కాళీపట్నం రామారావు : కథలు మిగిలేయి... కథల మాస్టారే ఇక లేరు

ఉపాధ్యాయుడిగా మొదలు పెట్టి సాహిత్యం లోనూ తనదైన ముద్రవేశారు కాళీపట్నం రామారావు.

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, కాళీపట్నం రామారావు
    • రచయిత, జంపాల చౌదరి
    • హోదా, బీబీసీ కోసం

'నాకు తెలిసిన ప్రపంచ సాహిత్యంలో రామారావుగారిలా కథ చెప్పేవాళ్ళు ఎంతోమంది లేరు.'-వేల్చేరు నారాయణరావు (1986)

నాలుగు గంటల నుండి మనసును, బుద్ధిని ఒక మెత్తటి బాధ కమ్మేసింది. ఒక కుటుంబ పెద్దని, సొంత మనిషిని కోల్పోయిన బాధ. ఇది నా ఒక్కడి బాధే కాదు; అసంఖ్యాకమైన తెలుగు కథాప్రేమికుల సామూహిక బాధ.

రచయితగానూ, వ్యక్తిగానూ నేనూ, మరెంతోమంది ఎంతో ఆరాధించి, గౌరవించి, అభిమానించి, ప్రేమించి, మాస్టారు అని ఆత్మీయంగా పిలుచుకునే కథల మాస్టారు కాళీపట్నం రామారావు మనల్ని విడిచి వెళ్ళిపోయారన్న వార్త విన్న దగ్గర నుంచి ఈ బాధ అలలు అలలుగా పైకి ఉబుకుతూనే ఉంది. మరి, దాదాపు యాభయ్యేళ్ళుగా తెలుసుననుకుంటున్న మనిషి ఇక లేడంటే బాధగా ఉండదూ?

మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు, చదువుకోవటానికి ఏమైనా పుస్తకాలున్నాయా అని అడిగితే, మా శోభక్క, కారా కథల పుస్తకముంది, చదివావా అని అడిగింది. నేను కారా అన్న పేరు వినటం అదే మొదటిసారి.

కాళీపట్నం రామారావు అనే రచయిత శ్రీకాకుళం జిల్లా మురపాకలో పుట్టి, వైజాగ్‌లో లెక్కల మాస్టారుగా పని చేస్తున్నారని, ఆయనను కారా అనీ, కారా మాస్టారు అనీ పిలుస్తారనీ, ఆయన విప్లవ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారని(అప్పటికి) ఆ తర్వాత తెలిసింది.

మా శోభక్క ఇచ్చిన 'యజ్ఞం' అనే చిన్న పుస్తకంలో మూడు కథలు ఉన్నాయి: యజ్ఞం అనే పెద్ద కథ ఒకటి, ఒక చిన్న కథ (తీర్పు అనుకుంటాను), ఇంకో పెద్ద కథ (ఆర్తి). ఆ కథలు చదవగానే ఒక రకమైన ఉన్మత్త స్థితి - ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక కొత్త ఆలోచనా విధానాన్ని మొదటిసారి చూసినప్పుడుండే మానసిక స్థితి అది. అప్పటినుంచి ఇప్పటి వరకు లెక్కపెట్టలేనన్ని సార్లు చదివాను ఆ కథల్ని.

వస్తుపరంగా, శైలిపరంగా అంతకు ముందు నేను చదివిన కథలకన్నా విభిన్నంగా ఉండటం ఒక ఎత్తైతే, ఈ కథల వెనుక, ఈ కథల్ని మించిన సామాజిక సత్యం ఉన్నదన్న స్పృహ ఇంకో ఎత్తు.

ఈ రచయిత ఏం చెప్తున్నాడు ఈ కథలో అన్న అన్వేషణ ఈ కథల్ని, ముఖ్యంగా యజ్ఞం కథని అనేకసార్లు చదివించింది. వేల్చేరుగారొకసారి అన్నట్టు, ఈ కథలు ఒక్కసారి చదవగానే మొత్తం అర్థం ఐపోవు; ఒక్కో పొరనీ తొలచిన కొద్దీ కొత్త విషయాలు బయటపడుతూ ఉంటాయి.

