స్కాట్ కెల్లీ: ‘గంటకు 50,400 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టడానికి వస్తోంది.. మళ్లీ భూమి మీదకు వస్తామో లేదో తెలియని పరిస్థితి’

ఫొటో సోర్స్, NASA
- రచయిత, పాల్ రింకన్
- హోదా, సైన్స్ ఎడిటర్, బీబీసీ న్యూస్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో ఒక ఏడాది కాలం ఎలా గడపాలో, అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎలా నిలదొక్కుకోవాలో వ్యోమగామి స్కాట్ కెల్లీ వివరించారు.
స్పేస్ స్టేషన్‌లో తన అనుభవాలను ఆయన బీబీసీతో పంచుకున్నారు.
నాసా నుంచి పదవీ విరమణ పొంది నాలుగేళ్లు అయిపోయినా..మళ్లీ స్పేస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా వెళతానని కెల్లీ అంటున్నారు.
2015, జులై 16వ తేదీ.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న ముగ్గురు వ్యోమగాములూ రష్యన్ సోయుజ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఇరుక్కుని కూర్చున్నారు.
ఇది, అత్యవసర పరిస్థితుల్లో లైఫ్‌బోట్‌గా పనిచేసే ఒక అంతరిక్ష నౌక.

ఫొటో సోర్స్, NASA
అంతరిక్షంలో పనిచేయడం ఆగిపోయిన ఒక పెద్ద శాటిలైట్..సెకండ్‌కు 14 కి.మీ. (గంటకు 50,400 కి.మీ.) వేగంతో వాళ్లున్న స్పేస్ స్టేషన్ దిశగా వస్తోందని మిషన్ కంట్రోల్ టీంనుంచీ కబురు అందింది.
అది వీళ్లకు దగ్గరగా వస్తున్నట్లు తెలుస్తోందిగానీ ఎంత దగ్గరగా వస్తోంది..పక్కనుంచీ ఒరుసుకుంటూ వెళిపోతుందా లేదా స్పేస్‌క్రాఫ్ట్‌ను ఢీకొట్టి ప్రమాదంలోకి నెట్టేస్తుందా అన్నది స్పష్టంగా తెలియట్లేదు.
అమెరికాకు చెందిన స్కాట్ కెల్లీ, రష్యాకు చెందిన గెనడీ పడల్క, మిఖైల్ మిషా కార్నియెంకో స్పేస్‌క్రాఫ్ట్‌లో ఇరుక్కుని కూర్చుని శాటిలైట్ గురించి వస్తున్న సమాచారాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు..మరణించొచ్చు లేదా తిరిగి భూమికి సురక్షితంగా చేరుకోవచ్చు. అన్నిటికీ సిద్ధమై ఉండాలని వాళ్లకు తెలుసు.
అంతకుముందు మిలటరీలో పైలట్‌గా పనిచేసిన కెల్లీకి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవడం కొత్తేం కాదు.
కానీ ఈ అనుభవం భిన్నమైనది... అన్నీ ఉండి కూడా అశక్తులుగా, నిస్సహాయులుగా మిగిలిపోవడం లోతుగా ఆలోచింపజేసింది.
శాటిలైట్ ఢీకొని ఉంటే, బయటపడే సమయంగానీ అవకాశంగానీ ఉండదు.
"నేను, మిషా, గెనడీ కూడా ఒక్క క్షణంలో ముక్కలు ముక్కలైపోయి ఈ అనంత విశ్వంలో కలిసిపోయేవాళ్లం" అని స్కాట్ కెల్లీ తన జ్ఞాపకాల పుస్తకం ‘ఎండ్యూరెన్స్’లో రాసుకున్నారు.
ఐఎస్ఎస్‌లో కూడా రోజూ భూమి మీద ఏం చేస్తుంటారో అదే దినచర్య ఉంటూ ఉంటుంది. వీడియో కాల్స్ చెయ్యడం, పరిసరాలు శుభ్రపరుచుకోవడం, ఆఫీసు పనిలో చిరాకులు...ఇలా దాదాపు భూమి మీద చేసే పనులే ఉంటాయి. రోజులు సాఫీగానే గడిచిపోతుంటాయి.
