'ఒక బెలూన్ నన్ను చంపేయగలదు' - లేటెక్స్ ఎలర్జీతో బాధపడే ఓ మహిళ కథ

- రచయిత, క్రిస్ క్వివాత్రే
- హోదా, బీబీసీ న్యూస్
పిల్లల పుట్టిన రోజుల్లో, పెద్దల పెళ్లిళ్లలో, రెస్టారెంట్లలో, దుకాణాల్లో బెలూన్లు (బూరలు, బుడగలు) సర్వసాధారణంగా ఉంటాయి. కానీ.. లిజ్ నైట్ చిన్నప్పటి నుంచీ వాటికి ఆమడ దూరంలో ఉంటారు. ఎందుకంటే వాటి వల్ల ఆమె ప్రాణం పోయే ప్రమాదం ఉంది.
చిన్నప్పుడు లిజ్‌కు దుమ్ము, జంతువుల జుట్టు, ఈకలతో ఎలర్జీ ఉండేది. కానీ 12 సంవత్సరాల వయసులో.. ఆమెకు మనుషుల జుట్టు కూడా అలర్జీయేనని డాక్టర్లు గుర్తించారు. పొడవైన ఆమె పోనీటెయిల్‌ను వెంటనే పొట్టిగా కత్తిరించేశారు.
అక్కడితో ఆగలేదు. ఆమె అలర్జీలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందువల్ల తను చిన్నప్పుడు ఏకాంతంగా ఉండాల్సి వచ్చేదని లిజ్ గుర్తుచేసుకున్నారు.
''నాకు నాలుగేళ్ల వయసులో మేం బంధువుల ఇంటికి వెళ్లాం. వాళ్ల ఇంట్లో ఒక బడ్జీ (ఒక రకం పెంపుడు చిలుక) ఉంది. అరవై, డెబ్బై దశకాల్లో ప్రతి ఒక్కరికీ ఒక బడ్జీ ఉన్నట్లు అనిపించేది. కానీ.. నాకు ఏ రకమైన ఈకలూ సరిపడవు. నాకు ఇంకా గుర్తుంది... మేం మా కారును పార్క్ చేశాం. నా అక్కాచెల్లెళ్లను తీసుకుని అమ్మానాన్నలు లోపలికి వెళ్లారు. నేను వెళ్లలేకపోయాను. వాళ్ల ఇంట్లో బడ్జీ ఉంది కాబట్టి నేను ఒక్కదాన్నే కారులో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు నాకు చాలా ఒంటరిగా అనిపించింది. మామూలు పిల్లలు చేసేవన్నీ నేను చేయలేకపోయాను'' అని వివరించారు.

ఫొటో సోర్స్, LIZ KNIGHT
డేవన్‌లోని పైంగ్నాటన్‌కు చెందిన లిజ్.. చిన్నప్పటి నుంచీ చర్మ సమస్యతో బాధపడుతున్నారు. ఇరవై ఏళ్ల వయసులో సోకిన చర్మవ్యాధి రక్తంలోకి చేరటంతో కొన్ని వారాల పాటు ఆస్పత్రిపాలయ్యారు. అయితే.. 1990లలో కుటుంబంతో కలిసి ఒక సంతకు వెళ్లినపుడు కానీ.. తనకు లేటెక్స్ (రబ్బరు) అలర్జీ ఉందని లిజ్‌కు అనుమానం రాలేదు.
''నా కూతుర్లలో ఒకరు పెద్ద, మందపాటి హీలియం బెలూన్లు తెచ్చి నా చేతిలో పెట్టారు. వాళ్లు ఎక్కడికో పరిగెడుతూ వాటిని కాసేపు పట్టుకోమని చెప్పారు. వాటిని పట్టుకున్న తర్వాత నేను నా ముఖాన్ని తాకి ఉండాలి. ఎందుకంటే అప్పుడే ఈ నాటకీయ వాపు మొదలైంది'' అని ఆమె తెలిపారు.