ఈ పుస్తకం నేను చదవటమే కాదు, కాలేజీలో చాలామంది మిత్రులతో చదివించాను. అప్పల రాముడు తన అప్పుని అప్పు ఎందుకు కాదంటున్నాడు, సీతా రాముడు కొడుకుని చంపటం ఏం చెప్తుంది అన్న విషయాలమీద సంభాషణలలో కాలేజీ రోజుల్లో ఎన్ని గంటలు గడచిపోయాయో.

యజ్ఞం కథని చదివిన మిత్రుల ప్రశ్నలకు సమాధానంగా ఆ రోజుల్లో నేనొక పెద్ద వ్యాఖ్యానం రాశాను; పుస్తకంతో పాటు ఈ నోట్సు కూడా మిత్రుల మధ్య తిరుగుతూ ఉండేది. రంగనాయకమ్మ యజ్ఞం కథను విమర్శించినప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది; తెలుగు సాహిత్య చరిత్రలోనే అపూర్వంగా ఈ కథ మీద వ్యాసాలతో రెండు పుస్తకాలు వచ్చిన విషయం సాహిత్య ప్రియులకు తెలుసు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కంతో సమమైన స్థానం యజ్ఞం కథది అని నా అభిప్రాయం.

ఐతే, నేను మొట్ట మొదట చదివిన కారా కథ యజ్ఞం కాదు. కారా అన్న పేరు తెలీకపోయినా, అంతకంటే చాలా యేళ్ళ ముందే, ఒక యువ దీపావళి సంచికలో భయం కథ, ఆంధ్రజ్యోతి వారపత్రికలో నో రూమ్ కథ చదివాను. ఇప్పటికీ భయం కథ మొదటిసారి చదువుతున్నప్పుడు కలిగిన ఉద్వేగమూ, విషాదమూ నా మనసులో బలంగానే ఉన్నాయి.

ఈ కథలు రాసింది కారా అనబడే కాళీపట్నం రామారావు అని తెలిసిన తరువాత, ఆయన కథలు వెతికి మరీ చదవటం ప్రారంభించాను.

కారా కథా రచనలో రెండు దశలున్నాయని ఆయన రచనలు చదివిన వారికి తెలిసిందే. నలభైలలో వ్యక్తిగత, కుటుంబ సంబంధాల కథలు రాయటం మొదలుపెట్టిన రామారావు 1955 తర్వాత కొన్నాళ్ళపాటు కథలు రాయలేదు. తనకిష్టమైన కథల్లాంటి వాటిని తాను రాయలేక పోవటం వల్ల కథలు రాయటం మానేశానని ఆయన అప్పుడు చెప్పుకున్నారు. రావిశాస్త్రితో సాన్నిహిత్యం, మార్క్సిస్టు తాత్వికతతో పరిచయం ఆయన ఆలోచనా పరిధిని విస్తృతం చేయటంతో తనకిష్టమైన విధంగా కథలు రాయడం, 1964లో 'తీర్పు' కథతో, మళ్ళీ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎనిమిదేళ్ళలో 18 గొప్ప కథలు రాశారు.

ఇవాళ మనం మాస్టారి సిగ్నేచర్ కథలుగా చెప్పుకునే యజ్ఞం, ఆర్తి, చావు, హింస, నో రూమ్, భయం, శాంతి, జీవధార, వీరడు మహావీరడు వంటి కథలన్నీ ఈ కాలంలో రాసినవే.

ఈ రెండో దశలో రాసిన కథలలో, కౌటుంబిక, మానవ సంబంధాలతో పాటు, సామాజిక చిత్రణ, విశ్లేషణ ముఖ్యమైన విషయాలైనాయి; ఒక ప్రాంతానికి పరిమితంకాకుండా, అవి విశ్వజనీనమైనాయి. దీనికితోడు, మాస్టారు కథ చెప్పే పద్ధతి విశేషమైనది, క్లిష్టమైనది.

