#MeToo: ఎం.జె. అక్బర్‌ మీద పోరాడేందుకు మహిళల ముందున్న మార్గాలేమిటి?

ఎంజే అక్బర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సర్వప్రియ సాంగ్వాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజె అక్బర్... ఆ ఆరోపణలు చేసిన పాత్రికేయురాలు ప్రియా రమణిపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు.

తనపై ఆరోపణలు చేసిన ఇతర మహిళలపైన కూడా అవే కేసులు వేస్తానని ఆయన హెచ్చరించారు.

ఆయన కేసు వేసిన కొన్ని గంటల తరువాత ప్రియా రమణి స్పందిస్తూ, ‘నేను ఎలాంటి కేసునైనా ఎదుర్కోవడానికి సిద్ధం. నేను సత్యాన్నే నమ్ముకున్నా’ అని చెప్పారు.

హిందీ నటుడు అలోక్ నాథ్‌పై కూడా చిన్ని తెర నిర్మాత, దర్శకురాలు విన్తా నందా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆమెపై అలోక్ నాథ్ కూడా పరువు నష్టం కేసు పెట్టారు. రాతపూర్వకంగా ఆమె క్షమాపణ చెప్పాలని కోరారు.

ఈ నేపథ్యంలో ప్రియారమణి, వినితా నందాలు ఆ కేసులను ఎలా ఎదుర్కొంటారన్నది ప్రశ్నార్థకమైంది.

ఈ మహిళలకు రెండు మార్గాలున్నాయని సీనియర్ న్యాయవాది రమాకాంత్ గౌర్ అన్నారు. మొదట వాళ్లు మహిళా మేజిస్ట్రేట్ ముందు కానీ, పోలీసు స్టేషన్లో కానీ తమ పైన లైంగిక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు నమోదు చేయాలి.

ఆ ఫిర్యాదుపై కోర్టులో విచారణ ముగిసేవరకు, లేదా ఛార్జి షీటు దాఖలు చేసేవరకు పరువు నష్టం కేసు విచారణ ముందుకు సాగదు. ఒకవేళ లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువైతే, పరువు నష్టానికి సంబంధించిన కేసును కొట్టేస్తారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కోర్టు నుంచి సమన్లు వచ్చే దాకా ఎదురుచూడటం మరో మార్గం. ఆ తరువాత కోర్టు క్రాస్ ఎగ్జామినేషన్‌ను ప్రారంభిస్తుంది. కానీ ఈ మార్గంలో విజయావకాశాలు తక్కువని, దేశంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేసే న్యాయవాదులు తక్కువగా ఉన్నారని రమాకాంత్ అన్నారు.

మరోపక్క ప్రముఖ న్యాయవాది వ్రిందా గ్రోవర్ మాట్లాడుతూ, ఈ మహిళల ముందు అనేక ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు. ముందుగా వాళ్లకు పరువు నష్టం జరిగిందని రుజువు చేయాలి. అది చాలా సుదీర్ఘ ప్రక్రియ అని ఆమె అన్నారు. ఒకవేళ అది రుజువైతే, ఆ తరువాత మిగతా ఆప్షన్ల అవసరం ఉంటుందని తెలిపారు.

నిరసన

ఫొటో సోర్స్, Getty Images

సివిల్ దావా - క్రిమినల్ దావా

దేశంలో రెండు రకాల పరువు నష్ట దావాలున్నాయి. ఒకటి సివిల్ డిఫమేషన్, రెండోది క్రిమినల్ డిఫమేషన్. ఈ రెంటిని కలిపి కూడా ఫైల్ చేయొచ్చు. కానీ, విచారణ వేర్వేరుగా సాగుతుంది.

ప్రియా రమణిపై ఎంజె అక్బర్ క్రిమినల్ దావా వేశారు. క్రిమినల్ డిఫమేషన్ కేసుల్లో ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద కేసులను నమోదు చేస్తారు.

సివిల్ కేసుల్లో... పరువు నష్టం కేసు పెట్టిన వాళ్లు అవతలి వ్యక్తుల వ్యాఖ్యల వల్ల తమ గౌరవం దెబ్బతిందని నిరూపించాలి. క్రిమినల్ కేసుల్లో కూడా ఇలా నిరూపించడంతో పాటు, అవతలి వ్యక్తి ఆ పనిని కావాలనే చేసినట్లు కూడా రుజువు చేయాలి.

పరువు నష్టం దావా వేయాలనుకునేవాళ్లు సరైన సాక్ష్యాలతో కూడిన పత్రాలను కోర్టుకు సమర్పించాలి. వాటిని పరిశీలించి, వాదనలను విన్న తరువాత కోర్టు సంతృప్తి చెందితే, ప్రతివాదులకు సమన్లను అందిస్తుంది.

సమన్లను అందుకున్న వ్యక్తి తన తప్పును ఒప్పుకోకపోతే, కోర్టు ఫిర్యాదుదారుడితో పాటు ఇతర సాక్షులను పిలుస్తుంది.

ఒకవేళ కేసును ఎదుర్కొంటున్న వ్యక్తి, తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని నిరూపించుకోగలిగితే పరువు నష్టం కేసు నుంచి సులువుగా బయటపడొచ్చు.

మీటూ

ఫొటో సోర్స్, iStock

97లాయర్లు వాదిస్తారా?

ఎంజె అక్బర్ తరఫున 97మంది లాయర్లు వాదిస్తున్నారనే పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. నిజానికి కోర్టు దావాలపైన ఒకరి కంటే ఎక్కువమంది న్యాయవాదులు సంతకం చేస్తుంటారు. దాని వల్ల ప్రధాన న్యాయవాది కోర్టుకు హాజరు కాలేని పక్షంలో మిగతా న్యాయవాదులు విచారణకు హాజరుకావొచ్చు.

ఎంజే అక్బర్ విషయంలో ఆ దావాపై 97మంది న్యాయవాదులు సంతకం చేయడం అనేది కేవలం ఆ మహిళపై ఒత్తిడి పెంచేందుకేనని రమాకాంత్ గౌర్ చెప్పారు.

భారత్‌లో పరువు నష్టం దావాలు

ఇతర దేశాల్లో పరువు నష్టం కేసులు క్రిమినల్ కేసుల జాబితాలో లేవు. భారత్‌లో కూడా దీన్ని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయి. పరువు నష్టం కేసులను క్రిమినల్ కేసుల జాబితా నుంచి తొలగించమని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ కూడా ఆ పిటిషన్‌లో పార్టీలుగా మారారు. వీళ్లంతా పరువు నష్టం దావాలను నేరాల జాబితా నుంచి తొలగించాలని కోరారు.

కానీ, అది సాధ్యం కాదని 2016లో ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)