లిజ్ వయసు ఇప్పుడు 56 సంవత్సరాలు. అనారోగ్య కారణాల వల్ల పదే పదే డాక్టర్ల దగ్గరకు వెళ్లటం వల్ల.. అప్పటికే చాలా సున్నితమైన తన చర్మానికి రబ్బరు తాకిడి ఎక్కువై లేటెక్స్ అలర్జీ వచ్చిందని ఆమె భావిస్తున్నారు.
ఆమె రోజు వారీ జీవితం అనేక రకాలుగా ప్రభావితమైంది. ఆమె అసలు వార్తాపత్రికలు చదవలేరు. ఎందుకంటే పత్రికల్లోని సిరాలో లేటెక్స్ ఉంటుంది. రిమోట్ కంట్రోల్‌ల మీద బటన్లు, కూరగాయలు కోసే కత్తి పిడి, బ్లెండర్ పిడి, మిక్సర్, హెయిర్ డ్రైయర్ హ్యాండిళ్లు అన్నిటి విషయం కూడా అంతే. ఆ హ్యాండిళ్లన్నిటికీ క్లింగ్ ఫిల్మ్ చుడితే కానీ ఆమె వాడలేరు.
సమీపంలో రోడ్డు పనులు ఏవైనా జరుగుతున్న ప్రతిసారీ.. లిజ్ తన ఇంటి తలుపులు, కిటికీలు మూసేసి ఉంచాల్సి వస్తుంది. ఎందుకంటే.. రోడ్డు ఉపరితలం మీద కూడా లేటెక్స్ ఉంటుంది. తన సొంత ఇంట్లో బందీని అయిపోయానని తనకు ఎప్పుడూ అనిపిస్తుంటుందని లిజ్ చెప్పారు.

''ఎటూ కదిలే వీలులేకుండా చిక్కుబడిపోయినట్లు అనిపిస్తుంటుంది. ఒక్కోసారి వారం రోజుల వరకూ ఇల్లు వదిలి బయటకు రాను. ఎందుకంటే.. నాకు ఇల్లే పదిలంగా ఉంటుంది'' అని ఆమె వివరించారు.
ఇక నాలుగేళ్ల కిందట.. లిజ్ భయపడుతున్న విషయం నిర్ధరణ అయింది. ఆమెకు గల లేటెక్స్ అలర్జీ గాలిలోకి కూడా మారింది. ఆ చలికాలంలో తన భర్తతో కలిసి ఒక షాపులోకి వెళ్లింది లిజ్. అంతే ఆమె పెదవులు వాచిపోయి.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి.
''నేను వెంటనే నేరుగా బయటకు వచ్చేశాను. అక్కడ ఏముందో నాకు తెలీదు. కానీ ఏదో అసలు బాగోలేదని నాకు బలంగా అనిపించింది'' అని ఆమె చెప్పారు.
వాళ్లు వెనుదిరిగి చూశారు. షాపు వెనకాల ఒక స్టాండుకి ఆరు బెలూన్లు కట్టి కనిపించాయి. అంటే.. లేటెక్స్ రేణువులు అక్కడి వేడి వ్యవస్థ వల్ల గాలిలో తిరుగుతున్నాయి. అయితే.. లిజ్ అలర్జీ ఎంత తీవ్రమైనదంటే.. ఒక గదిలో గత 48 గంటల్లో ఒక బెలూన్ ఉండి ఉంటే.. ప్రత్యేకించి అది ఆ గదిలో పగిలిపోయి ఉంటే.. ఆమెకు తీవ్రమైన రియాక్షన్ రావచ్చు. ఎందుకంటే ఆ లేటెక్స్ రేణువులు ఇంకా ఆ గదిలోని గాలిలో ఉండే అవకాశముంది.