కానీ, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడే అంతరిక్ష నౌకలో జీవితం తాలూకా కఠినమైన వాస్తవాలు కళ్ల ఎదుట కనబడతాయి.

2007నుంచీ కెల్లీ మూడుసార్లు అంతరిక్షంలోకి ప్రయాణించారు. కానీ 2015-16 మధ్యలో చేసిన యాత్ర ద్వారా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అదే ఆయన చివరి అంతరిక్ష యాత్ర.
మిషా కోర్నియెంకోతో కలిసి ఒక ఏడాదిపాటూ స్పేస్ స్టేషన్‌లో ఉండాల్సి వచ్చింది. మామూలుగా ఆరునెలలకు మించి అంతరిక్షంలో ప్రయాణించరు.
అంతకుముందు, అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన రికార్డ్ అమెరికాకు చెందిన మైకేల్ లోపెజ్-అలెగ్రియా పేరు మీద ఉండేది. కానీ స్కాట్ కెల్లీ, లోపెజ్-అలెగ్రియాకన్నా 100 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపి కొత్త రికార్డ్ సృష్టించారు.
స్కాట్ కెల్లీకి మరొక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఆయన కవల సోదరుడు మార్క్ కెల్లీ కూడా నాసాలో ఆస్ట్రోనాట్‌గా పనిచేసారు. అంతే కాకుండా, 2020 యూఎస్ ఎన్నికల్లో ఆరిజోనా రాష్ట్ర సెనేటర్‌గా కూడా మార్క్ ఎన్నికయ్యారు.
"నాకెప్పుడూ ఇంటికి తిరిగొచ్చేయాలని అనిపించలేదు. అంతరిక్ష యాత్ర మొదటినుంచీ చివరి వరకూ కూడా అంతే ఉత్సాహంతో సాగించాలని అనుకున్నాను. అలాగే చేశాను" అని స్కాట్ తెలిపారు.
"అవసరమైతే ఇంకా కొన్నాళ్లు ఉండమన్నా ఉండేవాడిని. నేను ఉండలేను అని ఎప్పుడూ అనుకోలేదు. నా సామర్థ్యాన్ని నేనెప్పుడూ శంకించలేదు" అని ఆయన చెప్పారు.
ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్‌కు ఎదురయ్యే మానసిక సమస్యల గురించి మాట్లాడుతూ..."చుట్టుపక్కల ఎవరూ లేకుండా మనమొక్కరమే గడపడం చాలా కష్టం. అది ఎంత పెద్ద సమస్యో నాకు తెలుసు. చాలామంది మానసిక సమస్యలు ఎదుర్కోవడం నేను కళ్లారా చూసాను. కష్టమే కానీ మనం చెయ్యలేనంత కష్టం కాదు" అని అన్నారు.
"ఇంట్రోవర్ట్, ఎక్స్‌ట్రావర్ట్ అని కాదుగానీ మనకు మనమే కాలక్షేపాన్ని సృష్టించుకోగలిగే సామర్థం ఉండాలి. ఇది అందరికీ సాధ్యం కాదు" అని స్కాట్ వివరించారు.
అన్నిటికన్నా కష్టమైన విషయం బయటకి వెళ్లి కాస్త చల్లగాలి పీల్చుకోలేకపోవడం...ప్రకృతిలోకి వెళ్లలేకపోవడం, తప్పించుకోలేని స్పేస్ స్టేషన్ షెడ్యూల్, అదే ప్రదేశంలో, అదే మనుషులతో అన్ని రోజులు గడపడం చాలా కష్టమైన విషయం అని స్కాట్ చెప్పారు. సహోద్యోగులు ఎంత మంచివాళ్లు, మనకెంత స్నేహితులైనా సరే రోజంతా వాళ్లతోనే, అక్కడే గడపడం అంత సులభం కాదని తెలిపారు.
