జమాల్ ఖషోగ్జీ హత్య: 'ప్రపంచ చరిత్రలోనే అత్యంత హేయమైన కపట నాటకం' - డోనల్డ్ ట్రంప్

trump

జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య ప్రపంచ చరిత్రలోనే 'అత్యంత దారుణమైన కపటనాటకం' అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ కుట్రకు పాల్పడినవారు ఎవరైనా సరే 'తీవ్రమైన చర్యలను' ఎదుర్కోక తప్పదని ఆయన అన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో కూడా ఆ తరువాత కాసేపటికి ఒక ప్రకటన చేస్తూ, అమెరికా కచ్చితంగా 'బాధ్యులను శిక్షిస్తుంది' అని అన్నారు. ఇప్పటికే 21 మంది అనుమానితుల వీసాలు రద్దు చేశామని కూడా ఆయన చెప్పారు.

వైట్ హౌస్ వద్ద ట్రంప్ విలేఖరులతో మాట్లాడుతూ, 'వాళ్ళు ఒక నీచమైన ఆలోచనతో ఉన్నారు. దాన్ని దుర్మార్గంగా అమలు చేశారు. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు వారు చేసిన ప్రయత్నం ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణం' అని అన్నారు.

"ఈ పనిని వారు ఆలోచన స్థాయిలో ఉండగానే ఆపి ఉండాల్సింది. ఆ ఆలోచన చేసిన వారు సమస్యల్లో ఇరుక్కున్నారు. వాళ్ళు కచ్చితంగా చిక్కుల్లో పడాల్సిందే" అని ట్రంప్ అన్నారు.

అమెరికా నివాసి, వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ అయిన 59 ఏళ్ళ ఖషోగ్జీ హత్య విషయంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఒకదానికొకటి పొంతన లేని కథనాలను వినిపిస్తూ వచ్చింది. కొన్ని వారాల పాటు ఆయన బతికే ఉన్నారని చెప్పిన సౌదీ అధికారులు, ఆ 59 ఏళ్ళ జర్నలిస్టు టర్కీలోని సౌదీ కాన్సులేట్‌లోకి వెళ్ళిన తరువాత హత్యకు గురయ్యారని ప్రకటించారు. అది 'నయవంచనతో పన్నిన వ్యూహం' అని కూడా అన్నారు.

మైక్ పాంపెయో

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో

వాషింగ్టన్‌లో విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ఈ పరిస్థితికి అధ్యక్షుడు, తాను 'బాధపడుతున్నామని' పాంపెయో అన్నారు.

"జర్నలిస్ట్ ఖషోగ్జీ నోరు మూయించడానికి హింసామార్గాన్ని ఎంచుకోవడం దారుణం. ఇలాంటి చర్యలను అమెరికా సహించదని మేం స్పష్టం చేస్తున్నాం" అని పాంపెయో అన్నారు.

సౌదీ యువరాజు ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఘటన మీద ఇచ్చిన వివరణను అమెరికా ఆమోదిస్తుందా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు, "అమెరికా తాను తెలుసుకున్న విషయాలను ఆమోదిస్తుంది" అని అన్నారు.

"వాస్తవాలేమిటో అర్థవంతంగా తెలుసుకునేందుకు ప్రపంచమంతా మనవాళ్ళు పనిలో ఉన్నారు. మనం మనదైన సమాచారాన్ని సంపాదించాలి. వాస్తవాలను స్వయంగా తెలుసుకోవాలి" అని పాంపెయో వివరించారు.

ఎర్దోగాన్
ఫొటో క్యాప్షన్, ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉందన్న టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్దోగాన్

మంగళవారం టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్దోగాన్ తన పాలక పక్ష ఎంపీలతో మాట్లాడుతూ, జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్యకు చాలా రోజుల ముందే పథకం పన్నారని చెప్పారు.

అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ కార్యాలయంలో ఖషోగ్జీని పక్కా పథకం ప్రకారం 'ఆటవికంగా' హత్య చేశారనడానికి టర్కీ వద్ద బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎర్దొగాన్ అన్నారు. అంతేకాదు, నిందితులను ఇస్తాంబుల్‌లోనే విచారించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

తమ ఎంపీలతో ఎర్దోగాన్ ఈ విషయాల మాట్లాడిన రోజే సౌదీ అరేబియాలో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ప్రారంభమైంది. ఖషోగ్జీ ఉదంతంతో ఆ సదస్సు తెరమరుగైంది. చాలా మంది ప్రభుత్వ, వ్యాపార ప్రముఖులు ఈ సదస్సు నుంచి తప్పుకున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం ఈ సదస్సులో పాల్గొన్నారు.

