బుల్లెట్ రైలు: గడువులోగా పట్టాలెక్కుతుందా?- Reality Check

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
వాదన: 2022లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభిస్తామని, దాంతో దేశంలో 165 ఏళ్లుగా ఆపసోపాలు పడుతున్న రైల్వే రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.
తీర్పు: 2022లోగా కేవలం కొద్ది దూరం వరకు హై- స్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం వాగ్ధానం చేసిన గడువులోపే కాదు, 2023 వరకు కూడా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా కనిపించడంలేదు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్, మహారాష్ట్రలోని ముంబయి నగరాల మధ్య బుల్లెట్ రైలు లైను నిర్మించనున్నట్లు 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం జపాన్‌తో ఒప్పందం చేసుకుంది.
జపాన్ ఆర్థిక సాయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు 2017 సెప్టెంబర్‌లో ఇరుదేశాల ప్రధానమంత్రులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
"2022 ఆగస్టు 15లోగా ముంబయి- అహ్మదాబాద్ మధ్య హై- స్పీడ్ రైల్వే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం" అని భారత రైల్వే శాఖ పేర్కొంది.
అయితే, 2022లోగా కొద్ది దూరం వరకు మాత్రమే బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మిగతాది తరువాతి ఏడాది పూర్తి చేస్తామని ఈ ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించడంలో భాగస్వాములైన అధికారులు అంటున్నారు.
ఈ బుల్లెట్ రైలు ఒక "మ్యాజిక్ రైలు’’ అది ఎప్పటికీ పూర్తికాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
బుల్లెట్ రైలు ఎందుకు అవసరం?
భారత రైల్వే ప్రతి రోజూ దాదాపు 9,000 రైళ్లతో 22 మందికి అత్యంత చవకగా ప్రయాణ సేవలు అందిస్తోంది.
అయితే, రైల్వే సేవలు అధ్వానంగా ఉంటున్నాయని, వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రభుత్వాలు శ్రద్ధపెట్టడంలేదని ప్రయాణికుల నుంచి చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం భారత్‌లో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ప్రయోగాత్మక పరిశీలనలో ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అయితే, జపాన్ బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
దాదాపు రూ.1.1 లక్షల కోట్ల ఖర్చుతో చేపడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తయితే, దేశ ఆర్థిక రాజధాని ముంబయితో, గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్ లాంటి ప్రముఖ వాణిజ్య నగరాలు హైస్పీడ్ రైలు ద్వారా అనుసంధానమవుతాయి.
ప్రస్తుతం అహ్మదాబాద్- ముంబయి మధ్య 500 కిలోమీటర్ల ప్రయాణానికి 8 గంటల సమయం పడుతోంది.
బుల్లెట్ రైలు వస్తే 2 గంటల 7 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చని అధికారుల అంచనా.

ఈ ప్రాజెక్టుకు మొదట విధించిన గడువును 2022 నుంచి ఒక ఏడాది పొడిగించారు. అయితే, ఈ గడువులోపు కూడా పూర్తవ్వడం అసంభవమేనని కొందరు నిపుణులు అంటున్నారు.
"ప్రస్తుతం పనుల వేగం చూస్తుంటే గడువులోగా పూర్తవుతుందని నేను అనుకోవడంలేదు. దీనికి ప్రభుత్వ పరమైన అడ్డంకులు కూడా కొన్ని ఉన్నాయి" అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్‌కి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డెబోలినా కుందు బీబీసీతో చెప్పారు.
ఈ గడువు 'చాలా కష్టమైనది' అని ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ) ఛైర్మన్ అచల్ ఖరే పేర్కొన్నారు.
2022లోగా సూరత్, బిలిమోరా పట్టణాల మధ్య 48 కిలోమీటర్ల లైను పూర్తయ్యే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ చెబుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి పెట్టుకున్న గడువు గురించి మేము అడిగినప్పుడు 2023 డిసెంబర్ అని అధికారులు సమాధానమిచ్చారు.
భూసేకరణ ఎందుకు సమస్యగా మారుతోంది?
ఈ ప్రాజెక్టుకు ఎదురవుతున్న ప్రధానమైన సమస్య భూసేకరణ.
3,400 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంటుంది. అందులో, ఎక్కువ భాగం ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకోవాల్సిందే.
గతేడాది ఆఖరులోగా భూసేకరణ పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, 2019 మధ్య కాలం వరకూ పట్టేలా ఉందని ఇటీవల చెప్పారు.
ఇప్పటి వరకు 1000 మంది భూ యజమానులతో ఒప్పందం కుదిరిందని, మొత్తం దాదాపు 6,000 మందితో ఒప్పందం చేసుకోవాల్సి ఉందని ఫిబ్రవరిలో బీబీసీకి అధికారులు తెలిపారు.
"పరిహారం మెరుగ్గా" లేకపోవడం వల్లే యజమానులు తమ భూములు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిర్వహణ సంస్థ మాత్రం న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన దానికంటే 25 శాతం అధిక పరిహారం ఇస్తున్నామని చెబుతోంది.
భూసేకరణకు వ్యతిరేకంగా ఇటీవల కొన్నిచోట్ల ఆందోళనలు జరిగాయి, కోర్టుల్లో పలువురు కేసులు వేశారు. ఆ కేసులు కొలిక్కి వచ్చేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేం.
మరో ప్రధానమైన అడ్డంకి వణ్యప్రాణి, పర్యావరణ అనుమతులు రావడం. ఈ ప్రాజెక్టు మూడు వణ్యప్రాణి సంరక్షణ ప్రాంతా లనుంచి, తీర ప్రాంతాల్లోంచి వెళ్తోంది.
అలాగే, అటవీ ప్రాంతం కూడా అడ్డొస్తోంది. పర్యావరణానికి హాని కలిగించకుండా ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేస్తున్నారు? అన్న విషయాలను అధ్యయనం చేసిన తర్వాతే అక్కడ అనుమతులు వస్తాయి.



ఇవి కూడా చదవండి:
- లోక్‌సభ ఎన్నికలు 2019: ఏప్రిల్, మే నెలల్లో 7 విడతల్లో పోలింగ్
- వీవీపాట్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?
- లీగల్ హ్యాకింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న కుర్రాడు
- రాజీవ్ గాంధీ 1971 యుద్ధంలో దేశం వదిలి పారిపోయారా
- పాకిస్తాన్ అయోమయం: భారత వ్యతిరేక మిలిటెంట్ల విషయంలో ఏం చేయాలి?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- మోదీ బుల్లెట్ ట్రైన్‌పై గుజరాత్ రైతులు ఏమంటున్నారు?
- ఈ ఆరు సూత్రాలనూ పాటిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








