ఆర్టీసీ బ‌స్సుల‌కు ఇన్సూరెన్స్ అక్క‌ర్లేదా? చట్టం ఏం చెబుతోంది?

టీజీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, చేవెళ్ల బస్సు ప్రమాదం, వాహనం ఇన్సూరెన్స్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, అమ‌రేంద్ర యార్ల‌గ‌డ్డ‌
    • హోదా, బీబీసీ ప్ర‌తినిధి

చేవెళ్ల‌ సమీపంలో బ‌స్సు ప్ర‌మాదం త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సులకు ఇన్సూరెన్స్ అంశంపై చర్చ జ‌రుగుతోంది.

ఆర్టీసీ బ‌స్సుల‌కు ఇన్సూరెన్స్ అక్క‌ర్లేదా? ఇన్సూరెన్స్ స‌ర్టిఫికెట్ లేక‌పోయినా బ‌స్సులు ఎలా న‌డిపిస్తున్నారు? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఉత్పన్నమవుతున్నాయి.

సాధారణంగా ప్ర‌తి వాహ‌నానికి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. పోలీసులు త‌నిఖీల స‌మ‌యంలో కూడా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడుగుతారు.

కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో తిరుగుతున్న ఆర్టీసీ బ‌స్సుల‌కు ఇన్సూరెన్స్ చెల్లించ‌కుండానే న‌డిపిస్తున్నారు.

ఏ ఒక్క బ‌స్సుకూ ఇన్సూరెన్స్ లేదు.

ఆర్టీసీ బస్సులు

'అందుకే ఇన్సూరెన్స్ చేయించ‌లేదు'

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో నిత్యం ల‌క్ష‌లమంది ప్ర‌యాణికులు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కొన్ని బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తున్నాయి.

చేవెళ్ల‌లో న‌వంబ‌రు 3న ఆర్టీసీ బ‌స్సు, టిప్ప‌ర్ లారీ ఢీకొన్న ఘ‌ట‌న‌లో 19 మంది చ‌నిపోయారు. ఈ బ‌స్సు అద్దెకు తీసుకుని ఆర్టీసీ న‌డుపుతోందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ఆర్టీసీ యాజ‌మాన్యానికి చెందిన బ‌స్సుల‌కు ఇన్సూరెన్స్ లేదు. ఈ విష‌యాన్ని ఆర్టీసీ అధికారులు కూడా ధ్రువీక‌రిస్తున్నారు.

"ఆర్టీసీ బ‌స్సుల‌కు ఇన్సూరెన్స్ తీసుకోలేదు. ఇది ముందు నుంచీ ఉంది. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణ‌లోనూ బస్సులకు ఇన్సూరెన్స్ లేదు. కానీ ఇదంతా నిబంధ‌న‌ల ప్ర‌కారమే జరుగుతోంది" అని చెప్పారు టీజీఎస్ ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజ‌ర్ శ్రీదేవి.

"ఆర్టీసీ విష‌యంలో చ‌ట్టంలో నిబంధ‌న‌లు ఉన్నాయి. అందుకే ఇన్సూరెన్స్ చేయించ‌క‌పోయినా అనుమ‌తిస్తున్నాం" అని హైద‌రాబాద్ ర‌వాణా శాఖలో కీల‌క అధికారి ఒక‌రు వివ‌రించారు.

చేవెళ్ల బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఆర్టీసీకి ఇన్సూరెన్స్ అవ‌స‌రం లేదా?

ఆర్టీసీ బ‌స్సులకు ఇన్సూరెన్స్ తీసుకోక‌పోవ‌డానికి 1988లో వ‌చ్చిన మోటార్ వెహిక‌ల్ యాక్ట్‌లో అంశాలను కారణంగా ప్ర‌స్తావిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

"ఆర్టీసీ బ‌స్సుల‌కు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా ఆ చ‌ట్టం ప్ర‌కారం వెసులుబాటు ఉంది" అని చెప్పారు శ్రీదేవి.

కేంద్ర లేదా రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్పొరేష‌న్ లేదా వాటి ఆధ్వ‌ర్యంలో న‌డిచే సంస్థ‌ల ప‌రిధిలో ఉండే వాహ‌నాల‌కు ఇన్సూరెన్స్ తీసుకోక‌పోయినా వాటిని న‌డిపేందుకు ఈ చట్టం వెసులుబాటు క‌ల్పించింది. దీని ప్ర‌కారమే ఆర్టీసీకి ఇన్సూరెన్స్ తీసుకోలేద‌ని చెబుతున్నారు అధికారులు.