చాలా రియాక్షన్లలో ఆమెకు చెమట పట్టటం మొదలవుతుంది. ఆమె పెదవులు ఉబ్బుతాయి. 'ఇక అంతా అంతమైపోతుంద'నే భావన ఆమెకు కలుగుతుంది. సాధారణంగా ఆమె ఆ ప్రాంతం నుంచి బయటపడినపుడు ఈ లక్షణాలకు కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే మామూలు స్థితికి రావటానికి కొన్ని గంటల సమయం పడుతుంది.


లేటెక్స్ ఎలర్జీ అంటే ఏమిటి?
- రబ్బరు వంటి చెట్ల మొదలుకు రంధ్రం చేసి సేకరించే పాలవంటి చిక్కటి ద్రవాన్ని లేటెక్స్ అంటారు.
- మెడికల్ గ్లవ్స్, షూస్, టైర్లు, బెలూన్లు, కండోమ్‌లు వంటి వస్తువులతో పాటు అనేక రకాల గృహోపకరణాలను తయారు చేయటానికి దీనిని ఉపయోగిస్తారు.
- శరీరంలోని రోగనిరోధక శక్తి ఏదైనా పదార్థాన్ని ప్రమాదకరంగా పరిగణించినపుడు అతిగా ప్రతిస్పందించటం వల్ల అలర్జీ వస్తుంది. ఈ లక్షణాలు చిన్న దద్దుర్లు మొదలుకుని తీవ్రమైన వాపుల వరకూ ఉంటాయి.
- బ్రిటన్ జాతీయ ఆరోగ్య వ్యవస్థ అంచనా ప్రకారం జనంలో ఐదు శాతం మంది వరకూ లేటెక్స్ అలర్జీ ఉండొచ్చు. అయితే వాళ్లందరిలో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు.
- అలర్జీ అనేది వంశపారంపర్యంగా కూడా రావచ్చు.. అయితే ఆస్తమా, చర్మ వ్యాధుల వంటి రుగ్మతలు మరింత మందికి సోకే అవకాశముంది.
- లేటెక్స్ అలర్జీ ఉన్నవాళ్లు ఆ రియాక్షన్లను నివారించటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం సాధ్యమైనంత వరకూ లేటెక్స్‌కు దూరంగా ఉండటమే.
- కొన్నిసార్లు ఆరోగ్య రంగ నిపుణులు ఉపయోగించే గ్లవ్స్ వంటి లేటెక్స్ ఉత్పత్తులను కూడా తరచుగా తాకే పరిస్థితి ఉంటే.. లెటెక్స్ అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. పదే పదే లేటెక్స్ ఉత్పత్తులను తాకే పరిస్థితి ఉంటే రియాక్షన్లు ఇంకా తీవ్రమవుతాయి.
- ప్రజలకు లేటెక్స్ అలర్జీని లేకుండా చేయటానికి కొన్ని ప్రయోగాత్మక చికిత్సలు ఉన్నాయి కానీ అవి ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు.
ఆధారం: ఎన్‌హెచ్‌ఎస్, బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, గ్లోబలాయ్

ఇటీవల లిజ్‌కు తన ఇంట్లో వచ్చిన రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంది. ఆమె తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
''రెండు నెలల కిందట నేను.. రెండు శాతం పైనాపిల్ జ్యూస్ ఉన్న ఒక సాషేను ఉపయోగించి స్వీట్ అండ్ సోర్ వంట చేశాను. అది తిన్న సుమారు 15 నిమిషాల లోపు నా నాలుక వాచిపోవటం నాకు తెలిసింది. ఆ తర్వాత నా గొంతు మారిపోయింది. నా నాలుక పరిస్థితి అంతకంతకూ తీవ్రమవుతోంది'' అని ఆమె వివరించారు.
