టీడీపీ: నామా నాగేశ్వర రావు, ఎస్వీ మోహన్‌రెడ్డి రాజీనామా.. ఒకరు టీఆర్‌ఎస్‌లోకి, మరొకరు వైసీపీలోకి

నామా నాగేశ్వర రావు, ఎస్వీ మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, fb/namanageswararaoofficial/VijayBabuChadipirall

ఫొటో క్యాప్షన్, నామా నాగేశ్వర రావు, ఎస్వీ మోహన్ రెడ్డి

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ నేతల వలసలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఆశించిన చోట టికెట్ రాక కొందరు, ఫలానా పార్టీలో ఉంటే ప్రతికూల ఫలితాలు వస్తాయన్న అనుమానంతో మరికొందరు నేతలు ఇతర పార్టీలకు వెళ్లి టికెట్లు సాధిస్తున్నారు.

తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీడీపీ తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందంటూ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఈ ఇద్దరు నేతలు గతంలో తమ ప్రత్యర్థి పార్టీ నేతల గురించి ఏమన్నారు? ఇప్పుడు ఏం చెబుతున్నారు?

నామా నాగేశ్వర రావు

ఫొటో సోర్స్, TeluguDesamPartyTelangana

ఫొటో క్యాప్షన్, అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి నామా నాగేశ్వర రావు పోటీ చేశారు.

నామా నాగేశ్వర రావు

2018 నవంబర్‌లో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఖమ్మంలో ప్రజాకూటమి నిర్వహించిన బహిరంగ సభలో నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోదీలపై విమర్శలు చేశారు.

"కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లే. మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు. అందుకే విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రాలేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం తీసుకురాలేదు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని తేలేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు. కేసీఆర్ నామీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు సవాల్ చేస్తున్నా... నాపై చేసిన ఆరోపణల మీద చర్చకు మీరు సిద్ధమా?" అని నామా నాగేశ్వర రావు అన్నారు.

నామా నాగేశ్వర రావు, కేటీఆర్

ఫొటో సోర్స్, fb/namanageswararaoofficial

ఫొటో క్యాప్షన్, టీఆర్‌ఎస్‌లో చేరిన నామా నాగేశ్వర రావు

2019 మార్చి 21

గురువారం నాడు కేటీఆర్ సమక్షంలో నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన అన్నారు.

"పార్లమెంటులో తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటు వేసిన వ్యక్తిని నేను. తెలంగాణ బాగుపడాలని కోరుకున్నాను. గత అయిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చూసిన తర్వాత వారితో పాటు ఉండాలని ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరాను. రాబోయే కాలంలో మా నాయకుడు కేసీఆర్‌కు అండగా ఉంటూ, వారి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రం కోసం, ఖమ్మం అభివృద్ధి కోసం పనిచేస్తా. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేస్తా" అని నామా నాగేశ్వర రావు చెప్పారు.

ఎస్వీ మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, fb/S V Mohan Reddy

ఎస్వీ మోహన్ రెడ్డి

2019 మార్చిలో

టీడీపీని వదిలి వైసీపీలో చేరుతున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. తాను గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లి తప్పు చేశానన్నారు.

తనకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ మోసం చేసిందని, అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

"గతంలో వైసీపీని వదిలి తప్పు చేశాను. ఇప్పుడు నా తప్పును సరిదిద్దుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను. నాకు కర్నూలు టికెట్ ఇస్తామని టీడీపీ మోసం చేసింది. పార్టీ కోసం పనిచేశాను. రోజూ రాత్రి 10 గంటల వరకూ కష్టపడ్డాను. నెల క్రితం వరకూ సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు సర్వేల పేరు చెప్పి నాకు టికెట్ ఇవ్వలేదు. కానీ, సర్వేల వల్ల కాదు, డబ్బు ప్రభావం వల్లే నాకు టికెట్ రాకుండా పోయింది. నాకు, రేణుకకు టికెట్ ఇస్తామని లోకేశ్ చెప్పారు. కానీ, తర్వాత ఇద్దరికీ ఇవ్వలేదు. పార్టీలో ఉంటూ పదేపదే అవమానాలు పడాలని అనుకోవడంలేదు" అని ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు.

2017లో ఏమన్నారంటే..

2016లో వైసీపీని వదిలి టీడీపీలో చేరారు. 2017 జూన్‌లో ఆయన ఏమన్నారో చూడండి.

"పార్టీల కంటే నాకు ఓటేసి గెలిపించిన కర్నూలు ప్రజల అభివృద్ధే ముఖ్యం. నియోజకవర్గం అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యం. అందుకే, నేను టీడీపీలో చేరాను. కడప ఉక్కు కర్మాగారం ఇవ్వలేమని కేంద్రం అంటే జగన్ ప్రశ్నించలేదు. సొంత జిల్లాకే అన్యాయం జరుగుతుంటే ఆయన మౌనంగా ఉంటున్నారు. ఆయన మీద ఉన్న కేసులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్‌కు లేదు. సొంత జిల్లా సమస్య గురించి మాట్లాడని జగన్, రాష్ట్రాన్ని ఉద్దరిస్తారా?" అని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)