జూలియన్ అసాంజ్: లైంగిక వేధింపుల ఆరోపణలపై పునర్విచారణ

ఫొటో సోర్స్, Getty Images
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌పై 2010లో వచ్చిన అత్యాచార ఆరోపణలపై పునర్విచారణ చేయనున్నట్లు స్వీడన్ ప్రకటించింది. బాధితురాలి తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన అసాంజ్, 2012 నుంచి స్వీడన్ వెళ్లకుండా లండన్‌లోని ఈక్వడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు.
ఆయనను గత నెలలోనే రాయబార కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చి, బెయిల్ షరతులను ఉల్లంఘించారనే నేరంపై 50 వారాల జైలుశిక్ష విధించారు. ప్రస్తుతం అసాంజ్ లండన్‌లోని బెల్మార్ష్ కారాగారంలో ఉన్నారు.
అసాంజ్ ఈక్వడార్ ఎంబసీలో తలదాచుకోవడం వల్ల కేసు విచారణ ముందుకు వెళ్లడం లేదంటూ స్వీడన్ ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు అసాంజ్‌పై ఉన్న రేప్ కేసు విచారణను నిలిపివేద్దామని రెండేళ్ల క్రితం భావించారు.
కానీ, ఈ కేసు విచారణను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు స్వీడన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎవా మేరీ పెర్సన్ ప్రకటించారు.
"అసాంజ్ అత్యాచారం చేశారనే ఆరోపణలకు బలం చేకూర్చే అంశాలున్నాయి. ఆయన ఈక్వడార్ ఎంబసీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ కేసు విచారణకు అనువైన పరిస్థితులున్నాయి" అని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే, అసాంజ్‌ను తమకు అప్పగించాలని కోరుతున్న స్వీడన్, అమెరికాల్లో ఎవరి విజ్ఞప్తిని అంగీకరిస్తారో చూడాలి.
జూలియన్ అసాంజ్ ఎవరు?
జూలియన్ అసాంజ్.. అభిమానుల కోణంలో ఆయన సత్యం కోసం పోరాడుతున్న సాహస యోధుడు.
విమర్శకుల దృష్టిలో మాత్రం కేవలం ప్రచారం కోసం సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తూ ప్రజల జీవితాలను ముప్పులోకి నెడుతున్న వ్యక్తి.
ప్రభుత్వాలు, నేతలను ఇరుకునపెట్టేలా రహస్య పత్రాలు, సమాచారాన్ని ప్రచురించే వికీ లీక్స్ సంస్థను 2006లో స్థాపించారు జూలియన్ అసాంజ్.
అయితే, ఆ సంస్థ పేరు మార్మోగిపోయింది 2010 ఏప్రిల్‌లోనే.
హెలికాప్టర్‌లో నుంచి అమెరికా సైనికులు కాల్పులు జరుపుతూ ఇరాక్‌లో 18 మంది పౌరుల ప్రాణాలు తీసిన దృశ్యాలున్న వీడియో ఫుటేజీని వికీ లీక్స్ అప్పుడు బయటపెట్టింది.
అదే ఏడాది అసాంజ్‌పై లైంగిక దాడుల ఆరోపణలు మోపుతూ స్వీడన్ అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. బ్రిటన్‌లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ మహిళపై అత్యాచారం, మరో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అసాంజ్‌ను ప్రశ్నించాలని స్వీడన్ అధికారులు భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
2010 ఆగస్టులో స్టాక్‌హోమ్‌కు వచ్చిన సమయంలో ఆయన ఈ నేరాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ రెండు ఘటనలూ పరస్పర అంగీకారంతో జరిగిన లైంగిక చర్యలన్నది అసాంజ్ వాదన.
2010 డిసెంబర్‌లో అసాంజ్‌కు బ్రిటన్ సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, 2012 మేలో అసాంజ్‌ను స్వీడన్‌కు అప్పగించాలని ఆదేశించింది.
దీంతో అరెస్టును తప్పించుకునేందుకు తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయాన్ని అసాంజ్ కోరారు. అందుకు ఆ దేశం సమ్మతించింది.
