తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర

పవన్ కళ్యాణ్

ఫొటో సోర్స్, janasenaparty/facebook

త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ యాత్ర చేపట్టనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొంగడట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని ఆయన శనివారం ట్విటర్‌లో తెలిపారు.

ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడి హోదాలో 2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా కరీంనగర్ జిల్లాలో పవన్‌కు కరెంట్ షాక్ తగిలింది.

ఆ విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ.. ‘‘2009 ఎన్నికలకు ప్రచారం చేస్తున్న తరుణంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి నేను ఇక్కడే క్షేమంగా బయటపడ్డాను’’ అని పేర్కొన్నారు.

‘‘సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి, అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నాను’’ అని పవన్ ఈ ట్వీట్‌ ద్వారా తెలిపారు.

పవన్ కళ్యాణ్

ఫొటో సోర్స్, janasenaparty/facebook

జనవరి 22వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.

యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టత ఇస్తూ.. ‘‘నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

గతేడాది డిసెంబర్ 31వ తేదీన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారు. తొలి సభ్యత్వం ఆయనే స్వీకరించారు.

‘‘కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం. ఇవి దేశ పటిష్టతకు మూలాలు. ఇవే జనసేన సిద్ధాంతాలు’’ అని గతంలో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పార్టీ నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)