ఈ కథలు ఒక క్లిష్ట పరిస్థితి (క్రైసిస్) చుట్టూ తిరుగుతాయి. కథలో ఇద్దరు ముగ్గురు పాత్రధారులు వాచ్యంగా ఏదో చెప్తారు, కాని అది కథకుడి కంఠం కాదు. ఆయన చెప్పేది అంతకన్నా ఎక్కువే ఉంటుంది; అదేమిటో మనకు చూచాయగా తెలుస్తూనే ఉంటుంది గాని, మనం కొద్దిగా లోతుకుపోతేకాని దాని అంతు చిక్కదు.

ఈ కథలు జరిగే ప్రాంతాలు, అందులో పాత్రలూ, వారి మాటతీరూ, చేతల తీరు ఈయనకి బాగా పరిచయం. దాంతో ఎంతటి నాటకీయమైన సంఘటన ఐనా సహజంగా కనిపింప చేసే కిటుకు ఆయనకు తెలుసు. అందుకే ఇన్నేళ్ళ తర్వాత కూడా ఈ కథలు చదివిస్తున్నాయి, చర్చలకు దారి తీస్తున్నాయి.

ఒక యజ్ఞంలా కథ నిలయం కోసం కాళీపట్నం రామారావు అవిశ్రాంతంగా పని చేశారు.

కథాయజ్ఞం కథానిలయం

గొప్ప కథలను రాయటంతోనే మాస్టారి కథా సేవ ఆగిపోలేదు. తెలుగులో ప్రచురించిన కథలన్నీ ఒకచోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో శ్రీకాకుళంలో నిర్మించిన కథా నిలయం ఈ సేవకు ఒక పార్శ్వమైతే, సమకాలీన సాహిత్యంలో మంచి కథలను, కథకులను గుర్తించి అందరికీ పరిచయం చేయటం, కొత్త కథకులకు శిక్షణ ఇవ్వటం ఒక ఉద్యమంగా కొన్నేళ్ళపాటు నిర్వహించటం ఇంకో పార్శ్వం.

అందుకే చాలామంది తర్వాతి తరం రచయితలు మాస్టారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో శిష్యులమని చెప్పుకుంటారు. ఆధునిక తెలుగు కథా సాహిత్యంపై మాస్టారు చెరగని ముద్ర వేశారనటం అతిశయోక్తి కాదు.

కారా మాస్టారు 1993లో న్యూయార్క్‌లో జరిగిన తానా మహాసభలకు అతిథిగా వచ్చారు; కాని ఆ విషయం ఆలస్యంగా తెలిసిన నాకు ఆయనను చూడటానికి కుదరక చాలా బాధపడ్డాను.

ఆ సందర్భంగా ప్రచురించిన యజ్ఞంతో మరి తొమ్మిది అనే కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి వచ్చింది. ఆ బహుమతి, కథానిలయం స్థాపనకు తోడ్పడింది.

2002లో నేనూ, అరుణా, వాసిరెడ్డి నవీన్ దంపతులు, వైజాగ్‌లో ఉండే డాక్టర్ శోభారాణి (ఇంతకు ముందు చెప్పిన శోభక్కే) డాక్టర్ కృష్ణమూర్తి దంపతులు (వారు అప్పటికే మాస్టారికి పర్సనల్ వైద్యులయ్యారు) కలిసి కథానిలయ యాత్ర చేసినప్పుడు మాస్టార్ని మొదటిసారిగా కలిశాను. అప్పటినుంచీ చాలాసార్లు కలిశాను; మాస్టారితో ఉత్తరప్రత్యుత్తరాలూ, టెలిఫోన్ సంభాషణలూ కొన్నాళ్ళు నడిచాయి.

తానా సహకారంతో కథానిలయం మూలనిధిని గణనీయంగా పెంచడానికి ప్రయత్నించాం. చాలా ఆప్యాయత చూపేవారు; సాహిత్య విషయాలేకాక, వ్యక్తిగత విషయాలూ మాట్లాడేవారు.