దాదాపు ఏడేళ్లు ఆ రాయబార కార్యాలయంలో అసాంజ్ శరణార్థిగా ఉన్నారు.
2019 ఏప్రిల్ 11న అసాంజ్‌కు కల్పించిన రాజకీయ ఆశ్రయాన్ని ఈక్వెడార్ ఉపసంహరించుకుంది. బ్రిటన్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
'అంతర్జాతీయ ఒప్పందాలు, రోజూవారీ నిబంధనలను అసాంజ్ పదేపదే ఉల్లంఘించడం' తమ దేశ నిర్ణయానికి కారణమని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో ట్విటర్ ద్వారా వెల్లడించారు.
అది తమ సార్వభౌమిక నిర్ణయమని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
'అమెరికాకు అప్పగించేందుకే'
ఈక్వెడార్ రాయబార కార్యాలయం బయట అడుగు పెడితే తనను స్వీడన్ నుంచి అమెరికాకు తరలిస్తారని, అమెరికా రహస్య పత్రాలను బయటపెట్టినందుకు విచారిస్తారని అసాంజ్ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు.
అయితే అసాంజ్‌పై ఉన్న ఆరోపణలపై సరైన విచారణ జరపడం కోసమే ఆయన అప్పగింతను కోరుతున్నామని స్వీడన్ విదేశాంగ శాఖ వాదిస్తూ వచ్చింది.
2017లో అసాంజ్‌పైనున్న కేసుల విచారణలను ఆపివేస్తున్నట్లు స్వీడన్ అధికారులు ప్రకటించారు.
అయితే, అసాంజ్ ఈక్వెడార్ రాయబార కార్యాలయం బయట అడుగుపెడితే అరెస్టు చేయాల్సి ఉంటుందని లండన్ మెట్రో పాలిటన్ పోలీసులు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
పుట్టింది ఆస్ట్రేలియాలో..
సాధారణంగా తన నేపథ్యం గురించి మాట్లాడేందుకు అసాంజ్ పెద్దగా ఇష్టపడరు.
కానీ, వికీ లీక్స్ ఆవిర్భవించిన తర్వాత మీడియా ఆయన గురించి వివరాలను వెతకడం ప్రారంభించింది. కొన్ని విషయాలను తవ్వితీసింది.
ఆస్ర్టేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ర్టంలోని టౌన్స్‌విల్లేలో 1971లో అసాంజ్ జన్మించారు.
తల్లిదండ్రులు టూరింగ్ థియేటర్ నడిపేవారు కావడంతో ఆయన బాల్యం పలు చోట్ల గడిచింది.
18వ ఏటనే అసాంజ్ తండ్రయ్యారు. కుమారుడి కస్టడీ కోసం కోర్టుల చుట్టూ తిరిగారు.
ఇంటర్నెట్ అభివృద్ధితో గణితంలో తనకున్న ప్రావీణ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం అసాంజ్‌కు వచ్చింది. అందులోనూ ఇబ్బందులు తప్పలేదు.

ఫొటో సోర్స్, JULIA QUENZLER, BB
హ్యకింగ్ చేసినందుకు జరిమానా
ఓ స్నేహితుడితో కలిసి 1995లో అసాంజ్ హ్యాకింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి.
తమపై నిఘా పెట్టిన గూఢచారులపై తిరిగి నిఘాకు పాల్పడే సామర్థ్యం తమ బృందానికి ఉన్నప్పటికీ అసాంజ్ దొరికిపోయారు. నేరం చేసినట్లు అంగీకరించారు.
ఆయనపై కొన్ని వేల ఆస్ర్టేలియన్ డాలర్ల జరిమానా పడింది. మళ్లీ నేరానికి పాల్పడకూడదన్న షరతుకు ఒప్పుకొని జైలు శిక్షను తప్పించుకున్నారు.
ఇంటర్నెట్ చీకటి కోణాలపై పరిశోధనలు చేస్తున్న రచయిత్రి స్యూలెట్ డ్రేఫస్‌తో కలిసి మూడేళ్లు పనిచేశారు. ఆమెతో కలిసి 'అండర్‌గ్రౌండ్' అనే పుస్తకాన్ని రచించారు. కంప్యూటింగ్ రంగంలో ఆ పుస్తకానికి విశేష ఆదరణ దక్కింది.