అయితే, ఈ సంవత్సర కాలంలో స్పేస్ స్టేషన్‌లో ఉన్న సహోద్యోగులతో బలమైన స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయని, అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని స్కాట్ చెప్పారు.
"శాంతియుతమైన అంతర్జాతీయ సహకారానికి స్పేస్ స్టేషన్ ప్రోగ్రాం ఒక గొప్ప ఉదాహరణ. నాతోపాటూ స్పేస్ స్టేషన్‌లో ఉన్న కాస్మోనాట్స్‌తో నాకు ఎప్పుడూ మంచి సంబంధాలే కొనసాగాయి. వృత్తి నైపుణ్యం, పరస్పర గౌరవం, సహకారంతో మేమంతా కలిసి పనిచేసాం" అని స్కాట్ వివరించారు.
స్పేస్ స్టేషన్ ప్రోగ్రాం నిరంతరం కొనసాగాలని, మానవులు అంతరిక్ష యానం చేస్తూనే ఉంటారని ఆశిస్తున్నట్లు స్కాట్ తెలిపారు.

ఫొటో సోర్స్, NASA
కక్ష్యలో ఏడాది పొడుగునా స్కాట్ ఉద్యోగ బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తూ ఉండిపోయారనుకుంటే పొరపాటే. తనకు విశ్రాంతి కలిగించే ఆటలు ఆడడానికి, సరదాగా కాలం గడపడానికి కూడా కొంత సమయాన్ని కేటాయించగలిగారు.
స్కాట్ గొరిల్లాలా డ్రెస్ వేసుకుని బ్రిటిష్ ఆస్ట్రోనాట్ టిం పీక్‌ను వెంబడించి స్పేస్ స్టేషన్ మొత్తం పరిగెత్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ గొరిల్లా డ్రెస్‌ను పుట్టినరోజు కానుకగా తన కవల సోదరుడు మార్క్ పంపించారని స్కాట్ చెప్పారు. ‘ఇది ఎందుకు పంపించావని’ అడిగితే, ‘ఏం ఎందుకు పంపించకూడదు’ అని తన సోదరుడు అడిగారని స్కాట్ నవ్వుతూ చెప్పారు.
ఈ కవల సోదరుల తల్లిదండ్రులిద్దరూ అమెరికాలో పోలీస్ అధికారులుగా పనిచేసారు. తన తల్లి తనకు స్ఫూర్తి అని స్కాట్ తెలిపారు.
చిన్నప్పుడు అన్నదమ్ములిద్దరూ బాగా అల్లరి చేసి దెబ్బలు తగిలించుకునేవారని, మార్క్ శ్రద్ధ పెట్టి చదువుకునేవారుగానీ తనకి ఆటలపైనే దృష్టి ఉండేదని స్కాట్ చెప్పారు. శ్రద్ధగా చదువుకోమని, కెరీర్ మీద దృష్టి పెట్టమని మార్క్ చెప్పేవారని అన్నారు.
స్కాట్ నావీ పైలట్‌గా ట్రైనింగ్ పొందిన తరువాత 1990లలో మొదటి గల్ఫ్ యుద్ధంలో పాల్గొన్నారు. మిలటరీ పైలట్‌గా కెరీర్‌లో ముందుకెళుతున్నప్పటికీ స్కాట్‌కు అంతరిక్షయానంపైనే ఆసక్తి ఉండేది.
1996లో మార్క్‌తో సహా స్కాట్ నాసాలో ఆస్ట్రోనాట్‌గా సెలక్ట్ అయ్యారు. తరువాత స్పేస్ షటిల్ మిషన్‌లో కూడా ఒకసారి పైలట్‌గా పనిచేసారు.
" నేను ఒక్కసారే స్పేస్ షటిల్ నడిపాను. ఒకసారో రెండు సార్లో పైలట్‌గా షటిల్ నడిపే అవకాశం వస్తుంది. దానికోసం ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది.