తెలుగులో ప్రచురించిన కథలన్నీ ఒకచోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో శ్రీకాకుళంలో నిర్మించిన కథా నిలయం ఆయన సాహితీ సేవకు నిదర్శనం
ఫొటో క్యాప్షన్, కథా నిలయం

నిరంతారన్వేషి

2014లో నేను మాస్టార్ని హైదరాబాదులో కలిశాను. అప్పటికాయన వయసు 90 సంవత్సరాలు. ఏం చేస్తున్నారు మాస్టారూ, అంటే, రోజుకు పది గంటలు ఇంతకు ముందు నిర్లక్ష్యం చేసిన సాహిత్యాన్ని చదువుకోవటానికి వినియోగిస్తున్నాను అన్నారు. పుల్లెల శ్రీరామచంద్రుడుగారి అనువాదాలు చదువుతున్నాను. ఆయన్ని కలసి కొన్ని సందేహాలు తీర్చుకోవాలి అని పనిగట్టుకుని శ్రీరామచంద్రుడుగారింటికి వెళ్ళి ఆయనతో చర్చించారు. ఇంతకూ మాస్టారు ఆ వయసులో హైదరాబాదు వచ్చిన పనేమిటి అంటే కథానిలయానికి సహాయం చేసిన కొందరు మిత్రులకి కృతజ్ఞతలు చెప్పటానికి మరి తర్వాత కుదుర్తుందో లేదో అని ఇప్పుడే వీలు చేసుకొని వచ్చాను అని చెప్పారు.

కాళీపట్నం రామారావు గారిని నేను ఆఖరుసారి కలసింది 2016లో, 'పాతికేళ్ళ కథ'ను మాస్టారు హైదరాబాదులో ఆవిష్కరించినప్పుడు. కథ మీద ప్రేమతో, 92 యేళ్ళ వయసులో శ్రీకాకుళం నుండి హైదరాబాదు వచ్చారు.

కొన్నాళ్ళుగా మాస్టారి ఆరోగ్యం క్షీణిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఒకసారి మాటల్లో ఆయన జీవితపు చివరి దశలలో శారీరకంగా వచ్చే బలహీనతల పర్యవసనాల పట్ల భయాన్ని వ్యక్తం చేశారు. ఆ ఇబ్బందులు పడకుండానే ఆయన సునాయాస మరణం పొందారని విన్నప్పుడు కొంత ఊరటగా అనిపించింది.

కాళీపట్నం రామారావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన కథలూ, కథానిలయమూ, చిరకాలం నిలుస్తాయి. కొన్ని తరాల తరువాత కూడా యజ్ఞం మీద చర్చలు నడుస్తూనే ఉంటాయి. మాస్టారు నిజంగా చిరంజీవే.

వ్యక్తిగతంగా కాళీపట్నం రామారావుగారు ఎంత సమున్నతులో తెలుసుకోవాలంటే, యజ్ఞం కథాసంపుటి మొదటి ప్రచురణలో రావిశాస్త్రి గారు చెప్పిన మాటలు చాలు.

'భగవంతుడికి జనం నమస్కరిస్తారు. ఆ భగవంతుడు మనిషిగా మారితే అప్పుడు కూడా అందరూ అతనికి నమస్కరిస్తారని, మనందరికీ తెలిసిన విషయమే. అయితే, దేముడు మానవుడైతే అప్పుడు అతనైనా సరే శ్రీ కాళీపట్నం రామారావుగారికి నమస్కరించి తీరవలసిందే! పురుషులలోన పుణ్యపురుషులు వేరయా అని వేమన గారు రామారావుగార్లాంటి వారిని చూసే చెప్పి ఉంటారు. రామారావు గారి వంటి సజ్జనుడి సాంగత్యం లభించడం నా అదృష్టం. ఆయన లాంటి గొప్ప కథకులుండటం మన జనం అదృష్టం.'

- రాచకొండ విశ్వనాధ శాస్త్రి, యజ్ఞం కథాసంపుటి ముందు మాట, 1971

నిజం, కాళీపట్నం రామారావు మాస్టారి కథలు చదవగలిగిన మనం అదృష్టవంతులం. ఆయన ధన్యులు.

(వ్యాసకర్త 'తానా' పూర్వ అధ్యక్షులు, కథా నేపథ్యం సంపాదకులు. వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)