''చాలా నిపుణుడు. నైతిక విలువలు, న్యాయం వంటి అంశాలపై, ప్రభుత్వాలు ఏం చేయాలి, ఏం చేయకూడదన్న విషయాలపై ఆయనకు బాగా ఆసక్తి'' అంటూ అసాంజ్ గురించి గతంలో డ్రేఫస్ వివరించారు.
ఆ పుస్తకం పూర్తయ్యాక మెల్‌బోర్న్ యూనివర్సిటీలో భౌతికశాస్త్రం, గణితంలో అసాంజ్ కోర్సు చేశారు. ఓ పెద్ద పజిల్‌ను ఆవిష్కరించి, అక్కడ ఆయన బాగా పేరు తెచ్చుకున్నారు. సహచరుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇంటర్నెట్ ద్వారా తన లాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులతో కలిసి 2006లో అసాంజ్ వికీ లీక్స్ వేదికను ప్రారంభించారు.
''మాకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు మేం సమాచారం మొత్తం ఎన్‌క్రిప్ట్ చేసేవాళ్లం. వివిధ దేశాల్లో ఉన్న పరిరక్షణ చట్టాలను ఉపయోగించుకుంటూ మా ఉద్యోగులు, టెలికమ్యూనికేషన్స్‌ను ప్రాంతాలు మార్చుతూ ఉండేవాళ్లం'' అని 2011లో బీబీసీతో అసాంజ్ చెప్పారు.
''ఈ విషయంలో మేం నైపుణ్యం సంపాదించుకున్నాం. ఒక్కసారీ విఫలమవ్వలేదు. మా లాగే అందరూ అంతగా కష్టపడతారని అనుకోవట్లేదు'' అని అన్నారు.
అసాంజ్ సంచార జీవన శైలిని పాటించారు. తరచూ ప్రాంతాలు మారుతూ వికీ లీక్స్‌ను నడిపించారు.
''అసాంజ్ తిండీతిప్పలు లేకుండా పనిచేస్తూనే ఉంటారు. పెద్దగా నిద్ర పోకున్నా పనిపై ఏకాగ్రత కోల్పోరు'' అంటూ అసాంజ్‌తో కలిసి కొన్నివారాల పాటు ప్రయాణం చేసిన న్యూయార్కర్ మ్యాగజైన్ పాత్రికేయుడు రాఫి ఖట్చడోరియన్ చెప్పారు.
''తన చుట్టూ ఉన్నవారు తనపై ప్రేమ చూపించే వాతావరణాన్ని అసాంజ్ సృష్టించుకుంటారు. ఆయనకు ఆ కరిష్మా ఉందన్నది నా అభిప్రాయం'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
'మచ్చ వేయాలన్న ప్రయత్నం'
ఇరాక్ పౌరులపై అమెరికా హెలికాప్టర్ కాల్పుల వీడియో బయటపెట్టడంతో వికీ లీక్స్, అసాంజ్ పేరు ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ఆ వీడియో విడుదలను.. అఫ్గాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించి అమెరికా సైనిక పత్రాలు బయటపెట్టడాన్ని అసాంజ్ సమర్థించుకున్నారు.
ఆ తర్వాత అమెరికాలోని నిఘా సంస్థ స్ట్రాట్ఫర్‌కు చెందిన 50 లక్షల రహస్య ఇ-మెయిళ్లు సహా పెద్ద సంఖ్యలో పత్రాలను వికీ లీక్స్ బయటపెట్టింది.
వికీ లీక్స్‌కు విరాళాలు అందకుండా అమెరికా ఆర్థిక సంస్థలు అడ్డుపడటంతో 2010లో ఆ సంస్థ మనుగడ కోసం కష్టపడే పరిస్థితి ఏర్పడింది.
అసాంజ్‌పై వచ్చిన లైంగిక దాడుల ఆరోపణలు, వాటిపై విచారణకు సంబంధించిన విషయాలే ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి.

