తాడిపత్రి: జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారిని దూషించారా? ఏమిటీ వివాదం?

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అనంతపురం డీపీఓ నాగరాజ నాయుడిని ‘దుర్భాషలాడుతున్న’ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు.

ఆ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజ నాయుడిపై ఆయన మీడియా సమక్షంలో దుర్భాషలాడారు.

‘యూ ఆర్ యారొగెంట్.. బీ కేర్‌ఫుల్.. ఎవడితో బిహేవ్ చేస్తున్నావ్.. టుమారో ఐ నీడ్ ద యాక్షన్.. ఐ విల్ కమ్ అండ్ కిక్ యు ఇన్ యువర్ బ్లడీ ఆఫీస్.. గో అండ్ రిపోర్ట్ టు ఎనీబడీ, ఐ డోంట్ కేర్’ అంటూ ఆ అధికారితో నేరుగా అన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆ అధికారిని ఉద్దేశించి ‘ఫ్రాడ్ నా కొడుకు’ అంటూ తీవ్ర పదజాలం వాడారు.

ఈ ఘటన జులై 17న అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం ముందు జరిగింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డీపీఓ ఏమన్నారు?

"అనాథరైజ్డ్ లే అవుట్లపై యాక్షన్ తీసుకోమని చెప్పారు. చేయాలనుకున్నాం. కానీ సచివాలయాల సిబ్బంది బదిలీలతో బిజీ షెడ్యూల్ వల్ల కొంత ఆలస్యం అయింది.

ఆయన ఫోన్ చేసి అడిగినప్పుడు 'చేస్తాం' అని చెప్పాను. తర్వాత ఆయన మాట్లాడాలని వచ్చినప్పుడు పక్క గదిలో మాట్లాడాం’ అని నాగరాజ నాయుడు చెప్పారు.

'రూల్స్ ప్రకారం చేస్తాం అని నేను అనగానే అసభ్యకరమైన భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు. దీంతో నేను లేచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది.

పని గురించి ప్రశ్నించవచ్చు. కానీ దుర్భాషలు మాత్రం కరెక్టు కాదు. నేను తప్పు చేసి ఉంటే కలెక్టర్‌కు పిర్యాదు చేయవచ్చు, అంతేగాని జిల్లా స్థాయి అధికారితో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్?

నాకు చాలా భాద అనిపించింది. కలెక్టర్‌కు ఈ విషయం తెలియజేశాను. కానీ కంప్లైంట్ ఇవ్వలేదు" అని నాగరాజ నాయుడు అన్నారు.

జేసీ ప్రభాకరరెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి

తన వ్యాఖ్యలపై జేసీ ఏమన్నారంటే...

తన వ్యాఖ్యలపై వివాదం నెలకొనడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడాల్సివచ్చిందో వివరించారు

"తాడిపత్రిలో పంచాయతీరాజ్‌కు సంబంధించిన లే అవుట్లలో ఫ్రాడ్ జరిగింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరూ అనుమతులు ఇచ్చారు.

వాటిపై యాక్షన్ తీసుకోవాలని వారు చెప్పినా, 'నాకు పని ఉంది' అంటూ ప్రతిసారీ తప్పించుకుంటున్నాడు. ఏప్రిల్ నుంచి నేనే ఫోన్ చేస్తూ ఉన్నాను. వస్తా అంటాడు, కానీ రాడు. నేను మాట్లాడుతుండగానే లేచి బయటకు వచ్చేశాడు. ఇది గత ఏడాది నుంచి జరుగుతోంది" అని అన్నారు.

రాష్ట్ర స్థాయిలో దుమారం

జేసీ తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. జిల్లా స్థాయి అధికారితో ఆయన ఉపయోగించిన భాష సరిగా లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్ స్పందించారు.

"ఇలాంటి ఘటనలు దురదృష్టకరం. ఒక జిల్లా స్థాయి అధికారిని బహిరంగంగా తిట్టడం సరికాదు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వాధికారుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంది" అన్నారు.

మరోవైపు, జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)