ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్ట్... నాలుగేళ్ల కిందటి కేసులో అదుపులోకి తీసుకున్న గజ్వేల్ పోలీసులు

ప్రొఫెసర్ కాశిం

ఫొటో సోర్స్, Ara Vind/Facebook

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశింను గజ్వేల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

పోలీసులు శనివారం నాడు ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. అనంతరం, 2016లో గజ్వేల్‌లో నమోదైన ఒక కేసుకి సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ప్రొఫెసర్ కాశిం ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన విప్లవ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

విరసం చట్టబద్ధంగా గుర్తింపు ఉన్న సంస్థ అని ప్రొఫెసర్ కాశిం తరఫు న్యాయవాది రఘునాథ్ తెలిపారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 1

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 1

ప్రొఫెసర్ కాశిం భార్య స్నేహలత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా భర్త కాశిం సమాజంలో ఉన్న అసమానతలు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగం, కులం సమస్యలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. అందుకే ఆయన్ను అరెస్టు చేశారు. కానీ, వాళ్లు చూపిస్తున్న కారణం ఏంటంటే.. 2016లో ములుగు పోలీసు స్టేషన్ పరిధిలో ఒక యాక్సిడెంట్ సందర్భంగా అరెస్టయిన శ్యాం సుందర్ రెడ్డితో పాటు ఆయన దగ్గరున్న రెండు పుస్తకాలను ఆధారం చేసుకొని ఆనాడే నా భర్త మీద కేసు నమోదు చేశారు. నేను 'తెలంగాణ వాడినే' అనే పుస్తకంతో పాటు ఎస్‌సీ, ఎస్టీ వర్గీకరణపై రాసిన పుస్తకాలు లభించిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. ఐదు సంవత్సరాలుగా నా భర్త ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి పరారీలో ఉన్నాడని చెబుతూ కారణం లేకుండానే ఇన్నాళ్ల తరువాత వచ్చి అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు’’ అని ఆరోపించారు.

''తలుపులు గడ్డపారతో పగలగొట్టి అక్రమంగా లోపలికి వచ్చారు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును సెర్చ్ చేశారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, ఇంట్లో ఉన్న పుస్తకాలను తీసుకెళ్లారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం'' అని ఆమె తెలిపారు.

చైతన్య మహిళా సంఘం దీనిపై స్పందిస్తూ , "అక్రమ అరెస్టులు, అక్రమ సోదాలను ఖండిస్తున్నాం" అని ప్రకటించింది.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 2

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 2

కాశిం తరఫు న్యాయవాది రఘునాథ్ బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌ను సవాల్ చేస్తూ పౌరహక్కుల సంఘం, హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

''నాలుగు సంవత్సరాల కిందటి కేసులో ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేశారని న్యాయమూర్తికి తెలిపాము. ప్రొఫెసర్ కాశిం పరారీలో ఉన్నారని పోలీసులు చీఫ్ జస్టీస్‌కి చెప్పారు. 2016 కేసులో ఇప్పటి వరకు కాశిం తప్పించుకున్నాడని ఎలా అంటారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రతి రోజూ కాలేజీకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెపుతున్న ప్రొఫెసర్ ఎలా తప్పించుకుంటాడని కోర్టుకు తెలిపాము. గజ్వేల్ కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు. అవసరం లేదని.. రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు తమ నివాసంలో హాజరు పరచాలని న్యాయమూర్తి చెప్పారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు'' అని వివరించారు.

2016లో పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ 120b కింద ప్రొఫెసర్ కాశిం మీద కేసు నమోదు చేశారు.

ప్రొఫెసర్ కాశిం మీద పెట్టిన కేసుపై నాలుగు సంవత్సరాలు ఏమీ చేయకుండా ఇప్పుడు అమాంతంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ప్రతి రోజు కాలేజికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్ ఎలా తప్పించుకుంటాడు? అసలు ప్రొఫెసర్ కాశిం ఉంటున్న యూనివర్సిటీ క్వార్టర్స్‌కి వెళ్లే ముందు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనుమతి తీసుకున్నారా లేదా? అని పోలీసులను ప్రశ్నించగా.. తీసుకోలేదని పోలీసులు తెలిపారని, తెలంగాణ పోలీసులు ఇలా చేయటం మొదటిసారి కాదు అని కూడా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారని న్యాయవాది రఘునాథ్ బీబీసీ తెలుగుతో చెప్పారు.

మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందునే అరెస్టు: సిద్ధిపేట పోలీస్ కమిషనర్

మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందునే ప్రొఫెసర్ కాశింను అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ డి.జోయల్ డేవిస్ ఒక ప్రకటన‌లో పేర్కొన్నారు.

‘‘సిపిఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ రెవెల్యుషనరి డాక్టర్ చింతకింది కాశిం, గత కొన్ని సంవత్సరాల నుండి మావోయిస్టు స్టేట్ కమిటీ నేతలతో మరియు సెంట్రల్ కమిటీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నందున 2016 సంవత్సరంలో ములుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది’’ అని ఆయన చెప్పారు.

‘‘నేరం నెంబర్ 7/2016 U/s 120 B,121 A,124 A, IPC 10,&18 UAPA Act. 1987 పోలీస్ స్టేషన్ ములుగు. కేసు పరిశోధనలో భాగంగా గజ్వేల్ కోర్టు నుండి సెర్చ్ వారెంట్ తీసుకుని, ఈ రోజు గజ్వేల్ ఏసీపీ నారాయణ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీములు ఉదయం 7 గంటల నుండి 10:05 గంటల వరకు అతను నివాసం ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్ క్వార్టర్ నెంబర్ Vl-9 అతని భార్య మరియు బంధువుల సమక్షంలో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన సిపిఐ (మావోయిస్టు) పార్టీల విప్లవ సాహిత్యాన్ని, కరపత్రాలను, సీడీలను ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసి, ఈరోజు ఉదయం 10;15 గంటలకు అరెస్టు చేసి అతని భార్యకు తెలియ పరచడం జరిగింది’’ అని తెలిపారు.

ప్రొఫెసర్ కాశిం అరెస్ట్

ఫొటో సోర్స్, Venkateshwar Rao/Facebook

‘‘సిపిఐ (మావోయిస్టు) తెలంగాణ కమిటీ సెక్రెటరీ హరి భూషణ్ అలియాస్ జగన్ మరియు ఇతర నేతలతో ఇతర మావోయిస్టులతో సెంట్రల్ కమిటీ మెంబర్‌లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సెంట్రల్ కమిటీ ఇచ్చే డబ్బులతో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో మరో (6) కేసులలో నిందితుడిగా ఉన్నాడు. సిపిఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ రెవెల్యుషనరీగా పనిచేస్తూ మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించడం జరుగుతుంది’’ అని కమిషనర్ వివరించారు.

మరోవైపు ప్రొఫెసర్ కాశిం అరెస్టును ఖండిస్తూ నిర్బంధ వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో పౌర హక్కుల సంఘం, వివిధ ప్రజా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)