కరోనావైరస్: ఫ్రాన్స్‌లో ఒకరి మృతి.. ఐరోపాలో ఇదే తొలి మరణం

ఫ్రాన్స్‌లో కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ వ్యాధి (కోవిడ్-19)‌తో ఐరోపాలోనే తొలిసారిగా ఒకరు ఫ్రాన్స్‌లో చనిపోయారు. ఆసియా వెలుపల మొదటి మరణం కూడా ఇదే.

మృతుడు చైనా నుంచి వచ్చిన పర్యటకుడని, ఆయన వయసు 80 ఏళ్లని ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ మంత్రి ఆగ్నెస్ బుజిన్ చెప్పారు. ఈ పర్యటకుడు చైనాలోని హుబే రాష్ట్రానికి చెందినవారని తెలిపారు.

ఆయన జనవరి 16న ఫ్రాన్స్ చేరుకున్నారని, 25 నుంచి ఆస్పత్రిలో ఒంటరిగా ఉంచామని మంత్రి వివరించారు.

ఉత్తర పారిస్‌లోని బిచట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చామని, ఆరోగ్యం విషమిస్తూ వచ్చిందని ఆమె చెప్పారు. కరోనావైరస్ వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ తలెత్తి ఆయన చనిపోయారని తెలిపారు.

ఆయన కుమార్తెకు కూడా వైరస్ సోకిందని, ఆమె కోలుకుంటున్నారని మంత్రి చెప్పారు. ఆమె వయసు 50 ఏళ్లు.

అడ్డగీత
News image
అడ్డగీత

చైనా ప్రధాన భూభాగం వెలుపల నాలుగు మరణాలు

ఫ్రాన్స్‌లో సంభవించిన మరణాన్ని కలుపుకొని చైనా ప్రధాన భూభాగం వెలుపల ఇప్పటివరకు నాలుగు మరణాలు నమోదయ్యాయి. హాంకాంగ్, జపాన్, ఫిలిప్పీన్స్‌లలో ఒకరు చొప్పున చనిపోయారు.

కరోనావైరస్ కేసులు ఐరోపాలో మొదట ఫ్రాన్స్‌లోనే గత నెల ద్వితీయార్ధంలో నమోదయ్యాయి. దేశంలో వైరస్ బాధితుల సంఖ్య 11. వీరిలో ఆరుగురు ఆస్పత్రిలో ఉన్నారు.

ఫ్రాన్స్‌లో వైరస్ సోకినవారిలో ఐదుగురు బ్రిటన్ జాతీయులు.

చైనా ప్రధాన భూభాగం వెలుపల 24 దేశాల్లో 500కు పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
ఫొటో క్యాప్షన్, చైనా ప్రధాన భూభాగం వెలుపల 24 దేశాల్లో 500కు పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

చైనాలో 1500కు పైగా మరణాలు

చైనాలోని హుబే రాష్ట్రం వుహాన్ నగరంలో కరోనావైరస్ బయటపడింది. చైనాలో దీనివల్ల 1,500 మందికి పైగా చనిపోయారు. అత్యధిక మరణాలు హుబే రాష్ట్రంలోనే సంభవించాయి.

చైనాలో కొత్తగా 2,641 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. దీంతో దేశంలో వైరస్ బాధితుల సంఖ్య 66,492కు చేరింది.

చైనా ప్రధాన భూభాగం వెలుపల 24 దేశాల్లో 500కు పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

కరోనోవైరస్‌తో వచ్చే వ్యాధిని అధికారికంగా కోవిడ్-19 అని పిలుస్తున్నారు.

డైమండ్ ప్రిన్సెస్‌లో వందల మంది అమెరికన్లు చిక్కుకుపోయారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, డైమండ్ ప్రిన్సెస్‌ నౌకలో వందల మంది అమెరికన్లు చిక్కుకుపోయారు.

వారి కోసం జపాన్‌కు విమానం: అమెరికా

'డైమండ్ ప్రిన్సెస్' నౌకలో చిక్కుకుపోయిన అమెరికన్లను స్వదేశానికి తీసుకొచ్చేందుకు జపాన్‌కు విమానాన్ని పంపిస్తామని అమెరికా చెప్పింది. కరోనావైరస్ బాధితులున్న ఈ నౌకను ఫిబ్రవరి 3 నుంచి జపాన్ నౌకాశ్రయంలో నిలిపి ఉంచారు. ఇందులో 3,700 మంది ఉన్నారు. వీరిలో 218 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

నౌకలోంచి తమ పౌరులను తీసుకొచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆస్ట్రేలియా చెప్పింది.

ఆఫ్రికాలో తొలి కేసు శుక్రవారం ఈజిప్ట్‌లో నమోదైంది. బాధిత వ్యక్తిది తమ దేశం కాదని ఈజిప్ట్ ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనావైరస్ పరీక్ష

ఫొటో సోర్స్, EPA

చైనాలో ఆరుగురు వైద్య సిబ్బంది మృతి

కోవిడ్-19తో చైనాలో ఆరోగ్య సేవల సిబ్బంది ఆరుగురు చనిపోయారని అధికారులు శుక్రవారం చెప్పారు. ఇప్పటివరకు ఈ సిబ్బందిలో 1,716 మంది వైరస్ బారిన పడ్డారని తెలిపారు.

వైరస్ ఆరోగ్య సేవల సిబ్బందికి ఎంత ప్రమాదకరంగా ఉందో ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

అదుపులో ఉంది: చైనా విదేశాంగ మంత్రి

చైనాలో వైరస్ వ్యాప్తి అదుపులో ఉందని చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ శనివారం చెప్పారు. హుబే రాష్ట్రం వెలుపల కొత్త కేసుల సంఖ్య వరుసగా 11 రోజులుగా తగ్గుతూ వస్తోందని ఆయన చెప్పారు. కోలుకొంటున్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతోందన్నారు.

బీజింగ్‌కు తిరిగి వచ్చేవారు ఎవరైనా 14 రోజులపాటు ప్రత్యేక వైద్య పరిశీలనలో ఉండాలని, లేదంటే శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్థానిక అధికార యంత్రాంగం ప్రకటించింది.

చైనాలో వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ వారాంతంలో విచారణ ప్రారంభించనుంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)