‘హేమమాలిని ఫొటో కోసం కొడవలి పడితే, మేం కడుపు కోసం కష్టం చేస్తున్నాం’: అభిప్రాయం

ఫొటో సోర్స్, BBC/FACEBOOK/DREAMGIRLHEMAMALIN
- రచయిత, పూనమ్ కౌశల్
- హోదా, బీబీసీ హిందీ కోసం
రాజేంద్రీ దేవి తన చిన్న చిన్న మనవరాళ్లతో గోధుమ పంటను కోస్తున్నారు. ఆమె శరీరం చెమటతో తడిచిపోయుంది.
గోధుమ కోతలను పంట పనుల్లో చాలా కష్టమైనదిగా చెబుతారు. ఎండలు మండిపోతున్నప్పుడు అది చాలా కఠినంగా ఉంటుంది.
అందుకే భూస్వాములు గోధుమ పంటను తమ చేత్తో కోయకుండా రాజేంద్రీ దేవి లాంటి కూలీలను పనికి పెట్టుకుంటారు.
రాజేంద్ర దేవి మూడు గుంటల గోధుమ పొలంలో కోస్తున్నారు. ఆమె భర్తతోపాటు వారి చిన్న చిన్న తొమ్మిది మంది మనవరాళ్లు కూడా అదే పని చేస్తున్నారు.
ఈ పొలంలో కోతకు వారికి వారం పట్టచ్చు. బదులుగా వారికి 120 కిలోల గోధుమలు ఇస్తారు.
"మేం ఇక్కడ కూలి చేస్తున్నాం. వేరే వేరే పొలాలకు వెళ్లి గోధుమ పంట కోస్తాం. మూడు గుంటల కోతకు 120 కిలోల గోధుమలిస్తారు" అని రాజేంద్రీ దేవి అన్నారు.
‘‘రోజుకు 200-250 కూలి కూడా సరిపోదు. ఆ డబ్బుతో ఏమొస్తుంది. ఒక కిలో నూనె కూడా రాదు. ఈ పని చాలా కష్టం. అప్పుడప్పుడు కూలి కూడా దక్కదు. కష్టం చేయించుకుని తరిమేస్తారు. మేం చాలా దూరం నుంచి వస్తాం" అన్నారు.
రాజేంద్రీ దేవీ భూమిలేని కూలీ. ఆరేళ్ల ముందు ఆమె కొడుకు, కోడలు చనిపోవడంతో తొమ్మిది మంది మనవరాళ్ల పొట్ట నింపే బాధ్యత ఇప్పుడు ఆమెపైనే పడింది.

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC
ప్రభుత్వ పథకాలతో ఏం దక్కింది
గోధుమ కోత పనికి వెళ్లే ఆమె ఏడాదంతా పిల్లలకు తిండి లోటు లేకుండా చూసుకుంటారు. ప్రభుత్వ పథకాల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనాలూ లభించలేదని రాజేంద్ర దేవి చెప్పారు.
"ఏ ప్రభుత్వం నుంచీ మాకు సాయం అందలేదు. ఎంత కష్టంగా ఉందో చెప్పలేం. ఎవరూ ఏమీ ఇవ్వరు. మేం పెన్షన్ ఇవ్వమని అడిగాం. పిల్లల కడుపు నింపాలనుకున్నాం. కానీ ఎవరూ సాయం చేయలేదు. పిల్లలకు వాళ్లనూ వీళ్లనూ అడిగి తెచ్చిన బట్టలు వేస్తా" అన్నారు.
తన చినిగిపోయిన చొక్కాను చూపిస్తూ ఆమె "మాకు ఈ చిరిగిన బట్టలే గతి. కూలి చేయక తప్పదు. మా ప్రాణం పోయేవరకూ ఈ కూలి చేసుకుంటూ బతకాల్సిందే" అన్నారు.
ఇటీవల మధుర ఎంపీ హేమమాలిని ఒక చేతిలో కొడవలి, మరో చేతిలో గోధుమ కంకులు పట్టుకున్న ఫొటో చాలా వైరల్ అయ్యింది. డ్రీమ్ గర్ల్ హేమమాలిని అధికార పార్టీ పోస్టర్ గర్ల్ కూడా.
కానీ, ప్రభుత్వ పథకాల వైఫల్యం గురించి ఏదైనా పోస్టర్ వేస్తే మాత్రం రాజేంద్రీ దేవి లాంటి వారు దానికి పోస్టర్ గర్ల్ అవుతారు.