ఉష్ణమండల పండ్లలో దాదాపు లేటెక్స్ ప్రొటీన్ వంటి ప్రొటీన్లు ఉంటాయి. వాటివల్ల లేటెక్స్ తరహా రియాక్షన్‌లు ఉత్పన్నమవుతాయి. ఆమె అలర్జీ రియాక్షన్ల ప్రభావాలను నెమ్మదింపజేసే ఆడ్రినలైన్ ఇంజెక్షన్‌ను తీసుకున్నారు.
''పారామెడికల్ సిబ్బంది అంబులెన్స్‌లో నా రక్తపోటును చెక్ చేశారు. అది 194 వరకూ ఉంది.. అమాంతం పెరిగిపోయింది'' అని చెప్పారు.
భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల తరహాలో అలర్జీ రియాక్షన్ వచ్చిన తర్వాతి దశ రియాక్షన్లు వస్తున్నాయేమో చూడటానికి లిజ్‌ను కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో పర్యవేక్షణలో ఉంచారు. చివరికి రియాక్షన్ లక్షణాలు ఉపశమించాయి.
లిజ్ అలర్జీలు ఆమె మానసిక ఆరోగ్యం మీద కూడా అనేక రకాలుగా ప్రభావం చూపాయి. ఆమె సామాజిక వలయం తీవ్రంగా కుచించుకుపోయింది. కొన్నేళ్ల పాటు తాను హాజరైన వ్యాయామ బృందాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అక్కడ లేటెక్స్ చాపలు, లేటెక్స్ శిక్షణ పరికరాలు, ఏరోసోల్ స్ప్రేయర్లు దీనికి కారణం.
పదే పదే రియాక్షన్లు వస్తుండటం వల్ల.. ఫార్మసీలో తన ఉద్యోగాన్ని కూడా వదిలేయాల్సి వచ్చింది. ఇంటికి తాను ఆర్ధికంగా చేయూతనివ్వలేకపోతున్నానన్న అపరాధన భావన ఇప్పుడు ఆమెలో ఉంది.
పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నాకూడా.. తనకున్న లేటెక్స్ ఎలర్జీ తన జీవితాన్ని పూర్తిగా దాని స్వాధీనంలోకి వెళ్లకుండా చూసుకోవాలన్న పట్టుదల తనలో మెండుగా ఉందని లిజ్ చెప్తారు. ''నేను నడవగలను. చూడగలను. పనిచేయగలను. నాకు ఉన్న వాటి పట్ల నేను కృతజ్ఞతతో ఉండాలి'' అంటారామె.
ఇప్పుడు ఆమె తన ఇంటి సమీపంలో ఒక అల్లిక బృందాన్ని కలుస్తోంది. అక్కడ ఉన్నవారు అందరూ ఆమె కోసం సంతోషంగా జాగ్రత్తలు తీసుకుంటారు. అలర్జీ అవగాహన బృందం గ్లోబలాయ్‌కి ఒక రాయబారిగా కూడా వ్యవహరిస్తున్నారు లిజ్.

ఫొటో సోర్స్, LIZ KNIGHT
గ్లోబలాయ్‌ని 2016లో డాక్టర్ పూజా న్యూమాన్ అనే మహిళ స్థాపించారు. మెల్‌బోర్న్‌లోని ఒక సంగీత కచేరీలో ఆమెకు తీవ్రమైన రియాక్షన్ వచ్చింది. ఆశ్చర్యపరచటం కోసం వదిలిన ఒక బెలూన్ వల్ల ఆమె వారం రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్‌లో ఉండాల్సి వచ్చింది. దీంతో లేటెక్స్ అలర్జీ గురించి అవగాహన పెంపొందించటం కోసం డాక్టర్ పూజా ఈ సంస్థను నెలకొల్పారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నపుడే ఆమె తన కథను చెప్పటానికి ఒక ఫేస్‌బుక్ పేజీని తయారు చేశారు. అలా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటైంది.
