ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు, మంత్రి పదవీ ఇస్తారా?

ఫొటో సోర్స్, Naga Babu/facebook
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పదవిపై ఇప్పటికే స్పష్టత వచ్చింది.
త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసన సభ్యుల కోటాలో కూటమి అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు చేసినట్టు జనసేన ప్రకటించింది.
ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేరిట ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు పేరును పవన్ ఖరారు చేశారనీ, ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని సమాచారం కూడా ఇచ్చారని, నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పవన్ ఆదేశించినట్టు హరిప్రసాద్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ప్రకటన మేరకే
కిందటేడాది డిసెంబర్ 9వ తేదీన రాజ్యసభకు అభ్యర్ధుల పేర్లను వెల్లడించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సరిగ్గా అదే సమయంలో నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ మేరకు స్వయంగా చంద్రబాబు నాయుడు పేరిట టీడీపీ లెటర్ హెడ్‌పై ఓ ప్రకటన విడుదలైంది.
వాస్తవానికి అప్పటి వరకు నాగబాబును రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం బలంగా జరిగింది.
కానీ, నాడు చంద్రబాబు ప్రకటనతో జనసేనకు రాజ్యసభ పోస్టు లేదనీ, దాని బదులు నాగబాబు రాష్ట్ర చట్టసభలోకి ప్రవేశిస్తారని స్పష్టమైంది.
కానీ చంద్రబాబు ప్రకటనపై పవన్ కల్యాణ్, నాగబాబు సహా జనసేన నేతలెవరూ స్పందించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఫొటో సోర్స్, Naga Babu/facebook
సాయిరెడ్డి రాజీనామాతో..
ఇక, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఖాళీ అయిన ఆ పోస్టులోకి తిరిగి నాగబాబు వెళతారనే ప్రచారం మళ్లీ మొదలైంది.
మరోవైపు నాగబాబుకు ఎంపీ కాదు.. ఎమ్మెల్సీ కాదు.. నామినేటెడ్ పదవి ఇస్తారంటూ మీడియాలో ప్రచారం సాగింది.
దీంతో నాగబాబుకు పదవిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ తమ పార్టీ అధినేత పవన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Naga Babu/facebook
‘‘అవును పోటీ చేస్తున్నా’’: నాగబాబు
కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ పరిచయం అక్కరలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ కంటే ఎక్కువ పని చేసిన నాగబాబు.. ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో సైలెంట్ అయ్యారు.
తరువాత జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు పవన్ కల్యాణ్ వెంట నిలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున ఎక్కడా పోటీ చేయని నాగబాబు, 2019లో జనసేన నుంచి నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకి పోటీ చేయాలని నాగబాబు భావించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారని చెబుతుంటారు.
ఆ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, జనసేన వందశాతం స్ట్రైక్ రైట్ సాధించడంతో నాగబాబుకు పదవి ఖాయమనే ప్రచారం ఏడెనిమిది నెలలుగా సాగుతోంది.
తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా పోటీచేస్తున్నట్టు ప్రకటన రావడంపై బీబీసీ నాగబాబును సంప్రదించింది. తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు నాగబాబు బీబీసీకి స్పష్టం చేశారు. మిగిలిన విషయాలు తరువాత మాట్లాడతానని చెప్పారు.

ఫొటో సోర్స్, Naga Babu/facebook
మంత్రి పదవి ఇస్తారా?
గతంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన మేరకు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమని జనసేన శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
నాగబాబు మంత్రి అయితే అన్నదమ్ములిద్దరూ మంత్రులుగా ఉన్న ఏకైక సభగా ఇది గుర్తింపు పొందనుందా.. అనే చర్చ జరుగుతోంది.
ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఒకే కొలువులో మంత్రులుగా ఉండటం గతంలో ఎప్పుడూ లేదు.
ఇక గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో 25 మంది మంత్రులు కొనసాగగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 24 మంది మంత్రులే ఉన్నారు.
ఖాళీగా ఉన్న ఆ ఒక్క మంత్రి పదవిని బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కానుండటంతో ఆ అవకాశం బీజేపీదా, జనసేనదా అనే చర్చ మొదలైంది.

ఫొటో సోర్స్, Naga Babu/facebook
కచ్చితంగా చర్చ నడుస్తుంది : గాలి నాగరాజు
రాజకీయాల్లో తనది ప్రత్యేకశైలి అని చెప్పే పవన్ కల్యాణ్ వారసత్వ రాజకీయాల విషయంలోనూ భిన్నంగా వ్యవహరించాల్సిందని సీనియర్ జర్నలిస్టు గాలి నాగరాజు బీబీసీతో అన్నారు. వారసత్వ రాజకీయాలను తప్పుపట్టే ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేనల వైఖరిపై కచ్చితంగా చర్చ నడుస్తుందని నాగరాజు అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














