కరోనావైరస్: భారత్‌లో ప్లాస్మా థెరపీకి పెరుగుతున్న డిమాండ్.. కోవిడ్-19 చికిత్సకు దీనిపై నమ్మకం పెట్టుకోవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
రోజురోజుకూ కరోనావైరస్ కేసులు పెరుగుతుండడంతో భారతదేశంలో ప్లాస్మా థెరపీకి డిమాండ్ పెరుగుతోంది.
కరోనావైరస్ సోకినవారి శరీరంలో వైరస్‌తో పోరాడడానికి యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ క్రమక్రమంగా పెరిగి ప్లాస్మా(రక్తంలోని ద్రవ పదార్థం)లోకి చేరుతాయి. ఈ ప్లాస్మాను కోవిడ్-19 చికిత్స పొందుతున్నవారి శరీరంలోకి ప్రవేశపెడితే యాంటీబాడీస్ సంఖ్య పెరిగి వ్యాధి నుంచి త్వరగా కోలుకోగలిగే అవకాశం ఉంది.
ప్లాస్మా థెరపీ కొత్తదేం కాదు. చాలా ఏళ్లుగా అనేక వ్యాధులకు చికిత్సలో భాగంగా దీన్ని వాడుతున్నారు.
మొట్టమొదటిసారిగా జర్మన్ ఫిజియాలజిస్ట్ ఎమిల్ వాన్ బెహ్రింగ్ ప్లాస్మా థెరపీని డిప్తీరియా వ్యాధి చికిత్సకు వాడినందుకుగానూ 1901లో నోబెల్ బహుమతి పొందారు.
ప్రస్తుతం కరోనావైరస్ రోగులకు చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీని సూచిస్తున్నారు.
గత రెండు నెలల్లో ప్లాస్మాకి డిమాండ్ అమాంతంగా పెరిగింది. కానీ సప్లై అంతంతమాత్రంగానే ఉంది.
కోవిడ్-19 సోకినవారిలో ఎక్కువమంది వ్యాధి తగ్గిన తరువాత ప్లాస్మా దానం చెయ్యడానికి ముందుకు రావట్లేదు. దీనితో ప్లాస్మా డిమాండ్‌కు, సప్లైకు మధ్య తేడా విపరీతంగా పెరిగిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
చాలా రాష్ట్రాల ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీవైపు మొగ్గు చూపుతున్నారు.
మహరాష్ట్ర, దిల్లీలాంటి రాష్ట్రాల్లో ప్లాస్మా థెరపీకి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్లాస్మా దానం చేసేందుకు వీలుగా సేకరణ కేంద్రాలను నెలకొల్పారు.
కోవిడ్-19 కేసులలో సాధారణ చికిత్సకు కోలుకోని రోగులకు ప్లాస్మా థెరపీ వాడొచ్చని డాక్టర్లకు సూచిస్తున్నారు.
కరోనావైరస్‌కు ప్లాస్మా థెరపీ పనిచేస్తుందా లేదా అనే అంశంపై ప్రపంచంవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. అయితే ఈ అధ్యయనాలనుబట్టీ కచ్చితంగా ఒక నిర్థరణకు రావడం కష్టమే. కోవిడ్-19 కేసులకు ఈ చికిత్స కచ్చితంగా పనిచేయదు అని చెప్పలేము, అలాగని ఈ చికిత్సను కొట్టిపారేయలేము అని డాక్టర్లు అంటున్నారు.
"కోవిడ్-19 చికిత్సకు ప్లాస్మా థెరపీ కచ్చితంగా పని చేస్తుందని ఇంత త్వరగా చెప్పలేము. ఇంకొంత పరీక్షించవలసి ఉంటుంది" అని దిల్లీకి చెందిన వైరాలిస్ట్ డా. షహీద్ జమీల్ అన్నారు.
"ఇటువంటి అధ్యయనాలకు దీర్ఘకాలికంగా క్లినికల్ ట్రయిల్స్ జరగాలి. ఎక్కువ వైవిధ్యం ఉన్న పెద్ద పెద్ద సమూహాల మీద ట్రయల్స్ జరపాలి. తద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించుకుని ఒక నిర్థరణకు రావాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.