''తీవ్రమైన రియాక్షన్ ఫలితంగా జనం పడే బాధను వేదనను గుర్తించటం.. వివక్షకు గురవుతున్నామన్న భావన.. లేదా రోజు వారీ జీవితంలో భాగస్వాములం కాలేకపోతున్నామనే భావన చుట్టూ ఉన్న అంశాల గురించి అవగాహన పెంపొందించటం ఈ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పటానికి ఒక కారణం'' అని డాక్టర్ న్యూమన్ పేర్కొన్నారు.
ఈ సంస్థ బహిరంగ ప్రదేశాల్లో ఎపిపెన్ స్టేషన్లను (అలర్జీ రియాక్షన్లకు అత్యవసర చికిత్స అందించే కేంద్రాలు) అభివృద్ధి చేసింది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఆహార తయారీలో లేటెక్స్ గ్లవ్స్ ఉపయోగించటం మీద నిషేధానికి మద్దతిచ్చింది. అలాగే ఆస్ట్రేలియాలో బహిరంగ ప్రదేశాల్లో బెలూన్లను నియంత్రించాలన్న ప్రతిపాదననూ సమర్థిస్తోంది.
ఈ గ్రూపుతో లిజ్ కలిసి పనిచేయటం పైగ్నాటన్‌లో పరిస్థితి మెరుగుపడింది. ఆమె సలహా ప్రకారం చాలా షాపులు తమ పద్ధతులను మార్చుకున్నాయి. లిజ్ తనకున్న అలర్జీల వల్ల తన జీవితానికి ఉన్న పరిమితులను గుర్తిస్తూనే.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నారు.
''నిజంగా అన్యాయం అనిపించినపుడు కొంత దిగులుపడుతుంటాను. కానీ ఇంతకంటే దారుణ పరిస్థితులు రావచ్చుననే భావన కూడా ఎప్పుడూ ఉంటుంది. లేటెక్స్ అలర్జీల గురించి సాధ్యమైనంత మందితో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఎంత మందికి దీని గురించి తెలిస్తే.. అంత ఎక్కువగా పరిస్థితులు మారతాయి'' అంటారామె.
''అలర్జీలు నా జీవితంలో ప్రతి దానినీ లాగేసుకోకుండా చూసుకోవాలని నేను కృతనిశ్చయంతో ఉన్నాను. నా కోసం మాత్రమే కాదు.. ఇతరుల కోసం కూడా పరిస్థితులను మెరుగుపరచటం కోసం కృషి చేస్తాను'' అని ఉద్ఘాటించారు లిజ్.
ఇవి కూడా చదవండి:
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- ‘దిశ’ అత్యాచారం: "నాకు చాలా బాధేసింది.. ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే" - ఓ నిందితుడి భార్య ఆవేదన
- విజయవాడ శ్రీలక్ష్మి హత్య నుంచి వరంగల్ పసిపాప అత్యాచారం, హత్య వరకు.. కేసుల ప్రస్తుత పరిస్థితి ఏంటి?
- 5 నెలలు.. 7 జిల్లాలు.. 2 రాష్ట్రాలు.. 1300 కి.మీ... ఆడ తోడు కోసం తిరిగిన మగ పులి
- చంద్రయాన్-2: ‘విక్రమ్ ల్యాండర్ దొరికింది.. కనిపెట్టింది నేనే’
- సర్కెగూడ ఎన్కౌంటర్లో మరణించింది గిరిజనులేనని తేల్చిన జ్యుడిషియల్ కమిటీ
- 'ఒక మహిళ ఒక వ్యక్తితో సెక్స్‌కు అంగీకరిస్తే, దాని అర్థం అతడు ఏం చేసినా ఫరవాలేదని కాదు'
- షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘‘ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయ్ అభిప్రాయం: ‘‘ఒక తల్లిగా నేను చేయలిగింది.. నా కూతుర్ని నిరంతరం భయంతో పెంచటం మాత్రమేనా?’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








