‘హోప్’ శాటిలైట్ ప్రయోగం: యూఏఈ మార్స్ మీదకు ఎందుకు వెళుతోంది?

హోప్ శాటిలైట్

ఫొటో సోర్స్, MBRSC

ఫొటో క్యాప్షన్, హోప్ శాటిలైట్ తయారీకి ఆరేళ్లు పట్టింది
    • రచయిత, జొనాథన్ ఆమోస్
    • హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి

అంగారక గ్రహం మీద వాతావరణ పరిస్థితులు అధ్యయనం చెయ్యడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఈ వారంలో ఒక శాటిలైట్‌ను పంపనుంది.

1.3 టన్నుల బరువుగల ఈ శాటిలైట్‌ ప్రయోగం పేరు 'హోప్'. జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్-2ఏ రాకెట్ ద్వారా హోప్‌ను నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ శాటిలైట్ 50 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి 2021 ఫిబ్రవరికి మార్స్ మీదకు చేరుతుంది. యూఏఈ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంలో 'హోప్' విజయవంతమవ్వాలని ఆ దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

శుక్రవారంనాడు స్థానిక సమయం 05.43 నిముషాలకి హోప్‌ను ఆకాశంలోకి ప్రయోగించనున్నారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారం బుధవారంనాడు ఈ శాటిలైట్‌ను లాంచ్ చెయ్యాల్సి ఉండగా తనెగాషిమాలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు.

హోప్‌తో సహా ఈ నెలలో మూడు శాటిలైట్స్ మార్స్ మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. యూఎస్, చైనాలు కూడా రోవర్లను మార్స్ మీదకు పంపడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

యూఏఈ హోప్ మార్స్ మిషన్ ఊహా చిత్రం

యూఏఈ మార్స్ మీదకు ఎందుకు వెళుతోంది?

అంతరిక్ష నౌకల(స్పేస్‌ క్రాఫ్ట్స్) రూపకల్పనలో, తయారీలో యూఏఈకు పరిమిత సామర్థ్యం, అనుభవం ఉన్నప్పటికీ 'హోప్' ప్రయోగాన్ని ఒక సవాలుగా తీసుకుని ఆశయ సాధన దిశగా కృషిచేస్తున్నారు. ఇప్పటివరకూ రష్యా, యూఎస్, యూరోప్, ఇండియాలు మాత్రమే అంతరిక్షనౌకల తయారీలో విజయవంతమయ్యాయి.

అమెరికాకు చెందిన నిపుణుల వద్ద శిక్షణ పొందిన యూఏఈ ఇంజనీర్లు కేవలం ఆరు సంవత్సరాల కాలంలోనే అధునాతనమైన శాటిలైట్‌ను రూపొందించగలిగారు. ఇది మార్స్‌పైకి వెళ్లి అక్కడి వాతావరణ పరిస్థితులపై తాజా సమాచారాన్ని అందించగలదని ఆశిస్తున్నారు.

ముఖ్యంగా మార్స్ మీద గాలి, నీరు ఎలా తగ్గిపోతున్నాయన్న అంశంపై మరింత అవగాహన కల్పించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

'హోప్' ప్రయోగం అరబ్ దేశాల్లో యువతకు స్ఫూర్తినిస్తుందని, విద్యార్థులు శాస్త్రీయ పరిశోధనవైపు మొగ్గు చూపడానికి ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నారు.

అయితే మార్స్ మీదకు చేరడం అంత సులభం కాదు. ఇప్పటివరకూ ఈ ఎర్రటి గ్రహం మీదకు పంపిన శాటిలైట్లలో సగం మాత్రమే విజయవంతమయ్యాయి.

"ఇది ఒక రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్. విఫలం అయ్యే అవకాశం ఉంది కానీ విజయం దిశగా మన ప్రయత్నం మనం చెయ్యాలి" అని 'హోప్' ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒమ్రాన్ షరీఫ్ బీబీసీతో అన్నారు.

"ఈ ప్రాజెక్ట్ విఫలం అయితే అవ్వొచ్చు. కానీ అభివృద్ధి పథంలోకి అడుగుపెట్టడంలో ఒక జాతిగా మేము విఫలమవ్వకూడదు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో మేము సాధించిన ప్రగతి, పెంపొందించుకున్న సామర్థ్యం, జ్ఞానం ముఖ్యమైనవి" అని ఆయన అన్నారు.

హోప్ శాటిలైట్

ఫొటో సోర్స్, MBRSC

యూఏఈ దీన్ని ఎలా సాధించగలిగింది?

‘‘పెద్ద విదేశీ కార్పొరేషన్‌ నుంచి ఈ శాటిలైట్‌ను కొనే స్థోమత మాకు లేదు. సొంతంగా తయారుచేసుకోవడం ఒక్కటే మార్గమని భావించాం’’ అని యుఏఈ ప్రభుత్వం తెలిపింది.

