పాకిస్తాన్: క్వెటాలో బాంబు పేలుడు, 16 మంది మృతి

క్రెటాలో బాంబు పేలుడు

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రాజధాని క్వెటా నగరంలోని హజార్‌గంజ్ ప్రాంతంలో ఒక బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందారు.

స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఉదయం ఎనిమిది గంటల (పాకిస్తాన్ కాలమానం) సమయంలో ఒక కూరగాయల బజారులో బాంబు పేలింది.

బజారులో ఉన్న పోలీసు వ్యాన్ లక్ష్యంగా ఈ బాంబు పేలుడు జరిగినట్లు పోలీసులు వెల్లడించారని వార్తా ఏజెన్సీ ఏపీపీ తెలిపింది.

డీఐజీ అబ్దుల్ రజాక్ చీమా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘బాంబు పేలుడులో పదహారు మంది చనిపోయారు. వీరిలో ఎనిమిది మంది హజారా (షియా) వర్గానికి చెందినవారు. ఒక జవాను, ఏడుగురు బజారులో పనిచేసేవారు’’ అని వెల్లడించారు.

క్రెటాలో బాంబు పేలుడు

‘‘భద్రతా బలగాలకు చెందిన వాహనం ఒకటి కూరగాయల బజారులోని బంగాళాదుంపల దుకాణం సమీపానికి చేరుకున్నప్పుడు ఈ పేలుడు జరిగింది’’ అని ఆయన చెప్పారు.

‘‘ఈ బాంబు దాడిలో ఐఈడీ ఉపయోగించారా లేక వేరే ఏమైనా వాడారా అన్నది విచారణలోనే తేలుదుంది’’ అని తెలిపారు.

ఇది ఆత్మాహుతి దాడా? అని ప్రశ్నించగా.. ఈ విషయం కూడా విచారణ తర్వాతే తేలుతుందన్నారు.

ఈ దుర్ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)