బస్సులో ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images

ప్రీమియంపై అయోమ‌యం

తెలంగాణ‌లో మొత్తం 9094 బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో 6368 ఆర్టీసీవి కాగా, 2726 బస్సులు అద్దెకు తీసుకున్నవి.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే, 11,138 బ‌స్సులుంటే వాటిలో 8364 బ‌స్సులు ఆర్టీసీవి, 2774 బ‌స్సులు అద్దెకు తీసుకుని న‌డుపుతున్నవి.

చాలా వరకు ఆర్టీసీ బ‌స్సుల్లో సాధారణంగా ప‌రిమితికి మించి ప్ర‌యాణికులు ప్ర‌యాణిస్తుంటారు. చేవెళ్ల స‌మీపంలో ప్ర‌మాదానికి గురైన బ‌స్సు ఓ ఎక్స్‌ప్రెస్ స‌ర్వీస్. దీని సీటింగ్ సామ‌ర్థ్యం 55. కానీ, ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో సుమారు 70 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు ఆర్టీసీ అధికారులు బీబీసీతో చెప్పారు.

బ‌స్సుల‌కు ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఏ విధంగా బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తారు, ప్రీమియం ఎలా క‌డతారు.. అనే అంశాలు సమస్యగా మారాయని ఏపీఎస్ ఆర్టీసీ అధికారి ఒక‌రు బీబీసీతో చెప్పారు.

"బీమా కంపెనీల‌తో గ‌తంలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు బస్సు సీటింగ్ సామ‌ర్థ్యం కంటే ఎక్కువ‌గా ప్ర‌యాణికులు ఉంటే బీమా ఏ ప్రాతిపదికన క‌ల్పించాల‌నే అంశంపై ముందడుగు ప‌డ‌లేదు" అని చెప్పారాయ‌న‌.

బస్సులు

ఫొటో సోర్స్, Getty Images

ఏసీ, స్లీప‌ర్ బ‌స్సుల‌కు సాధ్య‌మేనా?

ఏసీ బ‌స్సులు, స్లీప‌ర్ బ‌స్సుల్లో సీట్ల రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం ప్ర‌యాణికుల‌ను అనుమ‌తిస్తుంటారు. నిల‌బ‌డి వెళ్లే ప్ర‌యాణికులు సాధారణంగా ఉండ‌రు. కానీ, అలాంటి బ‌స్సుల‌కు కూడా ఇన్సూరెన్స్ తీసుకోలేదు ఆర్టీసీ అధికారులు.

మోటారు వాహ‌నాల చ‌ట్టం ప్ర‌కారమే బస్సులకు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవ‌సరం లేద‌ని, దాని ప్ర‌కార‌మే ఏ బ‌స్సుకూ ఇన్సూరెన్స్ తీసుకోలేద‌ని చెప్పారు టీజీఎస్ ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజ‌ర్ శ్రీదేవి.

ఈ విష‌యంపై ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వార‌కాతిరుమ‌ల‌రావును బీబీసీ ఫోన్‌లో సంప్ర‌దించేందుకు ప్ర‌య‌త్నించింది. ఆయ‌న అందుబాటులోకి రాలేదు.

చేవెళ్ల బస్సు ప్ర‌మాదం త‌ర్వాత ఇన్సూరెన్స్ విష‌యంపై అధికారుల‌తో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చ‌ర్చించారు.

"ఆర్టీసీలో ప్ర‌మాదాల కార‌ణంగా ఏటా రూ.80 కోట్ల వ‌ర‌కు పరిహారం చెల్లించాల్సి వ‌స్తోంది. ఇందులో ఆ ఏడాదిలో జ‌రిగిన ప్ర‌మాదాలే కాకుండా గతంలో జ‌రిగిన వాటి సెటిల్మెంట్ త‌ర‌హా ప‌రిహారం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో బీమా తీసుకునే విష‌యంపై యాజమాన్యం ఆలోచిస్తోంది" అని శ్రీదేవి చెప్పారు.

అయితే, అన్ని బ‌స్సుల‌కూ బీమా తీసుకునేందుకు రూ.60 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు కావచ్చని టీజీఎస్ ఆర్టీసీ అంచ‌నా వేసింది.

"ఇది కేవ‌లం అంచ‌నా మాత్ర‌మే. బీమా తీసుకునే విష‌యంలో పూర్తి స్థాయి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు" అని శ్రీదేవి బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)