చైనాలో ప్లాస్మా థెరపీ ట్రయల్స్ సత్ఫలితాలనిచ్చాయి. అయితే ఈ ట్రయల్స్‌లో రోగులకు ప్లాస్మా చికిత్సతోపాటూ వేరే చికిత్సలు కూడా అందించారు.

ఫొటో సోర్స్, Getty Images
"ప్రస్తుతం కోవిడ్-19 కేసులకు ఇది కచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేము" అని ప్రొఫెసర్ ఆంటొనీ గార్డన్ అన్నారు. ప్రొఫసర్ గార్డన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో క్రిటికల్ కేర్ అధిపతిగా ఉంటూ ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
అయితే ఇండియాలో మాత్రం ప్లాస్మా థెరపీ కచ్చితంగా పనిచేస్తుందని బలంగా నమ్ముతున్నారు. దీని గురించి రాజకీయ నాయకులు కూడా చురుకుగా ప్రచారం చేస్తుండడంతో డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది.
"ప్లాస్మా థెరపీ కావాలాని డిమాండ్ చేస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది" అని మెదాంత హాస్పటిల్ ఇంటెన్సివ్ కేర్ డైరెక్టర్ డా. సుశీల కటారియా అన్నారు.
"దీని గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్లాస్మా చికిత్స కచ్చితంగా పనిచేస్తుందనే నమ్మకం ప్రజల్లో బలపడిపోతోంది. కానీ ఈ చికిత్స ఎవరికి అందించాలి అనేది వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్లు నిర్ణయిస్తారు. అన్ని కోవిడ్-19 కేసుల్లోనూ ప్లాస్మా థెరపీని సూచించలేము" అని ఆమె అన్నారు.
ఎర్నాకుళం మెడికల్ కాలేజ్ క్రిటికల్ కేర్ హెడ్ డా. ఏ. ఫతాహుద్దీన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
"ప్రస్తుతం క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి. ఇది కచ్చితంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఎక్కువ డాటా కావాలి. దాన్ని మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలి. ప్లాస్మా థెరపీ ద్వారా కోవిడ్-19ను జయించవచ్చు అనే అభిప్రాయాన్ని రోగులకు, వారి కుటుంబ సభ్యులకు కలగజేయడం మంచిది కాదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మే నెలలో అద్వతీయ మల్ మామగారికి కోవిడ్ సోకి ఊపిరి అందని పరిస్థితుల్లో ఇతర చికిత్సలు కూడా ఫెయిల్ అవ్వడంతో డాక్టర్లు ప్లాస్మా థెరపీ సూచించారు. అయితే వారికి వెంటనే ప్లాస్మా డోనర్స్ దొరకలేదు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్లాస్మా థెరపీకి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మల్, ఢూండ్ (Dhoond) అనే ప్లాస్మా డొనేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్లాస్మా కావాలసిన వారికి, ప్లాస్మా దానం చేసేవారి వివరాలు అందిస్తారు.
అయితే మొదట్లో ఈ వెబ్‌సైట్ నిర్వహించడం కష్టమైందని, సాధారణ రక్తదాన కేంద్రం అనుకుని అనేకమంది రిజిస్టర్ చేసుకున్నారని మల్ తెలిపారు. తరువాత ఒక వలంటీర్ బృందాన్ని ఏర్పరచుకుని ప్లాస్మా దానం చేసేవారి వివరాలను మాత్రమే పొందుపరచగలిగే జాగ్రత్తలు తీసుకున్నారు.
కానీ డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతున్నదని, 1000 మందికి ప్లాస్మా అవసరమైతే తాము 100-200 మందికి మాత్రమే దాతల వివరాలు అందించగలుగుతున్నామని మల్ తెలిపారు.
ఎంతోమంది కోవిడ్-19 రోగులు ప్లాస్మా థెరపీ అందక నిరాశకు గురవుతున్నారు. అయితే వారిని తప్పుపటలేమని ఎపిడమాలజిస్ట్ డా. లలిత్ కాంత్ అభిప్రాయపడ్డారు.
"ప్లాస్మా థెరపీ గురించి వార్తల్లో అధిక ప్రచారం జరుగుతున్నప్పుడు, ప్రజల్లో ఒక గుడ్డి నమ్మకం ఏర్పడిపోతుంది. ఇందులో వారి తప్పేమీ లేదు" అని ఆయన అన్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








