బీజేపీపై కేసీఆర్ యుద్ధభేరి: 'గాంధీ కావాలా? గాడ్సే కావాలా?' - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, @TelanganaCMO
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లిం, లౌకికవాద శక్తుల్లో, ముఖ్యంగా యువతలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో వారితో పాటుగా ఉద్యమించేందుకు టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధమయ్యారని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. కేసీఆర్ తన ఉద్యమానికి దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగానే జనవరి 30వ తేదీన మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో 'గాంధీ కావాలా? గాడ్సే కావాలా?' నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ నిర్మిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో బీజేపీ భారీ విజయాలు సాధించడంతో సానుకూల వాతావరణం లేదని గ్రహించి, మౌనం వహించారు.
రాష్ట్రంలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎవరూ ఊహించని విధంగా నాలుగు సీట్లు దక్కాయి. ఆ తర్వాత బీజేపీ రాష్ట్రంలో కార్యకలాపాలను ఉద్ధృతం చేసింది. అందులో భాగంగానే మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాన్ని కూడా హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేశారు. వేలమందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌కు రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. సీఏఏ చట్టంతో ఉత్పన్నమయ్యే సమస్యలను వివరించి, ప్రజల్లో అవగాహన కలిగించాలని, తద్వారా బీజేపీయేతర పక్షాలను ఐక్యం చేయాలని కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
మహబూబ్‌నగర్‌లో ఈ అంశంపై అసదుద్దీన్ ఒవైసీ పెట్టిన సభకు భారీ ఎత్తున స్పందన లభించింది. దీంతో 27న నిజామాబాద్‌లో మరో సభ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ సభకు వచ్చే స్పందనను బట్టి హైదరాబాద్‌లో భారీ సభను కేసీఆర్ ఏర్పాటు చేస్తారు.
సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ కేసీఆర్ జనవరి 30న హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తారు. మహాత్మాగాంధీ కావాలా? గాడ్సే కావాలా? అనే నినాదంతో నిరసన బహిరంగసభను సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
ముస్లిం మత నాయకులు, ప్రతినిధులను దేశం నలు మూలల నుంచి ఆహ్వానించే బాధ్యతను అసదుద్దీన్ ఒవైసీకి అప్పగించారు. టీఆర్‌ఎస్ సభకు సోనియా, మమత, నితీశ్, పినరై విజయన్, హేమంత్ చౌదరిలను ఆహ్వానించనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దేశంలోని 130 కోట్ల మందీ హిందువులే: మోహన్ భాగవత్
''రాజకీయాలు, నాయకులతో ఈ దేశం అభివృద్ధి చెందదు. సమాజంలో మార్పు అవసరం. అందరూ ఒకే తాటిపై నడవాలి. దేశాన్ని తమ మాతృభూమిగా తలచి ఇక్కడి సంస్కృతిని ఆచరించేవారు, సర్వసృష్టిని ఒకటిగా భావించే వారు హిందువులే. సంఘ్ దృష్టిలో దేశంలోని 130 కోట్ల మందీ హిందువులే'' అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నట్లు 'ఈనాడు' ఓ కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఆరెస్సెస్ తెలంగాణ రాష్ట్ర విభాగ మూడు రోజుల విజయ సంకల్ప శిబిరంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సార్వజనికోత్సవంలో భాగవత్ మాట్లాడారు.
సమాజంలో అశాంతిని సృష్టిస్తూ, విధ్వంసాలకు పాల్పడుతూ పేరు, ప్రతిష్ఠలు, సొంత ప్రయోజనాల కోసం చేసేవన్నీ రాక్షస యుద్ధాలే అవుతాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సంఘర్షణలు జరుగుతున్నాయని, సాత్విక శక్తులన్నీ ఏకమై వీరిపై విజయం సాధించాలని ఆకాంక్షించారు. భారత దేశాన్ని ప్రపంచ గురువుగా మార్చాలన్న లక్ష్యంతో సంఘ్ ఉందని వెల్లడించారు.
''మన దేశంలో హిందువులు, ముస్లింలు కొట్లాడుకోవాలని ఆంగ్లేయులు అనుకున్నారు. అది ఎప్పటికీ జరగదని వాళ్లకీ తెలుసు. ఈ దేశంలో మత, ప్రాంత, భాషలతో సంబంధం లేకుండా నివసించే వారందరికీ సమాజసేవ చేయాలన్న ఏకసూత్రంతో ఆరెస్సెస్ పనిచేస్తోంది'' అని భాగవత్ చెప్పారు.