ఫొటో సోర్స్, @dreamgirlhema/TWITTER
కనిపించని అభివృద్ధి
రాజేంద్రీ దేవి గోధుమలు కోస్తున్న పొలం యమునా ఎక్స్‌ప్రెస్‌వేతో కలుస్తోంది.
ఒక వైపు దేశంలో వేగంగా పరుగులు తీస్తున్న అభివృద్ధి, మరోవైపు తప్పనిసరి స్థితిలో జీవితం ఎప్పుడు ముగుస్తుందా అని వేచిచూసే ఒక కూలీ.
పిల్లలతో పంట కోయించడం గురించి ప్రశ్నిస్తే ఆమె "ఎంతో కొంత వస్తుంది కదా.. పదీ, పదిహేను కిలోల గోధుమలైనా వస్తాయి. ఆకలితో ఉన్న పిల్లలను తిన్నారా.. అని ఈ సమాజం, ప్రభుత్వం ఎవరూ అడగరు. మేం ఎవరికీ అవసరం లేదు" అన్నారు.
ఆమె మనవరాళ్లు "మేం ఉదయం ఏడు గంటలకు పొలంలోకి వచ్చేస్తాం. సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడే ఉంటాం. రోజంతా గోధుమ పంట కోస్తాం" అని చెప్పారు
పొలం యజమాని సత్యపాల్ సింగ్ "హేమమాలిని కొడవలితో ఫొటో తీసుకుని షో చేశారు. నిజానికి గోధుమ కోత అంత సులభం కాదు. అది చాలా కష్టం. రోజంతా ఎండలో చెమటోడ్చాలి. అది మావల్లే కాదు, ఆమేం కోస్తారులే" అన్నారు.

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC
భూమిలేని రైతుల పరిస్థితి
భూమిలేని రైతు కుటుంబాల్లో గోధుమల కోతలకు తరచూ మహిళలే వెళ్తుంటారు. ముగ్గురు పిల్లల తల్లైన పింకీ కూడా తన కుటుంబంతో కలిసి కోతలకు వెళ్తారు.
గోధుమ పంట కోసి కోసి ఆమె అరచేతుల్లో కాయలు కాశాయి.
"చేతుల్లో చాలా నొప్పిగా ఉంటుంది. ఇది చాలా కష్టం. కానీ ఈ పనికి ఇచ్చేది కడుపు నింపడానికి సరిపోతుంది. కోతలకు డబ్బుకు బదులు, గోధుమలే ఇస్తారు" అని పింకీ చెప్పారు
"మా పేదల కోసం ఎవరకూ ఏం చేయరు. ఓట్లు వేస్తాం. గెలిచిన తర్వాత ఎవరూ ఏదీ అడగరు. మట్టి ఇంటిలోనే ఉంటున్నా మాకు ఎవరూ ఏం ఇవ్వరు. ఎన్నికల్లో ఉచితంగా మందు మాత్రం పంచుతారు. పీకల దాకా తాగమంటారు. మాలాంటి వారికి ఏదీ ఇవ్వరు" అన్నారు పింకీ.

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC
రాత్రంతా కన్నీళ్లతో జాగారం
సావిత్రి దేవి కూడా భూమిలేని కూలీనే. ఆమె ఉదయం మొదట ఇంట్లో పని చేసి, తర్వాత పంట కోతకు వెళ్తారు. రోజంతా పొలం పని చేశాక పొద్దుపోయి ఇంటి చేరితే ఆమెకు విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఉండదు. కుటుంబంలో అందరికీ రోటీ చేసిన తర్వాతే ఆమెకు ప్రశాంతత.
సావిత్రి దేవి భర్త ఎక్కువగా మద్యం మత్తులోనే ఉంటాడు. ఏదైనా అడిగితే చేయిచేసుకుంటాడు. దాంతో రాత్రి కన్నీళ్లతోనే గడిచిపోతుందని ఆమె చెప్పారు.
‘‘ప్రభుత్వం మా పేదల కోసం ఏం చేయదు, కానీ తాగుబోతులకు మద్యం అందిస్తుంది. మా ఆయన ఎప్పుడూ తిడుతూ, కొడుతూనే ఉంటాడు. తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాడు. రోజంతా ఆకలితో ఉన్న పిల్లలతో అడవిలోనే పడుండాల్సి వస్తుంది.’’
‘‘సరుకులన్నిటి ధరా పెరిగింది. నూనె, కూరగాయల ధర కూడా పెరిగింది. పిల్లలను ఎలా పోషిస్తున్నాం అనేది ఎవరికీ తెలీదు. తాగుబోతులేమో మద్యం తాగి పడుకుంటారు. నలుగురు పిల్లలను ఎలా పెంచుతున్నానో మా ఆయనకేం తెలుస్తుంది?’’

