జనసేన: నరసాపురం బరిలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు

జనసేన

ఫొటో సోర్స్, janasena

నటుడు నాగబాబు జనసేన పార్టీ తరఫున నరసాపురం లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ రోజు నాగబాబు లాంఛనంగా జనసేన పార్టీలో చేరారు. ఆయన గతకొంత కాలంగా పవన్‌ పార్టీకి మద్దతిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్‌కు వ్యతిరేకమని భావించే వ్యక్తులు, మీడియా సంస్థల మీద సెటైర్లు వేస్తూ వస్తున్నారు.

నాగబాబు చేరిక సందర్భంగా పవన్ మాట్లాడుతూ ''కుటుంబ సభ్యులను దొడ్డిదారిన కాకుండా రాజమార్గంలో ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి బరిలోకి దింపుతున్నాం. తీర్పు ప్రజలే ఇస్తారు. నా పిలుపు మేరకు పార్టీకి వచ్చిన నాగుబాబుకు ధన్యవాదాలు. ఆయనను జనసేన పార్టీ అభ్యర్థిగా నరసాపురం నుంచి బరిలోకి దింపుతున్నాం. రాజకీయాల్లో నాగబాబు వల్లే చైతన్యం కలిగింది. నాకు ఆయన రాజకీయ గురువులాంటి వారు'' అని పవన్ పేర్కొన్నారు.

నాగబాబు మాట్లాడుతూ, తన సోదరుడు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారని కొనియాడారు. పేరుకు తనకు పవన్ సోదరుడైనప్పటికీ తనే నాకు నాయకుడు అని అన్నారు. ఆయన స్ఫూర్తితో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని చెప్పారు.

జనసేన

ఫొటో సోర్స్, janasena

నరసాపురంలో ఏ పార్టీ నుంచి ఎవరు?

ప్రస్తుతం నరసాపురం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా శివరామరాజు పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి రఘురామకృషం రాజు బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు గెలుపొందారు.

కాగా, జనసేన అధినేత పవన్ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు ప్రకటించిన జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితా

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)