతం నుంచి 10శాతానికి తగ్గించారు.
ఇకపై విదేశాల నుంచి తెప్పించుకునే ఎలక్ట్రానిక్స్ లేదా బహుమతి వస్తువులు గతంలో కంటే చౌకగా మారతాయి.
విదేశీ ప్రయాణాల కోసం టూర్ ప్యాకేజీలపై ట్యాక్స్ ఎట్ సోర్స్ వద్ద వసూలు చేసే పన్నును 2 శాతానికి తగ్గించారు.
పిల్లల చదువు, చికిత్స కోసం విదేశాలకు పంపే రూ. 10 లక్షలకు మించి డబ్బుపై టీసీఎస్ 5శాతానికి బదులు 2 శాతమే విధించనున్నారు.
పర్యటకం లేదా చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే వస్తువుల ధరలు పెరిగాయి?
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ గతంలో కంటే ఖరీదైన వ్యవహారంగా మారనుంది.
ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్నును ప్రభుత్వం పెంచింది.
ఆప్షన్స్ ప్రీమియంలపై సెక్యూరిటీస్ లావాదేవీ పన్ను పెరిగింది. దీనివల్ల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాలలో ట్రేడింగ్ మరింత ఖరీదైనదిగా మారనుంది.
ఇప్పుడు ప్రమోటర్లు మూలధన లాభాల పన్నుతో పాటు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి కొన్ని రసాయనాలు, కొన్ని వినియోగ వస్తువులపై గతంలో అందుబాటులో ఉన్న కస్టమ్ సుంకం మినహాయింపుల్ని ఎత్తివేశారు.
వీటిపై ఇప్పుడు ఏడున్నర శాతం వరకు ప్రైమరీ కస్టమ్స్ డ్యూటీ అమల్లోకి రానుంది.
రసాయనాల ధరలు పెరగడం వల్ల వాటితో తయారైన ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడవచ్చు.
మొత్తం మీద బడ్జెట్ 2026లో ఖనిజాలు, స్క్రాప్, మద్యం ఖరీదైనవిగా మారాయి.
తోలు, వస్త్రాలు, సింథటిక్ పాదరక్షలు, విదేశీ ప్రయాణం, 17 రకాల క్యాన్సర్ మందులు, మైక్రోవేవ్ ఓవెన్లు, విమాన తయారీకి సంబంధించిన వస్తువులు, ఈవీ బ్యాటరీలు, మధుమేహ మందులు మొదలైనవి చౌకగా మారుతాయని భావిస్తున్నారు.
ఈసారి ప్రభుత్వం ఉత్పత్తి, వినియోగాన్ని చౌకగా చేయడంతో పాటు ఆర్థిక లావాదేవీలను ఖరీదైనదిగా చేసే మార్గాన్ని ఎంచుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగ విశ్లేషణ ద్వారా స్పష్టమవుతోంది.
బడ్జెట్ తర్వాత ఖరీదైనవిగా మారే ఉత్పత్తులు, కార్యకలాపాలలో స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్-ఆప్షన్స్ ట్రేడింగ్ ఉన్నాయి.
బడ్జెట్ తర్వాత వైద్య ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం, విద్యపై పన్నులు తగ్గుతాయి.
రోజువారీ జీవితంలో ఉపయోగించే అనేక ఎలక్ట్రానిక్, ఇంధన సంబంధిత ఉత్పత్తులు చౌకగా మారవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