ఫొటో సోర్స్, @dreamgirlhema/TWITTER
ఫొటో తీసుకోవడం వేరే, పంట కోయడం వేరే
అటు దేశ రాజధాని దిల్లీ నుంచి కాస్త దూరంలో ఉన్న దాద్రీ ప్రాంతంలోని ఒక గ్రామంలో కశ్మీరీ నిరుద్యోగులైన తన ఇద్దరు కొడుకులతో కలిసి గోధుమ పంట కోస్తున్నారు.
హేమమాలిని ఫొటో చూసిన కశ్మీరీ.. ‘‘ఫొటో తీసుకోవడం వేరే, గోధుమలు కోయడం వేరే అన్నారు. వ్యవసాయం చాలా కష్టం. ఇలా ఫొటో తీసుకోవడం మా కష్టాన్ని వేళాకోళం చేయడమే’’ అన్నారు.
కశ్మీరీ తల నుంచి చెమట కిందికి కారుతోంది. "కూలి పనులు చేసుకోక తప్పదు. ఎండలో ఇది చాలా కష్టం. ముగ్గురు నలుగురు పనిచేసినా రోజంతా ఒక గుంట కూడా కోయలేరు. పిల్లల కడుపు నింపాలి కాబట్టి అంత పనీ చేస్తున్నా" అన్నారు.
రాజేంద్రీ దేవి లాగే కశ్మీరీకి కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలేవీ అందలేదు. పొలం కోసినందుకు ఆమెకు గోధుమలు ఇస్తారు అంతే.
"మట్టితో కట్టిన గుడిసెలో ఉంటున్నాం. గ్రామంలో మాదొక్కటే మట్టిల్లు. కానీ ఎవరూ మాకు ఇల్లు కట్టించలేదు".
ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద కశ్మీరీ లాంటి పేద కుటుంబాలకు ఇల్లు నిర్మించుకోడానికి ప్రభుత్వం రెండున్నర లక్షల రూపాయల సాయం అందిస్తుంది.
కానీ కశ్మీరీకి సాయం చేయడానికి ఇప్పటివరకూ ఎవరూ రాలేదు. తన కోసం పరుగులు తీసేవారు కూడా ఎవరూ లేరని ఆమె చెబుతారు.
అక్కడకు కాస్త దూరంలో జయపాలీ కూడా తన పక్కింటి మహిళతో కలిసి గోధుమ పంట కోస్తున్నారు.
ఆమె కూడా కశ్మీరీ, రాజేంద్రీలాగే కష్టాలు పడుతోంది. "ఏడాదంతా తిండికి లోటు లేకుండా ఉండాలనే ఇంత కష్టం చేస్తున్నా" అన్నారు.
"ఏం పనోగానీ, ఎండల్లో చచ్చిపోతున్నాం. పని చేయకుంటే పిల్లలనెలా చాకాలి. ఎండైనా, చలైనా మేం కష్టం చేయాల్సిందే"