దీనికోసం అమెరికాలోని యూనివర్సిటీలతో అనుసంధానమయ్యారు. ఎమిరేట్స్, అమెరికా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కలిసి ఈ శాటిలైట్‌ను రూపొందించారు.

ఈ ప్రోబ్ తయారీలో అధికభాగం కొలరాడో యూనివర్సిటీలోని ద లేబరటరీ ఫర్ అట్మాస్ఫియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్(ఎల్ఏఎస్పీ)లో జరిగినప్పటికీ, దుబయ్‌లోని మొహమ్మద్ బిన్ రాషిద్ స్పేస్ సెంటర్(ఎంబీఆర్ఎస్సీ)లో కొంత ముఖ్యమైన భాగం తయారైంది.

ఇప్పుడు యూఏఈ సొంతంగా మరో శాటిలైట్ రూపొందిచుకోగలిగినంత సామర్థ్యం పొందిందని ఎల్ఏఎస్పీ సీనియర్ సిస్టమ్స్ ఇంజినీర్ బ్రెట్ లాండిన్ అన్నారు.

రూల్ వాల్లీస్.. అంగారక గ్రహంపై నీటి సరస్సు

ఫొటో సోర్స్, ESA/DLR/FU Berlin

ఫొటో క్యాప్షన్, అంగారక గ్రహం ఉపరితలాలను గమనిస్తే ఒకప్పుడు అక్కడ నీరు ప్రవహించి ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తాయి

'హోప్' లక్ష్యాలేమిటి?

ఇప్పటికే మార్స్ మీదకు వెళ్లిన శాటిలైట్స్ అందిస్తున్న సమాచారం కాకుండా శాస్త్రీయ పరిశోధనకు అవసరమైన సరికొత్త సమాచారాన్ని సేకరించే దిశగా దీని లక్ష్యాలను రూపొందించారు.

నాసా అడ్వైజరీ కమిటీ మార్స్ ఎక్స్‌ప్లొరేరేషన్ ప్రోగ్రాం అనాలిసిస్ గ్రూప్(ఎంఈపీఏజీ) వీరికి సహాయం చేసింది.

ఎంఈపీఏజీ సూచనల ప్రకారం 'హోప్'.. మార్స్ మీద ఉన్న వాతావరణంలోని శక్తి(ఎనర్జీ)పై నుంచి కిందకు ఎలా ప్రయాణిస్తుందో ప్రధానంగా పరిశీలిస్తుంది. రోజులో అన్ని సమయాల్లోనూ, ఏడాదిలో అన్ని ఋతువుల్లోనూ ఎనర్జీ కదలికలను పరిశీలిస్తుంది.

అంతే కాకుండా మార్స్ ఉపరితంలో గూడు కట్టుకుని ఉన్న ధూళి లక్షణాలను పరిశీలిస్తుంది. ఈ ధూళి అక్కడి వాతావరణం, ఉష్ణోగ్రతలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఈ ధూళి లక్షణాలను పరిశీలించడం ద్వారా వాతావరణ మార్పులను అధ్యయనం చేయవచ్చు.

అదనంగా, ఉపరితలంలో ఉండే హైడ్రోజన్, ఆక్సిజన్లలోని తటస్థ అణువుల ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. మార్స్‌పై ఉండే వాతావరణంలో కోత ఏర్పడడానికి ఈ అణువులు కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.

మార్స్‌పైన ఒకప్పుడు నీరు ఉండేదని, అదంతా మాయమైపోయిందని చెప్పే వాదనలపై కూడా ఈ అధ్యయనం దృష్టి సారిస్తుంది.

మార్స్‌కు 22,000 కిమీ నుంచి 44,000కిమీ దూరంలో మార్స్ మధ్యరేఖకు దగ్గర్లోని కక్ష్యలో తిరుగుతూ ఈ శాటిలైట్ తన పరిశీలనలను నమోదు చేస్తుంది.

సారా అల్ అమీరీ
ఫొటో క్యాప్షన్, సారా అల్ అమీరీ

సారా అల్ అమీరీ ఎవరు?

సార అల్ అమీరీ యూఏఈ ఆధునిక విజ్ఞాన శాఖా మంత్రిగా పనిచేస్తున్నారు. హోప్ శాటిలైట్ రూపకల్పనలో ఆమె ముఖ్య పాత్ర వహించారు.

హోప్ శాటిలైట్ తయారీలో 34% మహిళలు పాల్గొనడం విశేషం. అలాగే ఈ ప్రాజెక్టులో వివిధ బృందాలకు నాయకత్వం వహిస్తున్నవారిలో స్త్రీ పురుషులు సమానంగా ఉన్నారని అమీరీ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)