ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: సముద్రం మధ్యలో పోలింగ్..

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేశారు.
అందులో భాగంగా ఏజన్సీలోని మారుమూల గ్రామాలతో పాటు సముద్రంలో ఉన్న ద్వీప గ్రామాల్లోనూ పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్‌లో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
దాంతో సముద్రం మధ్యలో ఉన్న ఆ గ్రామంలో పోలింగ్ కోసం సిబ్బంది సముద్ర జలాలపై పయనమయ్యారు.

తాళ్లరేవు మండలం కోరింగ పంచాయితీ పరిధిలోని హోప్ ఐలాండ్ పరిధిలో సుమారు 110 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది వలస జీవులు.
పూర్తిగా మత్స్యకారులు నివసించే ఈ గ్రామం వారికి సముద్రంలో వేట ప్రధాన ఆధారం.
ఇటీవల సముద్ర సంపద తక్కువగా లభ్యం అవుతుండడంతో యానాం, కాకినాడ వంటి ప్రాంతాల్లో పనుల కోసం పలువురు వలస వెళ్లిపోయారు.
ఈ గ్రామంలో ఇంతవరకు పోలింగ్ కేంద్రం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటు వేయడానికి వారు పడవలపై సముద్రం దాటి తీర ప్రాంతానికి వచ్చేవారు.
అవి సాధారణ ఎన్నికలయినా, లేక స్థానిక సంస్థల ఎన్నికలైనా వారికి ఈ సమస్య తప్పేది కాదు.
ఈసారి ప్రభుత్వ యంత్రాంగం హోప్ ఐలాండ్ లోనే పోలింగ్ నిర్వహణకు సన్నాహాలు చేసింది. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ నెంబర్ 218 స్టేషన్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ మొత్తం ఓటర్లు 288 మంది ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అందులో మహిళలు 134 మంది.

గ్రామం నుంచి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా ఓటింగ్ కోసం వచ్చే అవకాశం ఉందని 90శాతం పైగా పోలింగ్ నమోదవుతుందనే అంచనాలో ఉన్నట్టు ప్రొసీడింగ్ అధికారి కల్యాణ్ మనోహర్ అభిప్రాయపడ్డారు.
తొలిసారిగా పోలింగ్ నిర్వహిస్తుండడంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్టు బీబీసీతో చెప్పారు.
‘‘మొత్తం 12 మంది సిబ్బంది ఈసారి ఎన్నికల నిర్వహణ కోసం హోప్ ఐలాండ్ చేరుకున్నాం. ముమ్మిడివరం నుంచి ప్రత్యేక వాహనంలో కాకినాడ వచ్చి అక్కడి నుంచి బోటులో రెండు గంటల సముద్ర ప్రయాణంలో హోప్ ఐల్యాండ్ చేరుకున్నాం. నలుగురు మహిళా సిబ్బంది సహా పోలీసులూ ఉన్నారు. రాత్రికి ఐల్యాండ్ లో బస చేసి ఎన్నికల నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటలకు మాక్ లైవ్, ఆతర్వాత పోలింగ్ ప్రారంభిస్తాం. సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంలు తీసుకుని మళ్లీ సముద్రం నుంచి వెనక్కి వస్తాం’’ అంటూ ఆయన వివరించారు.

సముద్రం మధ్యలోని లంకలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రావడంపై హోప్ ఐలాండ్ వాసులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి చెందిన వెంకట రమణ బీబీసీతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
‘‘మా తాతలు తండ్రులు ఓటు వేయాలంటే బోటులో వెళ్లాల్సి వచ్చేది. ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఈసారి మాకు ఇక్కడే ఓటు హక్కు కల్పించడం సంతోషంగా ఉంది.
గ్రామంలో సౌకర్యాలు సరిగా లేవు. ఉపాధి కల్పించి మమ్మల్ని ఆదుకుంటే మంచిది’’ అని రమణ తెలిపారు.
గ్రామంలో సెల్ ఫోన్ కవరేజ్ కూడా ఉండకపోవడంతో ఇక్కడి పోలింగ్ పరిస్థితిని పర్యవేక్షించేందుకు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఐల్యాండ్ లో పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక వసతులు కూడా కల్పించేందుకు బోటు కూడా ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









