అభిప్రాయం: ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్సును చూసి ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేస్తారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్లావియా ఆగ్నెస్
- హోదా, బీబీసీ కోసం
‘తలాక్’ అని మూడు సార్లు చెప్పి విడాకులివ్వడం నేరమని, దానికి మూడేళ్ల దాకా జైలు శిక్ష విధించాలని సిఫారసు చేస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఈ ఆర్డినెన్స్ కల్పించే ప్రయోజనాలను వివరిస్తూ కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ విషయాలను గమనిస్తే, 2017 డిసెంబరులో లోక్‌సభలో ఆమోదించిన బిల్లును కొంత నీరుగార్చి ఈ ఆర్డినెన్సును రూపొందించినట్టు కనిపిస్తోంది.
మొదట రూపొందించిన బిల్లులో ‘ట్రిపుల్ తలాక్’ చెప్పిన ముస్లిం భర్తపై భార్య మాత్రమే కాకుండా ఎవరైనా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండేది. కానీ గిట్టని వాళ్లు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందంటూ రాజ్యసభలో చర్చ జరిగింది. దాంతో భార్య లేదా ఆమె బంధువులకు మాత్రమే ‘తలాక్’ ఇచ్చిన భర్తపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఆర్డినెన్సులో మార్పులు చేశారు.
కొందరు వ్యతిరేకించినప్పటికీ, ‘ట్రిపుల్ తలాక్’ చెప్పిన వారికి బెయిల్ ఇచ్చేందుకు వీలు లేకుండా ఆర్డినెన్సు రూపొందించారు. కానీ, భార్యను సంప్రదించాక ఆమె అంగీకరిస్తే మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసేందుకు వెసులుబాటు కల్పించారు.
ఒకవేళ దంపతుల మధ్య సయోధ్య కుదిరితే, మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించి రాజీ కుదుర్చుకునే అవకాశాన్ని కల్పించారు.
మొదట లోక్‌సభలో ఆమోదించిన బిల్లులో ఈ వెసులుబాట్లేవీ లేవు. కానీ రాజ్యసభలో దీనిపై తీవ్రంగా వాదనలు జరిగిన అనంతరం ప్రభుత్వం బిల్లులో మార్పులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఆర్డినెన్సుల ద్వారా చట్టాల్ని రూపొందించే మార్గాన్ని ఎంచుకుంటుంది. అలాంటిది ఈ బిల్లు విషయంలో ఎందుకు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుందనేది చాలామందికి కలుగుతోన్న సందేహం. దీని వెనుక దాగున్న రాజకీయ ప్రయోజనాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2019 సాధారణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అత్యవసరంగా ఈ ఆర్డినెన్సును తీసుకొచ్చారని కొందరు అంటున్నారు. ఈ పరిణామం వల్ల ముస్లిం మహిళలు మోదీని తమ రక్షకుడిగా భావిస్తారని, ముస్లిం వర్గాల్లో ఉన్న మోదీ వ్యతిరేక సెంటిమెంట్లు కూడా దూరమవుతాయని వాళ్లు చెబుతున్నారు.
కానీ అలాంటి అంచనాలపైన నాకు కొన్ని సందేహాలున్నాయి. ఆచరణలో ఎలాంటి మార్పూ కనిపించనప్పుడు, తమ సొంత వర్గ సెంటిమెంట్లకు వ్యతిరేకంగా మహిళలు ఏ పార్టీకైనా ఓటు వేయాలని ఎందుకనుకుంటారు? ప్రస్తుతం ఉన్న చట్టాలకు భిన్నంగా ముస్లిం మహిళలకు ఈ ఆర్డినెన్సు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తుంది?
వాళ్ల ఆర్థిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు మారవు కదా. భర్తలు వాళ్లను పూర్తిగా దూరం చేయకుండా ఆర్డినెన్సులు ఆపలేవు కదా.
మరో పక్క ఈ ఆర్డినెన్సు వల్ల మహిళలకు ఏ దిక్కూ లేకుండా పోయే ప్రమాదమూ ఉంది. ‘ట్రిపుల్ తలాక్’ చెప్పి భర్త జైలు పాలైతే, భార్యా, పిల్లలకు ఎలాంటి భరోసా ఉండదు. ఆఖరికి వాళ్ల వైవాహిక బంధం కూడా నిలబడదు.

ఫొటో సోర్స్, Getty Images
వైవాహిక జీవితంలో సమస్యలుంటే ఏ భార్య అయినా ఆర్థిక భరోసా కోరుకుంటుంది కానీ భర్తను జైలుకు పంపించాలని అనుకోదు. కాబట్టి ఈ ఆర్డినెన్సు విషయంలో ప్రభుత్వ సమీకరణాలు తప్పినట్లు కనిపిస్తున్నాయి.
చదువులేని పేద మహిళలు ఓ పక్క బతకడానికి పోరాడుతూ, మరో పక్క భర్తకు శిక్ష పడేలా చేసేందుకు న్యాయస్థానంలో పోరాడటం సాధ్యమా? ఒకవేళ భర్తకు శిక్ష పడినా దానివల్ల ఆ మహిళకు ఒరిగేదేంటి? ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు పదేళ్లు శిక్ష పడినా కూడా ఆమెకూ, పిల్లలకు తిండీ, బట్టలూ దొరకవు కదా. ఏ మహిళ అయినా పిల్లల భవిష్యత్తుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. భర్తకు శిక్ష పడినంత మాత్రాన ఆ భవిష్యత్తుకు భరోసా దొరకదు.
ముస్లిం మహిళల జీవితాలకు భరోసా కల్పించనంత వరకూ, ట్రిపుల్ తలాక్‌ను నేరాల జాబితాలో చేర్చినా వాళ్ల సమస్యలు తీరవు.

ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం కోర్టు గతంలోనే ప్రకటించింది. చట్టబద్ధం కాని విషయంపై ఆర్డినెన్సును తీసుకొస్తే అది న్యాయ పరీక్షలో ఎలా నిలబడుతుందని చాలామంది న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే దాదాపు ప్రతి ఉత్తరాది రాష్ట్రంలో ముస్లింలు ‘గోరక్షకుల’ చేతిలో హత్యకు గురయ్యారు. వాటిపైన ప్రధాని పెద్దగా స్పందించింది లేదు. ‘లవ్ జిహాద్’ ముసుగులో హిందూ యువతిని పెళ్లి చేసుకున్న ముస్లింలు హత్యకు గురయ్యారు. ‘టెర్రరిస్టులు’ అన్న అనుమానంతో ముస్లింలను నిర్బంధించడం చాలా కాలంగా జరుగుతున్న ప్రక్రియే. ఈ నేపథ్యంలో... ‘మోదీ ముస్లిం మగవాళ్లను ద్వేషిస్తారు. కానీ, ముస్లిం మహళలను ప్రేమిస్తారు’ అనే పాపులర్ జోక్ గుర్తొస్తోంది.
(గమనిక: ఇవి రచయిత్రి ఫ్లావియా ఆగ్నెస్ వ్యక్తిగత అభిప్రాయాలు. ఆమె ముంబయికి చెందిన ప్రముఖ న్యాయ నిపుణురాలు. మహిళా హక్కుల న్యాయవాది)
ఇవి కూడా చదవండి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