చాలా మంది నేతలు ఖషోగ్జీ హత్యలను తీవ్రంగా ఖండించారు. దీనిపై లోతైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ట్రంప్ కూడా సౌదీ అధికారుల మీద విమర్శలు చేసినప్పటికీ, అమెరికా మిత్రపక్షంగా సౌదీకి ఉన్న ప్రాధాన్యాన్ని కూడా గుర్తు చేశారు. ఈ విషయాన్ని విచారించడానికి సిఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్‌ను అమెరికా సౌదీకి పంపించింది.

సౌదీ ప్రభుత్వం ఏమంటోంది?

యువరాజు సల్మాన్ మంగళవారం నాడు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఒక ప్రకటన చేస్తూ, హంతకులు ఎవరైనా సౌదీ ప్రభుత్వం విడిచిపెట్టదని అన్నారు.

కింగ్ సల్మాన్ రియాద్‌లో ఖషోగ్జీ కుటుంబ సభ్యులను, ఆయన కుమారుడు సలాహ్ బిన్ జమాల్‌ను కలుసుకున్నారని స్థానిక మీడియా తెలిపింది.

సలాహ్ బిన్ జమాల్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జమాల్ ఖషోగ్జీ కుమారుడు సలాహ్ బిన్ జమాల్‌ను మంగళవారం నాడు రియాద్‌లో కలుసుకున్న సౌదీ యువరాజు

సౌదీ అరేబియా మొదటి నుంచీ ఈ విషయంలో పొంతన లేని ప్రకటనలు చేస్తూ వచ్చింది. మొదట ఖషోగ్జీ కాన్సులేట్ భవనం నుంచి క్షేమంగా బయటకు వెళ్ళిపోయారన ప్రకటించింది. ఆ తరువాత, కాన్సులేట్‌లో జరిగిన ఘర్షణలో ఆయన పిడిగుద్దుల మూలంగా చనిపోయారని మరో ప్రకటన చేసింది.

అయితే, ఖషోగ్జీ హత్యకు గురయ్యారని సౌదీ విదేశాంగ మంత్రి ఆదివారం నాడు ధ్రువీకరించారు. ఈ కుట్రకు సౌదీ నాయకత్వానికి ఏ సంబంధం లేదని ఆయన ప్రకటించారు.

"అధికార క్షేత్రంలోని వారితో సంబంధం లేని వ్యక్తులు ఈ పని చేశారు. ఇది కచ్చితంగా ఘోరమైన తప్పిదం. దాన్ని దాచి పెట్టాలని ప్రయత్నించడం మరో పెద్ద తప్పు" అని సౌదీ విదేశాంగ మంత్రి ఆదెల్ అల్-జుబేర్ ఫాక్స్ న్యూస్‌కు చెప్పారు.

అయితే, ఖషోగ్జీ మృతదేహం ఎక్కడ ఉందో తనకు తెలియదన్నారు. పేరు చెప్పని సౌదీ అధికారి ఒకరు ఆదివారం నాడు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ, సౌదీ అరేబియాకు తిరిగి రావాలంటూ కొందరు ఖషోగ్జీని ఒత్తిడి చేశారని, అందుకు ఆయన తిరస్కరించారని, చివరకు గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని చెప్పారు. ఆ తరువాత ఆయన మృతదేహాన్ని ఒక రగ్గులో చుట్టి స్థానిక 'సహాయకుడికి' ఇచ్చి, దాన్ని కనిపించకుండా చేయమని చెప్పారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ దగ్గర ఏం జరిగింది?

ఈ ఘటనకు సంబంధించి కొందరిని అరెస్ట్ చేయడమే కాకుండా, యువరాజు అనుచరగణంలోని ఇద్దరిని తొలగించినట్లు సౌదీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఈ హత్య నేపథ్యంలో తమ ఇంటలిజెన్స్ ఏజెన్సీని ప్రక్షాళన చేసేందుకు యువరాజు నేతృత్వంలో ఒక సంస్థను కూడా స్థాపించారు.

టర్కిష్, అరబిక్ ఇంటలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ అందించిన కథనం ప్రకారం, ఉద్వాసనకు గురైన ఆ ఇద్దరిలో ఒకరు, ఖషోగ్జీని ప్రశ్నిస్తున్నప్పుడు స్కైప్‌లో కనిపించారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిన తరువాత, "ఆ కుక్క తల తీసుకుని నా దగ్గరకు రండి" అని సౌద్ అల్-కహతానీ ఆదేశించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

ఆ స్కైప్ ఆడియో రికార్డింగ్ టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ వద్ద ఉందని, అయితే దాన్ని అమెరికాకు ఇవ్వడానికి ఆయన నిరాకరిస్తున్నారని ఆంతరంగిక వర్గాలు చెప్పాయి.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)