ఫొటో సోర్స్, AFP/getty images
తనపై, నిర్భయంగా పనిచేసే వికీ లీక్స్‌పై మచ్చ వేసేందుకు రాజకీయ దురుద్దేశాలతో ఈ కేసులు పెట్టారని అసాంజ్ ఆరోపిస్తూ వచ్చారు.
ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఉండగా అసాంజ్ అప్పడప్పుడూ పత్రిక ప్రకటనలు, ఇంటర్వ్యూలు ఇచ్చేవారు.
2012 అక్టోబర్‌లో అసాంజ్ అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు సంకేతాలిస్తూ ఈక్వెడార్ రాయబార కార్యాలయం కూడా ఆందోళనలు వ్యక్తం చేసింది.
అయితే తాను వైద్య చికత్సల కోసం రాయబార కార్యాలయం వదిలి బయటకు వస్తున్నట్లు వచ్చిన కథనాలను 2014 ఆగస్టులో అసాంజ్ ఖండించారు.
రాయబార కార్యాలయం వదలలేని పరిస్థితి కల్పించి చట్ట విరుద్ధంగా తనను నిర్బంధంలో ఉంచారని ఐరాసకు అసాంజ్ ఫిర్యాదు చేశారు.
2016 ఫిబ్రవరిలో ఐరాస ప్యానెల్ అసాంజ్‌కు అనుకూలంగా ఆదేశం ఇచ్చింది. ఆయనను స్వేచ్ఛగా తిరగనివ్వాలని కోరింది.
అయితే చట్టపరంగా దాన్ని పాటించాల్సిన అవసరం బ్రిటన్‌కు లేకపోవడంతో పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు.

అసలు వారెంట్ రద్దైనా..
అత్యాచార కేసులో అసాంజ్‌ను ప్రశ్నించేందుకు స్వీడన్ ప్రధాన విచారణాధికారి ఇంగ్రిడ్ ఇస్గ్రెన్ ఈక్వెడార్ రాయబార కార్యాలయానికి వెళ్లారు.
అసాంజ్‌పై అభియోగాల నమోదులో తీవ్ర జాప్యం జరుగుతున్న కారణంగా విచారణలు నిలిపివేయాలన్న నిర్ణయానికి స్వీడన్ అధికారులు వచ్చారు.
దీంతో అసాంజ్‌పై జారీ అయిన అరెస్ట్ వారెంట్ రద్దైపోయింది.
అయితే 2012లో వెస్ట్ మినిస్టర్ మెజిస్ర్టేట్ కోర్టు అసాంజ్‌ను లొంగిపోవాలని ఆదేశించింది. వాటిని ధిక్కరించినందుకు అసాంజ్‌ను అరెస్టు చేయకతప్పదని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు.
అసాంజ్ అరెస్టైతే గానీ ఆయన్ను అప్పగించాలని ఇతర దేశాలు చేసిన అభ్యర్థనల గురించి తాము వెల్లడించలేమని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.
అమెరికాకు ఆయన్ను అప్పగిస్తారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
2017 డిసెంబర్‌లో అసాంజ్‌కు ఈక్వెడార్ పౌరసత్వం ఇచ్చింది. అసాంజ్‌ను తమ దౌత్యవేత్తగా గుర్తించాలని ఈక్వెడార్ చేసిన అభ్యర్థనను బ్రిటన్ తిరస్కరించింది.
ఒకవేళ దీన్ని ఆమోదిస్తే అసాంజ్‌పై చట్టపరమైన చర్యలుండేవి కావు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో తుపాకుల మోతను ఆపలేరా?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ శాతం 76.69
- పాకిస్తాన్: క్వెటాలో బాంబు పేలుడు, 16 మంది మృతి
- ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- ‘హేమమాలిని ఫొటో కోసం కొడవలి పడితే, మేం కడుపు కోసం కష్టం చేస్తున్నాం’
- ఆర్థిక వ్యవస్థ ఎక్కడుంది? అంబానీ ఆస్తి ఎంత పెరిగింది?
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- ఆమెకు కత్తితో కోసినా నొప్పి తెలియదు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