దీన్ని జాగ్రత్తగా కిందకు దించే అవకాశం ఒక్కసారే వస్తుంది. ఆ ఒక్కసారి నువ్వు విఫలమైతే మరో అవకాశం ఉండనే ఉండదు. బాగా నేర్చుకుని వచ్చి మళ్లీ ప్రయత్నిస్తాను అనడానికి ఉండదు. మనతో పనిచేస్తున్నవారు మాత్రమే కాదు..మొత్తం ప్రపంచం మన మనల్నే గమనిస్తోందని గుర్తుంచుకోవాలి" అని స్కాట్ వివరించారు.
స్పేస్ షటిల్ నడపడం ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అది చాలా పెద్ద వాహనం. 2003లో ‘కొలంబియా’ స్పేస్ షటిల్ భూమికి తిరిగి వస్తూ కూలిపోయింది. ఇందులో ఉన్న ఏడుగురు వ్యోమగాములూ ప్రాణాలు కోల్పోయారు.
కొలంబియా, ఛాలెంజర్..ఈ రెండు స్పేప్ షటిల్స్ కూలిపోయినప్పుడు నాసా భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తాయి. కొలంబియా విపత్తులో స్కాట్ తన స్నేహితులను కోల్పోయారు.
"మేము చేస్తున్న పని చాలా రిస్క్‌తో కూడుకున్నది. భద్రత అనేది అందరి బాధ్యత. ఈ అంశంలో ఏదైనా సమస్య తలెత్తితే..దాని గురించి మాట్లాడే అధికారం అందరికీ ఉందని గుర్తించాలి" అని స్కాట్ కెల్లీ అన్నారు.

ఫొటో సోర్స్, NASA
కవలల్లో ఒకరిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ద్వారా కక్ష్యలోకి పంపుతామని ప్రకటించినప్పుడు..ఏడాదిపాటూ అంతరిక్షంలో ఉంటే మానవ శరీరంపై ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయో అధ్యయనం చేయడానికి ఇదొక మంచి అవకాశమని కొందరు శాస్త్రవేత్తలు భావించారు.
కవలల్లో ఒక సోదరుడు మార్క్ భూమి మీదే ఉంటూ, మరొక సోదరుడు స్కాట్ అంతరిక్షంలో ఉంటే...స్కాట్‌లో కనిపించే ఎలాంటి మార్పులైనా సరే..అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వలన, అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా కలిగినవే అని నిర్థారించొచ్చు.
స్కాట్ భూమికి తిరిగి వచ్చిన తరువాత కవలలిద్దరికీ అనేక రకాల పరీక్షలు చేసారు...సైకాలజీ, మేథో సామర్థ్యం, రోగనిరోధకత, డీఎన్ఏ పరీక్షలు జరిపారు.
స్కాట్ డీఎన్ఏలో జన్యుపరమైన మార్పులు వచ్చినట్లు గమనించారు. కాస్మిక్ రేడియేషన్ వలన డీఎన్ఏకు కలిగిన హాని దానంతట అదే పూడుకున్నట్లు గమనించారు. ఈ ప్రక్రియ వలన స్కాట్ డీఎన్ఏలో మార్పులు వచ్చాయని నిర్థారించారు.
స్కాట్ క్రోమోజోముల చివర్లలో ఉండే టెలోమియర్స్‌లో కూడా ఊహించని మార్పులు వచ్చినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. అంతే కాకుండా, బ్లడ్ కెమిస్ట్రీ, శరీర ద్రవ్యరాశి, పేగుల సముదాయంలో మార్పులు వచ్చినట్లు గమనించారు.
అయితే, స్కాట్ భూమి మీదకు వచ్చిన కొన్నాళ్లకు ఇవన్నీ చాలావరకూ యథాస్థితికి వచ్చేసాయి.