''లాఠీలతో వెంటపడి తరిమితే చీకట్లు తొలగిపోవు. ఒక చిన్న దీపం వెలిగిస్తే చీకటి దూరమవుతుంది. ప్రేమతో అందరినీ కలుపుకోవాలి. వారిలో జ్ఞానదీపం వెలిగించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సంపూర్ణ సమాజం సంఘటితం కావాలి'' అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, @narendramodi
ఆందోళనకారులు హక్కులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలి: ప్రధాని మోదీ
''ఆందోళనకారులు తమ హక్కులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలి. ఆందోళనల్లో గాయపడిన పోలీసులు, సామాన్యులు ఏం తప్పు చేశారు?'' అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశ్నించినట్లు 'సాక్షి' ఓ కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ లక్నోలో 25 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటల్ పేరుతో ఏర్పాటు కానున్న వైద్య విశ్వవిద్యాలయానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
''ఆర్టికల్ 370 రద్దుతో ఓ పాత జబ్బు శాంతియుతంగా నయమైపోయింది. రామజన్మభూమి సమస్య కూడా శాంతియుతంగానే పరిష్కారమైంది. సవాళ్లకే సవాలు విసరడం మా నైజం. తమ పిల్లల మాన మర్యాదలను కాపాడుకునేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ చట్ట సవరణ అనే సమస్యకు 130 కోట్ల మంది భారతీయులు ఒక పరిష్కారాన్ని ఆవిష్కరించారు'' అని మోదీ పేర్కొన్నారు.
దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో వాజ్‌పేయి పేరు నిలిచి ఉంటుందని.. అటల్ ప్రధానిగా ఉండగా జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను శక్తిమంతమైన దేశంగా నిలిపాయని ప్రధాని కీర్తించారు.

ఫొటో సోర్స్, ANI
నాడు పాకిస్తాన్‌లో జరిగిన పరిణామాలే నేడు భారత్‌లో జరుగుతున్నాయి: చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్
దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలే దురదృష్టవశాత్తూ ఇప్పుడు భారత్‌లోనూ జరుగుతున్నాయని ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ వ్యాఖ్యానించారని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ''మతం అనేది ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నది. పాకిస్థాన్ పాలకుల మాదిరిగానే, ప్రస్తుతం మన దేశంలోని పాలకులకు కూడా బాగా తెలుసు. దానిపైనే వారి అధికారం ఆధారపడి ఉన్నది'' అని ఇర్ఫాన్ బుధవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
మోదీ సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన విధానాలు.. హిందుత్వ ఉద్యమ దీర్ఘకాలిక ప్రాజెక్ట్ ఎజెండాను ప్రతిబింబిస్తున్నాయన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏకి) వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలను కేవలం 'ముస్లింల ఆక్రోశం'గా పరిగణించడం తప్పన్నారు. సీఏఏ అంతిమంగా అందరిపైనా, ఆధునిక భారత భావనపైనా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనల సందర్భంగా ఆందోళనకారుల మీద పోలీసుల దాడుల గురించి ఆయన మాట్లాడుతూ.. వలస పాలనలో కూడా ఈ విధంగా అసమ్మతిని అణచివేయలేదని విమర్శించారు. 1938లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏంఎయూ)లో చోటుచేసుకున్న ఒక ఘటనను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు.
''ఏఎంయూలో జరిగిన హింసాత్మక ఘటనలు పోలీసులతో ఘర్షణకు దారితీశాయి. అప్పుడు ఎస్పీగా బ్రిటిష్ వ్యక్తి ఉన్నారు. నిరసన సమయంలో ఆయనను విద్యార్థులు చితకబాదారు. అయినప్పటికీ క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించడానికి ఆయన నిరాకరించారు. ఎందుకంటే ఆ క్షణంలో సంయమనం పాటించడం అత్యంత ముఖ్యమని ఆయనకు తెలుసు'' అని వివరించారు.
ప్రజాస్వామిక సమాజంలో నిరసన తెలిపేందుకు హక్కు ఉన్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనల్లో ముస్లింలేగాక పెద్ద సంఖ్యలో హిందువులు, ఇతర మతాలకు చెందిన వారు కూడా పాల్గొంటున్నారని ఇర్ఫాన్ హబీబ్ గుర్తుచేశారు. ఈ పోరాటం మన దేశం కోసం, ప్రజాస్వామ్య భవిష్యత్ కోసమని పేర్కొన్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహనీయులు అనుసరించిన మానవీయుత, బహుళత్వ సమాజ విధానాల కారణంగానే ఆధునిక భారతం ఆవిష్కృతమైనదని, అయితే ప్రస్తుతం భారత భావన అన్నది ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- ముజఫర్‌నగర్‌లో ముస్లింల ఇళ్లపై దాడి చేసింది ఎవరు?
- చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది?
- బ్రిటన్, అమెరికాల్లో క్రైస్తవులే క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది?
- భారత్‌లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
- "ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది"
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








