కరోనావైరస్: వరుసగా మూడో రోజు తగ్గిన కొత్త కేసులు - చైనా

ఫొటో సోర్స్, Reuters
దేశంలో కరోనావైరస్ కొత్త కేసుల సంఖ్య వరుసగా మూడో రోజు తగ్గినట్లు చైనా ఆదివారం ప్రకటించింది.
వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు తాము చేపడుతున్న చర్యలు ప్రభావం చూపించడం మొదలైందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికార ప్రతినిధి మీ ఫెంగ్ చెప్పారు.
వైరస్ కొత్తగా 2,009 మందికి సోకినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వల్ల వచ్చే కోవిడ్-19 వ్యాధితో మరో 142 మంది చనిపోయినట్లు చెప్పారు.
ఈ వారంలో ఇంతకుముందు వైరస్ బాధితులను లెక్కించే విధానాన్ని మార్చాక కొత్త కేసుల సంఖ్య పెరిగింది. అయితే గత మూడు రోజులుగా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.


మొత్తమ్మీద చైనాలో 68 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 1,665 మంది మరణించారు.
చైనా వెలుపల దాదాపు 30 దేశాల్లో 500 మందికి పైగా వైరస్ సోకింది.
హాంకాంగ్, ఫిలిప్పీన్స్, జపాన్‌లలో ఒకరు చొప్పున ఆసియాలో ముగ్గురు, ఐరోపాలోని ఫ్రాన్స్‌లో ఒకరు చనిపోయారు.

ఫొటో సోర్స్, EPA
కరోనావైరస్: ఇతర పరిణామాలు
వైరస్ వ్యాప్తి వల్ల జపాన్లో చిక్కుకుపోయిన 'డైమండ్ ప్రిన్సెస్' క్రూయిజ్ నౌకలో బాధితుల సంఖ్య 355కు పెరిగింది. తమ పౌరులను స్వదేశాలకు తీసుకొచ్చేందుకు అమెరికా, కెనడా జపాన్‌కు విమానాలు పంపిస్తున్నాయి.
మరో క్రూయిజ్ నౌక 'ఎంఎస్ వెస్టర్‌డ్యామ్'లో వచ్చిన 83 ఏళ్ల అమెరికా మహిళకు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. అనేక దేశాలు తమ నౌకాశ్రయాల్లో నిలిపేందుకు అనుమతించని ఈ నౌకను ఆగ్నేయాసియాలోని కంబోడియా అనుమతించింది.
బ్రిటన్లో కరోనావైరస్ తొమ్మిది మంది బాధితుల్లో ఎనిమిది మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఒకరికి చికిత్స కొనసాగుతోంది.
కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చైనా చేపడుతున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సారథి టెడ్రోస్ అధనమ్ జెబ్రెయెసస్ ప్రశంసించారు. ఇప్పటివరకు చైనా వెలుపల వ్యాధి వ్యాప్తి విస్తృతంగా ఉన్నట్లు కనిపించడం లేదని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
చైనా: వాడిన నోట్ల పంపిణీ నిలిపివేత
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చైనా పెద్దయెత్తున ఆంక్షలు అమలు చేస్తోంది. కోట్ల మంది ప్రజల దైనందిన జీవితంపై ఇవి ప్రభావం చూపిస్తున్నాయి.
కరోనావైరస్ వ్యాప్తి ప్రబలంగా ఉన్న హుబే రాష్ట్ర రాజధాని వుహాన్‌లో, హుబేలో ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. వుహాన్ నగరానికి చైనాలోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు దాదాపు తెగిపోయాయి.
హుబేలో కొత్త కేసుల సంఖ్య తగ్గిందని, కోలుకొన్న బాధితుల సంఖ్య బాగా పెరిగిందని విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ చెప్పారు. దేశంలో వైరస్ వ్యాప్తి అదుపులో ఉందని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. హుబే రాష్ట్రం వెలుపల కొత్త కేసుల సంఖ్య 11 రోజులుగా తగ్గుతూ వస్తోందన్నారు.
బీజింగ్‌కు తిరిగి వచ్చేవారు ఎవరైనా 14 రోజులపాటు ప్రత్యేక వైద్య పరిశీలనలో ఉండాలని, లేదంటే శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్థానిక అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్తగా చైనా సెంట్రల్ బ్యాంక్ 'పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా' వాడిన కరెన్సీ నోట్ల పంపిణీని నిలిపివేయనుంది. వాటిని క్రిమిరహితం చేసిన తర్వాత పంపిణీ చేయనుంది.

ఫొటో సోర్స్, Getty Images
వైరస్ వ్యాప్తి నియంత్రణకు జనవరి 7నే తాను ఆదేశాలు జారీచేశానంటూ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ నెల్లో ఇంతకుముందు చేసిన ఓ ప్రసంగాన్ని ప్రభుత్వ మీడియా ఇప్పుడు పబ్లిష్ చేసింది. ఆ సమయంలో వుహాన్‌లో స్థానిక అధికార యంత్రాంగం వైరస్ వ్యాప్తి తీవ్రతను తగ్గించి చూపేందుకు యత్నించింది.
వైరస్ ముప్పు సమాచారాన్ని బహిరంగపరచక ముందే ముప్పు గురించి ఉన్నతస్థాయి నాయకులకు అవగాహన ఉందని ప్రభుత్వ మీడియా తాజా చర్య సూచిస్తోంది.
వైరస్ వ్యాప్తి నివారణలో చైనా ప్రభుత్వ స్పందనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఇది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మొదటి నుంచీ నిర్ణయాత్మకంగానే వ్యవహరిస్తూ వస్తోందని చెప్పే ప్రయత్నమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- వుహాన్‌లో చిక్కుకుపోయిన కర్నూలు జ్యోతి పరిస్థితి ఏంటి?
- మెసేజ్‌లలో వచ్చే నగ్నచిత్రాలను తొలగించే ఫిల్టర్ తీసుకొచ్చిన ట్విటర్
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- ఆయుష్మాన్ భారత్ పథకం తొలి లబ్ధిదారు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది...
- Reality Check: నరేంద్ర మోదీ హామీలు నిలబెట్టుకున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