"వెనక్కొచ్చి నాలుగేళ్లయింది. అంతరిక్షంలో ఏడాదిపాటూ ఉండడం వలన వచ్చాయని చెప్పగలిగే మార్పులు ఏవీ నాలో లేవు. నా కళ్లల్లో మాత్రం నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి. అయితే దాని వల్ల నా చూపుకి ఏమీ ఇబ్బంది లేదు" అని స్కాట్ తెలిపారు.
అంతరిక్షంల్లో గడపడం వలన కొందరిలో కంటికి సంబంధించిన మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలకు ముందే తెలుసు. ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పడానికి అనేక అధ్యయనాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, NASA
అయితే, కొందరిలో ఇలాంటి మార్పుల రావొచ్చని తెలుసు కాబట్టి ఆస్ట్రోనాట్ ఎంపిక విషయంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయా అనే ప్రశ్నకు జవాబిస్తూ...
"ఇది నాసాకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న వ్యవస్థకు సంబంధించిన విషయం కూడా. ఇన్స్యూరెన్స్ పాలసీ సమస్యలు రావొచ్చు. ఇది నైతికతకు సంబంధించిన విషయం. దీని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
కవల సోదరుల మీద చేసిన అధ్యయనాల వల్ల అంతరిక్షంలో ఎక్కువకాలం గడపొచ్చని తేలింది. కాబట్టి రెడ్ ప్లానెట్ (మార్స్) మీదకు మనుషులను పంపొచ్చని స్పేస్ ఏజెన్సీలు ఆలోచిస్తున్నాయి. ఈ రెడ్ ప్లానెట్ భూమికి 3 కోట్ల 40 లక్షల మైళ్ల దూరంలో ఉంది. వెళ్లి రావడానికి అటూ ఇటూ తొమ్మిది నెలల చొప్పున మొత్తం 18 నెలలు పడుతుంది. అయితే, భూమి కక్ష్యలో కన్నా పది రెట్లు ఎక్కువ రేడియేషన్ తట్టుకోవాల్సి ఉంటుంది. దీనివలన దీర్ఘకాలంలో క్యాన్సర్, ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.
"ఈ రేడియేషన్ తప్పించుకోడానికి ఏదైనా కవచంలాంటిది కనిపెట్టాలి లేకపోతే మార్స్ మీదకు తక్కువ కాలంలో ప్రయాణించగలిగే సాధనం కనుక్కోవాలి. లేదంటే ఈ రిస్క్‌ని అంగీకరించి..ఏదైతే అది అయ్యిందని మార్స్ మీదకు వెళ్లి రావాలి" అని స్కాట్ అన్నారు.
2016లో స్కాట్ నాసానుంచీ రిటైర్ అయిపోయారు. అప్పటినుంచీ తన అనుభవల గురించి రాస్తున్నారు, మాట్లాడుతున్నారు.
ప్రస్తుతం స్కాట్ కెల్లీ మళ్లీ ఉద్యోగంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లే ఒక ప్రైవేట్ ఫ్లైట్‌కు కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
ఆస్ట్రోనాట్‌గా ఎంతో సాధించినప్పటికీ, రిటైర్ అయి నాలుగేళ్లైన తరువాత కూడా స్కాట్ కెల్లీకి స్పేస్ సైన్స్ మీద ఆసక్తి, వ్యామోహం ఏ మాగ్రం తగ్గలేదని తెలుస్తోంది.
"నన్ను ఎవరైనా మళ్లీ స్పేస్‌లోకి వెళతావా అని అడిగితే తప్పకుండా వెళతాను అనే చెప్తాను" అని స్కాట్ తెలిపారు. అయితే, సురిక్షతమైన అంతరిక్షయానానికే మొగ్గు చూపుతానని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లంబసింగి: 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాలుగు నెలల్లో లక్షల మంది వచ్చివెళ్తారు
- రజినీకాంత్ జీవితంలో అరుదైన కోణాలు
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు
- "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