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC
కరెంటు బిల్లు ఎలా కట్టాలి
"మొదట కరెంటు బిల్లు తక్కువొచ్చేది. ఇప్పుడు నెలకు వెయ్యి రూపాయలు వస్తోంది. మాలాంటి పేదలు అంత బిల్లు ఎలా కట్టగలరు. దాంతో అది పేరుకుపోయి 35 వేలైంది. ఎవరైనా మా బిల్లు తగ్గిస్తే, పుణ్యం ఉంటుంది" అన్నారు జయపాలీ.
ఆమెకు ప్రభుత్వాలు, పార్టీల హామీలపై ఎలాంటి నమ్మకం లేదు. కానీ ఆమెకు డబ్బులు నేరుగా పేదల ఖాతాలో పడే పథకం గురించి చెబితే "అలా జరిగితే, డబ్బు నేరుగా మా ఖాతాలోనే పడితే, మేం ఇక్కడ ఇంత కష్టం ఎందుకు చేస్తాం" అన్నారు.
అక్కడికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో గంగానహర్ తీరంలో మీరట్ జిల్లాలోని భోలాఝాల్ మహిళ మున్నీ దేవి తన కూతుళ్లను తీసుకుని అడవిలోకి వెళ్తున్నారు.
ఆమె చేతిలో కత్తి ఉంది.
"కట్టెలు కొట్టడానికి వెళ్తున్నా, సాయంత్రం పొయ్యి మండాలన్నా, కడుపు నిండాలన్నా అడవిలో కట్టెలు కొట్టుకురావాల్సిందే" అన్నారు మున్నీ.
కేంద్రం ఉజ్వల యోజన ప్రయోజనాలు మున్నీకి చేరలేదు. ఆమెతోపాటు కట్టెలు కొట్టడానికి వెళ్తున్న మైనర్ బాలిక నిషా తన చదువు కూడా కొనసాగించాలని అనుకుంటోంది. కానీ ఇంట్లోవారు ఆమెకు త్వరలోనే పెళ్లి చేసేయాలని అనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC
అప్పుడే పెళ్లి చేసుకోవడం నిషాకు ఇష్టం లేదు.
"కానీ అమ్మానాన్నకు తప్పడం లేదు. ఇంట్లో ఏం లేదు. అప్పులైపోయాం. ఇల్లు కూడా తాకట్టు పెట్టాం. అందుకే నాకు వేరే దారి లేకుండా పోయింది" అంది నిషా.
"డబ్బులు లేక చదువు ఆగిపోయింది. నాన్న వ్యాపారి నుంచి 40 వేలు అప్పు తెచ్చాడు. అది పెరిగి ఇప్పుడు రెండున్నర లక్షలైంది. మమ్మల్ని ఏదో ఒక రోజు ఇంటి నుంచి తరిమేస్తారు" అంది.
కట్టెలు కొట్టడానికి వెళ్తున్న మున్నీ దేవి, ఆ పని అయ్యాక గోధుమ కోతకు వెళ్లాలి. ఆమెకు తినడానికి గోధుమలే కాదు, పొయ్యి మండడానికి కట్టెలు కూడా కావాలి.
కూతురు చదువు మాన్పించేయడం ఆమెకు కూడా బాధ కలిగిస్తోంది. "మా పేదలకు ఎలాంటి సాయం అందదు. కూతురి పెళ్లైనా అయితే ఒక దిగులు తీరుతుంది" అన్నారు.
మున్నీ భర్త కూడా కూలి పనులకు వెళ్తాడు. కానీ చీకటి పడితే మద్యం తాగి వచ్చి గొడవ చేస్తుంటాడు.
ఈ ఎన్నికల సీజన్లో ఏ నేతనూ వారు నమ్మడం లేదు. "మాలాంటి పేదల కోసం ఎవరూ ఏదీ చేయరు. మీరైనా ఏదైనా చేస్తే పుణ్యం ఉంటుంది" అన్నారు.
నేను కలిసిన గోధుమ పంట కోస్తున్న మహిళలందరూ దళితులే. హేమమాలిని పొటో చూసిన వారికి, ఆమె తమ కష్టాలను వేళాకోళం చేసినట్టు అనిపించింది.

ఫొటో సోర్స్, POONAM KAUSHAL/BBC
రుణమాఫీ పథకం ఎక్కడ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల రైతులకు రుణమాఫీ ప్రకటించాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కిసాన్ సమ్మాన్ నిధి' కింద నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో రెండు వేల రూపాయలు కూడా వేస్తున్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం అందించే ఇలాంటి రైతు సంక్షేమ పథకాల ప్రయోజనం రాజేంద్రీ, జయపాలీ లాంటి కూలి పనులు చేసుకుని బతికే మహిళలకు అందడం లేదు.
ప్రభుత్వ ప్రయోజనాలు పక్కన పెడితే, భూమిలేని ఈ మహిళా కూలీలకు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడమే గగనంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశం ఎన్నికలు... ఆరు వారాల పెళ్ళి సంబరాలు
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: సముద్రం మధ్యలో పోలింగ్..
- ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది...
- 'అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా': కల్యాణదుర్గం సభలో రాహుల్ గాంధీ
- పవన్ కల్యాణ్, రాహుల్ గాంధీల తరహాలో రెండు స్థానాల్లో పోటీ చేసిన నేతలెవరు?
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
- రెండు స్థానాల నుంచి రాహుల్ గాంధీ పోటీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








