కొత్త కరోనావైరస్ వ్యాప్తి భయంతో ఇంగ్లండ్ నుంచి విమానాల రాకపోకల్ని నిషేధిస్తున్న యురోపియన్ దేశాలు : BBC Newsreel

ఫొటో సోర్స్, Getty Images
కొత్తరకం కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను పలు యురోపియన్ దేశాలు ఇంగ్లండ్ నుంచి రాకపోకల్ని నిషేధిస్తున్నాయి.
నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు ఇప్పటికే విమానాల రాకపోకల్ని రద్దు చేశాయి. బెల్జియం రైలు ప్రయాణాలను రద్దు చేసింది.
ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ కూడా ఇంగ్లండ్ నుంచి రాకపోకల్ని రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్నాయి.
లండన్, ఆగ్నేయ లండన్ ప్రాంతాల్లో ఈ కొత్తరకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది.
ఈ కొత్తరకం వైరస్ పాతదానికంటే ఎక్కువ ప్రాణాంతకం అనేందుకు ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే ఇది 70 శాతం ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని తేలింది.

ఫొటో సోర్స్, Sanjay Das
పశ్చిమ బెంగాల్: 'గాలి అనుకూలంగా వీచినంత మాత్రాన ఎన్నికల్లో గెలవలేం..' - అమిత్ షా
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి అనుకూలంగా గాలులు వీస్తున్నప్పటికీ చేతులు కట్టుకుని కూర్చోలేమని, పోలింగ్ బూత్ స్థాయినుంచీ సంస్థను బలోపేతం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నాయకులకు సలహా ఇచ్చారు.
కోల్‌కతాలోని ఒక హొటల్‌లో శనివారం అర్థరాత్రివరకు జరిగిన సమావేశంలో..అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చ సందర్భంగా అమిత షా ఈ సలహాలిచ్చారు.
"అమిత్ షా చెప్పింది కరక్టే. అనుకూలంగా గాలులు వీచినంత మాత్రాన ఎన్నికలు గెలవలేం. అందుకే అమిత్ షా సూచనలను అనుసరించి బూత్ స్థాయినుంచీ పార్టీని బలోపేతం చేసే దిశలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని" ఈ సమావేశానికి హాజరైన ఒక సీనియర్ బీజేపీ నాయకుడు తెలిపారు.
పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉన్నదని చేతులు ముడుచుకు కూర్చోవడం ఆత్మహత్యా సదృశం అవుతుందని, అందుకే ఈ అంశంలో మరింత శ్రద్ధ పెట్టాలని అమిత్ షా సూచించినట్లు ఆయన తెలిపారు.
ఎన్నికలు జరిగేవరకు అమిత్ షా ప్రతీ నెలా కోల్‌కతా పర్యటనకు వెళతారని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
"అమిత్ షా జనవరినుంచీ ప్రతి నెలా రాష్ట్రాన్ని సందర్శించడమే కాకుండా కనీసం ఏడు రోజులపాటూ ఇక్కడే ఉంటారు" అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
టర్కీలోని ఒక ఆస్పత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్ పేలడంతో వార్డులో చికిత్స పొందుతున్న 9 మంది కోవిడ్ రోగులు చనిపోయారని అధికారులు చెప్పారు.
దక్షిణ టర్కీలో గజియాంటెప్‌లోని శాంకో ప్రైవేటు యూనివర్సిటీలో ఇది జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలో ఈ పేలుడుతో మంటలు చెలరేగాయని స్థానిక గవర్నర్ కార్యాలయం చెప్పింది.
పేలుడులో 9 మంది చనిపోగా, వేరే ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఒక రోగి చనిపోయారు.
శనివారం తెల్లవారుజామున ఈ పేలుడు జరిగింది. తర్వాత చెలరేగిన మంటలను వెంటనే ఆర్పేశారు.
బాధితులందరి వయసు 56 నుంచి 85 ఏళ్ల మధ్య ఉందని ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో చెప్పాయి. పేలుడుకు కారణం ఏంటో తెలుసుకోడానికి దర్యాప్తు ప్రారంభించారు.
అదే వార్డులో ఉన్న చాలా మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలించామని, అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారని గజియాంటెప్ గవర్నర్ కార్యాలయం చెప్పింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం, టర్కీలో దాదాపు 20 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కోవిడ్-19తో 17,610 మంది మృతిచెందారు.
గత నెల రొమేనియాలోని ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. చికిత్స పొందుతున్న 10 మంది కరోనా రోగులు చనిపోయారు. వైద్య పరికరాలకు నిప్పంటుకుని, దగ్గరే ఉన్న ఆక్సిజన్ సిలిండర్ వల్ల మంటలు రాజుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చాయి.
అక్టోబర్‌లో రష్యాలోని చెల్యాబింస్క్ ప్రాంతంలో ఆక్సిజన్ బూత్‌లో మంటలు రేగడంతో తాత్కాలిక కరోనా ఆస్పత్రుల్లో ఉన్న 150 మంది రోగులను వేరే ప్రాంతాలకు తరలించారు.
ఇవి కూడా చదవండి:
- క్రిస్టమస్ స్టార్: గురు, శని గ్రహాల అరుదైన కలయికను మీరూ చూడవచ్చు
- గాలీ ప్రాజెక్ట్: తిట్లన్నీ మహిళలను అవమానించేలా ఎందుకుంటాయి... కల్చర్ మారేదెలా?
- రైతుల నిరసనలు దేశాన్ని కుదిపేస్తుంటే, తెలుగు రాష్ట్రాల రైతులు ఏమంటున్నారు? వాళ్ల కష్టాలు ఏంటి?
- కొడుకు పోర్న్ కలెక్షన్ ధ్వంసం చేసిన తల్లిదండ్రులు.. పరిహారం చెల్లించాలన్న అమెరికా కోర్టు
- అయోధ్యలో రామాలయం నిర్మాణానికి రూ. 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాన్ ఏంటి?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నాసా స్పేస్ మిషన్ కమాండర్‌గా హైదరాబాదీ రాజాచారి
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









